అగ్రరాజ్యాధినేత.. అయితే మాకేంటి.?

'అగ్రరాజ్యాధినేత అయితేనేం, ఆయన పట్ల మాకు వ్యతిరేకత వుంది.. ఆ వ్యతిరేకతను మేం ప్రదర్శించి తీరతాం..'  Advertisement – ఇదీ అగ్రరాజ్యం అమెరికాలో, డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యతిరేకుల తీరు.  కొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా…

'అగ్రరాజ్యాధినేత అయితేనేం, ఆయన పట్ల మాకు వ్యతిరేకత వుంది.. ఆ వ్యతిరేకతను మేం ప్రదర్శించి తీరతాం..' 

– ఇదీ అగ్రరాజ్యం అమెరికాలో, డోనాల్డ్‌ ట్రంప్‌ వ్యతిరేకుల తీరు. 

కొద్ది గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు జరిగాయి. 10 లక్షల మందికి పైనే ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కానున్నారన్నది ఓ అంచనా. అమెరికా అధ్యక్షుడంటే మామూలు విషయం కాదు కదా.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమెరికా అధ్యక్షుడంటే ప్రపంచానికి పెద్దన్న. అందుకే, డోనాల్డ్‌ ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకారోత్సవంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 

అయితే, ట్రంప్‌ వ్యతిరేకులూ పెద్ద సంఖ్యలో ట్రంప్‌ పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వ్యతిరేకంగా పెద్దయెత్తున నిరసనలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు. వీరి సంఖ్య 5 లక్షలకుపైనే వుంటుందన్నది ఓ అంచనా. అధ్యక్ష ఎన్నికల పర్వం ప్రారంభానికి ముందు నుంచీ అమెరికాలో, ట్రంప్‌ పట్ల తీవ్ర వ్యతిరేకత వుంది. చాలా తేలిగ్గానే ట్రంప్‌ ఓడిపోతారనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో విజయం సాధించిన విషయం విదితమే. 

వీధుల్లో ట్రంప్‌ నగ్న విగ్రహాలు, సోషల్‌ మీడియాలో ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రచారం.. అబ్బో, అమెరికా అధ్యక్ష ఎన్నికల పేరు చెప్పి ట్రంప్‌కి వ్యతిరేకంగా ఎంత రచ్చ జరగాలో అంత రచ్చా జరిగింది. ఇప్పటికీ, అమెరికన్లలో కొందరు ట్రంప్‌ని అధ్యక్షుడిగా అంగీకరించలేకపోతున్నారు. అయినాసరే, గెలుపు గెలుపే కదా. అయినా, అదీ ఆషామాషీ గెలుపు కాదు. వ్యతిరేకత ఎలా వున్నా, ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడంతే. 

ఇక, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాలపై ట్రంప్‌ ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నా, దేశాధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుపోతానని చెబుతున్నాడు. వ్యతిరేకుల గురించి మరీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది ఆయన వాదన. మరోపక్క, ట్రంప్‌ వ్యతిరేక నిరసనల కారణంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ చోటు చేసుకోకుండా అమెరికా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏ చిన్న గలాటా చోటు చేసుకున్నా, అమెరికా పరువు పోతుంది మరి.!