Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: తెలంగాణ ఫలితాలు

ఎమ్బీయస్‍: తెలంగాణ ఫలితాలు

ఈ నెల మొదట్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నెల తిరిగేలోగా వాటి గురించిన చర్చ సాగిద్దామని ప్రయత్నం. మొదటగా ఫలితాలు ఎలా ఉన్నాయో రకరకాల కోణాల్లోంచి పరామర్శిస్తాను. తర్వాత ఫలితాలు అలా ఎందుకు వచ్చాయని సర్వేలు చెప్పాయో చెప్తాను. పరిశీలకులు ఎలా భావించారో వచ్చే వ్యాసంలో చెప్తాను. మొదటగా సీట్లు, ఓట్లు - కాంగ్రెసుకు ఓట్లు 92.36 లక్షలు (39.4%) 64 సీట్లు. తెరాసకు ఓట్లు 87.54 లక్షలు (37.35%), 39 సీట్లు. బిజెపి ఓట్లు 32.58 లక్షలు (13.9%) 8 సీట్లు. మజ్లిస్ ఓట్లు 5.19 లక్షలు (2.2%) 7 సీట్లు, సిపిఐకి 1 సీటు వచ్చాయి. 2018తో పోలిస్తే తెరాసకు 9.5% ఓట్లు, 49 సీట్లు తగ్గాయి. కాంగ్రెసుకు 11% ఓట్లు, 45 సీట్లు పెరిగాయి. బిజెపికి 7% ఓట్లు, 7 సీట్లు పెరిగాయి. మజ్లిస్‌కు సీట్ల సంఖ్యలో తేడా లేదు కానీ 0.5% ఓట్లు తగ్గాయి.  

కాంగ్రెసు-తెరాస-బిజెపి-ఇతరులకు ఉమ్మడి జిల్లాల వారీగా వచ్చిన సీట్లు - ఉమ్మడి ఆదిలాబాదులో 4-2-4-0, నిజామాబాద్‌లో 2-4-3-0, కరీంనగర్‌లో 8-5-0-0, మెదక్‌లో 3-7-0-0, రంగారెడ్డి 4-10-0-0, హైదరాబాద్‌లో 0-7-1-7 (మజ్లిస్), మహబూబ్‌నగర్ 12-2-0-0, నల్గొండ 11-1-0-0, వరంగల్ 10-2-0-0, ఖమ్మం 8-1-0-1 (సిపిఐ). 44 సీట్ల ఉత్తర తెలంగాణలో కాంగ్రెసుకు 26 (2018లో 4) తెరాసకు 11 (38), బిజెపికి 7 (0), ఇతరులు 0 (2) వచ్చాయి. 46 సీట్ల దక్షిణ తెలంగాణలో కాంగ్రెసుకు 34 (2018లో 4) తెరాసకు 11 (32),  ఇతరులు 1 (3) వచ్చాయి.

ఉత్తర, దక్షిణ తెలంగాణలలో జయపతాకను ఎగరేసిన కాంగ్రెసు సిటీకి వచ్చేసరికి చతికిలపడడం గమనార్హం. గ్రేటర్‌ హైదరాబాదులో 24 స్థానాలుంటే 49.14 లక్షల ఓట్లు పోలయ్యాయి. మజ్లిస్ 7, బిజెపి 1 (22% ఓట్లు), తెరాస 16 (39 % ఓట్లు), కాంగ్రెసు 0 (24% ఓట్లు) తెచ్చుకున్నాయి. బిజెపి గెలిచిన గోషా మహల్‌లో తెరాసది రెండో స్థానం. 9 నియోజకవర్గాల్లో కాంగ్రెసుది రెండో స్థానం. ఎల్‌బి నగర్‌లో మధు యాష్కీది మూడో స్థానం. నగరమే తెరాస పరువు కాచిందనాలి. ఆంధ్రమూలాల వారి ఓట్లతో కాంగ్రెసు నగరాన్ని ఓ ఊపు ఊపుతుందని చేసిన ఊహాగానాలు తప్పాయి. రైతుబంధు వంటి పథకాలు, మెరుగైన యిరిగేషన్ సౌకర్యాల కారణంగా గ్రామీణ ప్రాంతాలలో తెరాస వెలుగుతుందనుకుంటే అలా జరగలేదు.

తెరాస ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులు, చీఫ్ విప్, మరో ముగ్గురు విప్‌లు ఓడిపోయారు. 104 తెరాస ఎమ్మెల్యేలలో 70 మంది ఓడిపోయారు. కానీ 20 వేల నుంచి లక్ష దాకా ఓట్లు తెచ్చుకున్న (10-54%) స్థానాలు 58 ఉన్నాయి. 10-15% ఓట్లు వచ్చినవి 10, 15-25% ఓట్లు తెచ్చుకున్నవి 25, త్రిముఖ పోరులో 50 స్థానాల్లో గట్టి పోటీ యిచ్చింది. 12 చోట్ల సిటింగు ఎమ్మెల్యేలను మార్చగా, 9టిలో గెలిచారు. 3టిలో ఓడారు. 2019లో తెరాస 9 పార్లమెంటు స్థానాలు గెలిచింది. తాజా ఎన్నికల్లో 3 స్థానాల పరిధిలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. కాంగ్రెసు 3 స్థానాలు గెలిచింది. ఇప్పుడు 10 స్థానాల పరిధిలో అధిక్యంలో ఉంది. మజ్లిస్‌కు అప్పుడూ, యిప్పుడూ ఒకటే. బిజెపి 4 గెలిచింది. ఇప్పుడు 2 స్థానాల పరిధిలో ఆధిక్యంలో ఉంది. బిజెపి గతంలో గెలిచిన వాటిలో యిప్పుడు కాంగ్రెసు 1 దానిలో , తెరాస 1 దానిలో బలంగా ఉన్నాయి.

బిజెపి 2018లో 118 సీట్లలో పోటీ చేసి 1 గెలిచింది. ఈ సారి 111టిలో పోటీ చేసి, 35-40టిలో గట్టి పోటీ యిచ్చి 18-22 గెలుస్తామని అనుకున్నారు. 2019లో గెలిచిన 4 ఎంపీ సీట్లలో 3 ఉత్తర తెలంగాణలోనే. ఈసారి గెలిచిన 8టిలో 7 ఉత్తర తెలంగాణలో (ఆదిలాబాద్‌లో 4, నిజామాబాద్‌లో 3) కాగా 1టి సిటీలో! కార్పోరేషన్ ఎన్నికలలో 48 సీట్లు గెలిచినా, అది యీ ఎన్నికలలో ప్రతిఫలించ లేదు.  బిసి ముఖ్యమంత్రిని చేస్తానన్నా ఓట్లు పడలేదు. నెగ్గిన 8 మందిలో ముగ్గురే బిసిలు. బిసిలైన బండి, అర్వింద్, ఈటల ముగ్గురూ ఓడిపోయారు. ముగ్గురు ఎంపీలు (బండి, అర్వింద్, సోయం బాపురావు), యిద్దరు ఎమ్మెల్యేలు (రఘునందన్, ఈటల) ఓడిపోయారు. ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పినా 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాల్లో ఓడిపోయారు. నెగ్గిన 8 మందిలో ఆరుగురు కొత్తవారు. రెండో స్థానంలో ఉన్న 19 నియోజకవర్గాల్లో పాత బస్తీ సిగ్మెంట్లూ ఉన్నాయి. కామారెడ్డి బిజెపి అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి యిద్దర్నీ ఓడించడం విశేషం.

మజ్లిస్‌కి ఓట్ల శాతాలు తగ్గాయి. యాకుత్‌పూరాలో 16.1%, కార్వాన్‌లో 5.4%, చార్మినార్‌లో 3.3%, చాంద్రాయణ గుట్టలో 3.1%, బహుదూర్‌పురాలో 11.9%, నాంపల్లిలో 1%, మలక్‌పేటలో 1% తగ్గాయి. 7టిలో 4టిలో (60%) స్థానాల్లో అభ్యర్థులను మార్చి విజయం సాధించింది. పాత బస్తీలో మజ్లిస్‌కి మెజారిటీ తగ్గింది. రెండిటిలో చివరి దాకా గట్టి పోటీ ఉండింది. యాకుత్‌పురాలో 878 మెజారిటీ,  నాంపల్లిలో 2037 మాత్రమే వచ్చాయి. కాంగ్రెసు మద్దతుతో కొత్తగూడెంలో 27 వేల మెజారిటీతో సిపిఐ అభ్యర్థి కూనంనేని నెగ్గారు. సిపిఎం 19 చోట్ల పోటీ చేసి, ఎక్కడా డిపాజిట్ తెచ్చుకోలేదు. పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు 5300 ఓట్లు, కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డికి 3200 ఓట్లు, మొత్తం మీద 50 వేల ఓట్లు వచ్చాయి.

బియస్పీ 107 సీట్లలో పోటీ చేస్తే రెండు చోట్ల డిపాజిట్ దక్కింది, 100 స్థానాల్లో పోటీయే యివ్వలేక పోయింది. మొత్తం మీద 3 లక్షల ఓట్లు, 1.4% ఓట్లు వచ్చాయి. సిర్పూర్‌లో ప్రవీణ్‌కుమార్‌కు 44600 ఓట్లతో మూడో స్థానం దక్కింది. ఆయన సోదరుడు ప్రసన్న కుమార్‌కు ఆలంపూర్‌లో 6000, దాసరి ఉషకు 10300 వచ్చాయి. పటాన్‌చెరులో బియస్పీ టిక్కెట్‌పై పోటీ చేసిన కాంగ్రెసు రెబెల్‌కు 46100 వచ్చాయి. బిజెపి నుంచి జనసేనకు చివరి నిమిషంలో మారిన ప్రేమ్‌కుమార్‌కు కూకట్‌పల్లిలో 39800 వచ్చాయి. జనసేన రాష్ట్ర అధ్యక్షుడికి 3000, కోదాడ, నాగర్‌కర్నూల్, ఖమ్మం, కొత్తగూడెంలలో 2 వేలకు తక్కువ, వైరా, ఆశ్వారావు పేటలో 2 నుంచి 3 వేల మధ్య ఓట్లు వచ్చాయి. అన్ని చోట్లా డిపాజిట్లు పోయాయి.

కొన్ని విశేషాలు – ‘బర్రెలక్క’ శిరీషకు 5600 ఓట్లు వచ్చాయి. * ఎల్‌బి నగర్‌లో మధు యాష్కీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో గద్దర్ కుమార్తె ఓడారు. మహేశ్వరంలో కెఎల్ఆర్‌కి మూడో స్థానం దక్కింది. * కిషన్ రెడ్డి లోకసభ స్థానమైన సికింద్రాబాద్‌లో, రేవంత్ లోకసభ స్థానమైన మల్కాజ్‌గిరిలో వారి వారి పార్టీలు గెలవలేదు. * అతి తక్కువ మెజారిటీతో నెగ్గినవి చేవెళ్లలో తెరాస (268), యాకుత్‌పురలో మజ్లిస్ (978), జుక్కల్‌లో కాంగ్రెస్ 1152, దేవరకద్రలో తెరాస 1392, నాంపల్లిలో మజ్లిస్ 2037 * 20 మందికి పైగా 50 వేల మెజారిటీ కంటె ఎక్కువగా వచ్చింది.

* 119 మందిలో 52 మంది కొత్తవాళ్లు నెగ్గారు. కాంగ్రెసు నుంచి 34 మంది, తెరాస నుంచి 9, మజ్లిస్ నుంచి 3గ్గురు * మహిళా ఎమ్మెల్యేలు గతంలో నలుగురు, యిప్పుడు 10 మంది (కాంగ్రెసు నుంచి 6గురు, తెరాస నుంచి 4గురు) * 2018లో తెరాస 88 గెలిచింది. 14 మందిని వివిధ పార్టీల నుంచి ఫిరాయింప చేసుకుంది. వారిలో 13 మందికి టిక్కెట్లిస్తే వారిలో 11 మంది ఓడిపోయారు. నెగ్గిన యిద్దరూ మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి (బిజెపి ఓట్లు చీల్చడం చేత), ఎల్ బి నగర్ నుంచి సుధీర్ రెడ్డి (మధు యాష్కీపై)!  * 19 ఎస్సీ 11 ఎస్టీ స్థానాలున్నాయి. 2018లో 8 స్థానాలు గెలిచిన కాంగ్రెసు యీ సారి 24 గెలిచింది. గతంలో 20 గెలిచిన తెరాస యీసారి 6 గెలిచింది.

నెగ్గిన ఎమ్మెల్యేలను కులాల వారీగా విభజించి చూస్తే కాంగ్రెసులో రెడ్లు 25, ఎస్సీ 14, ఎస్టీ 9, బిసి 8, వెలమ 6, బ్రాహ్మణ 1, సిపిఐ కమ్మ 1. తెరాసలో రెడ్లు 14, వెలమ 6, కమ్మ 2, మున్నూరు కాపు 2, గౌడ 3, మాదిగ 3, యితరులు 9, బిజెపిలో రెడ్డి 3, వెలమ 1, వైశ్య 1, బిసి 3. సర్వేల సంగతి చూస్తే యాక్సిస్ మై ఇండియా-ఇండియా టుడే సర్వే కాంగ్రెసుకు 68 తెరాసకు 39 వస్తాయంది. టైమ్స్‌నౌ 65-41, రిపబ్లిక్ టీవీ 63-51, ఎబిపి-సి ఓటర్ 57-46, టుడేస్ చాణక్య 71-33 వస్తాయన్నాయి. ఫైనల్‌గా కాంగ్రెసుకు 64, తెరాసకు 39 వచ్చాయి.

ఫలితాలు వచ్చాక డిసెంబరు 5 నాటి ‘‘హిందూ’’లో ప్రచురించిన లోకనీతి-సిఎస్‌డిఎస్ సర్వే కొన్ని అంశాలను హైలైట్ చేసింది. 30 అసెంబ్లీ నియోజక వర్గాలలోని 120 పోలింగు స్టేషన్లలో నవంబరు 25, డిసెంబరు 1 మధ్య 3097 మందిని ప్రశ్నలడిగి వీరు దీన్ని రూపొందించారు. కాంగ్రెసు-తెరాస మధ్య ఓట్ల తేడా 2% మాత్రమే. అయినా గతంతో పోలిస్తే తెరాస ఓట్లు 9% తగ్గగా, కాంగ్రెసు ఓటు శాతం 11 పెరిగింది. తెరాస నిష్క్రమణకు కారణాలు మూడు. మొదటిది గత ఐదేళ్లలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని 70% మంది రెస్పాండెంట్లు (ప్రశ్నలకు సమాధాన మిచ్చినవారు) అభిప్రాయ పడగా, 46% మంది తెరాస పాలన వచ్చిన దగ్గర్నుంచి అవినీతి పెరిగిందని అన్నారు.

రెండో కారణం, తెరాస కుటుంబపాలనపై 52% మంది రెస్పాండెట్ల అసంతృప్తి. మూడో కారణం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొందరికే లాభించాయనే భావన. 79% మంది రెస్పాండెంట్లు టూ బెడ్‌రూమ్ యిళ్లు రాలేదన్నారు. 51% మంది కెసియార్ కిట్లు రాలేదన్నారు. 50% మంది ఫీజు రీఎంబర్స్‌మెంట్ కాలేదన్నారు. 48% మంది ఆరోగ్యశ్రీ రాలేదంటే, 47% మంది కల్యాణలక్ష్మి రాలేదన్నారు. 51% మంది పెన్షన్లు వచ్చాయన్నారు. 34% మంది గత ఐదేళ్లలో నిరుద్యోగం పెరిగిందన్నారు. దీని కారణంగా 25 ఏళ్ల లోపు వారిలో కాంగ్రెసుకు 8 పాయింట్ల ఎడ్వాంటేజి కలిగింది. తెరాసకు 33% మంది ఓటేస్తే కాంగ్రెసుకు 41% వేశారు. ఉన్నత విద్యావంతుల్లో కూడా 8% (38%-30%) బెనిఫిట్ కలిగింది. 56 ఏళ్లు దాటినవారిలో తెరాసకు 48% వేస్తే, కాంగ్రెసుకు 38% వేశారు. గ్రాజువేట్లు కానివారిలో 47% తెరాసకు వేస్తే 40% కాంగ్రెసుకు వేశారు.

తెరాసకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉంటుందనుకున్నారు. కానీ అక్కడ దానికి 41% మంది మొగ్గు చూపితే 46% మంది కాంగ్రెసు వైపు మొగ్గారు. అర్బన్ ప్రాంతాల్లో తెరాసకు 33%, కాంగ్రెసుకు 30% మొగ్గు చూపారు. బిజెపికి గ్రామాల్లో 8%, అర్బన్‌లో 22% మొగ్గు చూపారు. ఆర్థిక స్థితిగతుల బట్టి చూస్తే పేదల్లో తెరాస, కాంగ్రెసు, బిజెపిల శాతాలు యిలా ఉన్నాయి – 41-42-12, దిగువ మధ్యతరగతిలో 38-43-11, మధ్యతరగతిలో 35-40-14, ధనికుల్లో 37-33-19. కులాల వారీగా చూస్తే రెడ్లు 34-49-11, యితర ఒసిలు 37-31-26, బిసి 38-44-14, దళితులు 41-38-8, లంబాడీలు 40-52-4, ఇతర ఎస్టీలు 48-38-9, ముస్లిములలో 25% మజ్లిస్‌కు తెరాసకు 35, కాంగ్రెసుకు 32, బిజెపికి 2 వేశారు.

తెరాస పనితీరు గురించి ప్రజలేమనుకుంటున్నా రనేది కూడా యీ సర్వే చెప్పింది. 67% మందికి పని తీరు నచ్చింది. వారిలో 21% మందికి పూర్తి సంతృప్తి కలగగా, 46% మంది కొద్దిపాటి సంతృప్తి కలిగింది. కెసియార్ చేపట్టిన పనుల్లో ఏది బాగా నచ్చిందని అడిగితే 15% మంది తాగునీరు సరఫరా అన్నారు. 15% విద్యుత్ సరఫరా, 15% రైతుల కష్టాలు తీర్చడం, 7% అభివృద్ధి, 7% మౌలిక వసతుల ఏర్పాటు, 6% దారిద్ర్య నిర్మూలన అన్నారు. విద్యుత్ సరఫరా 88% మెరుగుపడిందని చెప్పినవారిలో తెరాసకు 39% మాత్రమే ఓటేశారు. కాంగ్రెసుకు 38%, బిజెపికి 14% వేశారు. తాగునీరు సరఫరా 80% మెరుగుపడిందని చెప్పినవారిలో తెరాసకు 41%, కాంగ్రెసుకు 39%, బిజెపికి 12% ఓటేశారు.

రోడ్ల పరిస్థితి 65% మెరుగుపడిందని చెప్పినవారిలో తెరాసకు 45%, కాంగ్రెసుకు 35%, బిజెపికి 12% ఓటేశారు. సాగునీరు సరఫరా 60% మెరుగుపడిందని చెప్పినవారిలో తెరాసకు 44%, కాంగ్రెసుకు 39%, బిజెపికి 11% ఓటేశారు. ప్రభుత్వాసుపత్రులు 52% మెరుగుపడ్డాయని చెప్పినవారిలో తెరాసకు 48%, కాంగ్రెసుకు 33%, బిజెపికి 12% ఓటేశారు. ప్రభుత్వ పాఠశాలలు 42% మెరుగుపడ్డాయని చెప్పినవారిలో తెరాసకు 52%, కాంగ్రెసుకు 30%, బిజెపికి 11% ఓటేశారు. దీని ప్రకారం చూస్తే తెరాస పరిపాలన కారణంగా ఓడిపోలేదని తెలుస్తుంది. అవినీతి పెరిగిందని ఫీలైనవారిలో 29% తెరాసకు, 46% కాంగ్రెసుకు, 15% బిజెపికి ఓటేశారు. అవినీతి తగ్గిందని ఫీలైనవారిలో 44% తెరాసకు, 35% కాంగ్రెసుకు, 14% బిజెపికి ఓటేశారు.

కాంగ్రెసు యీ స్థాయిలో విజయం సాధించడానికి రేవంత్ నాయకత్వమే కారణమని యీ సర్వే నొక్కి చెపుతోంది. కెసియార్‌తో సమానంగా 29% ఓటర్లు అతన్ని ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. మహిళల్లో కెసియార్‌ను 31% మంది ఆదరించగా, రేవంత్‌ను 26% ఆదరించారు. పురుషుల్లో కెసియార్‌ను 28% మంది ఆదరించగా, రేవంత్‌ను 32% ఆదరించారు.25 ఏళ్ల లోపు వారిలో  కెసియార్‌ను 28% మంది ఆదరించగా, రేవంత్‌ను 32% ఆదరించారు. 26-35 ఏళ్ల వర్గంలో కెసియార్‌ను 26% మంది ఆదరించగా, రేవంత్‌ను 32% ఆదరించారు. 36 ఏళ్ల పైబడిన వారిలో కెసియార్‌కే ఆదరణ ఎక్కువగా ఉంది. రెడ్లలో కెసియార్‌ను 25% మంది ఆదరించగా, రేవంత్‌ను 38% ఆదరించారు. ముస్లిములలో కెసియార్‌ను 33% మంది ఆదరించగా, రేవంత్‌ను 23% ఆదరించారు. దళితుల్లో కెసియార్‌ను 31% మంది ఆదరించగా, రేవంత్‌ను 26% ఆదరించారు. ఆదివాసీల్లో కెసియార్‌ను 39% మంది ఆదరించగా, రేవంత్‌ను 34% ఆదరించారు.

తెలంగాణ రాష్ట్రసాధనకు, కెసియార్ పాప్యులారిటీకి లింకు ఉన్నట్లు యీ సర్వే చెపుతోంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడినందుకు అమితంగా సంతోషించినవారు 18% మంది. వారిలో 60% మంది కెసియార్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా 12% మంది రేవంత్‌ కావాలని కోరుకున్నారు. ఓమాదిరి సంతోషించినవారు 45% మంది. వారిలో 29% మంది కెసియార్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా 29% మంది రేవంత్‌ కావాలని కోరుకున్నారు. పెద్దగా సంతోషించనివారు 20% మంది. వారిలో 14% మంది కెసియార్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా 40% మంది రేవంత్‌ కావాలని కోరుకున్నారు. అస్సలు సంతోషించనివారు 10% మంది. వారిలో 7% మంది కెసియార్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకోగా 41% మంది రేవంత్‌ కావాలని కోరుకున్నారు.

కెసియార్‌కు యింత పాప్యులారిటీ ఉన్నా తెరాసను ఎందుకు గెలిపించ లేకపోయారు అని అడిగితే ఎమ్మెల్యే అభ్యర్థి కారణంగా అని 38% మంది, పార్టీ కారణంగా అని 32% మంది, ముఖ్యమంత్రి అభ్యర్థి కారణంగా అని 14% మంది, పార్టీ మానిఫెస్టో కారణంగా అని 10% మంది జవాబిచ్చారు.  ఎమ్మెల్యేల పట్ల అసంతృప్తి ఉందని తెలిసినా, వారిని మార్చడానికి సాహసించక పోవడం చేత కెసియార్ నష్టపోయారని యిప్పుడు ఎల్లెడలా వినిపిస్తున్న మాట. వాళ్లని బయటకు పంపిస్తే యితర పార్టీల్లో చేరి తమ ఓట్లకు ఎసరు పెడతారని భయపడడమే కొంప ముంచింది. రిస్కు తీసుకుని పంపించి ఉంటే యింత డామేజి జరిగేది కాదేమో అంటున్నారు.

పథకాల వలన లబ్ధి పొందినవారు అధికార పక్షానికి ఓట్లేస్తారా? లేదా? అనేది ముఖ్యమైన ప్రశ్న. 2018లో ప్రారంభించిన రైతుబంధు పథకం ప్రతి రైతుకి ఎకరాకు రూ.5 వేలు యిచ్చింది. దానిపై యీ సర్వే ఏం చెపుతోందంటే రెస్పాండెంట్లలో 80% మంది ఆ పథకం ద్వారా లబ్ధి పొందారు. కానీ వారిలో తెరాసకు 43% ఓట్లేయగా, కాంగ్రెసుకు 45% వేశారు. ఉచిత విద్యుత్ వలన లబ్ధి పొందినవారు 76%, వారిలో 44% తెరాసకు, 45% కాంగ్రెసుకి వేశారు. రైతుబీమా వలన లబ్ధి పొందినవారు 30%, వారిలో 51% తెరాసకు, 38% కాంగ్రెసుకి వేశారు. కేంద్ర పథకాల విషయానికి వస్తే పిఎం కిసాన్ యోజనా వలన లబ్ధి పొందినవారు 61%, వారిలో 41% తెరాసకు, 46% కాంగ్రెసుకి, 9% బిజెపికి వేశారు. కిసాన్ ఫసల్ బీమా యోజనా వలన లబ్ధి పొందినవారు 20%, వారిలో 41% తెరాసకు, 46% కాంగ్రెసుకి, 11% బిజెపికి వేశారు.

తెరాస పథకాలపై ఉన్న ఒక విమర్శ ఏమిటంటే అవి యూనిఫామ్‌గా అందరికీ అందలేదు. ఎవరికి యివ్వాలో, ఎవరికి యివ్వక్కరలేదో నిర్ణయించే వ్యవస్థ ఒకటి మధ్యలో ఉంది. ఆంధ్రలో టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల్లా, తెలంగాణలో తెరాస హయాంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు వ్యవహరించారనే ఆరోపణ ఉంది. ఫలం దక్కనివారు ఆగ్రహించారని అంటున్నారు. ఈ సర్వే ప్రకారం ఆసరా పెన్షన్ స్కీము 65% మందికి అందింది. కానీ టూ బెడ్‌రూమ్ యిళ్ల పథకం చాలా తక్కువమందికి అందింది. రెస్పాండెంట్లలో అందనివారు 79% కాగా వారిలో కాంగ్రెసుకి 41% మంది, తెరాసకు 36% మంది ఓటేశారు. కెసియార్ కిట్ అందనివారు 51%, వారిలో 43% కాంగ్రెసుకు, 34% తెరాసకు వేశారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ అందనివారు 50%, వారిలో 42% కాంగ్రెసుకు, 34% తెరాసకు వేశారు.

ఆరోగ్యశ్రీ అందనివారు 48%, వారిలో 45% కాంగ్రెసుకు, 30% తెరాసకు వేశారు. కళ్యాణలక్ష్మి లేదా షాదీ ముబారక్ అందనివారు 47%, వారిలో 43% కాంగ్రెసుకు, 32% తెరాసకు వేశారు. దళిత బంధు అందనివారు 82%, వారిలో 39% కాంగ్రెసుకు, 38% తెరాసకు వేశారు. బిసి బంధు అందనివారు 83%, వారిలో 43% కాంగ్రెసుకు, 45% తెరాసకు వేశారు. కేంద్ర పథకాల్లో పిఎం ఆవాస్ యోజనా అందనివారు 65%, వారిలో 42% కాంగ్రెసుకు, 36% తెరాసకు వేశారు. ఆయుష్మాన్ భారత్ అందనివారు 59%, వారిలో 42% కాంగ్రెసుకు, 36% తెరాసకు వేశారు. ఉజ్జ్వల యోజనా అందనివారు 55%, వారిలో 41% కాంగ్రెసుకు, 37% తెరాసకు వేశారు.

లోకనీతి సర్వేలో తీసుకున్న శాంపుల్ సంఖ్యాపరంగా తక్కువే కనబడతాయి. కానీ దాని ఫలితాలను అందరూ గౌరవిస్తారు. కోట్ చేస్తారు. అందుకే అంత విపులంగా యిచ్చాను. ఈ వ్యాసమంతా గణాంకాలతో నిండిపోయింది. టీవీ చర్చల్లో, పత్రికా వ్యాసాల్లో ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలతో తెలంగాణ ఫలితాల విశ్లేషణ అనే పేరుతో మరో వ్యాసం రాస్తాను.

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?