పత్రికల్లో వార్తలొస్తే సహించలేకపోతున్నారు.. సోషల్ మీడియాలో విమర్శలు వస్తే అసహనం కోల్పోతున్నారు.. అయినా, భావ ప్రకటనా స్వేచ్ఛకు అమితమైన గౌరవం ఇస్తున్నామంటున్నారు. ఇదెలా సాధ్యం.?
తెలంగాణలో కొన్నాళ్ళ క్రితం రెండు మీడియా సంస్థలపై 'గులాబీ ప్రభుత్వం' కక్షగట్టేసింది. అసెంబ్లీ సాక్షిగా అసహనం వ్యక్తం చేసింది. మీడియా అన్నాక, ఒక్కోసారి పొరపాట్లు జరగొచ్చుగాక. మీడియా నుంచి పనిగట్టుకుని విమర్శలు దూసుకురావొచ్చుగాక. పరిధి దాటి మీడియా వ్యవహరించొచ్చుగాక. అలాంటి సందర్భాల్లో, మీడియాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి అనేక వేదికలున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం అనధికారిక బ్యాన్‌ని విధించింది. అప్పట్లో, తెలుగుదేశం పార్టీ ఇలా మీడియాపై ప్రభుత్వ అసహనాన్ని ప్రశ్నించింది. ఆందోళనలు చేసింది కూడా.!
కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఓ సీనియర్ జర్నలిస్ట్, తాను పనిచేస్తోన్న మీడియా సంస్థ నుంచి బలవంతంగా వైదొలగాల్సి వచ్చింది.. అధికార తెలుగుదేశం పార్టీ ఒత్తిడి కారణంగా అఫ్‌కోర్స్, టీడీపీ సర్కార్ కన్నెర్రజేసినంతమాత్రాన ఆయన తన వృత్తికి దూరమవలేదనుకోండి.. అది వేరే విషయం. ఇప్పుడూ ఆయన, తెలుగుదేశం ప్రభుత్వ ఆగడాల్ని ప్రశ్నిస్తూనే వున్నారు.
ప్రశ్నించేవారే లేకపోతే, ప్రభుత్వాలు అందించేది పరిపాలన కాదు. అసలు ప్రశ్నించేవారు లేకపోతే, ప్రజాస్వామ్యానికి అర్థమే వుండదు. పార్టీ ఫిరాయింపులతో విపక్షాల్ని నిర్వీర్యం చేస్తున్నప్పుడు, ఆ విపక్షాల బాధ్యత మీడియా తన భుజానికెత్తుకోవడం సహజం. మీడియానీ తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చాలక, సోషల్ మీడియాని కట్టడి చేసేందుకు చంద్రబాబు సర్కార్ ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు.
పైగా, 'మాకు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద చాలా గౌరవం..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది చంద్రబాబు ప్రభుత్వం. భావ ప్రకటనా స్వేచ్ఛ మీద గౌరవం.. అంటే, సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు వచ్చినప్పుడు, వాటికి కారణమైనవారిపై చర్యలు తీసుకోవడానికి మార్గాల్ని అన్వేషించడం కాదనే విషయం పాలకులకు ఎప్పుడర్థమవుతుంది.?
మీడియా సంస్థల్లో అయినా, సోషల్ మీడియాలో అయినా.. అసత్య వార్తలు, కథనాలు వస్తే ఆటోమేటిక్‌గా వాటి విశ్వసనీయత పడిపోతుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. పైగా, మీడియాని వాడుకోవడాన్ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ. సోషల్ మీడియా ఈ రోజు ఇంతలా వెర్రితలలు వేస్తోందంటే, ఆ పాపంలో టీడీపీకి సైతం చాలా భాగముంది. అప్పుడు, తమకు వెన్నుదన్నుగా నిలిచిన సోషల్ మీడియా, ఈ రోజు వెక్కిరిస్తుండడంతోనే ఈ అసహనం. అధికారం వుంది కాబట్టి, అసహనంతో చెలరేగిపోతున్నారు.. అధికారం ఊడిన రోజు అసహనానికి అర్థమేమన్నా వుంటుందా.? ఆ అసహనమే, రాజకీయ అహంకారాన్ని తగలబెట్టేస్తుందనే విషయం ఎప్పుడర్థమవుతుందో ఏమో.!