బాబూ! నీకీ జన్మకి వైరాగ్యం రాదా?

మన దేశంలో సగటు మనిషికి అరవయ్యేళ్లొస్తే రిటైరైపోయావు ఇంటికి పొమ్మంటుంది ప్రభుత్వం. ఓపికుంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం లేదా వెసులుబాటుంటే పెన్షన్ డబ్బులతో శేషజీవితం గడపడం. ఇదే కదా జీవితం.  Advertisement ప్రాచీన…

మన దేశంలో సగటు మనిషికి అరవయ్యేళ్లొస్తే రిటైరైపోయావు ఇంటికి పొమ్మంటుంది ప్రభుత్వం. ఓపికుంటే ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవడం లేదా వెసులుబాటుంటే పెన్షన్ డబ్బులతో శేషజీవితం గడపడం. ఇదే కదా జీవితం. 

ప్రాచీన కాలంలో కూడా రాజులు తమ రాజ్యాన్ని తరువాతి తరానికి అప్పజెప్పి వానప్రస్థాననికి పోయేవారు. 

చంద్రబాబు! డెబ్బైరెండేళ్ల వయసులో జనాదరణ లేకపోయినా నానా పాట్లూ పడుతూ, ఏడుస్తూ, మళ్లీ సీయం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథాలు చేస్తూ, సొంత నియోజకవర్గం ప్రజలు ఆదరించకపోయినా ఇంకా చూరు పట్టుకుని వేలాడుతూ, కరడు గట్టిన పదవీ కాక్షతో ఎందుకయ్యా బతకడం? 

నీకేమైనా ఆస్తుల కొదవా? మందీమార్బలం కరువా? అన్నీ ఉన్నాయి కదా? కృష్ణా రామా అనుకుంటూ శేషజీవితం గడుపుతానని రాజకీయాల్లోంచి నిష్క్రమిస్తే ఎంత హుందాగా ఉంటుంది! ఆ పని చెయ్యవే?

అప్పట్లో హీరో శోభన్ బాబు అలాగే చేసాడు. తాను హీరోగానే రిటైరవ్వాలనుకున్నాడు. అయ్యాడు. 

అందరూ అలా బలవంతంగా కెరీర్ ని ఆపేసుకోవాలని కాదు. చక్కగా సాగుతుంటే హాయిగా పని చేసుకోవచ్చు. రజనీకాంతైనా, చిరంజీవైనా రిటైర్మెంటు లేకుండా సినిమాల్లో పని చేస్తున్నారంటే జనం ఆదరిస్తున్నారు, వారి మనసుకి కూడా పని హాయిగా ఉంది కనుక. 

కేంద్రంలో నరేంద్రమోదీ రాజ్యం చేస్తున్నాడంటే జనాదరణ తగ్గలేదు కనుక. 

నీకు జనాదరణ తగ్గిపోయింది. రెండు పేపర్లు, మూడు ఛానళ్లు, ఆ ఛానళ్లు మాత్రమే చూడడం వలన నీ సానుభూతిపరులుగా మారిన అతి తక్కువమంది కొందరు ప్రజలు, నీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు తప్ప నీ వెనుక ఇంకెవరూ లేరు. ఎలా లెక్కేసుకున్నా రానున్న కాలంలో ఈ సంఖ్యాబలంతో నీ పార్టీ నెగ్గే పరిస్థితే కనిపించడం లేదు. 

ఇలాంటప్పుడే హుందాగా తప్పుకోవాలి. లేకపోతే రాను రాను రక్తకన్నీరే. బహుశా ఈ స్పృహ నీకు మొన్నటి కుప్పం ఫలితాల తర్వాత కలిగే ఉంటుంది. అందుకే నీకు ఏడుపు తన్నుకొచ్చింది. భార్యనన్నందుకైతే నీకు వల్లభనేని వంశీ అన్నప్పుడే ఏడుపో, కోపమో రావాలి. అది జరగలేదు. 

నీ రాజకీయ జీవితం చరమాంకానికి వచ్చేసింది. ఎంతటివాడికైనా అవతార పరిసమాప్తి ఉంటుంది. నీ రాజకీయానికి కూడా పరిసమాప్తి పలికింది ప్రకృతి. దానికి అష్టదిగ్బంధనం లాంటి ఎనిమిది సంకేతాలున్నాయి. 

1. సొంత నియోజకవర్గంలో ఓటర్లు ఆదరించడం లేదు

2. కొడుకు రాజకీయంగా పనికిరావడంలేదు

3. నీ పంచన పెరిగిన నాయకులే నీకెదురు తిరిగి ఎగస్పార్టీ వైపు ఉన్నారు 

4. నీకు అన్యాయం జరిగితే లేచే నీ కుటుంబసభ్యుల నోళ్లకు బలం లేదు. 

5. కేంద్ర బలగాలు నిన్ను దగ్గరకు రానీయడంలేదు

6. నువ్వు ఏడిస్తే జాతీయ మీడియా విస్తుబోయి చూస్తోంది తప్ప నీ బాధ లోతులు వాళ్లకి అంతు బట్టడం లేదు

7. నువ్వు చెప్పుకునే నీ గతవైభవం ఇప్పటి ప్రజలకి పట్టట్లేదు

8. ఒక్కసారి జారిన పదవి ఇక నీ చేతికి చిక్కట్లేదు 

ఇలా నీ రాజకీయ జీవితం అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది. నీకు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. ఇలాంటప్పుడే గట్టిగా అరవాలనిపిస్తుంది. లేదా కడుపు పగిలేలా ఏడవాలనిపిస్తుంది. నువ్వు రెండోది చేసావు. 

నీకు అర్థమైపోయింది. 2024లో కూడా ఏ పరిస్థితుల్లోనూ పదవి వెనక్కి రాదని. 

సమస్త శక్తులు ఒడ్డి, నడుమొంచి దండం పెట్టి, మనస్ఫూర్తిగా ప్రచారం చేసినా కూడా కుప్పం ఓటర్లు వైసీపీకే మొగ్గారు. మరి ఇంకేం చేస్తే 2024 ఎన్నికల్లో నెట్టుకురాగలగడం? ఈ ప్రశ్న నిన్ను డొలిచేస్తోంది. 

నీకు సిలబస్ అంతు బట్టట్లేదు. 2024 పరీక్షకి ఎలా తయరవ్వాలో, ఎటునుంచి ఏ పాఠం చదవాలో నీకు తెలియడంలేదు. ప్రత్యర్థి అవలీలగా అన్నీ దాటుకుపోతున్నాడు. ఎన్ని సార్లు ఎన్ని గోబెల్స్ ప్రచారాలతో కాళ్లడ్డు పెట్టినా ఎగిరి వెళ్లిపోతున్నాడు తప్ప బొక్కబోర్లా పడట్లేదు. 

దీనిని బట్టి నీకు ఒకటి అర్థం కావాలి. ప్రకృతి, దైవం నీ రాజకీయ జీవితానికి చరమగీతం పాడేసి రెండున్నరేళ్లయిపోయింది. రాజకీయాలతో నీ ఋణం తీరిపోయింది. 

ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే తల్లి, తండ్రి పిల్లవాడిని ఒక దెబ్బ వేస్తారు. అప్పుడు వాడు ఏడుస్తాడు. 

నీ విషయంలోనూ అదే జరిగింది. ఎన్ని సార్లు సంకేతాలు పంపినా నీకు అర్థం కావట్లేదని ఆ ప్రకృతి, దైవం నీ మనసు మీద ఒక దెబ్బ వేసాయి. నిన్ను గుక్కపెట్టేలా ఏడిపించాయి. 

ఇప్పటికైనా అర్థం చేసుకుని నీ మార్గం మార్చుకోవడం శ్రేయస్కరం.  

అయినా నీ ఏడుపుతో తెదేపా శ్రేణుల మానసికస్థైర్యాన్ని చంపేసావు. కష్టకాలంలో నాయకుడు ఏడవడు. ఏడ్చే కార్యకర్తలని ఓదార్చేలాగ, ధైర్యాన్ని నూరి పోసేలాగా ఉండాలి నాయకుడు. 

అంతేగానీ నాయకుడు ఏడుస్తుంటే కార్యకర్తలు, అభిమానులు ఓదార్చే పరిస్థితి వచ్చిందంటే ఇక నువ్వు నాయకుడివి కాదని అర్థం. 

అన్నేళ్లు ముఖ్యమంత్రిగా నిన్ను భగవంతుడు కూర్చోబెట్టాడు. అన్నేళ్లు కేంద్రంలో చక్రం తిప్పేలా చేసాడు. అదంతా నీ ఘనత అనుకుంటూ డప్పు కొట్టుకుంటున్నావు. విర్రవీగుతున్నావు. 

నిజానికి నీకున్న శక్తి ఏదీ లేదు. పొత్తుల్లేకుండా ఎప్పుడూ గెలవలేదు నువ్వు. కులపత్రికల అండ లేకుండా నాయకుడివే కాలేదు నువ్వు. నందమూరి కుటుంబీకులు బోళా మనుషులవ్వడం, అమాయికులు కావడం, నీ పంచన బతుకీడ్చే బానిసలుగా మారడం నీకు కలిసొచ్చింది. అలా కలిసొచ్చేలా చేసాడు భగవంతుడు. అంతా ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అంతే. అది కాస్తా ఖర్చైపోయింది. ఇక నీకు కోరుకున్న పదవి రాదు. 

పుణ్యం సంగతి పక్కన పెడితే మరి పాపం సంగతో. పిల్లనిచ్చిన మామ తండ్రితో సమానం. అటువంటి వ్యక్తిని ఏం చేసావో, 72 ఏళ్ల వయసులో ఎంతటి మానసిక క్షోభకు గురిచేసావో నీ మనస్సాక్షికి తెలుసు. 

అప్పట్లో లక్ష్మీపార్వతి పార్టీని పట్టుకుపోతుందని నువ్వు రంగంలోకి దిగావని చెప్తారు నీ అనుయాయులు. ఆమెకే అంత భయపడ్డారంటే నీ అయుయాయుల తెలివి, నీ తెలివి ఎంతో ఇట్టే అర్థమవుతుంది. 

ఒకవేళ ఆమె పార్టీని లాగేసుకుంటే నీకేవిటి నష్టం? రాష్ట్రానికి నువ్వొక్కడివే దేవుడివే? జనం కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నాను తప్ప పదవుల కోసం కాదంటావు. నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో తెలుస్తోందా? నువ్వు కేవలం పనివాడివి మాత్రమే. అది కూడా ప్రజలు కోరుకుంటే. నువ్వనే కాదు. ఏ ముఖ్యమంత్రైనా ఇంతే. ఏదో జనాన్ని కాపాడడానికి దిగొచ్చిన అవతారమూర్తిలాగ నిన్ను నువ్వు భావించుకోవడం నీ అవివేకం. 

పోనీ ఒకవేళ అప్పట్లో లక్ష్మీపార్వతి పార్టీ మీద నిజంగా కన్నేసిందనుకుందాం. తెలివిగా ఆమెని మచ్చిక చేసుకుని నీ రాజకీయం నడపలేకపోయావా? విడగొట్టి వెన్నుపోటు పొడిచేకంటే, కలుపుకుని ముందుకెళ్లుంటే నీ రాజకీయ చతురత గొప్పగా ఉండేది కదా. వెన్నుపోటు అనే పదం నీ బతుకుకి అంటకుండానూ ఉండేది కదా. 

అణువణువూ పదవీకాంక్షతోనే బతికావు. వయసులో ఉన్నప్పుడు ఆ ఆశని అర్థం చేసుకోవచ్చు. కానీ వయసుడిగిన తర్వాత ఇప్పుడు కూడా ఇంకా పదవీకాంక్షతో ఏడుస్తున్నావంటే మహాభారతంలో ధృతరాష్ట్రుడే గుర్తొస్తున్నాడు. నీ పదవీకాంక్ష కంపుకొడుతోంది బాబూ! వైరాగ్యమనే సబ్బుతో స్నానం చేస్తే తప్ప ఆ కంపు పోదు. 

సంజయ కుమార్