గుండె.. తరలివచ్చింది.!

తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం… అన్న పాట మాటేమోగానీ, ఓ గుండె ఇంకో ప్రాణాన్ని నిలబెట్టేందుకు బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి చేరుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ యువకుడి…

తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం… అన్న పాట మాటేమోగానీ, ఓ గుండె ఇంకో ప్రాణాన్ని నిలబెట్టేందుకు బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి చేరుకుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ యువకుడి నుంచి గుండెను సేకరించిన వైద్యులు, బెంగళూరు నుంచి హైద్రాబాద్‌కి తరలించారు. సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రికి గుండెను చేర్చిన వైద్యులు, దాన్ని ఓ మహిళకు అమర్చేందుకు ఆపరేషన్‌ చేస్తున్నారు.

బెంగళూరు నుంచి చెన్నయ్‌కి ఇటీవలి కాలంలో రెండుసార్లు ఇలా ‘గుండె’ పయనించింది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి గుండెను సేకరించి, దాన్ని భద్రపరచడం అనేది అత్యంత క్లిష్టమైన వ్యవహారం. అయినప్పటికీ, ఆధునిక వైద్య శాస్త్రంలో అనేక అద్భుతాలు చోటుచేసుకుంటున్న దరిమిలా, ఆ అద్భుతాల్లో గుండెను ఎక్కువ సమయం పాటు సజీవంగా వుంచడం అనే ప్రక్రియనూ సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు వైద్యులు.

గంటన్నరలో బెంగళూరు నుంచి, సికింద్రాబాద్‌లోని ఆసుపత్రికి వైద్యులు గుండెను తరలించారు. ఈ ప్రక్రియకు ట్రాఫిక్‌ పోలీసులు సహకరించడంతో పని మరింత తేలికయ్యింది. ఆరు గంటల్లోపు శస్త్ర చికిత్స పూర్తి చేసి, బాధిత మహిళకు జీవం పోస్తామని డాక్టర్లు చెబుతున్నారు. ఈ తరహా గుండె మార్పిడి చికిత్స ఇదివరకు హైద్రాబాద్‌లో జరిగిన సందర్భాలున్నాయి. అయితే హైద్రాబాద్‌లోనే ఓ ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి ఇలా గుండెను తరలించి, అవసరమైన వ్యక్తికి అమర్చారు.

ఈసారి గుండె తరలింపు ప్రక్రియ తెలుగు రాష్ట్రాలకు అత్యంత ప్రత్యేకం. వేరే రాష్ట్రం నుంచి విమానంలో గుండెను తీసుకొచ్చి, దాన్ని అమర్చుతున్నారు. వైద్య శాస్త్రంలో ఇలాంటి అద్భుతాలు మరిన్ని జరిగి, బాధితులకు, డాక్టర్లు ఉపశమనం కల్పించాలని ఆశిద్దాం.