'ఊరి ముందుకు వచ్చి ఉరుకులు పెట్టడం' సామెత తెలిసిందే. చేయాల్సిన పని సకాలంలో లేదా త్వరగా పూర్తి చేయకుండా, జాప్యం చేసి కొంప మునిగిపోయే సమయంలో చేస్తుంటారు కొందరు. పనులను జాప్యం చేయడంవల్ల టెన్షన్ పెరిగిపోతుంది. ఏదో చేసేయాలనే ఆత్రంతో కాలుగాలిన పిల్లిలా తిరుగుతుంటారు. నిరుద్యోగ భృతి విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి ఇలాగే ఉంది. ఉద్యోగాలు లేనివారికి నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఆ తరువాత మర్చిపోయారో, చూద్దాంలే నెమ్మదిగా అనుకున్నారో తెలియదుగాని ఇన్నేళ్ల జాప్యం తరువాత ఇప్పుడు ఆరాటపడుతున్నారు. ఎందుకు? ఎదురుగా ఎన్నికల దృశ్యం కనబడుతోంది కదా. నిరుద్యోగ భృతి ఇవ్వని వైనంపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ అనేకసార్లు అసెంబ్లీలోనూ, పబ్లిగ్గా నిలదీశారు. బాబు ఈ విమర్శలను పట్టించుకోలేదు.
ఓ పక్క లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి మరోపక్క నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చానని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ప్రతిపక్షానికి ప్రచారాస్త్రం అవుతుందనే భయం ఉండొచ్చు. డిసెంబరు నెలాఖరులోగా నిరుద్యోగ భృతిపై నిర్ణయం తీసుకొని అమలు చేయాల్సివుంది. భృతి ఇవ్వాలంటే ముందుగా రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో తేలాలి కదా. పక్కగా లెక్క తేల్చడం కత్తి మీద సామే. ఈ సామును తన కుమారుడు కమ్ ఐటీ మంత్రి లోకేష్‌కు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుకు అప్పగించారు. ప్రస్తుతం సర్కారు దగ్గర నిరుద్యోగులకు సంబంధించి రెండు రకాల లెక్కలున్నాయి.
మొదటిది ఉపాధి కల్పన కేంద్రాల్లో నమోదైనవారు 9 లక్షల మంది. గతంలో నిర్వహించిన సాధికార సర్వే (తెలంగాణ తరహాలో) ప్రకారం 33 లక్షల మంది. 42 లక్షల మంది. అయితే ఈ లెక్కలు కూడా కరెక్టు కాదని సర్కారు అభిప్రాయం. అందుకే కొత్త కసరత్తు మొదలుపెట్టబోతున్నారు. రైతులందరికీ అన్ని రకాల రుణాలు రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన బాబు ఆ తరువాత అనేక నిబంధలు పెట్టారు. ఇప్పటికీ పూర్తి రుణ మాఫీ జరగలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా ఇదే తరహాలో ఉండొచ్చు. గత ఎన్నికల్లో చేసిన ఈ వాగ్దానంపై బాబుకు ఎలాంటి అవగాహన లేదని చెప్పొచ్చు. ఇచ్చిన ఏ హామీకీ ముందస్తు అధ్యయనం లేదు. దీంతో ఎలా ఇవ్వాలి? ఎంతమందికి ఇవ్వాలనేదానిపై ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నారు.
ఇదిలావుంటే, ఏ విషయంలోనైనా బాబుకు విదేశాల వైపు చూడటం అలవాటనే సంగతి తెలిసిందే. రాజధాని ప్రహనం చూస్తూనే ఉన్నాం. ఏ విషయంలోనైనా సరే విదేశాలకు వెళ్లి అధ్యయనం చేస్తేగాని ముఖ్యమంత్రికి అర్థం కాదు. ప్రపంచంలోని అనేక దేశాలకు ఆయన స్వయంగా వెళ్లి, మంత్రులను , అధికారులను పంపి రాజధానులను అధ్యయనం చేశారు. ఏ దేశం వెళితే దాని మాదిరిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పేవారు. కాని ఇప్పటికీ అయోమయంలోనే ఉన్నారు. నిశ్చితాభిప్రాయాలు లేవు. రాష్ట్రం కష్టాల్లో ఉందని, అన్యాయంగా విభజించి రోడ్డు మీద పదేశారని, అరకొర నిధులతో నెట్టుకొస్తున్నామని…ఇలా ఎప్పుడూ బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు విదేశీ పర్యటనలకు కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అవసరమైతే విదేశాలకు వెళ్లాలి. తప్పదు. అసలు వెళ్లొద్దని ఎవ్వరూ అనరు. కాని చంద్రబాబు ఈ విషయంలో 'ఓవర్' అయ్యారని అందరూ చెబుతున్నమాట. త్వరలోనే మళ్లీ మూడు నాలుగు దేశాలకు మందీ మార్బలంతో వెళ్లబోతున్నారు. సినిమా దర్శకుడు లండన్‌కు పంపడం ఈసారి ప్రత్యేకత. నిరుద్యోగ భృతి విషయంలో లోకేష్ విదేశాలకు వెళ్లవచ్చేమో…! కొన్ని విదేశాల్లో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు.
ఈ విషయంలో నెదర్లాండ్స్, ఆస్ట్రియాల్లో అమలవుతున్న విధానాలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో (బెంగాల్, కేరళ, యూపీ, త్రిపుర) గతంలో నిరుద్యోగ భృతి ఇచ్చేవారు. కాని ఇప్పుడు లేదు. ఆ రాష్ట్రాల్లో ఎందుకు ఆగిపోయిందో స్టడీ చేస్తారు. ఇదంతా తెలుసుకున్న తరువాత నెలకు రెండు వేలు ఇవ్వాలా? తగ్గించి ఇవ్వాలా అనేది నిర్ణయిస్తారు. జీవితాంతం ఇవ్వలేరు కదా. కాబట్టి అందుకు గడువు నిర్ణయిస్తారు. ఇదంతా సాధ్యమైనంత త్వరగా పూర్తియితేనే బాబుకు ఊరట కలుగుతుంది.