cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: కర్ణాటక సిఎంని మార్చుతారా?

ఎమ్బీయస్‍: కర్ణాటక సిఎంని మార్చుతారా?

కర్ణాటక సిఎంగా బసవరాజ బొమ్మాయ్ వచ్చి ఐదు నెలలే అయింది. అయినా ఆయనను కొనసాగిస్తారో లేదోనన్న అనుమానం రావడానికి కారణం, అవినీతి ఆరోపణలు కాదు, పాలనలో అసమర్థతా కాదు. ఎన్నికలు గెలవలేకపోవడం మాత్రమే. ఆయన సొంత జిల్లాలోని హనగల్ నియోజకవర్గంలో అక్టోబరు నెలాఖరులో జరిగిన ఉపయెన్నికలో బిజెపి సిటింగు సీటు కాంగ్రెసు చేతికి పోయింది. మరో చోట బిజెపి జెడిఎస్ సీటు గెలుచుకుంది. ఆ ఉపయెన్నికలలో రెండు చోట్లా కలిపి బిజెపికి 52% ఓట్లు వస్తే కాంగ్రెసుకు 45% వచ్చాయి. కాంగ్రెసు బలపడుతోందన్న సంకేతం అప్పుడే వచ్చింది. అది డిసెంబరు నెలాఖరులో వచ్చిన 58 అర్బన్ లోకల్ బాడీలలోని 1184 వార్డులకు జరిగిన ఎన్నికలలో మరింత స్పష్టంగా తెలియవచ్చింది.

20 జిల్లాలలో మొత్తం 1184 సీట్లుంటే బిజెపికి 433 వస్తే కాంగ్రెసుకు 501 వచ్చాయి. జెడిఎస్‌కు 45, యితరులకు 9, స్వతంత్రులకు 195  వచ్చాయి. 20 లోకల్ బాడీలలో కాంగ్రెసుకు మెజారిటీ వచ్చింది. బిజెపికి 15టిలో వచ్చింది. జెడిఎస్‌కు 1 దక్కింది. మైనారిటీలు ఎక్కువగా వున్న చోట ఓడిపోయాం కానీ, గతంలో కంటె బాగానే గెలుచుకున్నాం అన్నాడు బొమ్మాయ్. తన జిల్లాలోని రెండిటిలో కూడా బిజెపి ఓడిపోవడానికి కారణం మైనారిటీలే అన్నాడు. ఏది ఏమైనా వీటిలో కాంగ్రెసుకు 42% ఓట్లు రాగా, బిజెపికి 37% వచ్చాయి. జెడిఎస్‌కు 4% వచ్చాయి. పట్టణాల్లో వున్న మునిసిపల్ కౌన్సిళ్లలోని 441 సీట్లలో కాంగ్రెసుకు 202 రాగా, బిజెపికి 176 వచ్చాయి. టౌను పంచాయితీల్లోని 577 సీట్లలో కాంగ్రెసుకు 237 వస్తే, బిజెపికి 191 వచ్చాయి. బిజెపి నగరాలలోనే ఆధిక్యత, అదీ స్వల్పంగా కనబరచింది. సిటీ మునిసిపల్ కౌన్సిళ్లలో 166 సీట్లుంటే బిజెపికి 66, కాంగ్రెసుకు 62 వచ్చాయి. జెడిఎస్‌ 12, స్వతంత్రులు 26 మంది గెలిచారు.

సాధారణంగా అధికారంలో వున్న పార్టీ స్థానిక ఎన్నికలలో గెలుస్తూ వుంటుంది. కానీ యీసారి అది జరగలేదు. అదీ కాకుండా అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పుకోదగ్గ బలం ప్రదర్శించిన జెడిఎస్ యిప్పుడు పూర్తిగా చతికిలపడి, బరిలో బిజెపి, కాంగ్రెసు ముఖాముఖీ నిలిచే పరిస్థితి వచ్చింది. దేశంలో తక్కిన రాష్ట్రాలలో ముఖాముఖీ పోరులో కాంగ్రెసు ఓడిపోతూండగా, కర్ణాటకలో మాత్రం బిజెపి వెనకపడుతోంది. దీనికి కారణం బొమ్మాయే అని పార్టీలోని అతని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బొమ్మాయ్ ముఖ్యమంత్రి అయ్యాక సెప్టెంబరులో మూడు మునిసిపల్ కార్పోరేషన్లలో ఎన్నికలు జరిగితే బెళగావిలో తప్ప తక్కిన రెండిటిలో అంటే, హుబ్బళి-ధార్వాడ్, కలబురగిలలో ఓడిపోయింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో 15-16 సీట్లు వస్తాయనుకుంటే కాంగ్రెసుతో సమానంగా 11 మాత్రమే వచ్చాయి. ఈ మునిసిపల్ ఎన్నికలలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వున్న బాంకాపూర్‌లో మునిసిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెసుకు 14 సీట్లు వస్తే బిజెపికి దానిలో సగం 7 మాత్రమే వచ్చాయి. ఇవన్నీ చూపించి, అతన్ని మారిస్తే తప్ప పార్టీ భవిష్యత్తు బాగుపడదని బొమ్మాయ్ సీటు కోసం పోటీపడేవాళ్లు అధిష్టానానికి చెపుతున్నారు. యెడియూరప్ప వారసుడు కావాలని చాలామందే ప్రయత్నించారు. కానీ యెడియూరప్ప సిఫార్సుతో బొమ్మాయ్ అయ్యాడు. ఆ ఎంపిక తప్పని యిప్పుడు వీరి వాదన.

నిజానికి బిజెపికి దక్షిణాది రాష్ట్రాలలో పరిస్థితి గడ్డుగా వుంటూ వచ్చింది. మైనారిటీలు పెద్ద సంఖ్యలో లేకపోవడం, మతపరమైన చీలిక తీవ్రంగా వుండకపోవడం వలన మొదటినుంచి ఆరెస్సెస్ భావాలకు దక్షిణాది రాష్ట్రాలలో గిరాకీ లేదు. అందువలన తొలుత జనసంఘ్, తర్వాత బిజెపిలు ఉత్తరాది రాష్ట్రాలలో వచ్చిన బలంతోనే అధికారంలోకి వస్తోంది. కొద్దిపాటి కష్టంతోనే అక్కడ ఫలితాలు బాగా కనబడుతున్నాయి. మొత్తం పార్లమెంటు సీట్లలో దక్షిణాది రాష్ట్రాలలో 25% సీట్లు మాత్రమే వున్నాయి. తూర్పు రాష్ట్రమైన బెంగాల్‌లో 8% సీట్లున్నాయి. ఈ 33% సీట్లలో కష్టపడినా పెద్దగా ఫలితం వుండటం లేదు. అందువలన బిజెపి కౌ-బెల్ట్‌గా పిలవబడే ప్రాంతాల మీదే ఎక్కువగా ధ్యాస పెట్టింది. అయితే దక్షిణాదిన కర్ణాటకలో మాత్రం బిజెపి కాలుపెట్ట గలిగింది. దానికి కారణం యెడియూరప్పే అని చెప్పాలి. అతను లింగాయతులకు నాయకుడిగా ఎదిగి, బిజెపి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత లింగాయతులను కాంగ్రెసు నుంచి బిజెపి వైపు మళ్లించగలిగాడు.

దీనితో బాటు రామజన్మభూమి ఉద్యమానికి కర్ణాటకలోనే కొంత స్పందన కనబడింది. 1990ల నుంచి కాస్తకాస్తగా ఎదుగుతూ వచ్చి 2000 నుంచి ప్రధాన పాత్ర పోషిస్తూ, 2004 నుంచి బలమైన శక్తిగా తయారైంది. బిజెపి అంటే యెడియూరప్పే అనే పేరు వచ్చింది. ఇప్పుడు అతను దిగిపోవడంతో బిజెపి ఏ మేరకు నిలదొక్కుకుంటుందో చూడాలని అందరూ కుతూహలంగా ఉన్నారు. బొమ్మాయ్ కూడా లింగాయతే అయినా, యెడియూరప్ప మనిషే అయినా బిజెపి ఓటర్లు అతని పట్ల అంత సుముఖంగా లేరని యీ ఫలితాలు చెపుతున్నాయి. అతన్ని తక్షణం మార్చాలని ఉద్యమిస్తున్న శక్తులకు ఊతమిచ్చేటట్లు బిట్‌కాయిన్ బదిలీ వివాదం ముందుకు వచ్చింది. సూక్ష్మంగా చెప్పాలంటే బిట్‌కాయిన్లు సంగ్రహించడంలో దిట్ట అయిన శ్రీకి అనే ఒక హ్యేకర్ 2020 నవంబరులో పట్టుబడ్డాడు. 2021 ఏప్రిల్ వరకు అతను పోలీసు కస్టడీలోనే ఉన్నాడు. కస్టడీలో వుండగానే అతని వద్ద నున్న బిట్‌కాయిన్లు వేరేవారికి బదిలీ అయిపోయాయి. పోలీసులు సహకరించనిదే అది అయ్యే పని కాదు.

అతన్ని ఒత్తిడి చేసి, ఆ బిట్‌కాయిన్లు యిద్దరు ప్రముఖ బిజెపి నాయకుల ఖాతాలకు బదిలీ చేయించారనే ఆరోపణలున్నాయి. ఆ సంఘటన జరిగినప్పుడు బొమ్మాయ్ హోం మంత్రి. యెడియూరప్ప ముఖ్యమంత్రి. ఇప్పుడు యీ బిట్‌కాయిన్ స్కామ్‌లో బొమ్మాయ్ పాత్ర గురించి కొందరు రాష్ట్ర బిజెపి నాయకులు మోదీకి ఫిర్యాదు చేశారు. మోదీ అమెరికా పర్యటనలో వుండగా ఎఫ్‌బిఐ వారు యీ సంగతి మోదీకి చెప్పారనే వదంతి వుంది. బొమ్మాయ్ నవంబరు 11న దిల్లీ వెళ్లి మోదీని కలిశాడు. బయటకు వచ్చి ‘‘మా సమావేశంలో నేను బిట్‌కాయిన్ గొడవ గురించి ప్రస్తావించబోతే మోదీగారు ‘ఆ ఆరోపణల గురించి వర్రీ కావద్దు’ అని చెప్పారు.’’ అని చెప్పుకున్నాడు. దోషులెవరో తర్వాతి రోజుల్లో తేలవచ్చు కానీ ప్రస్తుతానికి మాత్రం బొమ్మాయ్ పేరు దీనిలో వినబడుతోందన్నది వాస్తవం. ఇప్పుడు శ్రీకి కథ విపులంగా చెప్పబోతున్నాను.

బెంగుళూరులో కొంతమంది డ్రగ్స్‌తో తరచుగా పార్టీలు చేసుకుంటున్నారనీ, ఆ డ్రగ్స్‌ను విదేశాల నుంచి డార్క్‌నెట్ యాప్ ద్వారా బిట్‌కాయిన్లు ఉపయోగించి కొంటున్నారనీ, అవి వేరే రకం పేరుతో వచ్చినపుడు ఓ పోలీసు కానిస్టేబుల్ సహాయంతో వాటిని తెప్పించుకుంటున్నారనీ బెంగుళూరు పోలీసులకు ఉప్పందింది. చామరాజపేటలో వున్న ఫారిన్ పోస్ట్ ఆఫీసులో అర్ణవ్ గౌడ అనే అతని పేర ఆర్గానిక్ కాఫీ పౌడర్ పార్శిల్ వచ్చినపుడు దాన్ని తీసుకోవడానికి ఎవరొస్తారా అని చూశారు. 2020 నవంబరు 4న సుజయ్ రాజ్ అనే అతను వచ్చాడు. అతని ఎదురుగా పార్శిల్ యిప్పిస్తే దానిలో 500 గ్రాముల హైడ్రో కెనబిస్ (గంజాయి) ఉంది. వెంటనే బెంగుళూరు పోలీసు విభాగంలో యిలాటి కేసులు చూసే సిసిబి (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్)కు కేసు అప్పగించారు. వాళ్లు తీగ లాగితే 25 ఏళ్ల శ్రీకృష్ణ (శ్రీకి అని ముద్దుపేరు) రమేశ్ అనే 25 ఏళ్ల కుర్రాడు బయటకు తేలాడు. అతని తండ్రి జయనగర్‌ అనే మంచి లొకాలిటీలో నివసించే చార్టెర్డ్ ఎకౌంటెంట్. ఉన్నతస్థాయి కుటుంబం. శ్రీకిని నవంబరు 28న అరెస్టు చేసి, పోలీసుల అదుపులోకి తీసుకుని విచారించారు.

పెద్ద కష్టం లేకుండానే అతను తన గురించి చాలా చెప్పాడు. అతను చైల్డ్ ప్రాడిజీట. చిన్నప్పటి నుంచి అమోఘమైన తెలివితేటలు కనబరుస్తూ నాలుగో క్లాసుకి వచ్చేసరికే కంప్యూటర్‌లో చాలా విద్యలు నేర్చేశాడు. పదో తరగతికి వచ్చేసరికే 50 వేల మంది వుండే బ్లాక్‌హ్యాట్ హేకర్స్ గ్రూపులో చేరాడు. ఈ గ్రూపులోని కొందరు తనను ఆర్థికనేరాలవైపు మళ్లించారని చెప్పుకున్నాడు. మేధావి కావడంతో క్లాసులో తక్కినవాళ్లందరూ దూరం పెట్టారని, ఒంటరితనం వలన ఇంటర్‌ చదివేటప్పుడే డ్రగ్స్‌కు అలవాటు పడ్డాననీ, 17వ ఏట హిమాలయాలకు పారిపోయాననీ, వాళ్ల నాన్న పోలీసుల సహాయంతో వెతికి పట్టుకుని ఇంజనియరింగులో చేర్పించాడని చెప్పాడు. ఇంజనియరింగు మధ్యలో మానేసి, నెదర్లాండ్స్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బి.ఎస్‌సి. చేశాడు. అప్పటికే అతను హ్యేకింగు ద్వారా 30 లక్షల డాలర్ల విలువ చేసే బిట్‌కాయిన్లు పోగేశాడు. కానీ నెదర్లాండ్స్‌లో యితనికి డ్రైవర్‌గా పనిచేసినతను యితన్ని ఏమార్చి, అంతా కొట్టేశాడు. దాంతో మళ్లీ మొదటికి వచ్చాడు. ఇటలీ యిత్యాది దేశాల్లో వున్న బిట్‌కాయిన్ ట్రేడర్స్ సహాయంతో బిట్‌ఫినెక్స్ అనే బిట్‌కాయిన్ ఎక్స్‌ఛేంజ్‌ని 2016లో హేక్ చేసి, ఆ నష్టాన్ని త్వరగానే పూడ్చుకున్నాడు.

2015లో బెంగుళూరుకి తిరిగి వచ్చాడు. ఎన్‌ఏ హారిస్ అనే కాంగ్రెసు ఎమ్మెల్యే కొడుకు ఒమర్‌తో స్నేహం కుదిరింది. ఇద్దరూ అతి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు. 2018 ఫిబ్రవరిలో యుబి సిటీ అనే లగ్జరీ షాపింగ్ మాల్‌లోని హోటల్లో ఒమర్ సోదరుడు మొహమ్మద్ కొందరిపై దాడి చేసిన ఘటనలో యితను కూడా నిందితుడే. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఉత్తర భారతానికి పారిపోయాడు. దానికి సహాయపడినవాడు రాబిన్ ఖండేల్‌వాల్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిట్‌కాయిన్ ట్రేడర్. ఇద్దరికీ ఆన్‌లైన్‌లో పరిచయమైంది. శ్రీకి తన దగ్గరున్న బిట్‌కాయిన్లను రాబిన్ కంపెనీ ద్వారా అమ్మేవాడు. అలా 8 కోట్ల రూ.ల వ్యాపారం చేశారు. కాయిన్లు అమ్మగా వచ్చిన డబ్బును శ్రీకి తన స్నేహితుల పేర ఉన్న బ్యాంకు ఖాతాల్లో వేయించేవాడు. యుబి సిటీ గొడవ రాగానే రాబిన్ ఒక చార్టెర్డ్ ఫ్లయిట్‌లో శ్రీకిని నార్త్ ఇండియా రప్పించాడు.

ఆర్నెల్లు పోయిన తర్వాత బెంగుళూరుకి తిరిగి వచ్చిన శ్రీకికి సునీష్ హెగ్గడే అనే కాంట్రాక్టరు, అతని కజిన్ ప్రసిద్ధ్ షెట్టీ పరిచయమయ్యారు. శ్రీకి అనేక పోకర్ వెబ్‌సైట్లను హ్యేక్ చేసి అవతలివాడి ముక్కలు వీళ్లకు చెప్పేవాడు. వీళ్లు దాని మీద డబ్బు గడించేవారు. ‘దొంగిలించిన బిట్‌కాయిన్లు నా దగ్గర బోల్డున్నాయి. వాటిని మీకిస్తా.’ అని వూరిస్తూ శ్రీకి హెగ్గడే చేత 2 కోట్ల రూ.ల దాకా ధారాళంగా ఖర్చు పెట్టించాడు. మధ్యమధ్యలో కొన్ని వెబ్‌సైట్లు హేక్ చేసి, వాటి నుంచి రేన్సమ్ వసూలు చేసుకుని పంచుకునేవారు. శ్రీకి మాటలతో కాలక్షేపం చేయడమే తప్ప బిట్‌కాయిన్లు యివ్వకపోవడంతో హెగ్గడేకి, అతనికి చెడింది. 2016లో బిట్‌ఫినెక్స్ ఎక్స్‌ఛేంజిని కొందరు కలిసి హ్యేక్ చేసి 1.20 లక్షల బిట్‌కాయిన్లు చోరీ చేశారు. ‘వారిలో నేను కూడా ఒకణ్ని. నాకు 2 వేల కాయిన్లు వచ్చాయి. ఇదే కాదు, 2017లో బిటిసి ఈ.కామ్ అనే ఎక్స్‌ఛేంజ్‌ను కూడా హేక్ చేసి మూడు వేల బిట్‌కాయిన్లు కొట్టేశాను. అప్పట్లో వాటి విలువ 35 లక్షల డాలర్లుంటుంది. ఇవే కాదు, రాష్ట్రప్రభుత్వం వారి ఈ-ప్రొక్యూర్‌మెంట్ సైట్ కూడా హేక్ చేసి 11.5 కోట్ల రూ.లు కొట్టేశాను. కానీ అంతా విలాసాలపై ఖర్చు పెట్టేశాను.’ అని శ్రీకి పోలీసులతో చెప్పాడు.

ఇవన్నీ వినేటప్పటికి పోలీసులకు మతి పోయింది. ఈ ప్రొక్యూర్‌మెంట్ హేకింగు కేసు, యుబి సిటీ కేసు యింకా పెండింగులోనే వున్నాయి. అనుకోకుండా పెద్ద చేపే పడిందే అనుకున్నారు. కానీ యితను చెప్పేదంతా నిజమేనా? అతిశయోక్తులు చెపుతున్నాడా? తమ కస్టడీలో వుండగా చెప్పినదాన్ని అతను రేపు కోర్టులో కాదంటే, ఆధారాలు చూపాలి కదా! ఆనవాళ్లు మిగలకుండా తుడిచిపెట్టేసే యీ సాఫ్ట్‌వేర్ మోసాలకు ఆధారాలు చూపి కోర్టును నమ్మించడం ఎలా? ఇంతకీ విలాసాలకు పోను, యిప్పుడు శ్రీకి దగ్గర మిగిలివున్నదెంత? ‘2021 జనవరి 8న అతని వాలెట్‌లో 31.1 బిట్‌కాయిన్లున్నాయి. వాటి విలువ రూ.9 కోట్లు. వాలెట్ పాస్‌వర్డ్ మార్చేసి భద్రపరిచాం.’ అని జనవరి 12న పోలీసులు ప్రకటించారు. అయితే జనవరి 22న వాళ్లు వాలెట్ తెరిచి చూసినప్పుడు 186.8 బిట్‌కాయిన్స్ కనబడ్డాయి. అలా ఎలా అంటే జనవరి 8 నుంచి 22 లోపున శ్రీకి తన వాలెట్‌నే ఎక్స్‌ఛేంజ్‌గా మార్చేసి, అనేక బిట్‌కాయిన్లు కాజేసి, వాటిల్లో కొన్ని యితరులకు బదిలీ చేసేసి, పలు ట్రాన్సాక్షన్స్ చేసేశాడట!

ఒక నిందితుడు పోలీసు కస్టడీలో వుండగా యిలా చేయగలిగాడంటే దాని అర్థం, అధికారంలో వున్నవాళ్లే అతని చేత యీ పని చేయించారని! హోం మంత్రిగా వున్న బొమ్మాయ్, ముఖ్యమంత్రిగా వున్న యెడియూరప్ప లబ్ధి పొందారని ప్రతిపక్షాల ఆరోపణ. పోలీసులు అతనిపై కేసులు పెట్టిన తీరు కూడా అనుమానం రగిలిస్తోంది. దాదాపు రూ.73  కోట్ల మోసం చేశానని అతనే చెప్తుండగా, కేవలం రూ.14 కోట్ల మేరకే ఎందుకు కేసులు పెట్టారు అని అడిగితే ఈ హైటెక్ మోసంలో కోర్టులో చూపడానికి ఆధారాలు లేవు అంటున్నారు. ఈ టెక్నాలజీ మన పోలీసులకు అర్థం కావడం కష్టమంటే అర్థం చేసుకోవచ్చు. అలాటప్పుడు వెంటనే సిబిఐ లోని ఇంటర్‌పోల్‌ విభాగం సహకారం తీసుకోవాల్సి వుంది. పైగా అతను చేసిన అంతర్జాతీయ మోసాలే కదా!

కానీ 2020 నవంబరులోనే అతను స్టేటుమెంటు యిచ్చినా ఐదు నెలల తర్వాత 2021 ఏప్రిల్‌లో మాత్రమే సిబిఐ ఇంటర్‌పోల్‌ డివిజన్‌కు చెప్పారు. అంతెందుకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు కూడా మార్చిలోనే చెప్పారు. ఈ లోపున జనవరిలో శ్రీకి చేత మరిన్ని దొంగతనాలు చేయించారు. జనవరిలోనే కాదు, అంతకు ముందూవెనకా కూడాట! వేల్ ఎలర్ట్ అనే బ్లాక్‌చెయిన్ ట్రాకర్ సంస్థ శ్రీకి సిసిబి కస్టడీలో వున్న నవంబరు 30 నాడే బిట్‌ఫినెక్స్ ద్వారా 14 ట్రాన్సాక్షన్స్ ద్వారా 5045 బిట్‌కాయిన్లు యితర ఖాతాలకు తరలించబడ్డాయని అంది. 2021 ఏప్రిల్ 14న శ్రీకి యింకా జుడిషియల్ కస్టడీలో వుండగా 69 ట్రాన్సాక్షన్స్ ద్వారా 10057 బిట్‌కాయిన్లు తరలింపబడ్డాయట. వీటి విలువ రూ.5 వేల కోట్లట. ఈ స్టేటుమెంట్లను బెంగుళూరు సిటీ పోలీసు కమిషనర్ కమల్ పంత్ కొట్టిపారేశారు. ఏమైతేనేం, 2021 ఏప్రిల్ 17న శ్రీకిని బెయిల్ మీద విడిచిపెట్టారు. హోటల్ కొట్లాట కేసులో నవంబరులో మళ్లీ అరెస్టు చేసి, బెయిల్ యిచ్చారు. ఈ కేసుని కాంగ్రెసే కాదు, బిజెపిలో బొమ్మాయ్ ప్రత్యర్థులు కూడా ఉపయోగించుకుంటున్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి బొమ్మాయ్ వాడుతున్న ఏకైక మంత్రం – హిందూత్వ!

యెడియూరప్ప మూలాలు ఆరెస్సెస్‌లో వున్నాయి. అందువలన 2021 ఫిబ్రవరిలో గోహత్య నిషేధం బిల్లు తెచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ బొమ్మాయ్ జనతా పరివార్ నుంచి వచ్చినవాడు. అతని తండ్రి ఎస్‌ఆర్ బొమ్మాయ్, గురువులు రామకృష్ణ హెగ్గడే, జెఎచ్ పటేల్, అందరూ సోషలిస్టులే. ఇతను 2019 వరకు జెడియులో వున్నాడు. అందువలన హిందూత్వవాదిగా వుండడు అని పరిశీలకులు అనుకున్నారు. కానీ బొమ్మాయ్ తీవ్రహిందూత్వవాదిగా తేలుతున్నాడు. అతను అధికారంలోకి వచ్చాక సైతం మోరల్ పోలీసింగు పేర కర్ణాటకలో హిందూత్వసంస్థలు రెచ్చిపోతున్నాయి. వాటికి ముఖ్యకేంద్రమైన మంగుళూరులో జులై-అక్టోబరుల మధ్య 32 కమ్యూనల్ సంఘటనలు జరిగాయని ఒక సామాజిక సంస్థ లెక్కవేసింది.

శ్రీరామసేన స్థాపకుడు ప్రమోద్ ముతాలిక్ గదగ్‌లోని జుమ్మా మసీదుని, బాబ్రీ మసీదు తరహాలో కూల్చివేస్తామని ప్రకటించాడు. బసవరాజ్ అనే విఎచ్‌పి నాయకుడు ‘హిందువులతో తలపడితే ముస్లిములకు కప్పెట్టడానికి కూడా చోటు మిగలకుండా చేస్తాం’ అని ప్రకటించాడు. చర్చిల మీద దాడులు, లవ్ జిహాద్ జరుగుతోందంటూ హత్యలు జరుగుతూనే వున్నాయి. ఏమిటిదంతా అని అడిగితే ‘ప్రతి చర్యకు, ప్రతిచర్య వుంటుంది’ అంటూ బొమ్మాయ్ వాటిని సమర్థించాడు తప్ప, అవతలివాళ్ల చర్య ఏమిటో వివరించలేదు. నంజనగూడులో అక్రమంగా కట్టిన గుడిని 2009 నాటి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూల్చివేయవలసి వచ్చింది. హిందూత్వ సంఘాలు దాన్ని ఖండిస్తూ నిరసన తెలిపితే, వెంటనే సెప్టెంబరులో కర్ణాటక రెలిజియస్ స్ట్రక్చర్స్ ప్రొటెక్షన్ బిల్లు అని అసెంబ్లీలో పాస్ చేయించాడు. అక్రమంగా కట్టినా సరే, వాటిని కూల్చలేరిక.

వీటన్నిటినీ మించినది డిసెంబరు 23న కర్ణాటక అసెంబ్లీలో పాస్ చేయించిన కర్ణాటక ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆప్ రెలిజియన్ బిల్’. సింపుల్‌గా చెప్పాలంటే మతమార్పిడులు నిషేధించే చట్టం. ఈ చట్టం గిరిజనులు ఎక్కువగా వున్న ఒడిశాలో 1967 నుంచి, అరుణాచల్ ప్రదేశ్‌లో 1978 నుంచి ఉంది. బిజెపి పాలనలో ఉండగా 2003లో గుజరాత్‌లో, 2006లో ఛత్తీస్‌గఢ్‌లో పెట్టారు. 2017 నుంచి 2020 లోపు హిమాచల్ ప్రదేశ్, యుపి, ఉత్తరాఖండ్, ఝార్‌ఖండ్‌లలో పెట్టారు. గిరిజనులు ఎక్కువగా వున్న మధ్యప్రదేశ్‌లో 1968 నుంచి వున్న చట్టాన్ని తీవ్రతరం చేస్తూ 2021లో ఆర్డినెన్స్ చేశారు. వాటన్నిటి కంటె కఠినంగా కర్ణాటక యీ బిల్లు తయారుచేసింది.

ఇకపై ఎవరైనా మతం మారదలచుకుంటే జిల్లా మేజిస్ట్రేటుకి నెల ముందుగా తెలియపరచాలి. అలా చెప్పకపోతే ఆర్నెల్ల నుంచి మూడేళ్ల దాకా జైలుశిక్ష. మతం మార్చేవ్యక్తి కూడా నెల నోటీసు యివ్వాలి. లేకపోతే ఏడాది నుంచి ఐదేళ్ల దాకా జైలుశిక్ష. వీళ్లు తెలియపరిచాక మేజిస్ట్రేటు, మతమార్పిడికి అసలైన ఉద్దేశం ఏమిటో కనుక్కోమని పోలీసు ఎంక్వయిరీకి ఆదేశిస్తాడు. ఆ తర్వాత ఒక డిక్లరేషన్ నోటీసు బోర్డులో పెడతారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలపమంచారు. ఇక్కడ అభ్యంతరాలు తెలిపే వ్యక్తి మతం మారే వ్యక్తికి సంబంధీకుడై వుండాలనే షరతు పెట్టలేదు. కోర్టులో పిల్ వేసిన తరహాలోనే దారిన పోయే దానయ్య కూడా అభ్యంతర పెట్టవచ్చేమో తెలియదు. ఏదైనా అభ్యంతరం వస్తే అప్పుడు మేజిస్ట్రేటు రివెన్యూ లేదా సోషల్ వెల్‌ఫేర్ డిపార్టుమెంటు ద్వారా అసలు కారణాలపై మళ్లీ ఎంక్వయిరీకి ఆదేశించవచ్చు. చివరకు అనుమతి లభించిన తర్వాతనే మతం మారాలి.

మారిన నెల్లాళ్ల లోపున మతం మారిన డిక్లరేషన్, ఐడెంటిటీ కార్డు మేజిస్ట్రేటుకి పంపాలి. ఈ డిక్లరేషన్‌ను నోటీసు బోర్డులో పెడతారు. ఇప్పుడు కూడా ఎవరైనా అభ్యంతర పెట్టవచ్చు. మేజిస్ట్రేటు తలచుకుంటే ఎప్పుడైనా సరే మతం మారిన వ్యక్తి అతని ఎదుట హాజరు కావలసినదే! ఇంత తతంగం పెట్టారు. బలవంతంగా మతం మార్చారని తేలితే మారిన వ్యక్తి జనరల్ కేటగిరీ వాడైతే మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా. ఎస్సీ, ఎస్టీ, మైనరు, మహిళ అయితే మూడు నుంచి పది సంవత్సరాల జైలుశిక్ష, 50 వేల జరిమానా. మతం మారిన ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం పోతుంది. ఈ చట్టం కౌన్సిల్‌లో పాస్ కావలసింది ఉంది. ఒకవేళ అది కుదరకపోతే, ఆర్డినెన్స్ జారీ కావచ్చు.

ఇది అమలయ్యాక, ప్రతి మతమార్పిడి బలవంతంగా జరిగిందని హిందూత్వ సంఘాలు గొడవ చేసే ప్రమాదం వుందని మైనారిటీలు భయపడుతున్నారు. ఎందుకంటే బలవంతపు మతమార్పిడి అనే దానికి చట్టం యిస్తున్న కారణాలు – మిస్‌రిప్రజంటేషన్, ఫోర్స్, అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్, కోయెర్షన్, ఎల్యూర్‌మెంట్, లేదా ఎనీ ఫ్రాడ్యులెంట్ మీన్స్-లో కొన్నిటిలో అస్పష్టత వుంది. అనుచిత ప్రభావం అనేది ఎలా నిర్వచిస్తారు? ప్రలోభపెట్టడంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యోగాలతో పాటు వివాహం కూడా చేర్చారు. అంటే మతాంతర వివాహాన్ని యీ బిల్లు నిషేధిస్తోందా, మరి అది వ్యక్తిస్వేచ్ఛకు భంగకరం కాదా అని అందరూ అడుగుతున్నారు. హిందూమతంలోకి మారడాన్ని యీ బిల్లు నిషేధించటం లేదు. ఎందుకంటే ఇతర మతాలు విదేశంలో పుట్టినవని, హిందూమతంలోకి రావడమంటే యింటికి తిరిగిరావడమని బిజెపి చెప్తోంది. మరి విదేశీ క్రైస్తవులను ఇస్కాన్ హిందువులుగా మార్చడాన్ని ఎలా చూడాలో తెలియదు.

ఈ వీరహిందూత్వవాది అవతారం బొమ్మాయ్‌కు ఏ మేరకు మేలు చేస్తుందో చూడాలి. 15 నెలల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి గెలుస్తుందా లేదా అన్నది అవతలి మాట. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బొమ్మాయ్ సిఎంగా కొనసాగుతారా లేదా, లేక మళ్లీ మరో లింగాయత్ నాయకుడితో ప్రయోగం చేస్తారా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. (ఫోటో – బొమ్మాయ్, మతమార్పిడి బిల్లుపై నిరసనలు, శ్రీకి)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు