బ్లడ్‌.. బ్లడీ పాలిటిక్స్‌.!

'ఈ ఒక్క విషయంలో నరేంద్రమోడీని అభినందిస్తున్నా..'  Advertisement – పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలివి.  'భారత సైన్యం రక్తం చిందిస్తోంది.. ఆ…

'ఈ ఒక్క విషయంలో నరేంద్రమోడీని అభినందిస్తున్నా..' 

– పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌పై భారత సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలివి. 

'భారత సైన్యం రక్తం చిందిస్తోంది.. ఆ రక్తం వెనుక నరేంద్రమోడీ ప్రభుత్వం దాక్కుంది.. సర్జికల్‌ స్ట్రైక్స్‌తో రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోంది..' 

– తాజాగా రాహుల్‌ గాంధీ ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాందీ చేసిన వ్యాఖ్యలివి. 

మొన్నటికి మొన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీకి సెల్యూట్‌ చేస్తూనే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగాయనడానికి తగిన సాక్ష్యాలు చూపించాలని డిమాండ్‌ చేయడం ద్వారా సైన్యాన్ని తీవ్రంగా అవమానించారు. దాంతో, పాకిస్తాన్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ రాత్రికి రాత్రి హీరో అయిపోయారు. అక్కడి మీడియాలో కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై బీభత్సమైన చర్చ జరిగింది. నరేంద్రమోడీని, భారతదేశాన్ని ఎండగడుతూ పాకిస్తాన్‌ మీడియా, కేజ్రీవాల్‌ని హీరోని చేసేసింది. 

శవాల మీద పేలాలు ఏరుకోవడంలో మన రాజకీయ నాయకులకు పోటీ ఇంకెవరూ వుండరేమో. పాకిస్తాన్‌ మీడియాలో కేజ్రీవాల్‌కి పాపులారిటీ దక్కింది గనుక, అలాంటి పాపులారిటీ ఏదో తనకీ దక్కితే బావుణ్ణని రాహుల్‌గాంధీ అనుకున్నట్టున్నారు. అందుకే, సర్జికల్‌ స్ట్రైక్స్‌ని అవమానించారు. కాదు కాదు, దేశ ప్రజల్నే అవమానించారిప్పుడు రాహుల్‌గాంధీ. ఇంకేముంది, రేప్పొద్దున్న పాకిస్తాన్‌ మీడియాలో రాహుల్‌గాంధీ హీరోయిజం బయటపడటం ఖాయం. 

పాకిస్తాన్‌ మొదటి నుంచీ చేస్తున్న ఆరోపణలు ఇవే. పంజాబ్‌ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, పాకిస్తాన్‌ని బూచిగా చూపించి, సర్జికల్‌ స్ట్రైక్స్‌ పేరుతో సెంటిమెంట్‌ని రాజేసిందనీ, ఇది రాజకీయ కుట్ర అనీ పాకిస్తాన్‌ ఆరోపించింది. అవే ఆరోపణలు మొన్న కేజ్రీవాల్‌ నోట, తాజాగా రాహుల్‌గాంధీ నోట వచ్చాయంతే. పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, పాకిస్తాన్‌ సైన్యాధిపతి, పాకిస్తాన్‌ మీడియా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, ఆప్‌ అధినే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పుడు ఒకే గ్రూప్‌లో చేరిపోయినట్లున్నారు. 

వాస్తవానికి రాజకీయాలు మాట్లాడే సమయం కాదిది. ముందు ముందు రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. రేప్పొద్దున్నే ఎన్నికలు జరగడంలేదు కదా.! ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. అప్పుడు బీజేపీ తీరుని ఎండగట్టినా ఓ అర్థం వుంది. సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం, పాకిస్తాన్‌ తీవ్రవాదులు పొంచి వున్న ప్రస్తుత తరుణంలో, దేశ నాయకత్వాన్ని అస్థిర పరిచేందుకు, దేశ ప్రజల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్‌, రాహుల్‌గాంధీ లాంటోళ్ళపై దేశద్రోహం కేసులు ఎందుకు నమోదు చేయకూడదు?