cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ

ఎమ్బీయస్: దిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ

రేపు రిపబ్లిక్ డే పెరేడ్ కంటె రైతులు నిర్వహించబోయే ట్రాక్టర్ ర్యాలీకే ఎక్కువ న్యూస్ కవరేజి వచ్చేట్లుంది. అసలు తగ్గు స్థాయిలోనైనా పెరేడ్ ఎందుకు నిర్వహిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఓ పక్క ‘దేశంలో కరోనా బీభత్సంగా వుంది, అందుకనే టెస్టులు పూర్తి కాకపోయినా, డేటా లేకపోయినా ఎమర్జన్సీ ప్రొవిజన్ కింద వాక్సిన్‌లకు అనుమతి యిచ్చేశాం’ అని చెప్పుకుంటారు. మరో పక్క - ఇదిగో యీ పెరేడ్‌లు, హరిద్వార్‌లో జనవరి 14 నుంచి ఏప్రిల్ 27 వరకు కుంభమేళాలు! ‘కరోనా గురించి భయపడకండి, కానీ జాగ్రత్తలు మానకండి, మాస్కు వేసుకోండి, భౌతికదూరం పాటించండి.’ అని ప్రధాని చెప్తూనే వుంటారు. ఈ పెరేడ్‌లలో, కుంభ మేళా నదీస్నానాల్లో భౌతికదూరం పాటిస్తున్నారనే అనుకోవాలా? దేశంలో కరోనా భయం వున్నట్లా? లేనట్లా? ప్రభుత్వం డిక్లేర్ చేయాలి, తన చర్యల ద్వారా!

పెరేడ్‌కి చీఫ్ గెస్ట్‌గా వస్తానన్న బోరిస్ జాన్సన్ తన దేశంలో కరోనా ఉధృతి వలన రాననేశాడు. ఆయన బదులు సురినామ్ (జనాభా 6 లక్షలట) దేశపు అధ్యక్షుడు చంద్రికాప్రసాద్ సంతోఖీ వస్తారని ప్రచారం జరిగింది కానీ ఎవరూ రాకుండానే జరిపించేస్తున్నారు. జరిపించకపోతే నష్టమేమైనా వుందా? నాలుగేళ్లకు ఓ సారి వచ్చే అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారమే వెయ్యిమందితో కానిచ్చేశారు కదా! దీన్నీ సింపుల్‌గా కానిస్తే నష్టమేముంది? రైతులు మేం రిపబ్లిక్ దినం నాడు ట్రాక్టర్ ర్యాలీ చేస్తాం అంటే ప్రభుత్వం కరోనా వుంది, ఎలా చేస్తారు అనగలదా? దాదాపు రెండు నెలలుగా దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల క్యాంప్‌లు చూడండి, ఒక్కరికైనా మాస్క్ వుందా? దూరదూరంగా వున్నారా? రేపు ట్రాక్టర్లు ఎక్కినపుడు ఎలా వుండబోతోందో ఊహించవచ్చు. అదెలా అని అడిగితే ప్రభుత్వం పెరేడ్ చేయలేదా? అంటారు వాళ్లు.

అసలు ఆ ర్యాలీని ప్రభుత్వం అనుమతిస్తుందాని సందేహం వచ్చింది. చివరకు కొన్ని షరతులతో అనుమతించారు, లేకపోతే మరీ గొడవ అయిపోతుందని. అనుమతి యిస్తూనే దీని వెనుక పాక్ హస్తం వుందన్న ప్రచారమూ ప్రారంభించారు. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరేం చేసినా వెనక్కాల పాక్ హస్తం వుంటుందంతే! దీని విషయంలో పాక్ హస్తం లేదనే సర్టిఫికెట్టు నేనివ్వను. శత్రుదేశంలో యిలాటి ఆందోళనలు చెలరేగినప్పుడు దాన్ని ఉపయోగించుకోని దేశాలు అరుదు. పాక్‌లో బెలూచిస్తాన్ గొడవను మనం వాడుకోలేదూ? గొడవ యింతటి తీవ్రస్థాయికి రాకుండా ప్రభుత్వం చూసుకోవాలి కానీ వచ్చాక శత్రుదేశం వాళ్లు లాభపడుతున్నారని వగచి ప్రయోజనం లేదు.

ఆందోళన యీ స్థాయికి ఎందుకు చేరాలి? చేరేదాకా ఎందుకు రానిచ్చారు? దీని వెనుక ప్రతిపక్షాలు ఉన్నాయి, ధనిక రైతులున్నారు, కమీషన్ ఏజంట్లు వున్నారు, యిలాటి వాదనలన్నీ వ్యర్థం. ప్రతిపక్షాలే కనుచూపు మేరలో కానరావటం లేదు. కాంగ్రెసు పార్టీ అంతర్గత కలహాల్లో కొట్టుమిట్టు లాడుతూ సంస్థాగత ఎన్నికలను జూన్ వరకు వాయిదా వేయవలసిన దుస్థితిలో వుంది. దిల్లీలోని ఆప్ కరోనా కట్డడిలో మునిగి తేలుతోంది. మూకబలంలో కాని, రూకబలంలో కాని బిజెపి దగ్గరకు రాగలిగిన పార్టీ ప్రస్తుతం దేశంలో లేదు. ఏవైనా ప్రాంతీయ పార్టీలున్నా, వారి వారి రాష్ట్రాలకు పరిమితమై వున్నారు. మమతా బెనర్జీ ఒక్కరు తప్ప వేరెవ్వరూ బిజెపితో పేచీ పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వాళ్లు జాతీయ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేపట్టే స్థితిలో వున్నారంటే ఎవరూ నమ్మరు.

ఏవైనా ఆందోళనలు జరిగాయంటే ప్రభుత్వ చర్యల వలన ప్రభావితమైన వారే చేపడుతున్నారు. మామూలు పరిస్థితుల్లో అయితే యిప్పటివరకు అలాటి ఆందోళనలు అనేకం జరగాలి. పౌరసత్వచట్టానికి వ్యతిరేకంగా ఓ మోస్తరుగా పెద్ద ఆందోళనే నడిచింది. కానీ ఆందోళన కారులందరూ దేశద్రోహులంటూ, కేసులు పెట్టి అణచివేశారు. సర్వశక్తిమంతుడిగా వెలిగిపోతున్న మోదీని ఢీ కొట్టడానికి ఎవరూ సాహసించటం లేదు. ఇలాటి పరిస్థితుల్లో యీ రైతులే నడుం కట్టారు. తెగించి ముందుకు వచ్చారు. పట్టు వదలకుండా, రాజీ పడకుండా పోరాడుతున్నారు. మోదీ ప్రభుత్వానికి తగిలిన గట్టి ఎదురుదెబ్బ యిది.

వీళ్లు ఏ ముస్లిములో అయితే యింత దూరం రానిచ్చేది కాదు. రైతులై కూర్చున్నారు. ఏమైనా కఠినంగా చర్య తీసుకుంటే అయ్యోపాపం రైతులు అంటారు జనం. తెలుగు మీడియా అయితే అన్నదాతల ఆక్రోశం అని నానా హడావుడీ చేస్తుంది. అసలు యీ అన్నదాత పదమే నాకు నచ్చదు. రైతులేమైనా అన్నాన్ని దానం చేస్తున్నారా? వరి పండించి అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం. భోజనం చేశాక ‘అన్నదాతా సుఖీభవ’ అని అనుకోవాలని పెద్దలు చెప్పారంటే దానికి అర్థం ఆ అన్నాన్ని ఉచితంగా యిచ్చినవారిని తలచుకోమని. బియ్యాన్ని, కూరలను, ఊరగాయలను అమ్మినవాళ్లను తలచుకోమని కాదు. ఇదే లాజిక్ ఉపయోగిస్తే నేత పనివారిని వస్త్రదాతలని, తాపీ మేస్త్రీలను గృహదాతలనీ వ్యవహరించాలి.

తెలుగు జర్నలిజంలో రైతుని అన్నదాతగా వ్యవహరించడం ఎప్పణ్నుంచి ప్రారంభమైందో భాషా పరిశోధకులెవరైనా గమనించి చెపితే బాగుణ్ను. ‘‘అన్నదాత’’ పేర రైతుల కోసం పత్రిక నడిపే ‘‘ఈనాడు’’ మొదలెట్టిందా? కులం బదులు ‘సామాజిక వర్గం’ అనడం కూడా ఈనాడే ప్రారంభించిందనుకుంటాను. పోనుపోను అలా వాడకపోతే దోషం అనే స్థాయికి వచ్చింది. సరే, యింతకీ చెప్పవచ్చేదేమిటంటే రైతులు కావడంతో వాళ్లని చటుక్కున దేశద్రోహులనడం కష్టం. వారు అమాయకులనీ, ఎవరో వారిని తప్పుదోవ పట్టిస్తున్నారనీ అంటున్నారు తప్ప వాళ్లు లేవనెత్తిన సందేహాలను తీర్చటం లేదు. సంబంధిత వర్గాలన్నిటి తోను సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా బిల్లులు ప్రవేశపెట్టడం దేనికి? ఇప్పుడు గొడవ వచ్చాక దాని అమలును ఏడాదిన్నర వాయిదా వేస్తామనడం దేనికి?

పంజాబ్, హరియాణా రైతులు మాత్రమే ఎందుకు ఆందోళన చేస్తున్నారు? అని కొందరి ప్రశ్న. వాళ్లంత స్థాయిలో దిల్లీలో డేరా వేయలేదు కానీ అనేక రాష్ట్రాలలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. చాలా విషయాల్లో గందరగోళం వుంది. బిల్లులు అమలులోకి వచ్చాక క్లారిటీ వస్తుంది, అప్పుడు మేలు జరగలేదని తేలితే గొడవలు రావచ్చు. కొన్ని ప్రభుత్వాలు వీటిని సమ్మతించలేదు. రేపు ముంబయిలో కూడా రైతుల ర్యాలీ జరుగుతోంది. తక్కిన చోట్లకు వ్యాపిస్తుందేమో చూడాలి. ఈ బిల్లులను సమర్థిస్తున్న జయప్రకాశ్ నారాయణ్ గారు పంజాబ్‌, హరియాణాలలోని ధనిక జాట్లు, మండీలకు సంబంధించిన కమిషన్ ఏజంట్లు కావాలని గొడవ చేయిస్తున్నారని అంటున్నారు.

నేను చదివిన ప్రకారం 22 పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను సిఎసిపి – కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ సిఫార్సు చేస్తుంది. అంటే వేరే ఎక్కడా దాని కంటె మంచి ధర పలక్కపోతే ఆ ధరకు నేను కొంటాను అని ప్రభుత్వం అండర్‌రైట్ చేయాలన్నమాట. అది అమలు చేయాలని చట్టం ఎక్కడా లేదు. చట్టంగా చేయాలని యిప్పుడు రైతులు కోరుతున్నారు. 22 పంటలకు అని అంటున్నా ప్రధానంగా వరి, గోధుమలకే రైతులు వాడుకుంటున్నారు. వరి, గోధుమల మొత్తం సప్లయిలో 65 శాతం పంజాబ్, హరియాణా రైతులదే వాటా. ఇప్పుడీ చట్టం వచ్చాక, ప్రభుత్వం నోటిమాటగా కనీస మద్దతు ధర విధానం అమలు చేస్తాం అని చెప్తున్నా, కావాలంటే కార్పోరేట్లకు అమ్ముకోండి. మేమెందుకు కొనాలి అని తప్పించుకోవచ్చని రైతుల భయం. అందువలన ఆ హామీని చట్టంలో పొందు పరచండి అని అడుగుతున్నారు. యుపిఏ హయాంలో చేయని పని మేమెందుకు చేయాలి అని యీ ప్రభుత్వం అంటోంది. ఎంఎస్‌పి విషయంలో అందరి కంటె ఎక్కువ బాధితులు పంజాబ్, హరియాణా రైతులే కాబట్టి వారు పోరుబాట పట్టారట.

ప్రస్తుతం రైతు తన పంటను ఎపిఎంసి (అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ) మండీలకు అమ్ముకుంటున్నాడు. ఇవి రాష్ట్ర పరిధిలోకి వస్తాయి. కొన్ని చోట్ల బాగా పనిచేస్తున్నాయి, కొన్ని చోట్ల పని చేయటం లేదు అంటూ కేంద్రం యిప్పుడు వాటి ప్రాధాన్యతను తీసేసి, పోటీగా కార్పోరేట్లకు అప్పగిస్తోంది. క్రమేపీ కార్పోరేట్లకు మేలు చేయడానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ లేకుండా మండీలను ఎత్తివేస్తుందని రైతుల భయం. ఎత్తివేయనని ప్రభుత్వం హామీ ఏమీ యివ్వలేదు. మండీలలో లోపాలుంటే సరిదిద్దాలి తప్ప వాటి పాత్రను పరిమితం చేయడమేమిటని రైతుల అభ్యంతరం. తక్కినవాటి మాట ఎలా వున్నా పంజాబ్, హరియాణాలలో మండీ వ్యవస్థ బాగా పని చేస్తూ గత 20 ఏళ్లగా వాళ్లకు వ్యవసాయం లాభసాటిగా వుందిట. అందువలన కూడా వాళ్లు ప్రస్తుత పరిస్థితిలో మార్పును ఆహ్వానించటం లేదు.

నిజానికి వ్యవసాయ బిల్లుల గురించి రాయాలంటే ఎంతోకొంత సాంకేతిక పరిజ్ఞానం వుండాలి. చదివినది హరాయించుకుని, సులభమైన భాషలో చెప్పగలగాలి. ప్రయత్నిస్తాను. తప్పులుంటే ఎత్తి చూపండి. మొత్తం మీద నాకు బోధపడిందేమిటంటే దీర్ఘకాలంలో రైతులు బాగుపడతారో లేదో తెలియదు కానీ, ప్రస్తుతానికి మాత్రం కార్పోరేట్లే బాగుపడతాయి. ‘బాగుపడితే తప్పేముంది? తమకు వచ్చిన లాభాలతో అవి రైతులను కూడా బాగుపరుస్తాయి. వినియోగదారుడికి నాణ్యమైన సరుకు దొరుకుతుంది. రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది.’ అంటారు కొందరు. ‘ప్రస్తుతం కార్పోరేట్లు రైతులకు మెరుగైన ధర యిస్తున్నాయా? రైతు బజారులో అమ్ముకునే రైతు కంటె రిలయన్స్ ఫ్రెష్‌కు అమ్ముకునే రైతు మెరుగ్గా వున్నాడా? అలా అయితే అందరూ రిలయన్స్ ఫ్రెష్‌కే అమ్ముదురు కదా!’ అంటారు ప్రొఫెసర్ నాగేశ్వర్. రైతులకు వచ్చే రేటు సంగతేమో కానీ కస్టమర్‌కు సూపర్ మార్కెట్లలో నాణ్యమైన కూరగాయలు దొరకవని మాత్రం నా అనుభవం.

ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజిలో నిధులు విడుదల చేసి, ఉద్యోగకల్పన చేయలేదు. చిన్న తరహా పరిశ్రమలకు తగినంత చేయూత నీయలేదు. కార్పోరేట్లు బ్యాంకులకు చేసిన అప్పులు తీర్చేసి, వారికి మరింత డబ్బు యిస్తే వాళ్లే ఉద్యోగాలు సృష్టిస్తారనే వాదన వినిపించింది. వాస్తవానికి అలా జరిగిందా? ఆక్స్‌ఫామ్ 2020 నివేదిక చూడండి, ఎవరు లాభపడ్డారో తెలుస్తుంది! ‘అసలు ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయాలి? మార్కెట్ ఫ్రీగా వదిలేస్తే మార్కెట్ శక్తులే ధరవరలు నిర్ణయిస్తాయి.’ అని వాదిస్తారు మరి కొందరు. మరి అలా అయితే ప్రభుత్వం దేనిలోనూ కలగజేసుకోకూడదు. పెట్రోలు ధరలను ఎందుకు నియంత్రిస్తోంది? మోదీ హయాంలోనే లీటరు ధర మూడంకెలకు చేరుతుందని సులభంగా ఊహించవచ్చు. వాక్సిన్ ముందు ఎవరికి యివ్వాలో, తర్వాత ఎవరికి యివ్వాలో నిర్ణయించడం దేనికి? దాని ధర గురించి మాట్లాడడం దేనికి?

ఉద్యోగాల్లో, చదువులలో రిజర్వేషన్లు ఎందుకు యివ్వాలి? రైతులకు సబ్సిడీలు, పరిశ్రమలకు రాయితీలు, లోన్ల మారిటోరియం, రైతు ఋణాల మాఫీ, ఇన్‌కమ్ టాక్స్‌లో వెసులుబాటు,.. యిలా సవాలక్ష వాటిల్లో వేలు పెట్టడం దేనికి? వాళ్లూవాళ్లూ చూసుకుంటారు, బలవంతుడెవడో మిగులుతాడు, బలహీనుడు వాడి అవస్థ వాడు పడతాడు అని ఊరుకోవచ్చుగా. కాపిటలిజానికి పుట్టినిల్లయిన అమెరికాలో సైతం వ్యవసాయానికి సబ్సిడీ ఎందుకు యిస్తున్నారు? రైతుల దగ్గరకు వచ్చేసరికే ఫ్రీ మార్కెట్ గుర్తు కొచ్చిందా? వాళ్లకు కావలసినదేమిటి? నకిలీ కాని విత్తనాలు, మంచి ఎఱువులు, చిన్న ట్రాక్టర్ వంటి వ్యవసాయ పనిముట్లను అద్దెకు తెచ్చుకోగలగడం, పంట చేతికి వచ్చినపుడు దాచుకోవడానికి గిడ్డంగులు, పంట దిగుబడి ఎక్కువగా వున్నపుడు దాచి, ప్రాసెస్ చేసి, వేల్యూ యాడ్ చేసి అమ్ముకునే ఆగ్రో యిండస్ట్రీస్ దగ్గర్లో వుండడం.. యిలాటివి.

టొమాటో ధర దారుణంగా పడిపోయి రైతులు రోడ్ల మీద పారబోసుకున్నారని చదువుతూంటాం. వాటిని జామ్‌గానో, సాస్‌గానో మార్చి పెట్టే పరిశ్రమ ఊళ్లో వుంటే ఎందుకు పారబోస్తారు? ఇలాటి సూచనలు, నాలుగు దశాబ్దాలుగా వింటున్నాను, చదువుతున్నాను. మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ముఖ్యమంత్రి ‘ఊరూరా ఆగ్రో ప్రాసెసింగ్ యిండస్ట్రీ వలననే పంజాబ్‌ రైతు పచ్చగా వున్నాడు. మన దగ్గరా పెడతాం.’ అంటూనే వున్నాడు. ఇప్పుడు జగన్ కూడా పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి చొప్పున పెడతానని ప్రకటించాడు. ఇలాటివి ‘ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు’ అనే చదువుతాం, తప్ప అమలయిందని చదవం. అమలైతే నిజంగా గొప్ప విషయమే. ఇవన్నీ చేసిన రోజున రైతును ప్రత్యేకంగా ఆదుకోవలసిన పని లేదు. అతను ఆత్మహత్య చేసుకుంటే లక్షల పరిహారం యివ్వనూ అక్కరలేదు.

ఇవేమీ చేయకుండా వాళ్లను కార్పోరేట్లకు అప్పగించేస్తాం. వాళ్లే ఉద్ధరించేస్తారు అంటోంది ఈ ప్రభుత్వం. నీమీద నమ్మకంతో ఓట్లేసి, నీ ఫోటో యింట్లో పెట్టుకుని దణ్ణం పెట్టుకుంటూంటే నువ్వే ఉద్ధరించలేదు కానీ, ఎవడో కార్పోరేట్ వాడు నీ ఓటరుపై జాలిపడతాడా? దేశపు రైతుల్లో 85 శాతం మంది బక్క రైతులే. కార్పోరేట్ వాడు నడుం విరిస్తే, నమిలి తినేస్తే, ఎదురు తిరిగి పోరాడగలడా? అంతో యింతో చదువుకున్న కార్మికులే పోరాడలేకపోతున్నారు. కార్మిక చట్టాలను మార్చి యాజమాన్యాలను బలోపేతం చేసి కార్మికుల హక్కులు హరించేశారు. ఇక సాధారణ చదువున్న రైతు విదేశాలతో వ్యాపారం చేసే స్థాయిలో వున్న కార్పోరేట్‌తో పేచీ పెట్టుకోగలడా?

కార్పోరేట్ మోసం చేసి ఒప్పందం సరిగ్గా అమలు చేయకపోతే సబ్ కలక్టర్ దగ్గర మొఱ పెట్టుకోవచ్చట. ఆయన తీర్పే ఫైనలట. దానిపై యింకో కోర్టుకి వెళ్లడానికి లేదట. ఏ పెద్ద కార్పోరేటైనా సబ్ కలక్టర్‌పై ఒత్తిడి చేయలేని పరిస్థితిలో వుందా? కోర్టుకి వెళ్లనీయకుండా చేయడమంటే ప్రాథమిక హక్కు హరించడమే కదా! ఇదెక్కడి అన్యాయమని దేశమంతా గగ్గోలు పెడితే యిప్పుడు ‘సర్లెండి, మారుస్తాం లెండి’ అంటున్నారు. ఏం? ఆ ముక్కేదో ముందే బిల్లులో రాయచ్చుగా! అంత తొందరెందుకు? ఇలాటివి చేయడం, అదేమిటని అడిగితే దేశభక్తి లేదనడం! ఇదో గోల! ఆ బిల్లులలోని తక్కిన విషయాల గురించి మరోసారి రాస్తాను.

ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×