ఐదారేళ్లుగా తీవ్రమైన ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అమ్మకం దిశగా పయనిస్తోంది. తమ నుంచి తీసుకున్న లోన్లను తిరిగి చెల్లించకపోవడంతో ఈ సంస్థను స్వాధీనం చేసుకున్నంత పని చేస్తున్నాయి బ్యాంకులు. సంస్థ దివాళా ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తి అయినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు డీసీని టేక్ ఓవర్ చేయడానికి వివిధ మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ జాబితాలో ఏసియా నెట్, బీసీసీఎల్, టీవీ 9, హిందుస్థాన్ టైమ్స్, ఎస్సెల్ గ్రూప్ తదితర సంస్థలు ఉన్నాయి. డెక్కన్ క్రానికల్ గ్రూప్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి చాలా కాలం అయ్యింది.
ఇలాంటి పరిణామాల మధ్యనే ఐపీఎల్ నుంచి డెక్కన్ చార్జెస్ టీమ్ కూడా సస్పెండ్ అయ్యింది. అయితే పత్రికగా క్రానికల్ బ్రాండ్ వ్యాల్యూను కోల్పోలేదు. మంచి పాఠకాదరణతోనే కొనసాగుతూ ఉంది. దక్షిణాదిన ఒక ప్రధాన మీడియా వర్గంగా చలామణిలో ఉంది. ఈ నేపథ్యంలో డీసీని చేజిక్కించుకోవడానికి మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఇక్కడ మరింత కీలకమైన అంశం, డీసీ విలువ. ఈ సంస్థకు భారీ ఎత్తున ఆస్తులు కూడా ఉన్నాయి. చాలా జిల్లాల్లో ప్రింటింగ్ యూనిట్లున్నాయి. ఆఫీసులు, స్థలాలు కూడా ఉన్నాయి. వీటన్నింటి విలువనూ లెక్కగట్టాల్సి ఉందింకా. వీటన్నింటికీ మించి బ్రాండ్ వ్యాల్యూ. దానికీ ఒక రేటు కడతారు. ఈ నేపథ్యంలో డీసీ కొనుగోలుకు మీడియా రంగంలోని సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయని స్పష్టం అవుతోంది.
ఏసియా నెట్ విస్తరణ ప్రయత్నాల్లో ఉంది. అలాగే హిందుస్థాన్ టైమ్స్ కూడా. ఇక ఇలాంటి టేకోవర్లకు టైమ్స్ గ్రూపు ఉత్సాహంగా ఉంటుంది. అందులోనూ ఇప్పుడు దక్షిణాదిన టైమ్స్ కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంది డీసీ. పత్రికగా డీసీకి దశాబ్దాల ప్రస్థానం ఉంది. ఇప్పుడు దివాళా దశకు వచ్చింది. ఇకపై దీని ప్రస్థానం ఎలా ఉంటుందో!