Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రాజకీయ వ్యభిచార నామ సంవత్సరం.!

రాజకీయ వ్యభిచార నామ సంవత్సరం.!

పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన ఘనుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది మాత్రం 'డాష్‌ డాష్‌' అన్నట్లు.. చంద్రబాబు చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతనే వుండదు. ఉదాహరణ కావాలా.? ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి 'ఫిరాయించడమే' ఇందుకు నిదర్శనం. 'రండి బాబూ రండి.. బంపర్‌ ఆఫర్లు.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?' అంటూ తలుపులు తెరిచి మరీ, నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులకు తెరలేపారు చంద్రబాబు. 

తెలంగాణలో.. అందునా తెలంగాణకు గుండెకాయ అయిన హైద్రాబాద్‌లో.. ఏదీ, తాను ఉద్ధరించేశాననుకుంటున్న గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో తెలుగుదేశం పార్టీకి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. అంతకు ముందు, ఆ తర్వాత పార్టీని చాలామంది ఎమ్మెల్యేలు వీడి, టీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో, చంద్రబాబు అసహనానికి హద్దుల్లేకుండా పోయింది. ఆ ఎన్నికల ప్రచారంలోనే చంద్రబాబు 'సంతలో పశువుల్ని కొంటుటున్నట్టు ఎమ్మెల్యేలని కొంటున్నారు.. ఇది రాజకీయ వ్యభిచారం..' అంటూ గింజుకున్న విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

కానీ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఏం చేశారు.? సంతలో పశువుల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలని కొన్నారు. పార్టీ ఫిరాయింపు అనే రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహించారు. ప్రోత్సహిస్తూనే వున్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయంగా ఉద్ధరించింది ఇదే.! 

ఇక, ముఖ్యమంత్రి హోదాలో పరిపాలన పరంగా చంద్రబాబు ఖాతాలో ఏదన్నా ఘనత వుందంటే, అది ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయ నిర్మాణమే. దీనికీ పురిటి నొప్పులు తప్పలేదు. బోల్డన్ని పబ్లిసిటీ స్టంట్లు.. దాన్ని మించిన తప్పటడుగులు.. ఎలాగైతేనేం, పిల్లిమొగ్గలేసి మరీ తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించేశారు.. అందులో ఆయనా పలుమార్లు తన కార్యాలయాన్ని 'ప్రారంభించేయడం' గమనార్హమిక్కడ. ఒక్కసారి చేస్తే అది పరమ రొటీన్‌.. మళ్ళీ పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ.. అన్నట్లు, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు మళ్ళీ మళ్ళీ చేసి, పబ్లిసిటీతో పిచ్చెక్కించేశారు జనాన్ని చంద్రబాబు. 

ఇంతేనా, ఇంకా చాలా వున్నాయి. పట్టిసీమ ప్రాజెక్టుని కూడా ఈ ఏడాదే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి చేసిందండోయ్‌. అదేంటీ, గతంలోనే కదా జాతికి అంకితం చేసేశారు.. అనడక్కండి. అదంతే. చంద్రబాబు ఇష్టం, ఆయనకు నచ్చినప్పుడు జాతికి అంకితం చేస్తారంతే. ఎలాగైతేనేం, అదీ పూర్తయ్యిందన్పించేశారు చంద్రబాబు. అలా పోలవరం ప్రాజెక్టుని పక్కన పెట్టి, పట్టిసీమను పూర్తి చేసిన చంద్రబాబు, ఆ పట్టిసీమ జలాలతోనే కృష్ణా పుష్కరాల్ని ఘనంగా ఈ ఏడాదే నిర్వహించారండోయ్‌. 

ఈ ఏడాది చివర్లో చంద్రబాబు మరో అద్భుతాన్ని సుసాధ్యం చేశారు. అదేంటంటే, పోలవరం ప్రాజెక్టుకి సుమారు 2 వేల కోట్ల రూపాయల కేంద్ర నిథులు తీసుకురావడం. దీన్ని కేంద్రం, ఆంధ్రప్రదేశ్‌ బొచ్చెలో వేసిన బిచ్చంగా ప్రజలు అభివర్ణిస్తోంటే, ఆ బిచ్చమే మహా ప్రసాదం.. అంటున్నారు చంద్రబాబు. సందట్లో సడేమియా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కి చంద్రబాబు తీరని నష్టం కూడా చేశారు. అదేంటో తెలుసా.? ప్రత్యేక హోదాని అటకెక్కించి, ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చెప్పడం. ప్యాకేజీ అన్న ఊసెత్తకుండా, దానికసలు చట్టబద్ధత కల్పించకుండా 'ప్రత్యేక సాయం' పేరుతో కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనతోనే చంద్రబాబు సరిపెట్టుకున్నారు. 

ఏదిఏమైనా, రాజకీయాల్లో దిగజారుడుతనానికి పరాకాష్ట.. అంటే ఏమిటో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఏడాది చూపించేశారు. రాజకీయాల్ని భ్రష్టుపట్టించడం, పరిపాలనను అటకెక్కించడం, ప్రజల సెంటిమెంట్లతో ఆటలాడటం.. ఒకటేమిటి.? 2016 సంవత్సరం చంద్రబాబు రాజకీయ జీవితంలో వెరీ వెరీ స్పెషల్‌.. కాదంటారా.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?