కరెన్సీ కంపం.. వణుకుతున్న భారతం

అవినీతిని నిర్మూలించాల్సిందే.. నల్లధనాన్ని అరికట్టాల్సిందే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అత్యంత కీలకమైన నిర్ణయాలు రాత్రికి రాత్రే జరగాలి. వేరే దారి లేదు. ఎందుకంటే, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏమాత్రం ఛాన్సిచ్చినా, నల్లదొంగలు…

అవినీతిని నిర్మూలించాల్సిందే.. నల్లధనాన్ని అరికట్టాల్సిందే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అత్యంత కీలకమైన నిర్ణయాలు రాత్రికి రాత్రే జరగాలి. వేరే దారి లేదు. ఎందుకంటే, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏమాత్రం ఛాన్సిచ్చినా, నల్లదొంగలు జాగ్రత్తపడిపోతారు. సో, ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్ళూ సరైనదే. 

కానీ, అత్యంత తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా దేశం ఏ స్థాయిలో కుదుపుకు గురవుతుందోగానీ, అంతకన్నా పెద్ద కుదుపు మాత్రం 'కరెన్సీ కంపం'తో సంభవించిందని చెప్పక తప్పదు. లంచం.. లంచం.. లంచం.. ఎటు చూసినా లంచమే. అందుగలడిందులేడని సందేహమువలదు.. అన్న చందాన అవినీతి అన్నిట్లోనూ అంతర్భాగమైపోయింది. పెద్దమొత్తాల్లో జరిగే ఏ లావాదేవీలో అయినాసరే, ఖచ్చితంగా నల్లధనం వుండి తీరుతుంది. 

భూమి కొనుగోలు దగ్గర్నుంచి.. పెద్ద పెద్ద వ్యాపారాలదాకా ఈ నల్లధనం యధేచ్ఛగా మార్పిడి జరుగుతూనే వుంది. మరిప్పుడెలా.? నోట్ల రద్దు, కొత్తనోట్ల రాక.. ఇదంతా సామాన్యుడికి పెద్ద కష్టమేమీ కాదు. అలాగని ఇబ్బంది లేదని కూడా చెప్పడానికి వీల్లేదు. ఓ స్థలం కొనాలంటే, 'బ్లాక్‌ ఎంత.? వైట్‌ ఎంత.?' అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. కానీ, ఇప్పుడు 'బ్లాక్‌' అనడానికి వీల్లేదు. ఎందుకంటే, ఏటీఎం నుంచి రోజుకి పది వేల రూపాయలు మాత్రమే వస్తాయ్‌. వారానికి గరిష్టంగా 20 వేల రూపాయలు మాత్రమే తీసుకోవచ్చు. పోనీ, పెద్దమొత్తంలో బ్యాంకుల నుంచి డ్రా చేసేద్దామా.? అంటే, అక్కడ మళ్ళీ కొత్త సమస్యలు. 

అన్నిటికీ మించిన పెద్ద సమస్య, ఇప్పటికే బీరువాల్లోనూ, భూమి పొరల్లోనూ, ఆఖరికి సెప్టిక్‌ ట్యాంకుల్లోనూ 'భద్రపరచబడిన' నల్లధనాన్ని ఎలా వెలికి తీయాలి.? వెలికి తీస్తే బండారం బయటపడిపోతుంది.. తియ్యకపోతే అది చెత్తతో సమానం. వాట్‌ టు డు.! ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వందలాది మంది, వేలాది మంది ఇప్పుడు ఈ 'కరెన్సీ కంపం'తో వణికిపోతున్నారు. 

వున్నపళంగా మీ అక్కౌంట్‌లోకి డబ్బులు వచ్చిపడొచ్చు.. అది పదివేలు కావొచ్చు, పాతికవేలు కావొచ్చు.. ఇంకా ఎక్కువైనా కావొచ్చు.. అంటూ అప్పుడే సోషల్‌ మీడియాలో అదోరకమైన ప్రచారం షురూ అయ్యింది. ఇదెంత నిజం.? అన్నది వేరే విషయం. నల్లదొంగలు తమ డబ్బుని మార్చుకోడానికి ఇప్పుడు ఖచ్చితంగా అడ్డదార్లు తొక్కి తీరాల్సిందే.. వేరే మార్గం లేదు. కానీ, ఆ అడ్డదార్లన్నీ మూసేయగలిగితేనే.. ఈ కరెన్సీ కంపం సత్ఫలితాలనిస్తుంది. లేదంటే అంతే సంగతులు.