తెలుగు సినిమాల్లో గత కొన్ని దశాబ్దాల్లో ఒక ట్రెండ్ తో కూడిన సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఒకే తరహా కథ, కథనాలతోనే ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. ఆ సినిమాల్లో కామన్ పాయింట్ ఏమిటంటే.. కమేడియన్ల పాత్రలు వాడబడుతూ ఉంటాయి! ఆ సినిమాల్లోని పాత్రలు కమేడియన్లను తమ స్వార్థం కోసం వాడుకుంటూ ఉంటాయి.
తాము వాడబడుతున్న విషయం ఆ పాత్రలకే తెలియకుండా, వారిని వాడుకోవడం అనే కాన్సెప్ట్ తో తెలుగులో గత దశాబ్దంన్నర సమయంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అదో హిట్ ఫార్ములా. సింపుల్ గా చెప్పాలంటే కొన్ని పాత్రలను బకరాలుగా చూపిస్తూ కథ రాసుకోవడం టాలీవుడ్ లో ట్రెండ్!
సినిమాల బయటకు వస్తే.. వీళ్లను బకరాలు, కమేడియన్లు అనలేం కానీ, వీళ్లందరినీ చంద్రబాబు నాయుడు ఉపయోగించుకుంటున్నారు అనేది మాత్రం జనాభిప్రాయంగా మారుతోంది. వీళ్లంతా చంద్రబాబు ఆటలో అరటిపళ్లు అనేది జనాభిప్రాయంగా వ్యక్తం అవుతోంది. చంద్రబాబుకు ఉపయోగపడటమే తప్ప వీళ్లకు మరో వ్యాపకం కూడా లేకుండా పోయిందనే మాట కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది.
ఒక సబ్బం హరి, మరో రఘురామకృష్ణంరాజు, ఇంకో కన్నా లక్ష్మినారాయణ.. మరో జేసీ దివాకర్ రెడ్డి, ఇంకా చంద్రబాబు టర్మ్ లో తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారు.. చంద్రబాబు చేత వాడబడిన వారు, వాడబడుతున్న వారు అనేది ప్రముఖంగా వినిపిస్తున్న అభిప్రాయం. వాళ్ల లెక్కలు ఏముంటాయో, ఎందుకు వలలో పడతారో కానీ.. అక్కడ నుంచి చంద్రబాబు అనుకూల మీడియా వారిని మనుగమాను ఎక్కించడం మొదలుపెడుతుంది.
జగన్ ను తిడితే చాలు.. వారిని వీరులుశూరులుగా చూపిస్తుంది. అనునిత్యం వారి చేత రన్నింగ్ కామెంట్రీ చెప్పించడం, అవసరం తీరాకా వారిని కూరలో కరివేపాకుల్లా పక్కన పెట్టడం ఇదే కథ!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించాకా.. జగన్ ను ద్వేషించడం, జగన్ ను విమర్శించడం, చంద్రబాబు అనుకూల మీడియాలో ఆటబొమ్మలుగా మారడం తప్ప అంతకు మించి ఏమీ సాధించని వాళ్ల సంఖ్య ఎంతో ఉంది!
జగన్ పార్టీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ లో ఉంటూ ఇష్టానుసారం చెలరేగిన వారు కొందరున్నారు. డీఎల్ రవీంద్రారెడ్డి, మరో వీర శివారెడ్డి, వారితో జత కలిసిన జేసీ దివాకర్ రెడ్డి. వీళ్లతో ఏబీఎన్ ఆర్కే లాంటి వాళ్లు వరస పెట్టి ఇంటర్వ్యూలు చేశారప్పట్లో. ఆ ఇంటర్వ్యూల ఉద్దేశం ఒక్కటే. వైఎస్ ను వారి చేత తిట్టించడం, జగన్ ను దూషింపజేయడం! ఇంకా శంకర్రావు, వీ హనుమంతరావు కూడా ఆ ఆటలో పావులు.
వీరిలో వీహెచ్ వంటి వాళ్లకు వైఎస్ ఇమేజ్ మీద అక్కసు, కాంగ్రెస్ మీద విధేయత అనే అజెండా అయినా ఉంది. అయితే డీఎల్, వీరశివారెడ్డి, జేసీ లాంటి వాళ్లు పచ్చ మీడియాకు ఎక్కి చించుకున్నా.. సాధించింది పెద్దగా ఏమీ లేదు!
డీఎల్ రవీంద్రారెడ్డి జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడి.. చివరకు జగన్ పంచకు చేరక తప్పలేదు! అప్పట్లో డీఎల్ రవీంద్రారెడ్డికి టీడీపీ అనుకూల మీడియా, అందునా ఆంధ్రజ్యోతి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆ ప్రాధాన్యతకు కారణం ఆయన జగన్ మీద ఇష్టానుసారం మాట్లాడతారనే!
పదేళ్ల తర్వాత తరచి చూస్తే.. ఇప్పుడు డీఎల్ ఎక్కడున్నారనేది ప్రజలకు పట్టని అంశం. పచ్చమీడియా మాత్రం ఆయనను ఒక పావులా కొన్నాళ్లు వాడుకుంది. వీరశివారెడ్డి కూడా అదే బాపతే. శంకర్రావు కూడా అలాంటి పేకముక్కే అయ్యారు. శంకర్రావు లెటర్ ను ఉపయోగించుకునే జగన్ మీద కేసులు పెట్టారు. ఆ కేసుల వల్ల టీడీపీ ఒక సారి లబ్ధి పొందింది. శంకర్రావు ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు!
అదీ వరస. టీడీపీ అధినేత చంద్రబాబు ఆటలో, పచ్చమీడియా ఆడే పేకలో ఎన్నో ముక్కలు. టీడీపీ వర్గాల లక్ ఏమిటంటే.. వాళ్లకు వాడుకోవడానికి ఎప్పుడూ ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. తమ అజెండాను, తమ మాటలను వారి చేత పలికిస్తారు. తమ ఉద్దేశాలను వారి ఉద్దేశాలుగా చెప్పిస్తారు. వాటిని చిలువలుపలువలుగా చేసి ప్రచురిస్తారు. తీరా అవసరం తీరాకా వారిని విసిరి కొట్టడం కూడా వీరికి పెద్ద కష్టం ఏమీ కాదు.
ఫిరాయింపుదారులతో కొన్నాళ్లు బండి లాగించారు. 2014 ముందు వరకూ కాంగ్రెస్ నేతలే టీడీపీ పాలిట బకరాలు. జగన్ ను తిట్టే కాంగ్రెస్ నేతలకు ముందు పేజీలో చోటిచ్చింది పచ్చమీడియా. 2014 తర్వాత కాంగ్రెస్ అవసరం లేకపోయింది.
అందుకే వారిని పక్కన పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు కొని తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో ఆట మొదలుపెట్టారు. వారికి తోడు జేసీ దివాకర్ రెడ్డి తోడయ్యారు. వారు జగన్ పై అనుచితంగా మాట్లాడుతూ ఉంటే చంద్రబాబుకు సమ్మగా అనిపించింది.
అంతకు ముందు కాంగ్రెస్ నేతలను వాడుకున్నట్టుగా.. తర్వాతి ఐదేళ్లతో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు కొందరిని బకరాలుగా వాడుకోవాలని చంద్రబాబు నాయుడు ప్లానేశారు. అయితే ఈ ప్లాన్ వికటించింది. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద ప్రయోగించడానికి చంద్రబాబు వాడిన వాళ్లంతా ఎన్నికల్లో చిత్తయ్యారు.
జేసీ దివాకర్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ.. ఇలాంటి రాయలసీమ రెడ్లకు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇచ్చిన ప్రాధాన్యత కేవలం జగన్ ను వారు తిడితే ఆయన ఓటు బ్యాంకు దెబ్బతింటుందనే లెక్కలతో తప్ప వారంటే ఆయనకు ఎలాంటి మమకారమూ లేదు! అందుకు నిదర్శనం ఇప్పుడు వాళ్లను చంద్రబాబు నాయుడు పూర్తిగా పక్కన పెట్టడమే!
23 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ, ముగ్గురు ఫిరాయింపు ఎంపీలకూ, నాడు జగన్ పై దుమ్మెత్తి పోసిన రెడ్డి, మైనారిటీ, దళిత నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో గమనిస్తే.. అసలు కథ అర్థం అవుతుంది. అప్పుడు జగన్ ను తిట్టించడానికి వారు ఉపయోగపడతారని వారిని దగ్గరకు తీసుకున్నారు. జనాలు వారిని ఓడించే సరికి, వారిని చంద్రబాబు కూడా పక్కన పడేశారు. ఇదీ గేమ్!
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలు జగన్ తీరును విమర్శిస్తే.. పచ్చమీడియా ఆ పలుకులను పతాక శీర్షికలకు ఎక్కించింది. ఇప్పుడు వారమైపోయారో కూడా పచ్చమీడియాకు పట్టడం లేదు!
జగన్ పార్టీ పెట్టిన తొలి ఐదేళ్లలో కాంగ్రెస్ నేతలందరినీ జాయింటుగా వాడేశారు, పిప్పిగా మిగిలాకా వారిని పక్కన పెట్టారు, ఆ తర్వాతి ఐదేళ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన వారిని వాడారు, ఆ పిప్పి ఇప్పుడు ఎందుకూ పనికిరాదని పడేశారు, ఇప్పుడు తటస్థులు అంటూ కొంతమందిని తెరపైకి తెచ్చారు.
సబ్బం హరిని ధిగ్గజ విశ్లేషకుడు అంటూ ఆయనను మునగమాను ఎక్కించారు. ఒక్కో కొమ్మా విరిగిపడుతూ ఉంది. ఇక రఘురామకృష్ణంరాజు ఏ లక్ష్యంతో ఆ రాజకీయం చేస్తున్నారో ఎవరికీ అంతుబట్టదు. ఆయన తీరును గమనించాకా.. రేపు ఏ బీజేపీనో కూడా ఆయనను నమ్మి కండువా వేస్తుందా? చంద్రబాబు నాయుడు అయినా ఆయనను చేర్చుకుని టికెట్ ఇస్తారా? వాటితో టీడీపీకి అవసరం లేదు.
ప్రస్తుతానికి జగన్ పై ప్రేలాపనకు ఆయన ఉపయోగపడుతున్నారు. ఆయన అలిసిపోనంత వరకూ పచ్చమీడియాలో ప్రాధాన్యతకు అయితే లోటు ఉండదు. ఆ తర్వాత సంగతేమిటో.. ఒకప్పుడు ఇలాగే చెలరేగిన కాంగ్రెస్ పొలిటీషియన్ల ఉదాహరణలను గమనిస్తే అర్థం అవుతుంది.
గమనించాల్సిన అంశం ఏమిటంటే..చంద్రబాబు వాడకానికి అస్త్రాలు కూడా తగ్గిపోతున్నాయి. కన్నా లక్ష్మినారాయణను ఏపీ విభాగం అధ్యక్ష స్థానం నుంచి తప్పించాకా.. బీజేపీ వైపు నుంచి సహకరం తగ్గింది. పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో వాడకానికి అందుబాటులో లేడు. ఆయన సినిమాల వైపు వెళ్లడంతో రాజకీయంగా ఆయన విశ్వసనీయత మైనస్ ల స్థాయిలోకి పడిపోయింది.
ఈ నేపథ్యంలో పవన్ తో కూడా ఉపయోగం లేకుండా పోతోంది. కాంగ్రెస్ నేతలు కూడా ఊసులో లేరు. బీజేపీలో ఎవరైనా ఉపయోగపడుతుంటే వారిని ఆ పార్టీ సస్పెండ్ చేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్లతోనే రోజూ రచ్చలు చేపించి, తమ పాత రొచ్చు వ్యూహాలనే చంద్రబాబు నమ్ముకున్నారు.
మరి చంద్రబాబు చేత ఇప్పుడు వాడబడుతున్న వారి పరిస్థితి గతంలో ఆయన వాడి, విసిరేసిన వారి పరిస్థితి లాగానే ఉంటుందని తేటతెల్లం అవుతోందని మాత్రం చెప్పకతప్పదు.