వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ పేరుతో చంపించిన క్రెడిట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. ఈ మాట అంటున్నది మనం కాదండీ. రాష్ట్ర పశుసంవర్ధక, డెయిరీ డెవెలప్మెంట్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఆయన ఆంగ్ల మీడియాతో మాట్లాడినప్పుడు కేసీఆర్‌ను బ్రహ్మాండంగా పొగిడేసి ఎన్కౌంటర్ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని ప్రశంసించాడు. అంటే ఎన్‌కౌంటర్‌కు అనుమతి ఇచ్చింది కేసీఆరేనని స్పష్టంగా తేలిపోయింది. సీపీ సజ్జనార్ ఎన్కౌంటర్ ప్లాన్ చేసి 'ఇలా చేస్తాం సార్' అని చెప్పివుంటాడు. దానికి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దిశను హత్య చేసిన చోటనే సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ పైవాళ్లే (ఉన్నతాధికారులు, ప్రభుత్వాధినేత) ప్లాన్ చేశారని మంత్రి చెప్పాడు. 'ఈ ఎన్కౌంటర్ దేశానికి సందేశం' అన్నాడు తలసాని.
కోర్టు ద్వారా న్యాయం జరగదనే భావం ప్రజల్లో ఉందని, అందుకే వెంటనే చర్య తీసుకోవాలని ప్రభుత్వంపై ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిందని చెప్పాడు. భారత న్యాయవ్యవస్థలో విచారణ సా…గుతూనే ఉంటుందని, అందుకే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని, ఈ క్రెడిట్ కేసీఆర్‌కే దక్కుతుందని తలసాని మెచ్చుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం వందశాతం చాలా బలమైందని, అందుకే వెంటనే చర్య తీసుకుందని చెప్పాడు. ఎన్కౌంటర్ సీఎం పర్మిషన్‌తోనే జరిగింది కదా అని అడగ్గా, పర్మిషన్తో అని కాదు. పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్నప్పుడు మేం (ప్రభుత్వం) మాత్రం ఏం చేస్తాం? కాని వెంటనే చర్య తీసుకోవాలని ఒత్తిడి బాగా వచ్చింది…అన్నాడు మంత్రి. ఈ ఎన్కౌంటర్ పట్ల ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశాడు.
'దేశ ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. ఈ మంత్రివర్గంలో ఉన్నందుకు నేను గర్వంగా ఫీలవుతున్నా' అని చెప్పాడు. ఈ ఎన్కౌంటర్ దేశం మొత్తానికి సందేశం. బాలికలకు, మహిళలకు రక్షణ కల్పిస్తామనే సందేశం ఇందులో ఉందన్నాడు. ఢిల్లీ నిర్భయ కేసును ప్రస్తావిస్తూ ఇప్పటివరకు ఏమీ కాలేదన్నాడు. అంటే ఆ దోషులకు ఇప్పటివరకు శిక్షలు పడలేదని అర్థం. నేరాలు చేసినవారు జైలుకు వెళతారని, బయటకు రాగానే మళ్లీ నేరాలు చేస్తారని, భారత్‌లో ఇదీ పరిస్థితి అని మంత్రి అన్నాడు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ అనేది దేశానికి బలమైన సందేశమని తలసాని అభిప్రాయపడ్డాడు.
దిశ కేసులో నిందితులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చిందని అంటూ తెలంగాణ పోలీసు వ్యవస్థ బలమైందని, దేశం మొత్తం మీద హైదరాబాదు పోలీసులు చాలా బలమైనవారని మంత్రి అన్నాడు. ఈ ఘనత అంతా ముఖ్యమంత్రిదేనన్నాడు. ఎన్కౌంటర్ తరువాత ఇదే జాతీయవార్తగా మారిందన్నాడు. జాతీయ మానవహక్కుల కమిషన్, ఇతర హక్కుల గ్రూపులు ఆందోళన వ్యక్తం చేశాయి కదా అని అడగ్గా మంత్రి తేలిగ్గా తీసిపారేశాడు. వాళ్లేదైనా మాట్లాడతారని, బాధిత కుటుంబాల పరిస్థితి ఏమిటని, వారికి ఏం చెబుతారని ప్రశ్నించాడు మంత్రి. ఈ దేశంలో న్యాయప్రక్రియకు అంతం ఉండదని, న్యాయప్రక్రియ అలా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందని అన్నాడు.
న్యాయ ప్రక్రియలో విచారణ చాలా ఆలస్యమవుతుందని ప్రజలకు తెలుసని అన్నాడు. న్యాయ వ్యవస్థలో చాలా మార్పులు అవసరమని, జనం దీన్ని గురించి ఆలోచించాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పాడు. మంత్రి చెప్పిన దాంట్లో సారాంశం క్లియర్‌గా అర్థమవుతూనే ఉంది. ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్ చెప్పిన కథ అబద్ధమని అందరికీ తెలుసు. అది మంత్రి ద్వారా మరోసారి స్పష్టమైంది. ఎన్కౌంటర్ ప్లానింగ్‌లో సీఎం కేసీఆర్ పాత్ర కూడా ఉంది. న్యాయ వ్యవస్థలో జాప్యం జరుగుతుందనే సాకు చూపించి ఉద్దేశపూర్వకంగానే నిందితులను చంపేశారు. దీనివల్ల జనం సంతోషించారు. కేసీఆర్‌కు 'ధైర్యశాలి' అనే గొప్ప పేరు దక్కింది.