చెన్నైలో బాంబుపేలుడు.. మోడీ కోసం తెచ్చిందేనా?

చెన్నై రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు పెను సంచలనాన్ని సృష్టించింది.  ఆగిఉన్న రైలులో రెండుసార్లుగా పేలుళ్లు సంభవించినట్లు చెబుతున్నారు. ప్లాట్‌ఫారంపై ఆగిఉన్న బెంగుళూరు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌5…

చెన్నై రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం 7.20 గంటల ప్రాంతంలో జరిగిన బాంబు పేలుడు పెను సంచలనాన్ని సృష్టించింది.  ఆగిఉన్న రైలులో రెండుసార్లుగా పేలుళ్లు సంభవించినట్లు చెబుతున్నారు. ప్లాట్‌ఫారంపై ఆగిఉన్న బెంగుళూరు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌5 బోగీలో ఈ బాంబుపేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఒకరు మృతిచెందారు. దాదాపు 30 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విని ప్రయాణికులు కకావికలై నలుదిక్కులకూ పరుగులు తీశారు. 

ఈ పేలుడులో ఆరుగురు మృతిచెందినట్లుగా కూడా తొలుత పుకార్లు వ్యాపించాయి. అయితే అదంతా ఉత్తిదేనని ఆ తర్వాత తేలిపోయింది. బాంబుపేలుడుకు గౌహతి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ 4,5 బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. 

చెన్నై స్టేషను నుంచి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. బాంబుస్క్వాడ్‌ అధికారులు సెంట్రల్‌స్టేషన్‌ను చేరుకుని క్షుణ్నంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

మరోవైపు ప్రస్తుతం చెన్నైకు సమీపంలోని తిరుమలలోనే బసచేసి ఉన్న నరేంద్రమోడీ లక్ష్యంగా తెచ్చినబాంబులే ఇక్కడ పేలిఉండచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. తిరుపతి సభకు బుధవారం వచ్చిన మోడీ మీద ఉగ్రవాదుల దృష్టి ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం ఉంది. తిరుమలలోనూ మోడీ హత్యకు కుట్రచేసిన ఉగ్రవాదుల ఫోటోలను మీడియాకు విడుదల చేసి పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆయన ఇవాళ సీమాంధ్రలో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు.