ఎన్‌కౌంటర్ ఎక్కడ జరిగినా, ఆ వార్తతోపాటు ఫేక్ ఎన్‌కౌంటర్.. అనే వాదనలూ ప్రముఖంగా తెరపైకొస్తుంటాయి. నక్సల్స్‌ని హతమార్చే క్రమంలో పోలీసులు ‘ఫేక్ ఎన్‌కౌంటర్లకు’ పాల్పడటం సహజాతి సహజమనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది సామాన్యుల్లో. నక్సల్స్ జాడ వెతికేందుకు పోలీసులు ప్రయత్నించడం.. పోలీసుల్ని గుర్తించి నక్సల్స్ కాల్పులకు దిగడం.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపాక, నక్సల్స్ మృతి చెందడం జరుగుతుంటుంది. ఒక్కోసారి ఎక్కడో నక్సల్స్‌ని పట్టుకుని, వారిని కాల్చి పారేసి, ఎన్‌కౌంటర్‌గా పోలీసులు చిత్రీకరిస్తారనే విమర్శలూ లేకపోలేదు. అలా ఎన్‌కౌంటర్లు.. ఫేక్ ఎన్‌కౌంటర్ల గురించి ఎప్పటికప్పుడు చర్చ, దాని పర్యవసానంగా రచ్చ.. సర్వసాధారణమైపోయింది.
ఈ తరహా వివాదాలకు తావులేకుండా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడిరచింది. ఎన్‌కౌంటర్ల విషయంలో సీఐడీతో విచారణ జరపాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్‌కౌంటర్ సమయంలో పేలుడు, మందుగుండు సామాగ్రి వంటివాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. ఎన్‌కౌంటర్ వివరాల్ని రాతపూర్వకంగా / ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో భద్రపరచాలనీ పేర్కొంది. సుప్రీం తాజా మార్గదర్శకాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యవాదులు మాత్రం సుప్రీం తీర్పుని హర్షిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు.. సుప్రీం మార్గదర్శకాలతో ఫేక్ ఎన్‌కౌంటర్లకు తావుండబోదని విశ్వసిస్తున్నాయి.
ఫేక్ ఎన్‌కౌంటర్ల వ్యవహారమై గతంలో పోలీసు ఉన్నతాధికారులూ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్‌కౌంటర్లనేవి ఆయా రాష్ట్రాల్లో అప్పటికప్పుడు ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి కూడా. ప్రభుత్వం చేయించిన హత్యలు.. అంటూ ఎన్‌కౌంటర్లు జరిగిన ప్రతిసారీ మానవ హక్కులు, ప్రజా హక్కుల సంఘాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.