పుల్వామా టెర్రర్ దాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి వాతావరణం కన్పిస్తోంది. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్నారు పుల్వామా టెర్రర్ ఎటాక్ ద్వారా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు. ఈ నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య వరల్డ్ కప్ క్రికెట్ సందర్బంగా మ్యాచ్ జరగకూడదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆడటం మానేయకూడదంటూ పలువురు మాజీ క్రికెటర్లు గళం విప్పుతున్నారు.
కాగా, సచిన్ టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పుడందర్నీ ఆలోచనలో పడేసింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో భారత్ తలపడాల్సిందేనని అంటున్నాడు సచిన్. 'అడకుండా, ఊరికినే పాకిస్తాన్‌కి రెండు పాయింట్లు ఇవ్వడాన్ని నేను ఇష్టపడను..' అంటూ సచిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. వరల్డ్ కప్ పోటీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కి తిరుగులేని రికార్డ్ వుందన్న విషయాన్ని ప్రస్తావించాడు.
నిజమే, వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్‌కి తిరుగులేని రికార్డ్ వుంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా భారత్‌పై పాకిస్తాన్ విజయం సాధించలేదు. ఒకే ఒక్కసారి, అదీ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్, భారత్‌తో మ్యాచ్‌ని 'టై' చేసుకునేందుకు ప్రయత్నించిందిగానీ, సూపర్ ఓవర్‌లో ధోనీ సేన, అద్భుత విజయాన్ని అందుకుంది. 'ట్రాక్ రికార్డ్' సంగతి పక్కన పెడితే, మైదానంలో భారత క్రికెటర్లు, పాకిస్తాన్ ఆటగాళ్ళపై విరుచుకుపడితే చూడాలని వుందంటూ భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు.
'క్రికెట్ దేవుడు సచిన్ చెప్పిందే నిజం..' అంటూ సచిన్‌తో గొంతు కలుపుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే, 'దేశం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే.. నేను మనస్ఫూర్తిగా ఆ నిర్ణయాన్ని సమర్థిస్తాను..' అంటూ తన ట్వీట్‌లో సచిన్ ముక్తాయింపు ఇవ్వడం గమనార్హం.