భ‌య‌పెడుతున్న బెజ‌వాడ‌…

ఒక‌ప్పుడు రౌడీయిజంతోనో, మ‌రికొన్నాళ్లు కుల పోరాటాలతోనో… భ‌య‌పెట్టిన‌ట్టు కాదు. ఇప్పుడు ఒక‌నాటి బెజ‌వాడ నేటి విజ‌య‌వాడ‌… అద్దెల‌తో సామాన్యుల‌ను భ‌య‌పెడుతోంది. మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబీకుల‌ను ద‌రిదాపుల‌కు కూడా రాకుండా బెదిరిస్తోంది. మండే ఎండ‌ల‌కు మాత్రమే ఒక‌ప్పుడు…

ఒక‌ప్పుడు రౌడీయిజంతోనో, మ‌రికొన్నాళ్లు కుల పోరాటాలతోనో… భ‌య‌పెట్టిన‌ట్టు కాదు. ఇప్పుడు ఒక‌నాటి బెజ‌వాడ నేటి విజ‌య‌వాడ‌… అద్దెల‌తో సామాన్యుల‌ను భ‌య‌పెడుతోంది. మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబీకుల‌ను ద‌రిదాపుల‌కు కూడా రాకుండా బెదిరిస్తోంది. మండే ఎండ‌ల‌కు మాత్రమే ఒక‌ప్పుడు కేరాఫ్‌గా ఉన్న ఈ కోస్తా న‌గ‌రం ఎపి రాజ‌ధాని ప్రక‌ట‌న‌ పుణ్యమా అని ఖ‌రీదైన వాళ్లు మాత్రమే ఉండే ప్రాంతానికి చిరునామాగా మారిపోనుంది.

స‌రిగ్గా ఏడాది క్రితం విజ‌య‌వాడ భ‌వానీపురంలో రూ.5-6వేలు పెడితే న‌లుగురు పిల్లలున్నకుటుంబం హ్యపీగా నివసించేందుకు వీలైన డ‌బుల్ బెడ్‌రూమ్ ఇల్లు అద్దెకు దొరికేది. ఇప్పుడు అదే ఇల్లు కావాలంటే క‌నీసం రూ.10 నుంచి 15వేలు చెల్లించాల్సిందే. స‌మీపంలో ఉన్న విద్యాధ‌ర‌పురం దూరంగా ఉన్న అజిత్ సింగ్‌న‌గ‌ర్‌, స‌త్యనారాయ‌ణ‌పురం, మాచ‌వ‌రం, కృష్ణలంక‌… వంటి ఏరియాల్లో అద్దెలు కూడా అక‌స్మాత్తుగా కొండెక్కాయి. చాలా కాలం నుంచీ ఈ ప్రాంతాల‌న్నీ స‌గ‌టు, మ‌ధ్య త‌ర‌గ‌తివారికి అందుబాటులో అద్దె ఇల్లు అందించేవి కావ‌డం ఇక్కడ గ‌మ‌నార్హం. 

ఇక ఎప్పటి నుంచో ఖ‌రీదైన ప్రాంతాల‌కు పేరుప‌డ్డ బంద‌రు రోడ్డు, ముత్యాలంపాడు, మొగ‌ల్రాజ‌పురం, గ‌వ‌ర్నర్‌పేట‌, సూర్యారావుపేట‌, ల‌బ్బీపేట‌, ప‌ట‌మ‌ట‌, క‌రెన్సీన‌గ‌ర్‌… వంటివైతే చెప్పనే అక్కర్లేదు. పూర్తి స్థాయి వ‌స‌తులతో అల‌రారే త్రిబుల్ బెడ్‌రూం త‌ర‌హా ఇళ్లయితే ఇక రూ.25వేల పైమాటే. స‌రే… సిటీకి ద‌గ్గర‌లో కాకుండా కాస్త దూరంగా అయినా స‌ర్ధుకుందాంలే అనుకుని తాడేప‌ల్లి, సీతాన‌గ‌రం, మంగ‌ళ‌గిరి, వ‌డ్దేశ్వరం వ‌గైరా ప్రాంతాల‌కు వెళ‌దామ‌న్నా… అవి కూడా ఏమీ త‌క్కువ తిన‌లేదు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లోనూ డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు రూ.5 వేల నుంచి మొద‌లై రూ.8వేల వ‌ర‌కూ అద్దె ప‌లుకుతున్నాయి. 

స‌రిగ్గా ఏడాది, రెండేళ్ల క్రితం… ఈ ఏరియాల్లో నిరుపేద‌లు, దిగువ మ‌ధ్యత‌ర‌గ‌తి వాళ్లూ కేవ‌లం రూ.1500 నుంచి రూ.3000 పెడితే మంచి ఇల్లు అద్దెకు దొరికేది. ఈ ప‌రిస్థితి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు త‌ర‌ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్న ఎపి ఉద్యోగుల‌తో పాటు హైద‌రాబాద్‌లో చిరుద్యోగాలతో స‌త‌మ‌త‌మ‌వుతూ, రాజ‌ధాని రాబోతుంది క‌దా భ‌విష్యత్తు బాగుంటుంద‌ని విజ‌య‌వాడ వెళ్లిపోదాం అని ఆలోచిస్తున్న సెటిల‌ర్స్‌కు శ‌రాఘాత‌మ‌వుతోంది. 

విజ‌య‌వాడ‌లో నెల‌కొన్న మ‌రో విచిత్రమైన ప‌రిస్థితి ఏమిటంటే… అటు అద్దెలు విప‌రీతంగా పెరిగినా,,, టులెట్ బోర్డులు పుష్కలంగా వేలాడుతూనే క‌నిపిస్తున్నాయి. ఓవైపు రాజ‌ధాని ప్రక‌ట‌న‌, మ‌రోవైపు ఆంధ్ర ప్రాంతీయులు పెద్ద యెత్తున వ‌ల‌స‌వ‌చ్చేస్తార‌నే ఆలోచ‌న‌, ఎపి ఉద్యోగులు త్వర‌లో రానుండ‌డం, స్వయంగా ప్రభుత్వం సైతం అద్దె భ‌వ‌నాల కోసం అన్వేషిస్తుండ‌డం… వీట‌న్నిటి నేప‌ధ్యంలో  రాబోయే డిమాండ్‌ను అతిగా ఊహించేసుకుంటూ  నెల‌ల త‌ర‌బ‌డి ఖాళీగా ఉంచుకోవ‌డానికైనా ఇష్టప‌డుతున్న ఇళ్ల య‌జ‌మానులు అద్దెలు మాత్రం త‌గ్గించేది లేదంటున్నారు. దీంతో నిన్నా మొన్నటి దాకా అన్ని వ‌ర్గాల‌ను స‌మానంగా అక్కున చేర్చుకున్న ఈ దుర్గమ్మ నెల‌వు… ఇప్పుడు డ‌బ్బున్న మారాజుల కొలువుగా మారిపోయే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.

రూ. కోటి విలువ చేసే స్థలం అమాంతం రూ.12 కోట్లయిపోవ‌డం లాంటివి సామాన్యుల‌కు ఎంత వ‌ర‌కూ న‌ష్టం క‌ల‌గ‌జేస్తాయో చెప్పలేం కానీ… అద్దెలు ఇలా ఇష్టారాజ్యంగా, అదీ అక‌స్మాత్తుగా పెరిగిపోవ‌డం మాత్రం స‌గ‌టు జీవితాన్ని అత‌లాకుత‌లం చేసేదే. సామాన్యుడికి త‌ల‌దాచుకునే స్థలం కూడా దొర‌క‌క‌పోవ‌డ‌మే న‌గ‌రానికి వ‌చ్చేసిన  రాజ‌ధాని క‌ళ అని నేత‌లు భావిస్తే… అంత‌క‌న్నా దౌర్భాగ్యం మ‌రొక‌టి ఉండ‌దు.

-ఎస్బీ