దేశ భక్తి గురించి సానియా మీర్జా పెద్ద క్లాసే తీసుకుంది సోషల్ మీడియాలో. టెన్నిస్ సంచలనంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సానియా మీర్జా హైదరాబాదీనే అయినా, తెలుగులో ఎప్పుడూ ఆమె మాట్లాడింది లేదు. ఆ మాటకొస్తే, అజారుద్దీన్ కూడా అంతే. భాష సంగతి పక్కన పెడితే, సానియా మీర్జా.. ఇప్పుడు సంకటంలో పడటానికి కారణం, కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన తీవ్రవాద దాడి.. ఆ దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడమే.
మామూలుగా అయితే, ఈ విషయమై స్పందించమని సానియా మీర్జాని ఎవరూ ప్రశ్నించి వుండేవారు కాదేమో.! కానీ, ఘటన జరిగాక సోషల్ మీడియాలో సానియా ట్రెండీగా వున్న తన ఫొటోల్ని షేర్ చేసే సరికి, జనానికి ఒళ్ళు మండిపోయింది. దేశం శోక సంద్రంలో వుంటే, భారతదేశానికి చెందిన వ్యక్తిగా నువ్వు చేసే పని ఇదేనా.? అని జనం ప్రశ్నించారు. దాంతో, కాస్త జాగ్రత్తపడి.. ఆ తీవ్రవాద దాడి ఘటనను ఖండించింది సానియా. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోయిందామెకి సోషల్ మీడియాలో.
సానియా పెళ్ళాడింది పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని. పాపం ఆమె మాత్రం, పాకిస్తాన్‌ని తిట్టగలదా.? ఇప్పుడామె పాకిస్తాన్‌కి కోడలు కదా.! కానీ, ఆమెను ప్రశ్నిస్తోన్న ఇండియన్స్ మాత్రం.. తగ్గడంలేదు. పాకిస్తాన్‌ని ఎందుకు తీవ్రవాదంపై నిలదీయడంలేదంటూ మండిపడుతున్నారు. ఏమో, సానియా ఇంకోసారి సోషల్ మీడియాలో స్పందిస్తుందేమోగానీ, ఆ స్పందనలోనూ ఆమె పాకిస్తాన్ పేరు ప్రస్తావించే అవకాశాలు తక్కువే.
సానియా మీర్జాకి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో జాతీయ జెండాని అవమానించిందంటూ ఆమెపై కేసు నమోదయ్యింది. ఆ తర్వాత ఆ కేసులో ఆమెకు ఊరట లభించిందనుకోండి.. అది వేరే విషయం. ఈసారి సమస్య ఇంకాస్త తీవ్రమైనదే.
కొసమెరుపేంటంటే, తమ దేశానికి కోడలిగా వచ్చిన సానియా మీర్జాని పాకిస్తానీయులు వెనకేసుకొస్తున్నారు. ఓ మహిళను గౌరవించడం కూడా తెలియదా? అంటూ ఇండియన్ నెటిజన్స్‌పై, పాకిస్తానీ నెటిజన్లు మండిపడుతున్నారు.