తెలంగాణ పాఠ్య పుస్తకంలో నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, తెలంగాణ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కానీ కెసిఆర్ కి థాంక్స్ చెప్పిన వాళ్ళలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఎన్టీఆర్ వారసుల తరఫున నందమూరి రామకృష్ణ ఓ ప్రకటనలో కెసిఆర్ ను పొగడ్తలలో ముంచెత్తారు. కానీ, తెలుగువారి ఆత్మగౌరవం నినాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై తెలుగుదేశం పార్టీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు మాత్రం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చంద్రబాబు నైజం తెలిసిన వారెవరైనా ఆయన నుంచి ఇలాంటి సంస్కారాన్ని ఎదురు చూడడం అత్యాశ అవుతుంది. సాధారణంగా తాను చేయలేని పనిని ఇతరులెవరైనా అమలు చేసి, దానిద్వారా వారికి పేరు వస్తోందంటే, చంద్రబాబు అసలు జీర్ణించుకోలేరు. ఈ విషయం పలు సందర్భాల్లో రుజువైంది.
ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చే విషయమై చంద్రబాబు స్పందించక పోవడానికి మరికొన్ని కారణాలు ఉండవచ్చని తెలుగు తమ్ముళ్లు చెవులుకొరుకుంటున్నారు. ఆ పాఠ్యాంశంలో ఎన్టీఆర్ కు తాను వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ అంశం ప్రస్తావనకు వస్తుందేమోనన్న భయం కారణంగానే చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ.. అమరావతిలో రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడినవారిపై ఉన్న ప్రేమ… అన్నగారు ఎన్టీఆర్ పై చంద్రబాబుకు ఏమాత్రం లేదని నందమూరి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అమరావతిలో రాజధాని కొనసాగించాలని ఏకంగా భార్య భువనేశ్వరితో కలిసి, ధర్నాలో పాల్గొని సంఘీభావం ప్రకటించిన చంద్రబాబుకు… కోట్లాది మంది ఆంధ్రుల ఆరాధ్యదైవమైన ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంపై స్పందించే తీరిక లేదా? అని వారు దుమ్మెత్తిపోస్తున్నారు.
ఎన్టీఆర్ ను విస్మరించడం చంద్రబాబుకు కొత్తేం కాదు… జయంతి, వర్ధంతుల రోజున మాత్రం ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి… నాలుగు మాటలు పొగిడి, చేతులు దులుపుకోవడం చంద్రబాబుకు ఆనవాయితీ. అంతే తప్ప అన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు ఏనాడూ ఆలోచించిన పాపాన పోలేదు.
కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పానని పదేపదే డబ్బా కొట్టుకుంటున్న ఈ ఫార్ర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పెద్ద… తన పరపతిని పలుకుబడిని ఉపయోగించి, ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకు ఇప్పించ లేకపోయారు? అనే ప్రశ్నకు ఆయన గారి దగ్గర సమాధానం దొరకదు.
భారతరత్న మాటేమో కానీ కనీసం పార్లమెంటు ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాకపోవడం ఆయన అలసత్వానికి నిదర్శనం. చివరికి ఈ విషయంలో గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు…దగ్గుబాటి పురంధరేశ్వరి పూనుకుని, ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో ఏర్పాటు చేయించాల్సి వచ్చింది.
స్వయం ప్రకటిత మేధావి అయిన చంద్రబాబు, ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించలేదో ఆయనకే తెలియాలి…ఇవన్నీ ఒక ఎత్తయితే, ఏపీలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలలో ఒకదానికి ఎన్టీఆర్ పేరును పెడతానని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన చంద్రబాబుకు ఏమాత్రం మింగుడు పడటం లేదు. తాను చేయలేకపోయిన పనిని జగన్ చేస్తున్నారని చంద్రబాబు ఈర్ష్యతో రగిలిపోతున్నారు.
ఈ పై ఉదంతాలను చూసిన తర్వాత… అమరావతి పేరుతో వేలాది ఎకరాలు సేకరించి.. రియల్ఎస్టేట్ వ్యాపారం చేయడంలో ఐదేళ్ళ కాలం వృధా చేసిన చంద్రబాబు… ఎన్టీఆర్ ఇమేజ్ ను క్యాష్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చంద్రబాబు ఆలోచనా ధోరణిని చూస్తూ ఉంటే.. అన్నగారు ఎన్టీఆర్ కంటే, అమరావతి ఇమేజ్ నే నమ్ముకోవడం మేలని డిసైడ్ అయినట్లు స్పష్టమవుతోంది. మరి చంద్రబాబు విపరీత ధోరణి పై నందమూరి అభిమానులు రాబోయే రోజుల్లో ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.