కెవిః కరోనానంతర పరిశ్రమలు

కరోనా వచ్చాక భారత పారిశ్రామిక రంగంలో, తద్వారా ఉద్యోగరంగంలో పెనుమార్పులు వస్తాయని అందరూ ఊహిస్తున్నారు. అది సహజమే. పరిశ్రమలు ఎటువంటివి నిలదొక్కుకోబోతాయి, వేటి షేర్లలో పెట్టుబడి పెడితే ఢోకా లేకుండా వుంటుంది అనే విషయాలపై…

కరోనా వచ్చాక భారత పారిశ్రామిక రంగంలో, తద్వారా ఉద్యోగరంగంలో పెనుమార్పులు వస్తాయని అందరూ ఊహిస్తున్నారు. అది సహజమే. పరిశ్రమలు ఎటువంటివి నిలదొక్కుకోబోతాయి, వేటి షేర్లలో పెట్టుబడి పెడితే ఢోకా లేకుండా వుంటుంది అనే విషయాలపై నేను రాయబోవటం లేదు. చాలా బ్రాడ్‌గా, చిన్నాపెద్దా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపిద్దామనుకునేవారు ఆలోచించవలసిన విషయాల గురించి చర్చిస్తున్నాను.

సామాజిక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడే ఉత్పత్తులు తయారుచేసే పరిశ్రమలు, అందించే వ్యాపారాలు తక్కినవాటి కంటె బాగా అభివృద్ధి చెందుతాయని  అందరికీ తెలుసు. అయితే సమాజానికి అనేక అవసరాలుంటాయి. కుజగ్రహానికి రాకెట్ పంపడమూ అవసరమే, అణ్వస్త్రాలు తయారుచేయడమూ అవసరమే, అంటార్కిటికా నివాసానికి అనువుగా వుందో లేదో పరిశోధించడమూ అవసరమే. వీటన్నిటితో బాటూ సామాన్యుడి మౌలిక అవసరాలు తీర్చడమూ అవసరమే. అంటే ఆహారధాన్యాల ఉత్పత్తి పెంచడం ఎలా, చౌకగా యిళ్లు నిర్మించడం ఎలా… ఇలాటివి. వీటన్నిటిలో పరిశోధన అవసరం వుండి తీరుతుంది.

ముందుగా మనం తేల్చుకోవలసినది – సమాజంలోని ఏ వర్గంపై దృష్టి పెట్టి వారికి అనువైన పరిశ్రమ పెట్టాలి అని! మహాత్మా గాంధీ గారు ఏదైనా ప్రాజెక్టు తలపెట్టే ముందు అది సామాన్యుడి జీవనప్రమాణాలను ఎంతవరకు మెరుగుపరుస్తుందో ఆలోచించమన్నాడు. అదే గీటురాయి అన్నాడు. నేను శాంతా మొదలుపెట్టడానికి ముందు ఒక బ్యాటరీస్ కంపెనీలో భాగస్వామిగా వున్నాను. అది విమానాల్లో బ్యాటరీలను స్వదేశీ విజ్ఞానంతో తయారు చేసేది. అదీ సమాజంలో కొన్ని వర్గాలకు మేలు కలిగించేదే!

దానిలోంచి విడిగా వచ్చేసి సొంతంగా కంపెనీ పెట్టాలనుకున్నపుడు నేను హెపటైటిస్‌-బి వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో పడ్డాను. లివర్‌కు సంబంధించిన వ్యాధి అది. దాని వ్యాక్సిన్ సామాన్యుడికి కూడా అందుబాటు ధరలో అందించాలంటే స్వదేశీ పరిజ్ఞానంతో చేయాల్సిందే. చేశాం. ఎందరో లాభపడ్డారు. మన దేశస్తులే కాదు, పేద దేశాలలో పిల్లలకు కూడా మేలు కలిగింది. బ్యాటరీ కంపెనీలో నాకు వచ్చిన పేరుప్రతిష్ఠల కంటె దీని ద్వారా వచ్చింది ఎన్నో రెట్లు ఎక్కువ… డబ్బు కూడా!

అందువలన సమాజంలో ఉన్న సమస్య గురించి, వారికి కావలసినది ఉత్పత్తి చేద్దామనీ ఆలోచించినప్పుడు సమాజంలోని ఏ వర్గానికి చెందిన అవసరాన్ని మీరు ఎడ్రస్ చేద్దామనుకుంటున్నారో నిశ్చయించుకోండి. దానికి అనుగుణంగా ప్లాను చేసినప్పుడు, అప్పటికే ఉన్న టెక్నాలజీని ఎలా వాడుకోవాలో, ఏయే మార్పులు చేసుకోవాలో మీకు బోధపడుతుంది. ప్రస్తుతం మనమందరం కరోనా గురించే ఎక్కువ ఆలోచిస్తున్నాం కాబట్టి దాన్నే ఉదాహరణగా తీసుకుని చెప్తాను.

అంతకుముందు మాస్కులనేవి డాక్టర్లు, నర్సులు కట్టుకునేవే అనుకునేవాళ్లం. ఇప్పుడు జనాలందరూ కట్టుకోవాల్సి వచ్చింది. మాస్ ప్రొడక్షన్ కావాలి. రకరకాల మాస్కులు మార్కెట్లోకి వస్తున్నాయి. సులభంగా అమర్చుకునేవి, ఫ్యాషన్‌బుల్‌గా వున్నవి, మాస్కుమీద మీ మీసం, గడ్డం ఫోటో ముద్రించి వున్నవి,.. అనేక రకాలు. బజార్లో వెళ్లినప్పడు కట్టుకునే రకాలు ఒక రకమైతే సరిపోతాయి. కోవిడ్ పేషంటు పక్కనే వున్నపుడు మరింత సేఫ్టీ కావలసిన మాస్కులు అవసరమౌతాయి. రోజూ వాడాలంటే చాలా అవసరమౌతాయి. టెక్నాలజీ మార్చి, ధర తగ్గించకపోతే కుటుంబ బజెట్‌లో చాలా భాగం దీనికే పోతుంది.

అలాగే వెంటిలేటర్లు. ప్రస్తుతం వున్న మల్టీటాస్కింగ్ వెంటిలేటర్లు చాలా రకాలుగా పనిచేస్తాయి. అయితే మనం కరోనా విషయంలో పల్మనాలజీకి సంబంధించిన భాగం మాత్రమే ఉపయోగిస్తున్నాం. హార్ట్‌కి సంబంధించిన భాగం వాడనే వాడం. అందువలన సింప్లిఫైడ్ వెంటిలేటర్లు తయారుచేస్తే, అవి తక్కువ ధరలో తయారవుతాయి. అలాటివి మనం వేల సంఖ్యలో తయారుచేయగలగాలి.

అదే విధంగా గ్లవ్స్, శానిటైజర్లు, హెడ్ కవర్స్ వీటన్నిటిలో కూడా ఇంప్రొవైజేషన్స్‌ చేయవచ్చు. రీ యూజబుల్, పెర్‌ఫ్యూమ్‌డ్, ఫోల్డబుల్.. యిలా ఎన్నో వస్తాయి. మాస్క్ వేసుకుంటే కళ్లజోడు మీదో, హెల్మెట్ అద్దం మీదో ముక్కులోంచి ఆవిర్లు వచ్చి మసకబారతాయి. అలా జరగకుండా ఏదో ఒక ఉపాయం కనిపెట్టవచ్చు. వేసవికాలంలో వాడేందుకు ఒక రకం, శీతాకాలంలో మరో రకం, వర్షంలో తడిసినా ఫరవాలేని విధంగా మరో రకం… ఇలా ఉన్న టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకుంటూ, రిసెర్చితో కొత్త టెక్నాలజీని డెవలప్ చేస్తూ ముందుకు సాగాలి. సమస్యలు వచ్చినపుడే పరిష్కారాల గురించి ఆలోచిస్తాం. వాటిని ముందే ఊహించగలిగినవాడు ఘనుడు.

ఏది చేసినా సామాన్యులను దృష్టిలో పెట్టుకుని చేసినప్పుడు పుణ్యం, పురుషార్థం. సాటి మానవుడికి తృప్తి కలగడమే కాక, మార్కెట్ బాగా విస్తరించడం వలన లాభపడతాం కూడా. గతంలో శానిటరీ నాప్‌కిన్లు దిగుమతి చేసుకునేవారం. పెద్ద కంపెనీలు బోల్డంత ధర పెట్టి అమ్మేవి. మురుగానందం అనే ఒకతను స్థానికంగా తయారుచేసి చౌకగా అమ్మడంతో మార్కెట్ ఎంతలా విస్తరించింది!

హెపటైటిస్-బి వ్యాధి వలన ఇండియాలో 5 శాతం మంది బాధపడుతూంటారు. చికిత్స ఖరీదైనది. వాక్సిన్ ఉంది. కానీ దిగుమతి చేసుకోవాలి. అందుకని ఎక్కువమంది వేయించుకునేవారు కాదు. దాంతో వాక్సిన్ మార్కెట్ చిన్నగా వుండేది. నేను హెపటైటిస్-బి వ్యాక్సిన్ తలపెట్టినపుడు మార్కెట్ సైజు 1.68 లక్షల డోసులు. ధరను సామాన్యుడికి అందుబాటులోకి తెస్తే యిప్పుడు దాని మార్కెట్ సైజు 150 కోట్ల డోసులైంది!

అందువలన నేను చెప్పేదేమిటంటే సామాన్యుడి అవసరాల పట్ల సెన్సిటివ్‌గా వుండండి. ఏ పరిశ్రమ పెట్టాలో మీకే తెలుస్తుంది. అవసరమంటూ తెలిశాక దానికి తగిన విధంగా ప్రోడక్ట్‌ను డిజైన్ చేయాలి. ఇదివరకు గొడుగులు పెద్దగా వుండేవి. ఫోల్డబుల్ గొడుగులు తయారయ్యాక ఎక్కువమంది వాడారు. ఇంట్లో కరంటుతో నడిచే రేడియోల కంటె బ్యాటరీలతో నడిచే ట్రాన్సిస్టర్లు వచ్చాక వాటి వాడకం విపరీతంగా పెరిగింది.

కోవిడ్ సందర్భం కాబట్టి మెడికల్ ఎక్విప్‌మెంట్, డివైసెస్ గురించి, వాటిని కొత్తరకంగా డిజైన్ చేసి మార్కెట్ చేయడం గురించి మాట్లాడదాం. ఆసుపత్రికి చేరాక ఏం చేయాలో తర్వాతి మాట, అసలు ఆసుపత్రికి పేషంటును త్వరగా చేర్చే సాధనాలు, ఆసుపత్రిని పరిశుభ్రంగా వుంచే సాధనాలను కూడా కొత్తగా డిజైన్ చేయాలిగా. ట్రాఫిక్ రద్దీ సమస్యను అధిగమించే ఆంబులెన్సులు, ఆంబులెన్సులోనే చికిత్స ప్రారంభించే టెలిమెడిసిన్ – యివన్నీ డిజైన్ చేసుకోవద్దూ!

ప్రోడక్టును డిజైన్ చేసినప్పుడు దాని ధరను అదుపులో పెట్టేందుకు సకల సాధనాలను చూసుకోవాలి. ఫ్యాక్టరీలో తయారుచేసినప్పుడు వీలున్నంతవరకు మెకానికల్‌గా చేసి, అవసరమైన చోటనే మానవ వనరులను (మాన్యువల్ పవర్) వాడాలి. క్రియేటివిటీ అవసరమైన చోట, పర్శనల్ సూపర్‌విజన్ వుండవలసిన చోట్ల మనిషి వుండాలి. యాంత్రికంగా, అంటే ఆలోచన ఏమీ అక్కరలేకుండా మెకానికల్‌గా చేసే పనులకు మెషిన్లు వాడాలి.

అట్టపెట్టెల్లో ప్యాకింగ్ చేసే చోట మనిషెందుకు? మెషినే పెద్ద అట్టను నాలుగువైపులా మడిచేసి, వస్తువులు దానిలో పడేసి, మూసేయగలదు. అలాటి వాటిల్లో మనిషిని పడేస్తే అతని మెదడు మొద్దుబారిపోతుంది. ‘‘మోడరన్ టైమ్స్‌’’ సినిమాలో చార్లీ చాప్లిన్‌ ఒక ఫ్యాక్టరీలో రెండు చేతులా స్పానర్లు చేతబట్టి బోల్టులు టైట్ చేసే ఉద్యోగం చేస్తూ వుంటాడు. ఆ పని చేసిచేసి, చివరకు పిచ్చెక్కి, ఆ స్పానర్లతో ఏది కనబడినా టైట్ చేసేస్తూంటాడు. అందువలన మనిషికి మేధస్సు ఉపయోగించే పని మాత్రమే యివ్వాలి.  

ఏదైనా ప్రోడక్టును పెర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేయాలంటే యితర సాంకేతిక విభాగాలను కూడా కలుపుకుని సమన్వయం చేసుకుంటూ (యింటర్‌డిసిప్లినరీ హార్మనీ) పోవాలి. ఏ సైన్సు విభాగమూ ఎక్స్‌క్లూజివ్ కాదు. విడిగా నిలవదు. వైద్యశాస్త్రం వుంది. దానిలో జువాలజీ మాత్రమే వుందా? రక్తప్రసరణ విధానాన్ని వివరించడానికి ఫిజిక్స్ కావాలి. వాడే మందులు కెమికల్స్ కాబట్టి కెమిస్ట్రీ తెలియాలి. బయోమెడికల్ ఎక్విప్‌మెంట్‌లో థర్మామీటర్, స్టెత్, ఇసిజి, సిటి స్కాన్‌లో యిమేజింగ్, వెంటిలేటర్‌లో పంపు యిలా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఎన్ని విభాగాలు తోడైతే మనకు చికిత్స జరుగుతోంది?

అడుగడుగునా కన్వర్జన్స్ ఆఫ్ టెక్నాలజీ (సాంకేతిక సంగమం) కనబడుతుంది. మన విభాగమే గొప్పది అనుకుంటే అడుగు ముందుకు పడదు. అన్ని రంగాలకు చెందిన నిపుణులతో కలిసి పని చేసే ధోరణి (మైండ్‌సెట్) మనం అలవర్చుకోవాలి. కలాం-రాజు స్టెంట్ గురించి వినేవుంటారు. సోమరాజు గారనే ఒక కార్డియాలజిస్టు, అబ్దుల్ కలాం గారనే డిఆర్‌డిఓ సైంటిస్టు కలిసి తేలికైన మెటల్‌తో, చౌక ధరలో తయారు చేసిన స్టెంటు అది.

మనమందరం వాడే సెల్‌ఫోన్ సంగతే తీసుకోండి. అది ఎలక్ట్రానిక్స్ పరికరం మాత్రమేనా? దాని బ్యాటరీ వేడెక్కకుండా మెటల్ వాడతారు. అంటే ఫిజిక్స్ పాలు పంచుకున్నట్లేగా, పవర్ రెసిస్టెన్స్ కోసం పెయింట్ వాడతారు. కెమిస్ట్రీ వాడారుగా! ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వున్నాయి.

అందువలన సైన్స్, టెక్నాలజీలలోని అన్ని విభాగాలను గౌరవించడం నేర్చుకోండి. వాటి గురించి తెలుసుకోండి, ఆ రంగాలలో నిపుణులతో నిరంతరం చర్చిస్తూ మీ ప్రోడక్ట్‌ను మెరుగుపరుచుకోండి. మీ ప్రోడక్టు ఎన్ని రకాలుగా, ఏ యే రంగాల్లో ఉపయోగపడుతుందో మీకూ తెలియదు. కొత్త ఉపయోగం మీ దృష్టికి వచ్చినపుడు దానికి అనుగుణంగా మార్పులు చేయడం నేర్చుకోండి. రిసెర్చి అనేది నిరంతర ప్రక్రియ. ఎప్పుడూ ఇన్నోవేట్ చేస్తూనే వుండాలి.

‘రొటీన్‌కు భిన్నంగా’ అనే పదం సినిమాల విషయంలో తరచుగా వింటూ వుంటారు. వాళ్లు అలా చెప్తారు కానీ అన్నీ రొటీన్‌గానే చేస్తారు. అందుకే 90 శాతం సినిమాలు ఫెయిలవుతాయి. విజయం సాధించాలంటే మీరు నిజంగానే రొటీన్‌కు భిన్నంగా వెళ్లాలి. నేను శాంతా సంస్థ పెట్టినపుడు బ్యాంకులు అప్పులివ్వలేదు, వెంచర్ కాపిటలిస్టులు ముందుకు రాలేదు. ఈ హెపటైటిస్-బి ఏమిటో మేమెప్పుడూ స్పెల్లింగ్ కూడా వినలేదు. పారాసిటమాల్ చేసుకో, లోనిస్తాం అన్నారు. అదే తయారు చేసి వుంటే నాకీ గుర్తింపు వచ్చేదా? మా సంస్థకు అన్ని అవార్డులు వచ్చేవా?

కొత్తబాట ఎప్పుడూ ముళ్లబాటే. రాళ్లూ, రప్పలూ అవన్నీ తీసేసుకుంటూ వెళ్లాలి. ఒకసారి రోడ్డు పడ్డాక అందరూ వెళతారు. అప్పటిదాకా ఆగి, ఆ దారిన నడుస్తామంటే మనం గుంపులో గోవిందాగానే వుంటాం. అందువలన ఇన్నోవేషన్ అనేది ముఖ్యం. ఇన్నోవేషన్ అనగానే లాబ్‌లో టెస్ట్‌ట్యూబ్ పట్టుకోవాలని నేను అనటం లేదు. సర్వీసెస్‌లో కూడా ఇన్నోవేషన్ చూపించి జాబ్ సృష్టించుకోవచ్చు. రిజిస్ట్రార్ ఆఫీసుంది, మీరు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలంటే డాక్యుమెంటు ఎలా రాయాలో సాయపడతాం అంటూ ఆ ఆఫీసు చుట్టూ ఎన్ని డాక్యుమెంటు రైటర్స్ ఆఫీసులుంటాయో చూడండి. వాళ్ల కెవరైనా పిలిచి ఉద్యోగాలిచ్చారా? వాళ్లంతట వాళ్లే క్రియేట్ చేసుకున్నారు.

కోవిడ్ తర్వాత ఆర్థికవ్యవస్థ అతలాకుతలమై పోతుంది, ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. అంతకంటె ఉద్యోగాలు మారతాయి అనడం సబబు. టేప్‌రికార్డరులు వున్నంత కాలం అవి రిపేరు చేసేవాళ్లుండేవారు. అవి వాడడం మానేశారు. మరి వాళ్లేమై పోయారు? వీడియో కాసెట్టు రిపేరర్లుగా అవతారమెత్తారు. ఇప్పుడు అవీ పోయాయి. ఇంకో రకమైన సర్వీసులోకి వెళ్లి వుంటారు. ఇలా కొత్త తరహా పనులు చేయడానికి మనం సిద్ధంగా వుండాలి.

డ్రగ్స్ విషయానికి వస్తే ఉన్నవాటికి కొత్త ఉపయోగాలు కనిపెట్టాలి. గుండెలో క్లాట్స్ ఏర్పడకుండా చూడడానికి తయారుచేసిన మందు వయాగ్రా. అది వేరేలా ఉపయోగపడి ఆ సంస్థకు లాభాలు కురిపించింది. ఒక కాంపోనెట్‌లో చిన్న మార్పులు చేస్తే చాలు మార్కెట్‌ స్వరూపమే మారిపోతుంది. గతంలో మోటార్ సైకిళ్లు పెద్దగా మైలేజీ యిచ్చేవి కావు. అందుకే స్కూటర్లదే హవా. మోటర్‌సైకిల్ కార్బురేటర్‌లో మార్పులు చేసి మైలేజీ పెంచారు. వాటి మార్కెట్ విపరీతంగా పెరిగింది. ఇలాటి అన్వేషణలు నిరంతరం సాగుతున్నాయి. హైడ్రోజన్‌తో లైఫ్‌లాంగ్ నడిచే బ్యాటరీలు చేద్దామని చూస్తున్నారు. అసలు బ్యాటరీ అవసరమే పడని సెల్ఫోన్ మీరు కనిపెట్టవచ్చు.

నా విషయానికి వస్తే నేనెప్పుడూ ఇన్నోవేషన్‌, ఆర్ అండ్ డిలనే నమ్ముకున్నాను.  మన దేశంలో ఆర్ అండ్ డి అతి తక్కువ. ఇలాటి పరిస్థితుల్లో మేం హెపటైటిస్-బి వ్యాక్సిన్ తర్వాత కూడా పరిశోధనలు కొనసాగిస్తూనే పోయాం. 15 ప్రోడక్టులను (12 వాక్సిన్‌లు, 3 థెరపటిక్ డ్రగ్స్) సొంతంగా డెవలప్ చేశాం. అందుకే ప్రపంచస్థాయి  ఫార్మా కంపెనీలు మా కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. శాంతాకు మార్కెట్ అంటూ ఎవరూ తయారుచేసి మమ్మల్ని రమ్మనలేదు. మా ప్రయత్నాలే మాకు మార్కెట్ సృష్టించాయి. మీ విషయంలోనే అంతే, మీ జాబ్ మీరే క్రియేట్ చేసుకుంటారు. చేసుకోవాలి కూడా. పరిస్థితులకు అనుగుణంగా మారుతూ పోవలసినదే.

అలా చేయాలంటే మీకు సబ్జక్టుపై పట్టుండాలి. పట్టుందని మీకు తెలియాలి. తెలిస్తేనే  ధైర్యం వస్తుంది. నేటి విద్యావిధానంపై నాకు చాలానే ఫిర్యాదులున్నాయి. మారుతున్న కాలానికి అనువుగా మనమూ మారాలి. అప్లికేషన్‌కు పనికిరాని, కేవలం ఎకడమిక్స్‌కు పనికి వచ్చే సబ్జక్టులకు మంగళం పాడాలి. కాలిక్యులేటర్స్ వచ్చేశాక సూత్రాలు ఒప్పచెప్పమని చంపుకు తిననక్కరలేదు. అర్థం కాకుండా బట్టీపట్టి ఒప్పచెపితే ఏం లాభం?

ఓ పక్క నిరుద్యోగిత పెరుగుతోందని గగ్గోలు పెడుతూంటారు. మరో పక్క వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు సరైన ఉద్యోగి దొరకటం లేదని గోల పెడుతూంటారు. ఎందుకిలా అంటే మనకు చెప్పే చదువులు ప్రాక్టికల్‌గా ఉపయోగపడటం లేదు. ఉద్యోగానికై వచ్చినపుడు నీ మార్కులు చూసి ఉద్యోగం యిచ్చినా, నీ తెలివిని పనితీరులో చూపించ లేకపోతే, ఉద్యోగం నిలవదు. అప్లికేటివ్ నాలెజ్ ముఖ్యం.

దేనికైనా సరే, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ముఖ్యం. అది తెలిస్తే, తెలియని సంగతి తటస్థపడినప్పుడు అన్వయించుకోవడం తెలుస్తుంది. ఎందుకంటే జీవితం టెక్స్ట్‌బుక్ కాదు. సిలబస్‌లో వున్న ప్రశ్నలే జీవితంలో వస్తాయనుకోకూడదు. జీవితం ఎల్లప్పుడూ సరికొత్త ఛాలెంజ్‌లు విసురుతూ వుంటుంది. ఉదాహరణకి యీ కరోనా, యీ లాక్‌డౌన్ బందీ బతుకు మనకు కొత్తవి. మన పాఠ్యపుస్తకాల్లో వీటి గురించి చెప్పలేదు. వీటిని ఎదుర్కునే ఉపాయాలు శోధించాలంటే మనం చదువును వంటబట్టించుకోవాలి. బుర్రకెక్కించుకోవాలి.

సబ్జక్టంటూ క్షుణ్ణంగా బోధపడితే అవసరాన్ని బట్టి వేరే రంగానికి కూడా వెళ్లవచ్చు. ఛేంజ్ ఆఫ్ డొమైన్ బ్రహ్మవిద్య ఏమీ కాదు. ఇందాకా చెప్పినట్లు అన్ని విజ్ఞానశాస్త్ర శాఖలు ఒకదానితో మరొకటి అల్లుకున్నవే. మనకు కామన్‌సెన్స్ వుండాలి. కొత్తగా ఆలోచించగలగాలి. గ్లోబలైజేషన్ వచ్చాక మనకు ఐటీ ఉద్యోగాలు వచ్చాయని చంకలు గుద్దుకుంటున్నాం కానీ, పరిశ్రమలు మూలపడ్డాయని గ్రహించలేకపోయాం. ఉదాహరణగా – ప్లాస్టిక్ ఫార్ములేషన్స్‌లో మనకు ఎంతో అనుభవం వుంది. అయినా మైక్రో పిప్పెట్స్ చేసకోలేక పోయామంటే కారణం ఏమిటి? ఆ దిశగా ఆలోచించలేక పోవడం.

చైనా సరుకు అంటూ యిప్పుడు బజార్లో దొరికేవి యిదివరకు పంజాబ్, హరియాణాలలో యింటింటా తయారు చేసే సరుకు లాటిది కాదా! వీటి కోసం మనం విలువైన విదేశీ మారక ద్రవ్యం వెచ్చించాలా? పోనీ దిగుమతి చేసుకున్నవి అమోఘంగా ఏమైనా వున్నాయా? కోవిడ్ టెస్టింగ్ విషయంలో చైనీస్ కిట్స్ వ్యవహారం చూశాంగా. ఇన్నోవేషన్‌తో మనం కాటేజీ యిండస్ట్రీస్ నెలకొల్పితే నిరుద్యోగ సమస్యే వుండదు. దానికి గాను బాగా చదువుకోవాలి.

చెప్పిన చదువు వంటబడుతోందో లేదో తెలియాలంటే విద్యార్థులకు ప్రాక్టికల్‌గా సమస్యలిచ్చి సాల్వ్ చేయమనాలి. మల్టిపుల్ ఛాయిస్‌లో ఎ,బి,సి.. లిచ్చి ఏదో ఒకటి టిక్కు పెట్టమనే పద్ధతి పోవాలి. లేకపోతే చదువులో కూడా జూదం నేర్పుతున్నట్లే. బిఇ పేపరును ఒకటో క్లాసువాడికి యిచ్చి టిక్కులు పెట్టమన్నా వాడికీ 40యో, 50యో మార్కులు రావచ్చు. సబ్జక్టు వచ్చిందని తెలియాలంటే వాళ్లను దాని గురించి రాసి చూపించమనాలి. అప్పుడే వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి.

ఆ స్కిల్స్ చాలా అవసరం. ఎందుకంటే పని చేయగానే సరి కాదు, దాని గురించి వివరించగలగాలి, దానిలో ప్రత్యేకత ఏమిటో చెప్పుకోగలగాలి. అప్పుడే కెరియర్‌లో పైకి వస్తారు. అంతేకాదు, యీ రోజుల్లో టీమ్ లీడర్‌ల అవసరం ఎంతో వుంది. టీము సభ్యుల్లో తక్కినవారికి తన మనసులోని భావాన్ని వ్యక్తపరచి, వారిని కన్విన్స్ చేయగలగాలి. దానివలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

చాలామందికి తమకేమీ రాదని, తామెందుకు పనికిరామని నమ్మకం. అందుకే ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగంలో దూరిపోతే జీవితం గడిచిపోతుందనుకుంటారు. ఆ ఏటిట్యూడ్ పోవాలి. నాకు వచ్చినది ఫలానా, రానిది ఫలానా, నేర్చుకోగలిగినది ఫలానా.. అనే క్లియర్ అండర్‌స్టాండింగ్ వుంటే మనకు దేనిలో నైపుణ్యం వుందో దానిలోనే ప్రయత్నం చేస్తాం. ఏదైనా స్టార్టప్ మొదలుపెడతాం, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్‌గా వుంటాం.

స్టార్టప్‌ల గురించి చెప్పాలంటే ప్రోడక్టుకు టైమ్ రెలవెన్స్ వుండాలి. మార్కెటింగ్ చేయగలగాలి. కాస్ట్ ఎఫెక్టివ్‌గా చేయగలగాలి. సప్లయి చెయిన్ సరిగ్గా వుండేట్లు ప్లాన్ చేసుకోగలగాలి. వీటిల్లో ఏది తక్కువైనా లాభం లేదు. సమాజం అవసరాలు నిత్యం మారుతూ వుంటాయి. వాటికి అనుగుణంగా మారుతూ పోవాలి. ఎంట్రప్రెనార్‌కు ఓర్పు వుండాలి, ఓపిక వుండాలి. పరిస్థితులతో రాజీ పడినా కష్టమే, పడకపోయినా కష్టమే.

ఉద్యోగంలో అయితే ఐదేళ్లకు ప్రమోషన్ వస్తుంది, అరవై ఏళ్లకు రిటైర్‌మెంట్ వస్తుంది వంటి లెక్కలుంటాయి. దీనిలో అలాటి లెక్కలు లేవు. ఇరవై ఏళ్లు కష్టపడినా బ్రేక్ ఈవెన్ కాకపోవచ్చు. మనం కష్టపడి ఓ ప్రోడక్ట్ మార్కెట్‌లోకి తెస్తే ప్రభుత్వం రూల్స్ మార్చేసి, దానికి యింపోర్టెడ్ సబ్‌స్టిట్యూట్ మార్కెట్లోకి అనుమతించవచ్చు. జనం ఆ చైనా సరుకే కొనవచ్చు. ఒక్కోప్పుడు మంచీ జరగవచ్చు. మాస్కుల తయారీదారుల గురించి మొన్నటిదాకా అడిగినవాడు లేడు. కరోనా రాగానే ఎంత డిమాండ్ ఏర్పడిందో చూడండి. దేనికైనా సిద్ధపడాలి.

వ్యాపారం అంటే రిస్కు కదా అంటారు మీరు. కానీ ఉద్యోగాలకూ రిస్కు వుందని మర్చిపోకండి. మెర్జర్లు, టేకోవర్‌లు విజృంభిస్తున్న యీ రోజుల్లో మీ కంపెనీ అస్తిత్వమే ప్రశ్నార్థకం కావచ్చు. కంపెనీ ఉన్నా మీ ఉద్యోగం వుండకపోవచ్చు. మీరు మధ్యవయసులో వుండగా, హై బర్న్‌ రేట్ కారణంగా మీ శక్తియుక్తులు హరించుకుపోయాయని, మీకిచ్చే జీతంతో యిద్దరిని వేసుకోవచ్చనే లెక్క వేసి, ఎగ్జిట్ పాలసీలో కంపెనీ మిమ్మల్ని యింటికి పంపవచ్చు. వ్యవసాయం మాట కొస్తే అది ఎటూ రిస్కుతో కూడుకున్నదే.

అందువలన జాబ్ సీకర్‌గా వుండేబదులు జాబ్ ప్రొవైడర్‌గా వుండడం మేలు. అందరూ సంస్థలు పెట్టలేకపోవచ్చు కానీ సెల్ఫ్-ఎంప్లాయిడ్‌గా వుండవచ్చు. ప్రొఫెషనల్‌గా పని చేయవచ్చు. అప్పగించిన పనిని శ్రద్ధగా, నైపుణ్యంతో, టైముకి చేసిపెడితే నేటి ఔట్‌సోర్సింగ్ రోజుల్లో మీకు చేతినిండా పనే! కానీ ఒక హెచ్చరిక. మీకు ఆసక్తి వున్న రంగంలోనే పని ఎంచుకున్నపుడే మీరు రాణిస్తారు. డబ్బులు ఎక్కువ వస్తాయని నైపుణ్యం లేని రంగంలోకి వెళితే కొద్దికాలంలోనే మీకు డిమాండ్ హరించుకు పోతుంది.

చివరగా నేను యిచ్చే సలహా ఏమిటంటే – ఏమి చేసినా సోషల్లీ రెలవెంట్‌గా వుండేవి చేయండి. ఎథికల్‌గా చేయండి. తక్షణ విజయం కోసం అడ్డదారులు తొక్కకండి. నాణ్యత విషయంలో రాజీ పడకండి. చెపితే అదోలా వుంటుంది కానీ మన భారతదేశం నుంచి వెళ్లే ఎగుమతుల విషయంలో బయటివారికి చాలా ఫిర్యాదులున్నాయి. మొదటి కన్‌సైన్‌మెంట్ నాణ్యంగా వుంటుంది. రెండోదానిలో ఆ క్వాలిటీ వుండదు. అంటే మోసం చేయడం ప్రారంభమైందన్నమాట. దానివలన ఆ కంపెనీకే కాదు, దేశానికే చెడ్డపేరు వస్తుంది.

కొన్ని ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీల విషయంలో విదేశాలు వేసిన జరిమానాల సంగతి వినేవుంటారు. అలాటప్పుడు మనం సిగ్గుతో తలవంచుకుంటాం. మనకు కమిట్‌మెంట్ లేదు, కన్విక్షన్ లేదు. వాడెవడో అవినీతి చేసి త్వరగా పైకి వచ్చాడు, మన కెందుకు యీ చాదస్తం అనుకుని తప్పుదోవన పోతాం. చేసిన అక్రమాలకు ఎవరికి ఎప్పుడు శిక్ష పడుతుందో, అసలు పడుతుందో లేదో కూడా చెప్పలేం. మన కంటూ నీతి వుండాలి.

శాంతాలో అనేక విదేశీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయంటే దానికి కారణం – నాణ్యత పట్ల మా నిబద్ధత. అత్యున్నత ప్రమాణాలు. వీటి విషయంలో విత్తనం వేసిన చాన్నాళ్లకు కానీ కాపు త్వరగా రాదు. ఓపికగా వేచి వుండాలి. ఈలోగా నిస్పృహ చెందకూడదు. మన పని మనం చేశాం, ఫలితం ఎప్పుడు వస్తే అప్పుడు రానీ అనుకోవాలి. ఇటువంటి ఆలోచనాధోరణి అలవరచుకుంటే మీరు ఎంత చిన్న పరిశ్రమ పెట్టుకున్నా రాణిస్తారు.

కెఐ వరప్రసాద్ రెడ్డి,
వ్యవస్థాపక చైర్మన్, శాంతా బయోటెక్నిక్స్ లి.