భర్త మంతనాలు…భార్య ప్రయత్నాలు..!

తమిళనాడులో ఓ పక్క జల్లికట్టు ఉద్యమం ఇంకా సాగుతుండగానే మరోపక్క అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేందుకు యమ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె భర్త నటరాజన్‌ కూడా తీవ్ర ప్రయత్నాలు…

తమిళనాడులో ఓ పక్క జల్లికట్టు ఉద్యమం ఇంకా సాగుతుండగానే మరోపక్క అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేందుకు యమ ఆరాటపడుతున్నారు. ఇందుకోసం ఆమె భర్త నటరాజన్‌ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జల్లికట్టుపై సుప్రీం కోర్టు పూర్తిగా నిషేధం ఎత్తేయనప్పటికీ ఈసారికి ఈ క్రీడ నిర్వహించుకోవడానికి సానుకూల వైఖరి వ్యక్తం చేసి తీర్పును వాయిదా వేయడంతో,  రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించడంతో ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం 'పరపతి' కొద్దిగా పెరిగింది. జనాల్లో ఆయనపట్ల సానుకూలత ఏర్పడిందని ఒకటి రెండు టీవీ ఛానెళ్ల సమాచారం. ఈ ఆర్డినెన్స్‌ కనుక చట్టమైతే పన్నీరుశెల్వం ఇమేజ్‌  అమాంతం పెరగడం తథ్యం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లోనే చట్టం చేస్తామని పన్నీరుశెల్వం వాగ్దానం చేశారు. అందులోనూ పన్నీరుపట్ల కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు కనబడుతోంది. ఈ నేపథ్యంలో శశికళ, ఆమె భర్త ముఖ్యమంత్రి పీఠం స్వాధీనం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జనవరి 29లోగా సీఎం కుర్చీ ఎక్కాలని శశికళ లక్ష్యంగా పెట్టుకున్నారని ఓ ఆంగ్ల పత్రిక సమాచారం.

శశికళకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ విపరీతంగా ఉన్నా దాని వెనకే నిరాశ కూడా ఉంది. ఇందుకు కారణం సుప్రీం కోర్టులో ఉన్న అక్రమాస్తుల కేసు. ఈ కేసులో తుది తీర్పు రావల్సివుంది. ఆ తీర్పు ఏవిధంగా వస్తుందో తెలియదు కదా. దీంతో శశికళ, ఆమె భర్త నటరాజన్‌ టెన్షన్‌ పడిపోతున్నారు. పొంగల్‌ కంటే ముందే ఢిల్లీ వెళ్లిన నటరాజన్‌ అక్కడ కాంగ్రెసు నాయకులను, ప్రముఖ న్యాయవాదులను కలుసుకుంటూ అక్రమాస్తుల కేసుపై మంతనాలు చేస్తున్నారు. ఈ కేసును ఎలా డీల్‌ చేయాలనే విషయంలో ఆయన చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెసు నాయకుల్లో కపిల్‌ సిబాల్‌, అభిషేక్‌ సింఘ్వీ పేరు మోసిన సుప్రీం కోర్టు న్యాయవాదులు. నటరాజన్‌ వారితో చర్చలు జరిపారు. మరి కాంగ్రెసు నాయకులు లేదా న్యాయవాదులు ఈ కేసులో ఎలా సాయం చేస్తారో చూడాలి. ఇక శశికళ, నటరాజన్‌ దంపతులకు బీజేపీ సిద్ధాంతకర్త, ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ కమ్‌ జర్నలిస్టు అయిన ఎస్‌.గురుమూర్తి పక్కలో బల్లెంలా తయారయ్యారు. ఆయన అన్నాడీఎంకే చీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 

తమిళనాడులో 'తుగ్లక్‌' అనే రాజకీయ పత్రిక చాలా పాపులర్‌. సినిమా నటుడు కూడా అయిన చో రామస్వామి ఈ పత్రిక వ్యవస్థాపకుడు. దివంగత జయలలితకు ఈయన అత్యంత సన్నిహితుడు, శ్రేయోభిలాషి. జయ కన్నుమూసిన కొన్ని రోజులకే ఈయన మరణించారు. ఇప్పుడు తుగ్లక్‌ పత్రికకు గురుమూర్తి సంపాదకుడయ్యారు. ఆయన శశికళపై తీవ్ర విమర్శలు చేస్తూ చీల్చిచెండాడుతున్నారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు మద్దతు ఇస్తున్నారని సమాచారం. శశికళపై వ్యతిరేకత కూడగట్టడంలో గురుమూర్తి బిజీగా ఉన్నారు. అన్నాడీఎంకేలో ఎక్కువమంది ఎమ్మెల్యేలు, మంత్రులు శశికళ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆమె విధేయులందరూ  చిన్నమ్మ ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు. వీరి భక్తిప్రపత్తుల్లో ఇదొక భాగం.

ఇదివరకు జయలలిత ఫోటో పెట్టుకొని తిరిగారు. ఇక్కడొక విశేషం చెప్పుకోవాలి. మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో సాధారణంగా ముఖ్యమంత్రి ఫొటో ఉంటుంది. కాని తమిళనాడులో శశికళ ఫొటోలు పెట్టారు. పన్నీరు శెల్వం ఫొటోలు ఎక్కడా కనబడటంలేదు. ఆయన్ని ముఖ్యమంత్రిగా అంగీకరించడంలేదనడానికి ఇదో నిదర్శనం. జ్యోతిష్యులు శశికళకు ఇప్పటివరకు మూడు తేదీలు చెప్పారు. వారు చెప్పిన వాటిల్లో రెండు తేదీలు గడిచిపోయాయి. మరో తేదీ జనవరి 26. అది కూడా అయ్యేటట్లు కనబడటంలేదు. ఇప్పుడేమో 29లోగా సీఎం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక జల్లికట్టుకు అనుమతి రావడం తన ఘనతేనని శశికళ చెప్పుకుంటున్నారు. జల్లికట్టుకు అనుమతి సాధించాలని తాను పార్టీని, ప్రభుత్వాన్ని ఆదేశించిన తరువాతే కదలిక వచ్చి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెప్పారు. చిన్నమ్మ ఆశిస్తున్నట్లు నెలాఖరులో అద్భుతం జరుగుతుందా?