10 అక్కౌంట్లు.. పది లక్షల కోట్లు.!

ఎవడన్నాడు భారతదేశం పేద దేశమని.. దేశం గొప్పదే.. మన దేశంలోనూ కుబేరులున్నారు. అయితే ఆ కుబేరులు నల్లధనం కూడబెడ్తుండడంతోనే దేశం పేద దేశంగా మారిపోతోంది. కుబేరులు నల్ల కుబేరుల్లా నిగనిగలాడిపోతుంటే, పేదలు కడు బీదల్లా…

ఎవడన్నాడు భారతదేశం పేద దేశమని.. దేశం గొప్పదే.. మన దేశంలోనూ కుబేరులున్నారు. అయితే ఆ కుబేరులు నల్లధనం కూడబెడ్తుండడంతోనే దేశం పేద దేశంగా మారిపోతోంది. కుబేరులు నల్ల కుబేరుల్లా నిగనిగలాడిపోతుంటే, పేదలు కడు బీదల్లా జీవనం సాగిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ బాగు పడే పరిస్థితుల్లేవంటే దానిక్కారణం ఈ నల్ల కుబేరులే.

దేశాన్ని కుదిపేస్తోందిప్పుడు నల్ల కుబేరుల వ్యవహారం. ఒకరా ఇద్దరా.? ఎంత మంది నల్ల కుబేరులు మన దేశంలో వున్నారు.? అన్న ప్రశ్నకు సమాధానం అంత తేలిగ్గా దొరికేలా లేదు. ఎందుకంటే, అంత పెద్ద సంఖ్యలో మన దేశంలో నల్ల కుబేరులున్నారు మరి. వేల కోట్లు.. అనేది ఇప్పుడు చాలా చిన్న మాట. ఇప్పుడు మేటర్‌ లక్షల కోట్ల మీద నడుస్తోంది.

సుప్రీంకోర్టుకు కేంద్రం నల్ల కుబేరుల జాబితాను రేపు ఓ మోస్తరు స్థాయిలో వెల్లడించే అవకాశమున్న దరిమిలా, వారెవరు.? వారి వద్ద వున్న మొత్తమెంత.? అనే ప్రశ్నలకు రకరకాల ఊహాగానాలు సమాధానాలుగా విన్పిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురి వివరాల్ని కేంద్రం, సుప్రీంకోర్టుకు అందజేసింది. తాజాగా మరో పది మందిని లిస్ట్‌లో పెట్టి, కేంద్రం రేపు సుప్రీంకోర్టుకు అందజేయనుందట.

అలా కేంద్రం వద్దనున్న పది అకౌంట్ల వివరాల్ని బట్టి చూస్తే అటూ ఇటూగా పది లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గుతోందన్నది ఓ అంచనా. ఓ అక్కౌంట్‌లో ఏకంగా రెండు లక్షల కోట్లు మగ్గుతుంటే, మరో అక్కౌంట్‌లో లక్షన్నర కోట్లు మగ్గుతున్నాయి. మరో అక్కౌంట్‌లో లక్ష కోట్లు దాచుకున్నాడో నల్ల కుబేరుడు. మిగతా వాటిల్లో 35 వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల దాకా వున్నాయి.

10 అక్కౌంట్‌ నెంబర్లు పది లక్షల కోట్లు అంటే, లెక్కల్లేకుండా పడి వున్న మిగతా అక్కౌంట్లలో ఎంత మొత్తంలో నల్ల కుబేరులు దాచి వుంటారు.? అమ్మో.. ఆలోచిస్తేనే తలకాయ పగిలిపోతుంది. పాపం పండిపోయినట్టు విదేశీ బ్యాంకుల్లో నల్లధనం పండిపోయిందన్నమాట. ఇక్కడ విశేషమేంటంటే, నల్ల కుబేరుల్లో వ్యాపారవేత్తలకన్నా రాజకీయ నాయకులే ఎక్కువగా వున్నారట. వున్న వ్యాపారవేత్తలకూ ఏదో ఒక పార్టీతో రాజకీయ సంబంధాలుండడం ఇంకా పెద్ద విశేషం.

దోచుకున్నోడికి దోచుకున్నంత.. అనే రేంజ్‌లో రాజకీయాలు దేశాన్ని సర్వనాశనం చేసేయడంతో.. ఇదిగో ఇలా లక్షల కోట్లు విదేశీ బ్యాంకుల్లో మగ్గిపోతున్నాయన్న వాస్తవం తెలిశాక అయినా, రాజకీయాల్లో సమూల మార్పు దిశగా ఓటరు ఆలోచన చేయాల్సి వుంది. రాజకీయ నాయకులు, పార్టీలూ ఎప్పటికీ మారవు. మారాల్సిందల్లా ఓటరు మాత్రమే. బరిలో నిలిచినోళ్ళంతా దోపిడీదారులే అయితే ఓటెవరికి వెయ్యాలి.? అన్న ప్రశ్నను వదిలేసి.. క్లీన్‌ పాలిటిక్స్‌ దిశగా ఓటరు ఆలోచన సాగితే.. దేశ రాజకీయాల్లో ఇప్పుడు కాకపోతే.. ఇంకో ఐదేళ్ళకో పదేళ్ళకో మార్పు వచ్చి తీరుతుంది.