ఆంధ్రప్రదేశ్ రాజధాని- కృష్ణమ్మకి చెరోవైపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఖరారైంది. ‘విజయవాడ పక్కనే..’ అని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని ఎక్కడన్న విషయంపై స్పష్టత ఇచ్చేశారు. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండల కేంద్రంగా, మంగళగిరి, అమరావతి గ్రామాల్ని కలుపుతూ…

ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ఖరారైంది. ‘విజయవాడ పక్కనే..’ అని అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజధాని ఎక్కడన్న విషయంపై స్పష్టత ఇచ్చేశారు. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు మండల కేంద్రంగా, మంగళగిరి, అమరావతి గ్రామాల్ని కలుపుతూ మరికొన్ని గ్రామాల్ని చేర్చి ‘అమరావతి’ పేరుతో రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తులు షురూ చేసింది. అతి త్వరలో మాస్టర్ ప్లాన్ రెడీ అయిపోతే, రాజధానికి శంఖుస్థాపన కూడా జరిగిపోతుంది.

ఉత్తరాంధ్రలో వున్న విశాఖను కాదని, రాయలసీమలోని కర్నూలుని కాదని.. గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చేసినట్టు.? భూంకపాలు వచ్చే అవకాశం వుంది.. అని ఎంతమంది ఎన్ని రకాలుగా హెచ్చరించినా ముఖ్యమంత్రి ఆలోచనలు గుంటూరు జిల్లా వైపే ఎందుకు మళ్ళినట్లు.? పచ్చని పంట పొలాల్లో మాత్రమే రాజధాని కట్టాలనే కఠిన నిర్ణయానికి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చినట్టు.? ఇలా సవాలక్ష ప్రశ్నలు గుంటూరు జిల్లాలో రాజధాని అనగానే పుట్టుకొచ్చాయి. రాజధాని జనాలున్న చోట కాకుండా, అడవుల్లో ఎలా కడతాం.? అని తెలివిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. రాజకీయ ప్రత్యర్థుల్ని.

అయితే, గుంటూరు  కృష్ణా జిల్లాలు కవర్ చేసేలా రాజధానిని చంద్రబాబు నిర్మించాలనుకోవడం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ వుంది. అదేమిటంటే, టీడీపీకి వెన్నుదన్నుగా వుండే బలమైన సామాజిక వర్గం.. ఆంధ్రప్రదేశ్ మొత్తమ్మీదకన్నా ఈ రెండు జిల్లాల్లోనే ఆ బలమైన సామాజిక వర్గం సంఖ్యా పరంగా చాలా ఎక్కువగా వుందన్నది కాదనలేని వాస్తవం. ఆ సామాజిక వర్గ నేతలు, పారిశ్రామికవేత్తల ఒత్తిడి ఫలితమే ఎవరేమనుకున్నా గుంటూరు జిల్లాలోనే రాజధాని కట్టాలన్న చంద్రబాబు నిర్ణయానికి కారణం అనే వాదన ఈనాటిది కాదు. సామాజిక వర్గాల లెక్కల సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకెక్కడా లేనంత ‘కనెక్టివిటీ’ కొత్త రాజధానికి ప్రాంతానికి వుంది. ఈ కోణంలోంచి చూస్తే మాత్రం, రాజధానికి ఇంతకన్నా గొప్ప ప్రాంతం మరేదీ లేదన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.

హైద్రాబాద్‌తో పోల్చలేంగానీ, విజయవాడ అభివృద్ధి చెందిన నగరమే. విజయవాడ సమీపంలో విమానాశ్రయం వుంది. విజయవాడలో రైల్వే జంక్షన్ వుంది. రోడ్డు రవాణా జంక్షన్ కూడా. పక్కనే కృష్ణమ్మ గలగలా పారుతుంటుంది. పూర్తిస్థాయి నీటి నిల్వకు అనుకూలంగా వుందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, విజయవాడలోనే కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ వుంది. అంటే ఇక్కడ నీటి సమస్యకు ఆస్కారం తక్కువన్నట్లే కదా. ఇన్ని అనుకూలతలున్నప్పుడు రాజదాని విషయంలో ఇంకో ఆప్షన్ గురించి చంద్రబాబు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అయితే, రాజకీయ వివాదాలు ఎక్కడన్నా సర్వసాధారణమే కదా. అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలోనూ, ఆ రాజకీయాలు కాస్త ఇబ్బంది పెట్టినా, ప్రస్తుతానికి అవన్నీ సద్దుమణిగినట్టే. భూ సమీకరణ దాదాపు పూర్తయ్యింది. చిన్న చిన్న గలాటాలు ఇంకా కొనసాగుతూనే వున్నాయనుకోండి.. అది వేరే విషయం.

రాజధాని రూపురేఖల వెనుక

కొత్తగా రాజధానిని నిర్మించాలనుకున్నప్పుడు అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, రాజధాని అందరికీ అనుకూలమైన.. అనగా అందరికీ దగ్గరగా వున్న ప్రాంతం అయి వుండాలి. ఆ లెక్కన గుంటూరు కన్నా ‘కామన్ పాయింట్’ ఆంధ్రప్రదేశ్‌కి ఇంకేముంటుంది.? పేరుకి గుంటూరు జిల్లా అయినప్పటికీ, రాజధాని విజయవాడ చుట్టూ విస్తరించి వుంటుందని రాజధాని ప్రాధమిక మాస్టర్ ప్లాన్ చెబుతోంది. రాజధాని పరిధిలోకి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి తదితర ప్రాంతాలు వస్తున్నాయి. ఇదంతా ఒకప్పుడు వీజీటీఎం పరిధిలో వున్నదే. విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కూడా పెద్ద పట్టణమే, మంగళగిరి, అమరావతి కూడా గ్రామాలకన్నా ఎక్కువ.. పట్టణాలకన్నా కాస్త తక్కువ. జనసాంద్రకొచ్చేసరికి.. కొత్త రాజధాని నిర్మాణం అంటూ మొదలైతే, జనసాంద్రత విపరీతంగా పెరగాడానికి ఆస్కారం వుంది. 

విజయవాడ నగరం విస్తరించడం, గుంటూరు నగరం కూడా అదే స్థాయిలో విస్తరించడం.. వెరసి రెండు ప్రధాన నగరాలు రాజధాని పరిధిలోకి వచ్చేస్తాయి. రైల్, రోడ్ కనెక్టివిటీతోపాటు, దగ్గరలోనే పోర్టులు కూడా వున్నాయి. ఇవి రాజధానికి అదనపు హంగులుగా పేర్కొనవచ్చు. రింగ్, రేడియల్ రోడ్లతో రాజధాని ప్రాంతాన్ని పోర్టులతో అనుసంధానం చేయడం ఈ రోజుల్లో పెద్ద వ్యవహారమే కాదు. ఇంత రెడీమేడ్‌గా దేశంలో ఇంకేదన్నా ప్రాంతం ఏ రాష్ట్రానికైనా కొత్త రాజధాని కోసం అనుకూలంగా వుందా? అంటే లేదని చెప్పొచ్చేమో.!

రాజధాని నిర్మాణానికి ఖర్చు ఎలా.?

కేంద్రం ఇప్పటికే రాజధానికి సంబందించి 1500 కోట్ల రూపాయల్ని ప్రకటించింది. ఇందులో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు తితర నిర్మాణాలు, మౌళిక సదుపాయాలు వంటి వాటి కోసం ఈ మొత్తానికి కేటాయిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. ఇలాంటి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలకు తప్ప, రేడియల్ రోడ్లు, రింగ్ రోడ్లు, పారిశ్రామిక కారిడిర్లు, పార్కులు వంటివాటికోసం ప్రభుత్వ పరంగా ప్రత్యేక ఖర్చులు వుండకపోవచ్చు. ఇపడంతా ప్రైవేటు సంస్థల చేతుల్లోని పని. ప్రాజెక్టుల్ని నిర్మించి, నిర్వహించి, లాభాల్ని  ఆర్జించడం అనే పద్ధతిలోనే అనేక నిర్మాణాలు జరుగుతున్న దరిమిలా, మౌళిక సదుపాయాలు కల్పిస్తే రాజధాని నిర్మాణం తక్కువ ఖర్చుతో శరవేగంగా పూర్తయిపోవచ్చు. ఇలాంటి వ్యవహారాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిగారిది అందెవేసిన చెయ్యి. అంతా ప్రైవేటు పరం చేసేసి, జనం నెత్తిన పన్నులు రుద్దడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. యూజర్ ఛార్జీల పేరుతో ఖజానా నింపుకోవడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. ఆ లెక్కన రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు.. అని సర్కార్ చెబుతున్నప్పటికీ గట్టిగా 15 నుంచి 25 వేల కోట్ల రూపాయల మధ్య రాజధాని నిర్మాణం అత్యద్భుతంగా పూర్తయిపోవడానికి ఆస్కారముంది. ప్రభుత్వం తాజా లెక్కలు కూడా 20 వేల కోట్లని చెబుతుండడమే ఇందుకు నిదర్శనం.

రాజధాని.. మొదలవ్వాల్సింది అక్కడే

తాత్కాలిక రాజధానిగా విజయవాడ.. అనే ప్రకటన చాన్నాళ్ళ క్రితమే వచ్చినా, ఉద్యోగులెవరూ అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడటంలేదట. ఈ విషయమై రాజకీయ వర్గాల్లో గుసగుసలు, చర్చోపచర్చలు జరిగేసరికి, ఉద్యోగులు కాస్త కలత చెందారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టం విడిపోకూడదని కోరుతూ ఉద్యోగులు చేసిన త్యాగాల్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి వుందని వారు మీడియాకెక్కి వాదించారు. హైద్రాబాద్ విడిచి, విజయవాడకు లేదా కొత్త రాజధానికి వెళ్ళేందుకు తాము సిద్ధంగా వున్నామనీ, అయితే ఈ విషయంలో ప్రభుత్వమే తగిన చొరవ చూపడంలేదన్నది ఉద్యోగుల వాదన. ఉద్యోగులకూ కొన్ని ఇబ్బందులుంటాయి. తగిన సౌకర్యాల్ని ఉద్యోగులకు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడితే, ఈపాటికి ఎపడో చాలావరకు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కి తరలివెళ్ళేవారు. అలా చేసుంటే, ఆటోమేటిగ్గా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో కాకపోయినా తాత్కాలిక రాజధానిలో అయినా అభివృద్ధి పరుగులు పెట్టేదే. ఒక్కో ఉద్యోగి మీదా మినిమమ్ నాలుగైదు కుటుంబాలు ఏదో ఒక రూపంలో ఆధారపడి వుంటాయి. క్యాడర్‌ని బట్టి ఈ కుటుంబాల సంఖ్య పది కావొచ్చు, వంద కావొచ్చు. అలా లెక్కలేసుకుంటే, ఏపీ ఉద్యోగులు హైద్రాబాద్‌లోనే వుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతున్నది అంతా ఇంతా కాదు.

రాజధాని.. కృష్ణానదికి అటూ ఇటూ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కృష్ణా నదికి చెరోవైపు అమరావతి నగరం విస్తరించనుంది. అమరావతి నగరంలో అటు గుంటూరు, ఇటు విజయవాడ.. రెండు పట్టణాలూ అంతర్భాగం కానున్నాయి. తెలంగాణ రాజధాని హైద్రాబాద్ ఎలాగైతే హైద్రాబాద్, సికింద్రాబాద్ నగరాల కలయికో.. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా అంతే. రెండు నగరాల లేదా పట్టణాల కలయికగా అమరావతిని అభివర్ణించవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు బ్రిడ్జ్‌లను కృష్ణా నదిపై నిర్మించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రెండు నదుల మధ్య ప్రయాణానికి వంతెనలు వీలు కల్పిస్తే.. కృష్ణమ్మ రెండు నగరాల్ని ఒక్కటి చేసి, మహా నగరానికి సరికొత్త అందాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ, కృష్ణమ్మలో నీటి ప్రవాహం సంగతేంటి.? అన్న ఆందోళన మాత్రం ఏదో మూల కన్పిస్తోంది. గడచిన పది పదిహేనేళ్ళ లెక్కల్నే తీసుకుంటే, వరదలొచ్చినప్పుడు తప్ప, మిగతా రోజుల్లో అసలు కృష్ణా నది జీవనదిలా కన్పించనే కన్పించదు. విజయవాడ నగర ప్రజల దాహార్తిని తీర్చడమే కృష్ణమ్మకు కనాకష్టమైపోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతి మహానగరంలోని ప్రజల దాహార్తిని కృష్ణమ్మ తీర్చగలదా? అన్న సందేహాలకు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం సమాధానం వెతకాల్సిందే. పొరుగు రాష్ర్టంతో జలవివాదాల పుణ్యమా అని కృష్ణమ్మ భవిష్యత్తేంటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. రాజధాని నిర్మాణం పూర్తయ్యి, కృష్ణమ్మ మరింత ఆక్రమణలకు గురైతేనో.! ఇదీ ఆలోచించాల్సిన విషయమే.

రాజధాని.. అప్పుడు ఇంద్రుడు.. ఇప్పుడు చంద్రుడు

పురాణాల్ని బట్టి చూస్తే అమరావతి నగరాన్ని ఇంద్రుడు పరిపాలించాడట.. ఇపడేమో చంద్రుడు పరిపాలించనున్నాడు. ఇదీ ‘పచ్చ’ మీడియా ఉప్పొంగిపోతూ చంద్రబాబుని మోసేస్తున్న తీరు. అప్పట్లో నిర్మించారట.. అన్నదానికీ, ఇప్పుడు నిర్మిస్తున్నారు.. అన్నదానికీ చాలా తేడాలున్నాయి. ఓ ఫ్లైఓవర్ నిర్మాణానికే సవాలక్ష వివాదాలు. అలాంటిది రాజధాని నిర్మాణం, అది కూడా తీవ్ర ఆర్థిక లోటుతో వున్న రాష్ర్ట రాజధాని నిర్మాణం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. ఓ పక్క కేంద్రం నుంచి అరకొర నిధులు, ఇంకోపక్క చంద్రబాబు సర్కార్ ‘దుబారా’ ఖర్చులు.. వెరసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. విభజనతో ఆంధ్రప్రదేశ్ ఇలా నష్టపోయింది.. అంటూ వివిధ రంగాలకు సంబంధించిన లెక్కలతో ‘శ్వేతపత్రాలు’ విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. అది గతం, ప్రస్తుతంలోకి వచ్చి చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేయాల్సి వుందిప్పుడు. అలా చేస్తే తప్ప, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక దుస్థితి ఏమిటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ తెలియదు. నిధులు రాబట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తగినంత వేగం చూపలేకపోతున్నారు. కేంద్రమేమో అన్నీ చేస్తున్నాం.. అంటూనే వాస్తవాలకు దూరంగా లెక్కలు చెబుతుండడంతోనే ఇబ్బంది వస్తోందంటూ పరోక్షంగా చంద్రబాబు సర్కార్‌పై అసహనం వ్యక్తం చేస్తోంది. ఇక్కడ రాజకీయ కోణాన్నీ కాదనలేం. తమ మిత్రపక్షం తమపై ఒత్తిడిని పెంచితే, దాన్ని ఎలా అణిచేయాలన్న వ్యూహంలో కేంద్రంలోని అదికార పక్షం, ఆంధ్రప్రదేశ్‌ని అధికార పక్షం గురించి రాజకీయ వ్యూహాల్లో నిమగ్నమైపోయింది. ఇక్కడా అధిపత్య పోరు సుస్పష్టం.

రాజధాని అత్యవసరం.!

అవకాశాలున్నాయి.. అడ్డంకులున్నాయి.. వెసులుబాట్లు వున్నాయి.. వివాదాలూ వున్నాయి.. అనుమానాలున్నాయి.. అభ్యంతరాలూ వున్నాయి.. అంచనాలూ వున్నాయి.. ఇలా నాణానికి చెరోవైపు.. అన్నట్టుంది ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పరిస్థితి. పుణ్యకాలంలో తొమ్మిది నెలలు ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ తొమ్మిది నెలలూ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది.? అన్న ప్రశ్నకు సమాధానమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరకని దుస్థితి. ఇది ఆత్మగౌరవ సమస్య. రాజధాని పేరు ప్రకటించి ఊరుకుంటే సరిపోదు, రాజధాని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరగాల్సి వుంది. హీరోషిమా, నాగసాకియా అణు బాంబు విధ్వంసాలనుంచి ఎలాగైతే తేరుకున్నాయో, విభజన విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ అంతకన్నా వేగంగా తేరుకుని, అభివృద్ధి పథం వైపుకు పయనించాల్సి వుంది. ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని, ఎదురుదాడికి వ్యూహరచన చేయడంలోనే సమయమంతా గడిపేసి, బాధ్యతల్ని ప్రభుత్వంలో వున్న రాజకీయ పార్టీ మర్చిపోతే, చరిత్ర క్షమించదు. అనుమానాలకు నివృత్తి కల్పించాలి. అడ్డంకుల్ని అధిగమిస్తామనే భరోసా ఇవ్వాలి. వివాదాలకు ఆస్కారం లేకుండా అభివృద్ధి పథంలో పయనించగలమన్న నమ్మకాల్ని కల్పించాలి.. ఇలా ప్రభుత్వంపై పెద్ద పెద్ద బాధ్యతలు చాలానే వున్నాయి. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలరన్న నమ్మకంతోనే ముఖ్యమంత్రిగా అనుభవజ్ఞుడైన చంద్రబాబుకి అవకాశమిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. ఆ నమ్మకాన్ని వమ్ము చేసేలా వ్యవహరిసే చరిత్ర క్షమించదుగాక క్షమించదు.

సింధు