ఈసీ చెప్పింది చేస్తే నేతలకు షాక్‌….!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లకుబేరులకు షాక్‌ ఇస్తానని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలకు షాక్‌ ఇచ్చారు. మన దేశంలో ఏ షాక్‌ అయినా సామాన్య ప్రజలకు తగిలి వారు షేక్‌…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లకుబేరులకు షాక్‌ ఇస్తానని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలకు షాక్‌ ఇచ్చారు. మన దేశంలో ఏ షాక్‌ అయినా సామాన్య ప్రజలకు తగిలి వారు షేక్‌ అయిపోతారు తప్ప రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు, నల్లకుబేరులకు, ఇతర బడా బాబులకు ఎలాంటి షాక్‌ తగలదు. వారి జీవితాలు ఏవిధంగానూ 'బ్రేక్‌' కావు. బతుకులు బ్రేక్‌ అవడం, తద్వారా క్రాక్‌ రావడం అంతా సామాన్య ప్రజలకే. డీమానిటైజేషన్‌ను పెద్ద సంస్కరణగా బీజేపీ నాయకులు, దాని అనుకూలురు అభివర్ణిస్తున్నారు. కాని పెద్దోళ్లకు ఏమైనా అయిందా? అని ప్రశ్నించుకుంటే ఏమీ కాలేదనే చెప్పుకోవాలి.

పైగా నల్లధనాన్ని తెల్లగా మార్చుకోవడానికి సర్కారు ఇంకా అవకాశాలిస్తూనే ఉంది. సరే…ఈ విషయం అలా ఉంచితే రాజకీయ నాయకులకు ప్రభుత్వం గట్టి షాక్‌ ఇవ్వగలిగితే ప్రభుత్వానికి డబ్బు మిగులుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది. నల్లడబ్బు చెలామణిలోకి రాకుండా ఉంటుంది. ఇందుకు మోదీ సర్కారు ఏం చేయాలి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనపై ఆలోచించి అమలయ్యేలా చూడాలి. దేశం బాగుపడాలంటే ఒక్క ఆర్థిక సంస్కరణలే  సరిపోవు. ఎన్నికల సంస్కరణలు అత్యంత ముఖ్యమైనవి.

ఎన్నికల సంస్కరణల ద్వారా నాయకులకు షాకిస్తే కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టింది. ఏమిటది? సాధారణ ఎన్నికల్లో ఏ నాయకుడూ ఒకేసారి రెండు స్థానాల నుంచి పోటీ చేయకూడదు. అంటే ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలని అర్థం. ఈ నిబంధన అమలు కావాలంటే ప్రజాప్రాతినిథ్య చట్టం-1951కి సవరణ చేయాలి. ఎన్నికల సంఘం ప్రతిపాదన ప్రకారం… ఒక్కరు ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలి ఒకవేళ అది కుదరకపోతే…ఒక అభ్యర్థి రెండు స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలో గెలిచినట్లయితే ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అక్కడ ఉప ఎన్నిక జరపాలి. ఆ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కొంత డబ్బును గెలిచిన అభ్యర్థి డిపాజిట్‌ చేయాల్సివుంటుంది. ఒకప్పుడు అభ్యర్థుల పోటీపై పరిమితి లేదు. ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశముండేది. ఎన్‌టీఆర్‌ టీడీపీ పెట్టి రాజకీయాల్లో ప్రవేశించగానే మూడు స్థానాల నుంచి పోటీ చేసి మూడింటిలోనూ గెలిచారు.

ఒక్క స్థానం ఉంచుకొని రెండింటికి రాజీనామా చేశారు. ఆ రెండింటికీ ఉప ఎన్నికలు జరిపారు. సాధారణ ఎన్నికలకే బోలెడు ఖర్చువుతుంది. ఆ వెంటనే ఉప ఎన్నికలు జరపడానికి తడిసి మోపడవుతుంది. ఇదంతా ప్రజల సొమ్ము వృథాగా ఖర్చు చేయడమే కదా. డబ్బు వృథా కావడమే కాకుండా ఎన్నికల నిర్వహణకు వేలాదిమంది ప్రభుత్వ ఉద్యోగులను. ఇతర సిబ్బందిని నియమించుకోవాలి.  

వాస్తవానికి ఇదంతా  ప్రజాస్వామ్యం పేరుతో చేస్తున్న పనికిమాలిన పని. మూడు స్థానాల నుంచి పోటీ చేయడం తక్కువ అయినా రెండు స్థానాల నుంచి పోటీ సాధారణమైపోయింది. ప్రముఖ నాయకులు, ప్రజాదరణ ఉన్న నేతలే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఇలాంటి నాయకులకు లెక్కలేదు. అత్యంత ప్రజాదరణ ఉన్న కేసీఆర్‌ కూడా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. చిరంజీవి అదే పని చేశారు. గత ఎన్నికల్లో మోదీ ఈ పనే చేశారు. రెండు స్థానాల నుంచి పోటీ చేసినవారి లిస్టు చాలా ఉంది. ఈ రెండు స్థానాల నిబంధన 1996లో వచ్చింది. రెండు స్థానాల నుంచి పోటీ చేయడం నాయకులకు ఓ ఆటగా మారిపోయింది. 

పనిగట్టుకొని ప్రజాధనం వృథా చేస్తున్నారు. దీంతో ఒక్క స్థానం నుంచే పోటీ చేయాలని ఈసీ ప్రతిపాదించింది. రెండు స్థానాల్లో అభ్యర్థి గెలిచినట్లయితే ఉప ఎన్నిక నిర్వహించే స్థానానికి కొంత డబ్బు డిపాజిట్‌ చేయాలనే నిబంధన విధించాలని ఈసీ 2004లోనే ప్రతిపాదించింది. అప్పటి ప్రతిపాదన ప్రకారం అసెంబ్లీ సీటుకు 5 లక్షలు, లోక్‌సభ సీటుకు 10 లక్షలు డిపాజిట్‌ చేయాలి. కాని అప్పటి సర్కారు దీన్ని పట్టించుకోలేదు. రెండు స్థానాల నుంచి పోటీ అవకాశం కొనసాగించినట్లయితే ఉప ఎన్నిక నిర్వహించే స్థానానికి డిపాజిట్‌ మొత్తాన్ని ఇంకా పెంచాలని ఈసీ ప్రతిపాదించింది. దేశమంతా ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే సంగతి తరువాత చూడొచ్చు. ముందు ఎక్కువ స్థానాలకు పోటీ చేయడం నిషేధిస్తే మోదీ సర్కారుకు అదొక విజయమవుతుంది. నోట్ల రద్దు అస్తవ్యస్తమైపోయింది. ఇదైనా సక్రమంగా చేస్తే నాయకులకు షాక్‌ ఇవ్వడంతోపాటు ప్రజాధనం ఆదా చేయొచ్చు.