సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం.. గ్రేహౌండ్స్‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్ చరిత్రలోనే చీకటి రోజు అది. మావోయిస్టుల ఏరివేత క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రేహౌండ్స్ తగిన మూల్యం చెల్లించుకుంది. బలిమెల ప్రాంతంలో, బోటులో గ్రేహౌండ్స్ బలగాలు ప్రయాణిస్తున్న సమయంలో, మావోయిస్టులు వ్యూహాత్మకంగా దాడి జరిపారు. ఎదురుదాడికి అవకాశమే లేకుండా పోయింది.. దాంతో 30 మందికి పైగా గ్రేహౌండ్స్ బలగాలు ప్రాణాలు కోల్పోయాయి. మొత్తం లెక్క 38. ఈ ఘటనతో అసలు గ్రేహౌండ్స్ తిరిగి తన ఉనికిని చాటుకోగలగుతుందా.? అని అంతా షాక్‌కి గురయ్యారు.
అత్యంత హేయమైన దాడి అది. తెలుగునాట అంతటి పెద్ద దాడి అంతకు ముందెన్నడూ జరగలేదు. ఆ తర్వాత కూడా తెలుగు గడ్డ అలాంటి హేయమైన దాడిని ఎరుగదు. మళ్ళీ ఎనిమిదేళ్ళ తర్వాత, దాదాపు అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఈసారి కూడా బలిమెలకు దగ్గర్లోనే దాడి జరిగింది. ఈసారి దాడిలో ప్రాణాలు కోల్పోయింది మావోయిస్టులు. లెక్క 24. ఇప్పుడిక మావోయిస్టులు తిరిగి పుంజుకోగలరా.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
దాడికి ప్రతిదాడి.. కన్నుకి కన్ను… ప్రాణానికి ప్రాణం.. ఇంతేనా.? ఇంకేమీ లేదా.! మనిషి, సాటి మనిషి ప్రాణం తీయడమేనా.? విధి నిర్వహణ.. అంటూ గ్రేహౌండ్స్, నమ్మిన సిద్ధాంతాల కోసమంటూ మావోయిస్టులు.. ప్రాణాలు తీసేయడం ద్వారా ఏం సాధిస్తారట.? ఇదిప్పుడు కొత్తగా పుట్టిన ప్రశ్న కాదు. అనాదిగా అందరి మెదళ్ళనూ తొలిచేస్తోంది. కానీ, జరగాల్సిన నష్టం జరిగిపోతూనే వుంది.
పోన్లే, భూమికి భారం తగ్గుతోంది.. అనుకోవాలా.? మనిషిలో మానవత్వం అనేది మాయమైపోతోందని అనాలా.? సాధారణంగా ఇలాంటి దాడుల్ని చత్తీస్‌ఘడ్‌లో ఎక్కువగా చూస్తుంటాం. పది మందినో, పాతిక మందినో, యాభై మందినో.. ఒకేసారి మట్టుబెట్టేందుకు అటు మావోయిస్టులు, ఇటు భద్రతా బలగాలు వ్యూహాల్ని అమల్లో పెడుతుంటాయి. సాటి మనిషిని చంపేయడానికి ఈ వ్యూహాలేంటి.? అసలు మనం సమాజంలో వున్నామా.? అరాచకం రాజ్యమేలే జనారణ్యంలో వున్నామా.?
ఎవరి ప్రాణం పోయినా అది అత్యంత విలువైనది. అసలంటూ మరణ శిక్షే వుండకూడదన్న డిమాండ్ ఓ పక్క విన్పిస్తోంది. కానీ, ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు చాలా తేలిగ్గా పోతున్నాయి. మనిషిని మనిషి చంపేసుకోవడం ద్వారా ఏం సాధిస్తాడో ఏమో, ఎప్పటికీ ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. 38 మంది పోలీసులు.. అమరులైతే, పోలీసు వ్యవస్థ కుదేలైపోయింది. ఎన్నో కుటుంబాలు రోదించాయి. ఇప్పుడు మావోయిస్టుల కుటుంబాలు రోదిస్తున్నాయి.. అంతే తేడా.
ఎవరి బాధ్యతలు వారివి, ఎవరి సిద్ధాంతాలు వారివి.. ఈ రక్తచరిత్ర అలా అలా కొనసాగుతూనే వుంటుంది.