Advertisement

Advertisement


Home > Articles - Special Articles

జగన్ సమర్థతకు సవాళ్లు

జగన్ సమర్థతకు సవాళ్లు

అవును ప్రభుత్వ వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కారుమేఘాల్లా కుట్రలు అలుముకుంటున్నాయి. వాటిని పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ప్రభుత్వానికి, రాజకీయానికి సంబంధంలేని దుర్ఘటనలు అనేకం జరుగుతున్నాయి. అవి ప్రజల ఎదుటకు వెళ్లేలోగా వాటిమీద కొత్త ముసుగు తొడిగేస్తున్నారు.

ఆ ముసుగులో అవి భూతాల్లా ప్రజల ఎదుట నిలుస్తున్నాయి. ఆ ముసుగులను చీల్చిచెండాడంలో ప్రభుత్వం లక్ష్యరహిత ఖడ్గ ప్రహారాలు చేస్తోంది. అవి గురి తప్పుతున్నాయి. కానీ.. ప్రభుత్వాన్ని అపప్రధ పాల్జేయడానికి కుట్రలు మాత్రం యథేచ్ఛగా పెట్రేగిపోతున్నాయి. 

ఈగను భూతద్దంలో చూస్తే పెద్దదిగా కనిపిస్తుంది. అది నిజమని భ్రమపడి.. కనిపించినంత పెద్దదిగా ఉంటుందనుకుని దాని మీదకు ఒక రాయి విసిరితే భంగపడతాం. అది తుర్రున ఎగిరిపోతుంది. ప్రభుత్వం మీద జరుగుతున్న ప్రచారాలు.. వాటిని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీరు.. ఇలాంటి పోలికనే మనకు గుర్తుకు తెస్తున్నాయి. 

ఇదంతా ఎలా జరుగుతోంది?  వివరించి చెప్పే ప్రయత్నమే గ్రేటాంధ్ర కవర్ స్టోరీ ‘‘జగన్- సమర్థతకు సవాళ్లు!’’

‘ఏకం సత్ విప్రా బహుధా వదన్తి’ సత్యం ఒక్కటే దాన్ని వేర్వేరు పండితులు వేర్వేరు రకాలుగా చెబుతుంటారు.. అనేది దీని అర్థం. ఈ ఆర్యోక్తి రాజకీయాలకు కూడా అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. సంఘటన ఒకటే జరుగుతుంది. దానిని రాజకీయ నాయకులు ఎవరికి తోచిన రకంగా వాళ్లు ప్రచారంలో పెడుతుంటారు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అదే. 

రాజకీయం అంటేనే రంగు పులమడం. జరిగిన సంఘటన ఏదైనా సరే.. ఎవరికి ఇష్టమైన రంగు వారు పులిమి దానిని ప్రజలకు తమకు తోచిన రీతిగా చూపించేస్తారిక్కడ. ఎవరికి కావాల్సిన రంగు వాళ్లు పులుముకోవడానికి అందరికీ స్వేచ్ఛ ఉంది. కాకపోతే.. బాధాకరమైన విషయం ఏంటంటే.. ఎవరు ముందుగా ఏ రంగు పులిమి ప్రజల ఎదుట నిలబెట్టేస్తారో.. ఆ రంగే అందరికీ ఎక్కువగా కనిపిస్తోంది. ఎవరు ఎక్కువగా, వేగంగా రంగులు పులమగలిగితే వారిదే పైచేయి. పులిమిన రంగుల వెనుక అసలు రంగు ఏమిటి? అనేది ప్రజలకు అర్థం కాకముందే.. చాలా నష్టాలు జరిగిపోతున్నాయి. 

రామతీర్థం రాముల వారి విగ్రహం ధ్వంసం చేసిన కొన్నిరోజుల తర్వాత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొన్ని పరిశీలనలను వ్యాప్తిలోకి తీసుకువచ్చింది. ఆ వివరాలను గమనిస్తే ఎవరైనా నివ్వెర పోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్న ప్రతిసారీ.. ఒకటిరెండు రోజులు ముందు వెనుకగా.. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట చిన్నదో పెద్దదో హిందూ ఆలయాల మీద దాడి చేసే దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. 

చివరికి రామతీర్థం సహా! పేదలకు ఇళ్లపట్టాల కార్యక్రమాన్ని విజయనగరంలో నిర్వహించడానికి జగన్ ముహూర్తం పెట్టుకున్న ముందురోజునే.. అదే జిల్లాలో ఇలాంటి దుర్మార్గం జరిగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ గణాంకాలన్నీ బాగానే తయరుచేశారు. కానీ.. వాటి మీదికి ప్రజల దృష్టి రాబట్టడంలో కొంత జాగు చేశారు. అప్పటికే ప్రభుత్వానికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. దాన్ని అడ్డుకోవడంలో జరిగిన ఆలస్యం వల్ల దిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇంతకీ ఎలాంటి సాధారణ సంఘటనలు.. ఎలాంటి ప్రచారానికి గురయ్యాయో.. ఎలాంటి పరిణామాలకు దారితీశాయో.. ఎలా మసకబారిపోయాయో ఓసారి పరిశీలిద్దాం. గతంలో కొన్ని నెలలుగా జరుగుతున్న అనేకానేక ఘటనలన్నింటినీ పక్కన పెడదాం. ఇటీవలి కాలంలో కొన్ని ఘటనలను మాత్రం చూద్దాం.

ప్రొద్దుటూరు నందం సుబ్బయ్య హత్య..

ఒక నేరం, దుర్ఘటన జరగగానే దానిని ఏదో ఒక రీతిగా వైఎస్సార్ కాంగ్రెస్ కు, జగన్మోహన్ రెడ్డికి ముడిపెట్టడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఈ హత్య విషయానికి వస్తే.. జగన్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ ఎమ్మెల్యేను నిందిస్తూ నందం సుబ్బయ్య ఒక వీడియోను విడుదల చేసిన అయిదురోజుల్లోనే, .. హత్య జరగడం అనేది ఒక యాదృచ్ఛికమైన సంఘటన. కానీ.. హత్యకు గురైన వ్యక్తి తమ పార్టీ వాడు కావడం, జగన్‌ను నిందించిన మరురోజే హత్య జరగడం అనేది తెలుగుదేశానికి బాగా కలిసివచ్చింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తన బావమరిదితో కలిసి స్వయంగా హత్య చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ యాగీ ప్రారంభించింది. 

నందం సుబ్బయ్య భార్యకు భర్త హత్య వలన జీవితంలో కలిగే వెలితి తీర్చలేనిది. ఆమెకు పార్టీ తరఫునుంచి ఎలాంటి ప్రలోభాలు చూపించారో గానీ.. దుఃఖం మధ్యలోనే చాలా పద్ధతిగా ఎమ్మెల్యే మీద నిందలు వేయించారు. చంద్రబాబునాయుడు స్వయంగా ఆమెతో ఫోన్లో మాట్లాడి.. మరింత పురిగొల్పారు. 

అదే ఫోన్ కాల్ లో పార్టీ నాయకులతో మాట్లాడుతూ.. ‘ఆ నా కొడుకులు.. ఆ నా కొడుకులు’ అంటూ వైఎస్సార్సీపీ నాయకుల్ని ఉద్దేశించి వారి అంతు తేలుస్తా అన్నట్టుగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు అన్నీ.. ఎంచక్కా బయటకు వచ్చాయి.

అలాంటి బజారు భాషతో తండ్రి చెలరేగిపోవడం ఒక ఎత్తయితే.. కొడుకు లోకేష్ నడిపించిన డ్రామా మరొక ఎత్తు. అచ్చమైన శవరాజకీయం అంటే ఏంటో లోకేష్ రుచిచూపించారు. శవాన్ని కదలనివ్వకుండా ధర్నాకు కూర్చుని బలవంతంగా పోలీసులతో కేసు పెట్టించారు. 

ఇంతా కలిపి.. ఎవరిమీదైతే ఆరోపణలు చేశారో.. సదరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. ఎలాంటి సవాళ్లు ప్రతిసవాళ్లు ప్రస్తావన లేకుండానే.. నేరుగా తమ కులదైవ చౌడమ్మ ఆలయానికి వెళ్లి ఆమె పాదాల మీద ప్రమాణం చేసి.. తాను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఈ హత్య చేయించలేదని.. చాలా నిజాయితీగా ప్రమాణం చేశారు. దమ్ముంటే లోకేష్ ను తన మీద  ఆ నియోజకవర్గంలో పోటీచేయాలని సవాలు విసిరారు. అక్కడితో తెలుగుదేశం దళాలకు నోరు మూత పడింది. అదే సమయంలో.. అసలు ఆ హత్య వెనుకగల కారణాలు ఫ్యాక్షన్ మరియు ఇతర వ్యవహారాలు అని తేలింది.

చచ్చిన పాము ఎదుట బూర ఊదే ప్రయత్నం..

అనంతపురం జిల్లా రాజకీయాలను కంటిచూపుతో, రెప్ప సైగతో శాసించిన నేపథ్యం జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి ఉంది. అయితే ఇదంతా గత వైభవం. తమకు జిల్లా మీద ఆధిపత్య వైభవం, బలం కట్టబెట్టిన పార్టీని వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నప్పుడే.. వారి చేవ సగం చచ్చినట్టుగా ప్రజలు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే.. 2019 ఎన్నికల్లో ఎంతో తిరుగులేని నాయకులుగా చెప్పుకునే జేసీ కుటుంబం దారుణంగా చతికిల పడింది. 

ఆ తర్వాతి పరిణామాల్లో నేరాలు- కేసులు, కోర్టులు- జైళ్లు అంటూ వారి వ్యాపకం మొత్తం అక్కడికక్కడే సరిపోతోంది. మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద నోరు పారేసుకోవడం.. తాము తమ కేసుల సంగతి చూసుకోవడమే వ్యాపకం అన్నట్టుగా సాగుతోంది. అయితే వారి దళాలు మాత్రం స్థానికంగా పనిచేస్తూనే ఉన్నాయి. జిల్లా రాజకీయాలకు సంబంధించినంత వరకు చచ్చిన పాము చందంగా తయారైనప్పటికీ.. వారి అనుయాయులు.. చిల్లర వ్యవహారాలకు పాల్పడుతూనే ఉన్నారు. 

స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ఉద్దేశించి చేసిన అలాంటి ఒక ఆకతాయి పని.. పెద్ద వివాదానికి కారణమైంది. సోషల్ మీడియా పోస్టుల్లో తన కేరక్టర్ అసాసినేషన్ తట్టుకోలేని ఎమ్మెల్యే నేరుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి వారిని నిలదీస్తే తదనంతర పరిణామాలు హైడ్రామాను తలపించాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తరలి వెళ్లి.. తన అనుచరుల్ని విడిపించుకోవడానికి పెద్ద అతిశయమైన డ్రామా నడిపించారు. ఆమరణ దీక్షలు అన్నారు. మధ్యాహ్నానికెల్లా విరమణ అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ దాడులుగా దీని గురించి రాష్ట్రమంతా ప్రచారం చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేతలు చంద్రబాబునాయుడు, లోకేష్ ఉవ్విళ్లూరారు గానీ.. వారి పాచిక పారలేదు. అనంతపురం జిల్లా రాజకీయాలకు సంబంధించినంత వరకు చచ్చిన పాము వంటి జేసీ కుటుంబాన్ని రెచ్చగొట్టడానికి, పాముబూర ఊదడానికి వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. 

ఎంత ఘోరం అంటే.. తెలుగుదేశం పార్టీలోనే.. అనంతపురం జిల్లాలో ఉండే ఏ ఒక్క నాయకుడు కూడా జేసీ కుటుంబానికి అన్యాయం జరిగిందని పల్లెత్తు మాట అనలేదు. వారికి దన్నుగా మాట్లాడలేదు. ఆ కుటుంబానికి జిల్లా పార్టీలోనే ఉన్న మంచి పేరు అంతన్నమాట! దాంతో ఆ వ్యవహారం కూడా తెలుగుదేశం ఎంత పెంచడానికి ప్రయత్నించినా చతికిలపడింది.

రాముడి భుజాలపైనుంచి నకిలీ హిందూ బాణాలు

రామతీర్థం బోడికొండ ఆలయంలో రాముడి విగ్రహానికి తల వేరు చేయడం విపక్షాలకు  కలసి వచ్చింది. దేవుడి భుజాల మీదనుంచి ప్రభుత్వం మీదికి బాణాలు ప్రయోగించడానికి తెలుగుదేశం, బీజేపీ అత్యుత్సాహం కనబరుస్తున్నాయి. దానికి తోడు రామతీర్థం తర్వాత.. మరికొన్ని ఆలయాల్లో జరిగిన ఘటనలు వారికి మరింతగా కలిసి వచ్చాయి. 

అచ్చంగా జగన్మోహన్ రెడ్డే దగ్గరుండి స్కెచ్ వేసి ఈ దాడులన్నీ చేయిస్తున్నట్లుగా ప్రచారం చేయడానికి ఉద్యుక్తులయ్యారు. బీజేపీ తొలుత కొంత వెనకపడింది. చంద్రబాబు వెళ్లివచ్చిన తర్వాత.. పుంజుకుని.. హిందూ మైలేజీ మొత్తం తమకే దక్కాలన్నట్టుగా అతి దూకుడు ప్రదర్శిస్తోంది. 

ఇటీవలి కాలంలో తుపాను బాధితుల పరిశీలన, అరెస్టయిన నాయకుల పరామర్శలు వంటి అన్ని పనులకూ లోకేష్‌ను పంపుతున్న చంద్రబాబునాయుడు.. కొడుకు వెళ్లడం వల్ల మైలేజీ కంటె డేమేజీ ఎక్కువని భావించారో ఏమో గానీ.. రామతీర్థం స్వయంగా వెళ్లారు. తద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలనని అనుకున్నారు. అయితే.. మరోవైపు ప్రాథమిక సమాచారం పోలీసులు కేసులు నమోదుచేసిన వారిలో తెలుగుదేశానికి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి సమాచారం అందిందో ఏమో గానీ.. దాదాపుగా సైలెంట్ అయ్యారు. 

బీజేపీ అతి రభస

హిందూ అనే పదానికి తాము మాత్రమే గుత్తాధిపత్యం కలిగి ఉంటాం అనుకునే బీజేపీ ఎక్కువ గొడవ చేస్తోంది. రాష్ట్రానికి ఆ పార్టీ కేంద్ర నాయకత్వం, మోడీ సర్కారు చేసిన ద్రోహాలను రాష్ట్ర ప్రజలు మరచిపోయేలా చేయాలంటే.. ఏదో ఒక రభస చేయక తప్పదనే ఎజెండాతో వారు పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 

ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేవచచ్చిపోయిందని, అప్పనంగా తాము నెంబర్ టూ పొజిషన్ లోకి వచ్చేయగలమని వారికి చాలా ఉత్సాహంగా ఉన్నట్టుంది. అనుమతులు లేకపోయినా.. ప్రదర్శనలకు వెళ్లడం.. సొమ్మసిల్లి పడిపోవడం.. ఆస్పత్రి పాలు కావడం వంటి డ్రామాలను బాగా రక్తి కట్టిస్తున్నారు. కానీ.. మోడీ సర్కారు ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాలకు రాష్ట్ర ప్రజలు మరికొన్ని దశాబ్దాల పాటు ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మరని, గెలిపించరని వారికి అర్థం అవుతున్నట్లు లేదు. 

సొంత పార్టీలో ‘అమాత్య గ్రహాలు’..

ఏనుగు నెత్తిన ఎవ్వరూ చెత్త వేయలేరు. అది తన నెత్తిన తానే చెత్త వేసుకుంటుంది.. అనే సామెత జగన్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మరొకరు బద్నాం చేయక్కర్లేదు. జగన్ కోటరీలో ఉన్న అమాత్యగ్రహాలు కొన్ని ఆ పనిని నిర్విఘ్నంగా చేస్తూనే ఉన్నాయి. ఉంటాయి.

జగన్ గడువు పెట్టిన రెండున్నరేళ్ల గడువు ముగిసేసరికి తన పదవి ఉంటుందో ఊడుతుందో అనే భయంలో ఉన్న వెలంపల్లి శ్రీనివాస్ రామతీర్థం ఘటన గురించి మాట్లాడే క్రమంలో అశోక్ గజపతి రాజును నిందించడానికి, రాజుల కులాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే సృష్టించాయి. లాక్కోలేక పీక్కోలేక వెలంపల్లి ఇబ్బంది పడుతున్నారు. 

ఇదొక ఎత్తు అయితే.. తన అనుచరులు పేకాట శిబిరాల్లో అడ్డంగా దొరికితే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఇంకా తీవ్రమైనవి. స్వయంగా మంత్రి అలాంటి మాటలు మాట్లాడడం ప్రభుత్వం పరువును ఏ బజార్లో పెడుతుందో వారే అర్థం చేసుకోవాలి. 

ఎక్కడ ఫెయిలవుతున్నారు..

ముందే చెప్పుకున్నట్టు ఒక ఘటన జరిగితే.. దానికి నానా రంగులు పులిమి.. తాము ఏ రకంగా ప్రజల ముందు నిలబెట్టదలచుకుంటే.. ఎలా ప్రచారం చేయదలచుకుంటే.. దానికి తగ్గట్టుగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఇలాంటి కుట్రపూరిత ప్రచారాలను సకాలంలో పసిగట్టడం, విరుగుడు మార్గం పసిగట్టడంలో ప్రభుత్వం, వారికి ఉండగల ఇంటెలిజెన్స్ వర్గాలు, పార్టీ గూఢచారులు అంతా ఫెయిలవుతున్నారు. 

రామతీర్థం విషయంలో కూడా విగ్రహం తల తీసేయడం అనేది ఎంత పెద్ద వివాదంగా మారుతుందో జగన్మోహన్ రెడ్డి తొలిరోజున అంచనా వేయలేకపోయారు. అందుకే డిసెంబరు 29న విగ్రహం ధ్వంసం అయితే, 30వ తేదీన ఆ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ.. దాని గురించి ఒక్కమాట మాట్లాడలేదు.

ఆ రోజే సభలో గనుక.. కొత్త విగ్రహం ఏర్పాటు, ఆలయ జీర్ణోద్ధరణకు నిధులు వంటి హామీలు విజయనగరంలోనే ప్రకటించి ఉంటే గనుక.. అసలు వివాదం ముదిరేదే కాదు. ఆయనగానీ, మంత్రి వెలంపల్లి గానీ.. అదే సభలో ఉండి.. ఆ విగ్రహం గురించి ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేశారు. విపక్షాలకు మంచి ఛాన్స్ దొరికింది. 

అయితే ఎందుకిలా ఫెయిలయ్యారు? లక్షలకు లక్షల జీతాలు, కోటానుకోట్ల ప్రయోజనాలు పొందుతూ.. జగన్ కోటరీలో కీలకంగా మెదులుతూ.. సలహాదారులనే ట్యాగ్ లైన్లతో చెలామణీ అవుతూ ఉండేవారు ఏం  చేస్తున్నట్టు? ఎలాంటి ప్రమాదం ముంచుకు రానున్నదో దానికి తరణోపాయం ఏమిటో చెప్పలేకపోతే.. వారి మేథోసంపదలు ఎందుకు? తగలేసుకోడానికా? అనే మీమాంస పార్టీ వర్గాల్లో నడుస్తోంది. 

అలాగే మీడియా మేనేజిమెంట్ లో కూడా పార్టీ విఫలం అవుతోందనే అభిప్రాయం కూడా వారిలో ఉంది. తాము ప్రజా సంక్షేమం చూస్తున్నాం.. ప్రజల నిజమైన మద్దతు తమకు ఉంది.. ఇక ఇతరత్రా ‘మేనేజిమెంట్’ అనవసరం అనే నమ్మకంతో జగన్ సర్కారు సాగుతున్నట్టు అనిపిస్తుంది.

కానీ.. మంచి చేయడం మాత్రమే కాదు.. చేస్తున్నట్టు కనిపించడం కూడా ప్రధానమైన ఈరోజుల్లో మీడియా మేనేజిమెంట్ లో వారు విఫలం అవుతున్నారు. ఇలాంటి రకరకాల వైఫల్యాలు కలిసి జగన్మోహనరెడ్డి సమర్థకు మరింత పదును పెట్టాలి. ఇలా తన గురించి దుర్మార్గపు ప్రచారాలకు ఇతరులు ఒడిగట్టడానికి ఆస్కారం ఇవ్వకుండా.. ప్రజా సంక్షేమ పథంలో ఆయన పాలన ముందుకు సాగాలి. 

.. ఎల్. విజయలక్ష్మి

వ్రతం చెడినా, ఫలితమైనా దక్కుతుందా?

దర్శకుడిగా మారుతున్న రవితేజ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?