సినిమా రంగంలోనూ అద్భుతాలు జరుగుతుంటాయి. కొంతకాలంపాటు ఆ అద్భుతాన్ని గురించే జనం, సినిమా పరిశ్రమవారు చర్చించుకుంటారు. పత్రికల్లో, టీవీ ఛానెళ్లలో ఎడతెగని చర్చలు జరుగుతుంటాయి. మొన్నటివరకు బాహుబలి గురించి ఎంత చర్చ జరిగిందో, ఎన్ని ప్రశంసలు కురిశాయో, ఎంతమంది మెచ్చుకున్నారో చూశాం. అది వందల కోట్ల భారీ బడ్జెటు చిత్రం.
అంత బడ్జెటుతో నిర్మించిన చిత్రం కాకపోయినా ఆ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'మహానటి' చిత్రం. ఎక్కడా చూసినా దీని మీదనే చర్చ. ఏ సమీక్ష చదివినా, ఎవరూ రివ్యూ రాసినా 'అద్భుతం' అనే మాట తప్ప మరోటి లేదు. చివరకు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.
తాజాగా టీడీపీ అంతర్గత సమావేశంలో సైతం మహానటిపై చర్చ జరిగింది. దీన్ని గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాయకులు మాట్లాడుకున్నారు. సినిమా బాగుందని తనకు చాలామంది చెప్పారని, మీ అభిప్రాయం ఏమిటని నేతలను అడగ్గా చాలా బాగుందని కొందరన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కూడా ఆ స్థాయిలో చాలా బాగుండాలని బాబు వ్యాఖ్యానించారు. నాగ్ అశ్విన్ రేంజ్ ఏ స్థాయికి పెరిగిపోయిందో చెప్పడం కష్టం. అతను ఎంత టాప్‌కి వెళ్లాడంటే తరువాత సినిమా తీయడానికి అతనే భయపడేంత పేరు వచ్చేసింది.
ఇతను మరో సినిమా తీస్తున్నాడంటే జనం అంచనాలు ఎక్కడో ఉంటాయి. ఆ అంచనాలను అందుకోగలగేలా నాగ్ అశ్విన్ కృషి చేయాల్సివుంటుంది. పలువురు సినిమా క్రిటిక్స్ బయోపిక్కు నాగ్ అశ్విన్ ఒక సిలబస్ తయారుచేసి పెట్టేశాడని, కొన్ని ప్రమాణాలు నెలకొల్పాడని, బయోపిక్‌లు తీయాలనుకునేవారు ఈ ప్రమాణాలను విస్మరించే పరిస్థితి లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బయోపిక్‌లు తీయాలని ఉరకులు పెడుతున్నవారంతా నిలబడి ఆలోచించుకోవాలి. కొంతకాలం క్రితం తెలుగు చిత్రసీమలో బయోపిక్‌ల హడావిడి బాగా నడిచింది. చర్చోపచర్చలు సాగాయి. నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నానని చెప్పగానే, ఎన్టీఆర్ జీవితం ఆధారంగా బయోపిక్‌లు నిర్మిస్తామంటూ కొందరు మీడియాలో పెద్ద దుమారం లేవదీశారు.
వివాదాలు లేవదీయడంలో రామ్‌గోపాల్ వర్మ ముందు ఉంటాడు కదా. ఆయన వెంటనే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అంటూ ఓ బయోపిక్‌ను ప్రకటించడమే కాకుండా ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశాడు. అందులో ఎన్టీఆర్ ఇంట్లో కూర్చునివుంటే, ఓ మహిళ అంటే లక్ష్మీపార్వతి ఇంటి లోపలికి అడుగుపెడుతూ ఉంటుంది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి షూటింగ్ ప్రారంభిస్తానన్నాడు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించినప్పటినుంచి మరణం వరకు తన సినిమా ఉంటుందని చెప్పాడు.
సహజంగానే ఈ సినిమాపై పెద్ద వివాదం రేగింది. ఆర్జీవి తన అనుమతి తీసుకోలేదని లక్ష్మీపార్వతి ఆరోపించడం, అనుమతి అక్కర్లేదని రామ్‌గోపాల్ వర్మ జవాబివ్వడం, దీంతో టీవీ ఛానెళ్లలో చర్చలు జరగడం… ఇదంతా పెద్ద కథ. గతంలో కొన్ని సినిమాలు తీసిన కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అనే దర్శక నిర్మాత 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే సినిమా తీస్తానన్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాల ప్రోగ్రెస్ ఏమిటో తెలియదు. ఎవ్వరేమీ మాట్లాడటంలేదు.
బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటించే బయోపిక్ 'ఎన్టీఆర్'కు ఆదిలోనే హంసపాదు పడి ఝలక్ ఇచ్చింది. తనవల్ల కాదని డైరెక్టర్ తేజ తప్పుకున్నాడు. రాఘవేంద్రరావు తనకు కుదరన్నారు. ఇక తానే దర్శకత్వం చేయాలని బాలయ్య నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి. సినిమా ప్రారంభం అట్టహాసంగా జరిగినా ఇది ఎంతవరకు ముందుకు సాగుతుందో తెలియదు. ఈ బయోపిక్ తీయడం ఆషామాషీ కాదు.
ఇక దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై బయోపిక్ మొదలైనట్లు వార్తలు, పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి పోషిస్తున్నారు. ఆమధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బయోపిక్ తీస్తున్నట్లు వార్తలొచ్చాయి. తరువాత దాని ఊసే లేదు. ఎన్టీఆర్ బయోపిక్ తమిళులకు స్ఫూర్తి కలిగించినట్లుంది అక్కడ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌పై సినిమా తీయబోతున్నారు. ఈ సినిమాకు బాలకృష్ణన్ దర్శకుడు. ఎంజీఆర్ పాత్రను ప్రముఖ నటుడు సత్యరాజ్ పోషిస్తారని అనుకుంటున్నారు. వీటిల్లో ఎన్ని సినిమాలు జనం ముందుకు వస్తాయో మరి!