నింగిలో మరో సంతకం చేసింది 'ఇస్రో'. 'డార్లింగ్ పీఎస్‌ఎల్‌వీ' షరామామూలుగానే మరో విజయాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఖాతాలో వేసింది. మొత్తం 31 ఉపగ్రహాలు నింగిలోకి తీసుకెళ్ళింది పీఎస్‌ఎల్‌వీ రాకెట్. ఇందులో ఒకటి భారత దేశానికి సంబంధించినది కాగా, మిగతావన్నీ విదేశాలకు చెందినవే. అవన్నీ నానో శాటిలైట్లు కావడం గమనార్హం.
సుమారు 160 కోట్ల రూపాయలతో ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. గడచిన యాభై రోజుల్లో ఏకంగా మూడు ప్రయోగాల్ని ఇస్రో చేపట్టి, ప్రపంచ అంతరిక్ష రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. విజయం, ఆ తర్వాత మరో విజయం.. మళ్ళీ మళ్ళీ విజయం.. వెరసి, ఇస్రోకి సక్సెస్‌లు అలా అలవాటైపోయాయంతే. ఇంతలా ఇస్రో విజయాల్ని అలవాటు చేసుకోవడం వెనుక శాస్త్రవేత్తల కృషి, పట్టుదల చాలా చాలా వుందన్నది నిర్వివాదాంశం.
'వందల కోట్లు వెచ్చించి రాకెట్ ప్రయోగాలు చేయడం అవసరమా.?' అని కొంతమంది వెకిలి ప్రశ్నలు వేయొచ్చుగాక. కానీ, ఇస్రో ఖర్చు చేసే ప్రతి పైసాకీ ఫలితం రాబడ్తోంది. అంతే కాదు, కమర్షియల్ శాటిలైట్ల ప్రయోగంతో సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోగలగుతోంది. ఇస్రో వైపు అమెరికా లాంటి దేశాలు కూడా శాటిలైట్ల ప్రయోగంలో 'స్నేహహస్తం' అందిస్తున్నాయంటే.. ఇస్రో ఘనత ఏ స్థాయిలో విశ్వవ్యాపితమయ్యిందో అర్థం చేసుకోవచ్చు.
శాస్త్ర సాంకేతిక రంగంలో ఈ స్థాయిలో అద్భుతాల్ని సాధిస్తున్నామని మురిసిపోయేంతలోనే మన అవివేకం, అజ్ఞానం, నిర్లక్ష్యం.. మనల్ని వెక్కిరిస్తున్నాయి. తెలంగాణలో ఓ చిన్నారి బోరుబావిలో జారిపడిన ఘటన అందర్నీ కలచివేస్తోంది. 'బోరుబావుల్ని తెరిచి వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం..' అని పాలకులు హెచ్చరించడం మామూలే.. బోరుబావుల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడమూ సహజమే. తల్లిదండ్రుల నిర్లక్ష్యం.. ప్రభుత్వాల నిర్లక్ష్యం.. వెరసి, మనల్ని మనమే పాతాళానికి నెట్టేసుకుంటున్నాం.
నింగిలో అద్భుతాలు సాధిస్తున్నాంగానీ, పాతాళానికి పడిపోయిన నిర్లక్ష్యం నుంచి మాత్రం మనం బయటకు రాలేకపోతుండడం అత్యంత బాధాకరమైన విషయం. వందల కోట్లు వేల కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు చేస్తామా.? ప్రాణాలు పోతోంటే, పోతే పోనీ.. అని నిర్లక్ష్యం ప్రదర్శిస్తామా.? పోయేది అభాగ్యుల ప్రాణాలు మరి. అందుకే ఈ నిర్లక్ష్యం.