కౌంట్ డౌన్ మొదలయ్యింది.. మరికొద్ది గంటల్లోనే అగ్రరాజ్యాధినేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆన్‌లైన్, పోస్టల్ ఓటింగ్‌లో నాలుగు కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించేసుకున్నారు. రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్.. వాడి వేడిగా ఎన్నికల ప్రచారంలో ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు.. పదునైన ప్రసంగాలు చేశారు.. పచ్చి పచ్చిగా తిట్టుకున్నారు.. అత్యంత అసభ్యకరంగా ఇరు పార్టీలకు చెందినవారూ ప్రత్యర్థుల నగ్న విగ్రహాల్ని అమెరికా వీధుల్లో పెట్టి, అగ్రరాజ్యం పరువుని బజార్న పడేశారు. ఈ మొత్తం తతంగానికి కొద్ది గంటల్లోనే శుభం కార్డు పడనుంది.
మధ్యలో ఒకే ఒక్కసారి ట్రంప్ కాస్త ఆధిక్యంలోకి వచ్చినట్లు కన్పించారుగానీ, మొత్తంగా అన్ని సర్వేల్లోనూ హిల్లరీకే ఆధిక్యమని తేలిపోయింది. తాజా సర్వే ప్రకారం హిల్లరీకి 4 పాయింట్లు అధికంగా లభించాయి. సర్వేల సంగతెలా వున్నా, తానే అమెరికాకి కాబోయే అధ్యక్షుడినని ట్రంప్ అంటున్నారు. అంతేనా, తాను గెలవకపోతే అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రసహనమే వేస్ట్.. అని తేల్చేశారాయన. ఓటమిని అంగీకరించబోనని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసేశారు ట్రంప్.
ఒక్కటి మాత్రం నిజం. అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా రాజకీయాలు రోడ్డున పడ్డాయి. హిల్లరీకి రాజకీయ అనుభవం వుంది. ట్రంప్‌కి వ్యాపార అనుభవం వుంది. హిల్లరీ రాజకీయ ఎత్తుగడలకి, ట్రంప్ తనదైన వ్యాపార కిటుకులతో షాకిచ్చారు. గెలిచినా ఓడినా ట్రంప్ పేరు మాత్రం అమెరికా చరిత్రలో ఎప్పటికీ మార్మోగిపోతుంది. కారణం, ఎలాంటి అంచనాలూ లేకుండానే ట్రంప్ ఈ స్థాయికి రావడం.
హిల్లరీపై ప్రైవేటు ఇ-మెయిల్ కుంభకోణం ఆరోపణలు వుంటే, ట్రంప్ మీద ఏకంగా మహిళలతో 'భంచిక్' ఆరోపణలున్నాయి. హిల్లరీకి, అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు లేటెస్ట్‌గా ఎఫ్‌బీఐ నుంచి ఇ-మెయిల్ స్కాప్‌పై క్లీన్ చిట్ లభించింది. ట్రంప్‌పై ఆరోపణల ప్రసహనం ఇంకా కొనసాగుతూనే వుంది. అయినాసరే, ట్రంప్‌కి మద్దతిచ్చేవారి సంఖ్య మాత్రం పెరుగుతూనే వుండడం గమనార్హం. అంతెందుకు, అమెరికాలో భారతీయులు అమెరికన్ల ఉద్యోగావకాశాల్ని కొల్లగొట్టేస్తున్నారంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, భారతీయుల్లో చాలామంది ఆయనకు మద్దతిస్తున్నారంటే ట్రంప్ ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవచ్చు.
అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్, అబార్షన్లకు చట్టబద్ధత వంటి అంశాలు ఎన్నికల వేళ ముఖ్యమైన చర్చనీయాంశాలుగా మారాయి. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు డిబేట్లలో. అక్కడా హిల్లరీదే ఆధిపత్యం. అయినా హిల్లరీ శిబిరంలో కనిపించని పూర్తిస్థాయి ధీమా. ఎన్నికల పోలింగ్, ఆ వెంటనే ఫలితం.. వెరసి, రేపు భారత కాలమానం ప్రకారం 10 గంటలకల్లా అగ్రరాజ్యాధినేత ఎవరన్నదీ తేలిపోతుంది. ఈలోగా జ్యోతిషాలనీ, ఇంకోటనీ.. రిపబ్లికన్లు – డెమోక్రాట్లు వేస్తున్న పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు.