వయసు పదేళ్ళు.. కానీ ఆ కుర్రాడు హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ అయ్యాడు. పోలీసుల గౌరవ వందనం అందుకున్నాడు. ఇదంతా మేక్ ఎ విష్ ఫౌండేషన్ ఆ కుర్రాడికి కల్పించిన అరుదైన గౌరవం. తీవ్ర అనారోగ్యంతో బాధపడ్తున్న సిద్ధికీ అనే చిన్నారికి పోలీస్ కమిషనర్ అవ్వాలనేది కల.
చిన్నారి సిద్ధికి ఆరోగ్య పరిస్థితిని హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిథులు. పెద్ద మనసుతో హైద్రాబాద్ సీపీ, మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిథులు చేసిన విజ్ఞప్తిని పరిశీలించారు, వారి కోరిక మన్నించారు. అంతే సిద్ధికి పోలీస్ కమిషనర్ అయిపోయాడు.
చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారికి మానసికంగా ఆనందాన్ని కలగజేస్తే, చికిత్సకు వారి శరీరం మరింతగా స్పందించే అవకాశం వుంటుందనీ అందుకే తమ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు చేపడ్తోందనీ, ప్రభుత్వాలు తమకు సహకరిస్తున్నందుకు చాలా ఆనందంగా వుందని మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. పోలీస్ డ్రెస్‌లో సిద్ధికీ చాలా ఉత్సాహంగా కన్పించాడు.
కాగా, ఖమ్మంలో శ్రీజ అనే చిన్నారికి సినీ హీరో పవన్‌కళ్యాణ్‌ని కలవాలనే కోరిక వుందనీ, ఆ కోరికను త్వరలోనే తీర్చుతామని అంటున్నారు మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిథులు.