Advertisement

Advertisement


Home > Articles - Special Articles

భగత్‌సింగ్ తుపాకీ భారత్‌కు ఎలా వచ్చిందంటే?

భగత్‌సింగ్ తుపాకీ భారత్‌కు ఎలా వచ్చిందంటే?

షహీద్ భగత్ సింగ్ బ్రిటిషు అధికారిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత.. భగత్ సింగ్‌ను ఉరితీశారు. ఈ సంగతి మనకు తెలుసు. కానీ... ఇంతకూ భగత్ సింగ్ వాడిన పిస్తోలు, మన భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రతీక.. ఆ తర్వాత ఏమైపోయింది? ఇది మొన్నమొన్నటి వరకూ ఎవ్వరికీ తెలియదు.

స్వాతంత్ర్యం వచ్చిన సంబరాల్లో భగత్ సింగ్‌ను మరుగున పెట్టేసినట్టుగానే... పోరాటాలకు ప్రతీక అయిన ఆయన పిస్తోలును కూడా అందరూ చాలా ‘కన్వీనియెంట్’గా మర్చిపోయారు. కాలక్రమంలో జాతిమొత్తం మరచిపోయింది.

కానీ పంజాబ్‌కు చెందిన జర్నలిస్టు జుపిందర్ జిత్ సింగ్ దానిని విస్మరించలేదు. తన స్ఫురణకు భగత్ సింగ్ తుపాకీ వచ్చిననాటినుంచి ఏక బిగిన అసిధార వ్రతంలాగా దానిని అన్వేషించారు. చివరికి ఆ తుపాకీ ఎక్కడ ఉన్నదో కనుగొన్నారు. పాకిస్తాన్ లోనే ఉండిపోయిన ఆ పిస్తోలును తిరిగి భారత్‌కు తీసుకువచ్చారు. ఇప్పుడది... పంజాబ్ ఫిరోజ్ పూర్ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు మ్యూజియం సందర్శకులు వీక్షించడానికి వీలుగా ఉంచారు.

అయితే ఆ పిస్తోలు భారత్ కురావడం అంత సులువుగా ఏం జరగలేదు. అందుకోసం సుమారు ఏడాదికి పైగా జుపిందర్ జిత్ సింగ్ నిర్విరామంగా కష్టపడ్డారు. అనేక ప్రాంతాలు తిరిగారు. అనేకమంది సైనిక, పోలీసు, అధికారులతో మాట్లారు. వేల పేజీల కోర్టు రికార్డులను అధ్యయనం చేశారు. నిద్రలేని రాత్రులు గడిపారు. ఎట్టకేలకు ఆ తుపాకీని పట్టుకోగలిగారు.  ఈ ప్రయత్నం మొత్తాన్ని ఆయన ఓ పుస్తకంగా కూడా రాశారు.

ఆ జర్నలిస్టు జుపిందర్ జిత్ సింగ్.. ఈ తన ప్రయత్నాన్ని తెలుగు రచయితలతో పంచుకున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూరు వద్ద జరిగిన తెలుగు రచయితల కథాసదస్సులో.. జుపిందర్ తన ప్రయత్నాన్ని సాకల్యంగా వివరించారు.

అర్థవంతమైన చర్చలతో ‘కథాఉత్సవం 2019’

‘సమకాలీన సామాజిక స్థితిగతులను భవిష్యత్తు కోసం రచనల భాండాగారాలలో నిక్షిప్తం చేసే కార్మికులు- రచయితలు’. అలాంటి రచయితలు అనేకమంది ఒకచోట సమావేశమై సమకాలీన సాహిత్యం,  మారుతున్న పోకడలు, అవసరమైన మార్పులు తదితర విషయాల గురించి సాకల్యంగా చర్చించుకుంటే దానివలన సమాజానికి పైకి కనిపించని ప్రయోజనం చాలా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సమీపం మామిడిపల్లిలో ఇలాంటి మంచి ప్రయత్నం రెండురోజుల ‘కథా ఉత్సవం 2019’గా జరిగింది. రైటర్స్ మీట్ సారథులు మహ్మద్ ఖదీర్ బాబు, కె.సురేష్- డాక్టర్ అమృతలత ల సంయుక్త నిర్వహణలో ఈ ఉత్సవాన్ని రెండురోజుల పాటు ప్రయోజనకరంగా నిర్వహించారు.

రైటర్స్ మీట్ ఆధ్వర్యంలో ఖదీర్ బాబు, కె.సురేష్ లు 2001 నుంచి కథాఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 14వ కథా ఉత్సవాన్ని ఆర్మూర్ సమీపం మామిడిపల్లిలోని అపురూప కల్యాణమండపంలో డా.అమృతలతతో కలిసి నిర్వహించారు.

ఈ ఉత్సవంలో ఆధునిక సాంకేతిక పోకడల నుంచి సృజనాత్మక రచనా ప్రక్రియలు పోటీ ఎదుర్కొంటున్న కథ అవసరం ఎంతవరకు? కథల్లో ఇంకా రావాల్సిన మార్పులు ఏమిటి?, రచయితలకు ఎదురవుతున్న అస్తిత్వ వాద సమస్యలు, స్త్రీ రచయితలకు సమకాలీన రచయితలనుంచి ఎదురవుతున్న ఇబ్బందులు, వృత్తిగతంగానూ ఇతరత్రా కారణాల వల్ల రచయితలు ఎదుర్కొంటున్న కష్టాలు, వస్తువు ఎంపికలో చూపవలసిన వైవిధ్యం, నవలా చిత్రాలు, కొత్త రచయితల అనుభవాలు, కొత్త రచయితలకు సూచనలు తదితర విషయాలపై విపులంగా అర్తవంతమైన చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలనుంచి సుమారు నలభై మందికి పైగా రచయితలు, ప్రచురణ కర్తలు ఔత్సాహికులు పాల్గొన్నారు.

ఈ కథా ఉత్సవంలో లబ్ధప్రతిష్టులైన కథా రచయితలు మధురాంతకం నరేంద్ర, అల్లం రాజయ్య, కాత్యాయని విద్మహే, ప్రముఖ నాటక రచయిత విజయభాస్కర్, ఇంకా డాక్టర్ అమృతలత, కూనపరాజు కుమార్ రాజు, ఎన్. వేణుగోపాల్, డానీ, మహ్మద్ ఖదీర్ బాబు, కె. సురేష్, కుప్పిలి పద్మ, పులగం చిన్నారాయణ, అరిపిరాల సత్యప్రసాద్, జహానారా, నెల్లుట్ల రమాదేవి, ఝాన్సీ పాపుదేశి, తోట అపర్ణ, మురళీ ధర్, వెంకట్ సిద్ధారెడ్డి, మహి, కరుణ కుమార్, రెంటాల జయదేవ, కె.ఎ. మునిసురేష్ పిళ్లె, జిఎస్ రామ్మోహన్, అరణ్య క్రిష్ణ, రుబీనా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. కథారచనలో భిన్న పోకడలతో మరిన్ని మంచి రచనలు అందించడానికి ఇలాంటి కథా ఉత్సవాలు బహుధా ఉపయోగపడతాయని పలువురు అభిప్రాయపడ్డారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?