Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: వైజాగ్ పోర్టు అనుభవం

ఎమ్బీయస్: వైజాగ్ పోర్టు అనుభవం

వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఉద్యమం ఊపందుకుంటోంది. పబ్లిక్ సెక్టార్‌ను ఎడాపెడా అమ్మేయడం తప్పుకాదని వాదించేవారు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు పనిచేయరని, అందుకే నష్టాలు వస్తాయని, ఆ నష్టాలు మనలాటి టాక్సు చెల్లింపుదారులు కట్టాల్సి వస్తోందని వాపోతూంటారు. పబ్లిక్ సెక్టార్‌కు నష్టాలు రావడానికి కేంద్ర ప్రభుత్వవిధానాలు ఎలా కారణమవుతాయో పివిఆర్‌కె ప్రసాద్ గారి ‘‘అసలేం జరిగిందంటే..’’ పుస్తకంలో 1988 మే నుంచి వైజాగ్ పోర్టు చైర్మన్‌గా ఆయన అనుభవాలు చదివితే తెలుస్తుంది. వాటిల్లో కొన్ని ప్రస్తావిస్తాను. కేంద్రం కావాలని ఎలా చెడగొడుతుందో మీకు అర్థమవుతుంది. దాన్ని అడ్డుకోవాలంటే ప్రసాద్ గారి లాటి గట్స్, చాకచక్యం ఉన్నవాళ్లు ఉండాలి. అనేక సంస్థల్లో వుండే వుంటారు కూడా. అయితే వాళ్ల గురించి మనం తెలుసుకోలేము. ఈయన ధైర్యంగా అన్ని విషయాలూ చెపుతూ పుస్తకం రాశారు కాబట్టి తెలిసింది.

ఇప్పుడు చూడండి, మోదీ సర్కారు వచ్చిన తర్వాత ‘నీతి ఆయోగ్ చెప్పింది కాబట్టి చేశాం, ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కాబట్టి చేశాం’ అని వాళ్ల మీద నెట్టేస్తున్నారు. నిజానికి తాము అనుకున్నదే నీతి ఆయోగ్‌ చేత చెప్పిస్తూంటారు వీళ్లు. అందుకే అరవింద్ పనగారియా లాటి వాళ్లు విసిగి వెళ్లిపోయారు. చంద్రబాబు గారూ అంతే, తన ఆలోచనలకు ప్రపంచబ్యాంకు రిపోర్టు లాటివి అడ్డేసుకుంటారు. 1988లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఓడరేవుల అభివృద్ధికి, రాబోయే పదేళ్లలో ఎగుమతి, దిగుమతులు ఎలా పెంచాలి అనే దానిపై ప్రణాళిక వేసే పని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు కన్సల్టెంట్లకు అప్పగించింది. ప్లానింగ్ కమిషన్ ఎలాగూ వుంది. 1989 జనవరిలో కేంద్ర రవాణా మంత్రి రాజేష్ పైలట్ దేశంలోని అన్ని మేజర్ పోర్టుల చైర్మన్లను పిలిచి వీళ్లందరితో కూర్చోబెట్టి సమావేశం జరిపాడు.

2000 సం. నాటికి వైజాగ్ పోర్టు ఎగుమతులు, దిగుమతులు కలిపి 185 లక్షల టన్నుల సరుకు హ్యేండిల్ చేస్తుందని కన్సల్టెంట్ల నివేదిక చెప్పింది. ప్రసాద్ ఆ నివేదికతో విభేదించారు. ‘గత మూడేళ్లగా ఏడాదిగా ఏటా లక్ష టన్నులు వ్యాపారం పెంచుకుంటూ ప్రస్తుతం 150 లక్షల స్థాయికి చేరాం కాబట్టి, వచ్చే 12 ఏళ్లలో ఏడాదికి 3 లక్షల చొప్పున మొత్తం 36 లక్షలు పెరిగి 185 లక్షలకు చేరుతుందని కాకిలెక్క వేశారు. దీని ప్రకారం మా పోర్టుకు నిధులు కేటాయిస్తే నష్టపోతాం.’ అన్నారు. ‘నెలల తరబడి అధ్యయనం చేసి తయారుచేసిన నివేదికను అలా కొట్టి పారేస్తే ఎలా?’ అని అడిగితే ప్రసాద్ ‘నేను వచ్చిన ఎనిమిది మాసాల్లో మా ట్రాఫిక్ పెరిగి ప్రస్తుతం 180 లక్షల టన్నులకు చేరాం. ఇంకో రెండు నెలల్లో 200 లక్షలకు చేరాలనే లక్ష్యంతో వున్నాం. మరి అలాటప్పుడు 2000 వరకు 185 చేరమని చెపితే ఎలా?’ అన్నారు ప్రసాద్. ఇలా వుంటాయ్ నివేదికలు! ఇప్పుడైతే వైజాగ్ పోర్టు యూస్‌లెస్ కాబట్టి అమ్మేద్దాం అనే నివేదిక కూడా తయారుచేసుకుని కూడా తెచ్చి వుంటారు.

ఈయన ట్రాఫిక్‌ను యీ స్థాయిలో పెంచడానికి ఓ బృహత్ ప్రయత్నం చేశారు.  ఎగుమతి చేయాల్సిన సరుకులు 75 బోగీల గూడ్స్‌ రైళ్లలో వాల్తేర్ రైల్వే స్టేషన్‌కు వస్తాయి. వాటిని పోర్టు రైలింజన్ల ద్వారా తీసుకుని వచ్చి పోర్టులో సైడింగ్ అనే ప్లాట్‌ఫాం మీద దింపాలి. అక్కణ్నుంచి ఓడల్లోకి లోడింగ్ చేయించాలి. అయితే వీళ్ల సైడింగులు ఎంత చిన్నవంటే ఒక గూడ్సులో వచ్చిన దాన్ని మూడు, నాలుగు భాగాలుగా తెచ్చి ఒక దాని తర్వాత మరో దాన్ని అన్‌లోడింగు చేయించాలి. మొదటిది ఓడల్లో లోడింగు అయ్యేవరకు రెండోది అన్‌లోడింగు చేయలేరు. ఈ సైడింగులను పెద్దవి చేయిద్దామన్నా అసలు వాల్తేరు నుంచి ఇక్కడికి యిక్కడకు తీసుకుని వచ్చే పోర్టు రైలింజన్లు ఇక్ష్వాకుల కాలం నాటివి, ఒక్కోసారి 25 బోగీల కంటె లాగలేవు. అందుకని ఇన్‌స్టాల్‌మెంట్లలో లాక్కుని వస్తూంటాయి. దిగుమతి చేసుకుని వేరే ఊళ్లకి పంపాలన్నా యిదే సమస్య. దీనివలన ఎగుమతులకు, దిగుమతులకు చాలా జాప్యమయ్యేది. పైగా రైల్వే స్టేషన్‌లో గూడ్సులను ఎక్కువకాలం ఆపేస్తున్నందుకు వాళ్లకి డెమరేజీ కట్టేవారు. 1987లో కోటి రూపాయలు కట్టారు.

వాల్తేరు స్టేషన్ సౌత్ ఈస్ట్ రైల్వే కిందకు వస్తుంది కాబట్టి దాని చీఫ్ రామ్‌జీని ప్రసాద్ గారు పోర్టుకి ఆహ్వానించి ఏదైనా సాయం చేయగలరా అని అడిగితే, ఆయన ‘వైజాగ్ స్టీలు ప్లాంటు చూడండి, సైడింగ్‌లు ఎంత పెద్దవి కట్టారో.  75 బోగీలు గూడ్స్ రైలు 8-10 గంటల్లో ఖాళీ అయిపోతుంది. మీకు నాలుగు రోజులు పడుతోంది. మీ సైడింగులు చిన్నవి, ఇంజన్లు ఓపిక లేనివి. మేమేం చేస్తాం?’ అన్నారు. ఈయన తన అధికారులను పిలిచి ఏం చేస్తున్నారిన్నాళ్లూ? అని గద్దిస్తే వాళ్లు చెప్పారు – రైలింజను కొంటాం అనుమతి యివ్వండి అని కేంద్రానికి పంపిన ప్రతిపాదన రెండేళ్లగా వాళ్ల దగ్గరే పడి వుంది. అనుమతి వచ్చాక రైల్వేకు ఆర్డరిస్తే మూడేళ్లు పడుతుంది. రెండు పెద్ద గూడ్సులు పట్టేటంత యార్డు కట్టాడనికి 5 కోట్లవుతుంది, పర్మిషన్ యివ్వండి అని ప్రతీ ఏడాదీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతూనే వున్నారు కానీ కేంద్రం ఆమోదించలేదు. పోర్టు దగ్గర డబ్బుంది కానీ చైర్మన్‌కు కోటి రూ.లకు మించి ఖర్చు పెట్టే అధికారం లేదు.

ఇప్పుడర్థమైందా? కేంద్రం పబ్లిక్ సెక్టార్‌ను ఎలా నాశనం చేస్తోందో! పోర్టులో ట్రాఫిక్ పెరిగితే లాభాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, దేశం ముందుకు వెళుతుంది. కానీ కేంద్రంలో ఆ శాఖలో వున్న ఉద్యోగికి అవేమీ పట్టవు. పోర్టులో వున్నవాళ్లకు టార్గెట్లు వుంటాయి తప్ప రోజుకి యిన్ని ఫైళ్లు కదల్చాలి అని ఆ ఉద్యోగికి టార్గెట్ వుండదు. మంత్రులే పూనుకుని, చైర్మన్ ఉత్తరం రాశారు కదా, అనుమతులు యిచ్చేయండి అనాలి. కానీ వాళ్లు ఉద్దేశాలు వేరు. పబ్లిక్ సెక్టార్ దండగ అని చూపడమే వాళ్ల లక్ష్యం. అందుకే ఇంత చిన్న పని జరపకుండా పోర్టును యిబ్బందుల్లోకి నెట్టారు. హార్బర్‌లో కోల్ జెట్టీల్ని బెర్త్‌లుగా మార్చాలని పదేళ్లుగా అధికారులు అడుగుతున్నా చేయటం లేదు. ప్రసాద్ గారు వెంటనే ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ప్రాజెక్టు 15 కోట్లు అవుతుంది కాబట్టి దాన్ని కోటి రూ.లకు మించని 15 చిన్న ప్రాజెక్టులుగా విడగొట్టి ప్రతిపాదించండి. కోటి రూ.ల దాకా నాకు పవర్ వుంది కాబట్టి వెంటనే శాంక్షన్ చేసేస్తాను అన్నారు.

అలా రెండు నెలల్లో నాలుగు గూడ్సు రైళ్ల సామాను పట్టేటంత సైడింగులు కట్టించేశారు. వాటి ప్రారంభోత్సవానికి రామ్‌జీని పిలిచి చూపించారు. ఆయన ఈయన తెగువకు ఆశ్చర్యపడి, అంతా బాగానే వుంది కానీ రైలింజను లేదు కదా ఏం చేస్తారు? అన్నారు. ‘దానికి మీరు సాయం చేయాలి. మీ రైల్వేకు, మాకూ డబ్బు విషయాల్లో పేచీలున్నాయి. మా దగ్గర్నుంచి మీకు డబ్బు రావాల్సి వుంది. అవన్నీ  వెంటనే పరిష్కరించేస్తాను.’ అని ప్రసాద్ ఆఫర్ చేశారు. అలాగే టపటపా చేసేయడంతో సౌత్ ఈస్ట్ రైల్వే జిఎం ముగ్ధుడై పోయాడు. పాత బాకీలు వసూలయ్యాయి కదాన్న సంతోషంలో ఆయనుండగా ప్రసాద్ గారు ‘ఓ రైలింజను యిప్పిస్తే కృతజ్ఞుణ్ని’ అన్నారు. ‘గతంలో ఎప్పుడూ యిలా చేయలేదు. మా రైల్వే బోర్డు చైర్మన్‌ను అడుగుతాను. ఆ లోపున మా వాల్తేరు యార్డు నుంచి మీ సైండిగుల వరకు గూడ్సు వెళ్లేట్లా ఆదేశాలు యిస్తాను.’ అన్నారు.

వారం రోజుల్లో రామ్‌జీ ‘మీరు వెంటనే మూడు కోట్ల రూ.లు వారణాశిలోని లోకోమోటివ్ వర్క్‌షాప్‌కి కడితే యింజను యిప్పిస్తారు’ అన్నారు. నిజానికి అది సౌత్ ఈస్ట్ రైల్వేకి గతంలో కేటాయించిన యింజను. దాన్ని జిఎం గారు యిటు మళ్లించడానికి ఒప్పుకున్నారు. అయితే పోర్టులో ఫైనాన్షియల్ ఎడ్వయిజర్ అభ్యంతర పెట్టాడు. ‘మనం డైరక్టుగా కొనగూడదు. మన మంత్రిత్వశాఖ ఆమోదిస్తే, మనం రైల్వే మంత్రిత్వ శాఖకి రాస్తే, వాళ్లు రైల్వేబోర్డుతో సంప్రదించి ఔనంటేనే కొనాలి. లేకపోతే ఆడిట్ అభ్యంతరాలతో మనం యిరుక్కుంటాం.’ అంటూ చెప్పబోయారు. ప్రసాద్ ‘గతంలో మన బోర్డులో ఇంజను కొనాలని తీర్మానం చేసి మంత్రిత్వశాఖకు పంపాం కదా, దాని మీదే నేను డబ్బు కట్టమని ఆదేశాలిస్తాను. మీరు అభ్యంతర పెట్టండి, నేను తోసిరాజంటాను. మీరు సేఫ్ అవుతారు. ఏదైనా వస్తే నాకే చుట్టుకుంటుంది.’ అన్నారు.

అలాగే వారం రోజుల్లో డబ్బు కట్టేయడం, పది రోజుల్లో భారీ రైలింజను వచ్చేయడం జరిగాయి. ఈ చర్య వలన 6-7 నెలల తర్వాత యీ పోర్టు ట్రాఫిక్ 50 లక్షల టన్నులు దాటిపోయి, 203 లక్షలకు చేరుకున్నారు. దేశంలో పోర్టులన్నిటిలో అగ్రస్థానానికి చేరుకున్నారు. రైల్వేకి డెమరేజీలు కట్టనక్కర లేకుండా డబ్బు మిగిలింది. ట్రాఫిక్ పెరగడంతో ఇంజను ఖర్చుని రాబట్టేశారు కూడా. కానీ పోర్టు మంత్రిత్వశాఖ అధికార దుర్వినియోగం చేశారంటూ యీయన్ని తప్పు పట్టింది. మేం రాటిఫై చేయడం లేదంటూ సంజాయిషీ కోరింది. ‘ఏడాదికి 50 లక్షల టన్నుల ట్రాఫిక్ హేండిల్ చేయడానికి బొంబాయి దగ్గర నవసేవా పోర్టుని వెయ్యి కోట్లతో కట్టింది ప్రభుత్వం. మేం ఒక్క ఏడాదిలో 48 లక్షల ట్రాఫిక్ పెంచి, పోర్టుని నష్టాల్లోంచి లాభాల్లోకి తెస్తే యిదా ప్రతిఫలం’ అనిపించింది ఆయనకు. ‘మా ప్రతిపాదనను ఏడాదిపాటు మీ దగ్గరుంచుకుని తాత్సారం చేశారు. దానివలన మా ట్రాఫిక్ పెరగకపోతే జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?’ అని సమాధానం రాశారు.

ఈ సమాధానం మంత్రిదాకా వెళ్లిపోయింది. రాజేష్ పైలట్ ఫోన్ చేసి ఏమిటి యిలా రాశారు? అని అడిగారు. ఆయనకు ప్రసాద్ గారిపై సదభిప్రాయం వుంది. ఈయన చెప్పినదంతా విని ‘‘మంత్రిత్వశాఖలో పోర్టుల ప్రతిపాదనలు సంవత్సరాల తరబడి పెండింగులో వుండిపోతున్నాయని రెండు మూడు పోర్టుల చైర్మన్లు చెప్పారు. మంచిపనులు చేయడమే చాలా కష్టం. అందుకే మీ చర్యల్ని ఆమోదిస్తూ, యిటుపై మేజరు పోర్టుల చైర్మన్‌లు ఒక్కో ప్రాజెక్టుపై పెట్టే ఖర్చు రూ.5 కోట్లకు పెంచుతున్నాను.’’ అన్నారు. అలా కథ సుఖాంతమైంది.

దీని తర్వాత యింకో విషయంలో గొడవ వచ్చింది. ఎగుమతిదిగుమతుల లోడింగ్, అన్‌లోడింగుకై వినియోగించే లేబరును పోర్టుకి అనుబంధంగా వుండే డాక్ లేబర్ బోర్డు చేస్తుంది. పనిలేని రోజుల్లో జీతం, వైద్యం ఖర్చు, పిఎఫ్ వగైరాలు భరించడానికి పోర్టు ఎగుమతి, దిగుమతి దారులపై లెవీ విధించేది. తక్కిన అన్ని పోర్టుల కన్నా వైజాగ్ పోర్టులో ఆ లెవీ అధికం. దానివలన ఎగుమతి, దిగుమతి దారులు తప్పనిసరి ఐతే తప్ప వైజాగ్‌కు వచ్చేవారు కారు. ప్రసాద్ గారు వచ్చాక రెండేళ్లలో ట్రాఫిక్‌ను 30 శాతం పెంచారు. దానితో ఎక్కువ లెవీ జమపడింది. దానిలోనుంచి రూ. 50 కోట్లు తీసి బ్యాంకులో డిపాజిట్ చేయించి, దాని మీద వచ్చే వడ్డీతో కార్మికుల వైద్యం ఖర్చు, పిఎఫ్ భరించసాగారు. ఇక లెవీ విధించాల్సిన అవసరం పడలేదు. ట్రాఫిక్ హాండ్లింగ్ చార్జీలు తగ్గించారు. దాంతో ఎగుమతి, దిగుమతి దారులు తక్కిన పోర్టులను వదిలేసి వైజాగ్ పోర్టుకే రాసాగారు. ట్రాఫిక్ మరింత పెరిగింది.

ఇది తక్కిన పోర్టులను మండించింది. వాటి చైర్మన్‌లు అప్పటి మంత్రి ఉన్నికృష్ణన్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికి రాజీవ్ ప్రభుత్వం పడిపోయి నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ‘కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా హేండ్లింగ్ చార్జీలలో మార్పు చేసే అధికారం మీకు లేదు. ఇది అధికార దుర్వినియోగం. సంజాయిషీ యివ్వండి’ అని మంత్రిత్వశాఖ లేఖ పంపింది. ఈయన ‘పోర్టులో హేండ్లింగ్ చార్జీలు పెంచాలనుకున్నపుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి తప్ప తగ్గించాలనుకుంటే అనుమతి తీసుకోవాలని నిబంధనలలో లేదు.’ అని జవాబిచ్చారు. ఇక వాళ్లేమీ అనలేక పోయారు.

ప్రభుత్వ శాఖలే ఒక్కోదాన్ని ఎలా పీడిస్తాయో చెప్పడానికి మరో ఉదాహరణ. ఛత్తీస్‌గఢ్ లోని బైలాడిలా నుంచి నేషనల్ మినరల్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్ఎమ్‌డిసి) వాళ్లు ఇనుప ఖనిజాన్ని వైజాగ్ చేరిస్తే మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పోరేషన్ (ఎంఎంటిసి) దాన్ని పోర్టు ద్వారా జపాన్ ఓడల్లోకి ఎక్కించి, జపాన్‌కు ఎగుమతి చేసి, వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని వాటిల్లోంచి ఎన్ఎమ్‌డిసికి, వైజాగ్ పోర్టుకి, రాయల్టీ రూపంలో కేంద్రానికి డబ్బులు చెల్లించడానికి పదేళ్ల క్రితమే ఒప్పందం కుదిరింది. అయితే ఎంఎంటిసి పోర్టుకి చెల్లించాల్సిన దానిలో సగమే చెల్లిస్తూ తక్కినది కేంద్రం చెపితే యిస్తాం అంటూ తాత్సారం చేస్తోంది. అలా కొన్నాళ్లయ్యాక కేంద్రం మధ్యవర్తిత్వం చేసి ఓ రేటు ఖరారు చేసింది కానీ అది కూడా మూడేళ్లగా ఎంఎంటిసి చెల్లించటం లేదు. కేంద్రం వాళ్లని నిలదీయటం లేదు.

ప్రసాద్‌గారు నెలరోజుల్లో ఆ బకాయిలు చెల్లించకపోతే మేం ఎగుమతి చేయడం కుదరదు అని ఎంఎంటిసికి నోటీసు యిచ్చారు కానీ వాళ్లు ఖాతరు చేయలేదు. 15 రోజులు పోయాక రిమైండర్ పంపారు. అయినా చలనం లేదు. గడువు పూర్తయ్యే ముందురోజు ఎంఎంటిసి వాణిజ్య మంత్రిత్వశాఖ, వీళ్ల మంత్రిత్వశాఖల ద్వారా ప్రసాద్‌గారిపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నిస్తోందని తెలిసింది. దాంతో ప్రసాద్ ఒక ట్రిక్ ప్లే చేశారు. జపాన్ నౌక రాగానే లోడ్ చేయాల్సిన కన్వేయర్ బెల్ట్‌ని ఏదో సాంకేతిక సమస్య వచ్చిందంటూ ఆపించేశారు. పైగా ఆఫీసుకి వెళ్లలేదు. దిల్లీ నుంచి బాస్‌లు ఫోన్ చేస్తూంటే యీయన పిఏ ‘చైర్మన్‌గారు హార్బరులో ఎక్కడో యిన్‌స్పెక్షన్‌లో వున్నార’ని చెపుతున్నాడంతే. ఇక ఎంఎంటిసికి దడ పట్టుకుంది. లోడింగు కాకపోతే పరువు పోతుంది. చివరకు మధ్యాహ్నం 3 గంటలకు అప్పటికప్పుడు రూ.10 కోట్లు చెల్లించింది. ఇంకో 20 కోట్లు రెండు వారాల్లో యిస్తామని లిఖితపూర్వకంగా రాసి యిచ్చింది. అప్పుడు కన్వేయర్ బెల్టు తిరగడం ప్రారంభమైంది. ప్రసాద్ ఆఫీసుకి వచ్చి వాళ్ల బాస్‌కు ఫోన్ చేసి, ‘సారీ సర్, ఫోన్ చేశారట. నేను పని మీద పోర్టులో వుండిపోయాను.’ అని చెప్పారు. ఇలాటి తెగింపుతోనే ఆయన 47 కోట్ల నష్టంతో వున్న పోర్టును రెండేళ్లలో 100 కోట్ల లాభానికి తీసుకుని వచ్చారు.

ఇలాటివి అప్పుడు, యిప్పుడూ, ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, ఏ పార్టీ పెత్తనం చెలాయిస్తున్నా యిలాటివి సాధారణం. ఇటీవలి కాలంలో పబ్లిక్ సెక్టార్‌ను బాడ్‌గా చూపించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయి కాబట్టి జోరు పెరిగి వుంటుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కి 4జి యివ్వకపోవడం, ఆస్తులమ్మి నష్టాల్లోంచి బయటకు వస్తామంటే అనుమతి యివ్వకపోవడం, వైజాగ్ స్టీల్‌ ప్లాంటుకి సొంత గనులు కేటాయించకపోవడం యివన్నీ యీ స్కీములో భాగమే. అందుకే మోదీ వచ్చాక లాభాలు వచ్చే పబ్లిక్ సెక్టార్ సంస్థలు ఏటేటా తగ్గుతున్నాయి. తలచుకుంటే ప్రసాద్ గారు వైజాగ్ పోర్టులో చేసినట్లు చిన్నచిన్న మార్పులతో వాటిని గట్టెక్కించవచ్చు. కానీ ముంచేసి, అమ్మేద్దామనుకునే వాళ్లు గట్టెక్కించాలని ఎందుకనుకుంటారు? (ఫోటో వైజాగ్ పోర్టు, ఇన్‌సెట్ – పివిఆర్‌కె ప్రసాద్)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?