గుత్తావంటి అసంతృప్త జంప్‌ జిలానీలెందరో….!

ప్రతిపక్షాల నుంచి నాయకులు అధికార పార్టీలోకి జంప్‌ అవడానికి కారణం అందరికీ తెలిసిందే. పెద్ద నాయకులు, రాజకీయంగా బలమైన లీడర్లయితే మంత్రి పదవి కోరుకుంటారు. అంత సీన్‌ లేనివారు ఇంకేదైనా పదవి ఆశిస్తారు. ఇంకొందరు…

ప్రతిపక్షాల నుంచి నాయకులు అధికార పార్టీలోకి జంప్‌ అవడానికి కారణం అందరికీ తెలిసిందే. పెద్ద నాయకులు, రాజకీయంగా బలమైన లీడర్లయితే మంత్రి పదవి కోరుకుంటారు. అంత సీన్‌ లేనివారు ఇంకేదైనా పదవి ఆశిస్తారు. ఇంకొందరు డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం, ఏమైనా కేసులుంటూ వాటిని మాఫీ చేయించుకోవడం కోసం, అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవడం కోసం…ఇలా అనేక రకాల కారణాలతో అధికార పార్టీ కండువా కప్పుకుంటారు. కాని ఆశించింది జరగనప్పుడు అనవసరంగా పార్టీ మారామని, తప్పు చేశామని ఫీలవుతుంటారు.

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోని జంప్‌ జిలానీలంతా ఇదే ఫీలింగ్‌తో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవ్వరికీ పదవులు రాలేదు కాబట్టి. వీరంతా బహిరంగంగా మాట్లాడటంలేదు. బయటకు అసంతృప్తి వ్యక్తం చేయడంలేదు. సన్నిహితుల దగ్గర కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఫిరాయింపుదారుల్లో తెలంగాణలోని నల్గొండ టీఆర్‌ఎస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఒకరు. గత ఎన్నికల్లో కాంగ్రెసు తరపున లోక్‌సభకు ఎన్నికైన ఈయన మంత్రి పదవి మీద ఆశతో గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ కండువా కప్పుకున్నారు కాబట్టి టీఆర్‌ఎస్‌ ఎంపీగా చెప్పుకుంటున్నాం.

నిజానికి ఆయన ఇప్పటికీ కాంగ్రెసు ఎంపీయే. ఎంపీ పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ తరపున గెలవలేదు కాబట్టి కాంగ్రెసు ఎంపీగానే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు బొచ్చెడుమంది అధికార పార్టీల్లో చేరారు. వీరు ఎవ్వరూ పదవులకు రాజీనామా చేయలేదనే సంగతి తెలిసిందే. తాము రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతామని, మళ్లీ గెలుస్తామనే ధీమా ఉందని ఆ నాయకులు చెబుతున్నా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అందుకు సాహసించడంలేదు. స్పీకర్లు కూడా అనర్హత వేటు వేయకుండా ముఖ్యమంత్రులకు సహకరిస్తున్నారని వారు వ్యవహరిస్తున్న తీరును బట్టి అర్థమవుతోంది.

గుత్తా సుఖేందర్‌ రెడ్డి అసంతృప్తిగా ఉండటానికి కారణం ఒకటి మంత్రి పదవి ఇవ్వకపోవడం. రెండు నల్గొండ జిల్లాలో ఒరిజినల్‌ టీఆర్‌ఎస్‌ నేతలతో విభేదాలు ఉండటం. మూడోది చాలా సీనియర్‌ అయిన ఈయనకు పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం. మూడుసార్లు ఎంపీగా గెలిచి రాజకీయ ఉద్దండుడిగా పేరు తెచ్చుకున్న గుత్తా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో నోరు మూసుకొని కూర్చున్నారు. ఒకప్పుడు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలను కోర్టులో సవాల్‌ చేసి కంట్లో నలుసుగా మారి ఇబ్బంది పెట్టిన గుత్తా ఇప్పుడు తానే ఇబ్బంది పడుతున్నారట…! 

గుత్తా బలహీనత మంత్రి పదవి. కేసీఆర్‌ లక్ష్యం కాంగ్రెసును మటాష్‌ చేయడం. కేసీఆర్‌ లక్ష్యానికి గుత్తా సహకరించినా ఆయన ఆశించింది కేసీఆర్‌ ఇవ్వలేదు. గుత్తాతో టీఆర్‌ఎస్‌లో చేరిన కొందరు నాయకలు కేసీఆర్‌ తత్వం బోధపడటంతో మళ్లీ కాంగ్రెసులో చేరిపోయారు. టీఆర్‌ఎస్‌లో చేరగానే గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌కు చెప్పారు. రాజీనామా చేస్తానని చెప్పింది నైతిక విలువలకు కట్టుబడి కాదు. ఆయనకు ఢిల్లీలో ఉండటం కంటే రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండటమే ఇష్టమట. కాబట్టి ఎమ్మెల్సీ పదవిగాని, ఇంకేదైనా రాష్ట్రస్థాయి పదవిగాని ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారట. వెంటనే గులాబీ దళపతి 'అన్నా…గుత్తన్నా నువ్వు రాజీనామా చేయకే. ఆ పని చేస్తే తిప్పలైతుంది' అని చెప్పారు.

అసలైతే కేసీఆర్‌ ఉప ఎన్నికల స్పెషలిస్టు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నిసార్లు ఏరికోరి ఉప ఎన్నికలు తెచ్చారో లెక్కలేదు. తన సామర్థ్యం, టీఆర్‌ఎస్‌ బలం ప్రజలకు తెలియాలంటే ఎన్నికలే కరెక్టు మార్గమనుకున్న కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులతో మూకుమ్మడిగా రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలు నిర్వహింపచేశారు. అలాంటి కేసీఆర్‌ పనిగట్టుకొని ఉప ఎన్నికలు తెప్పించొద్దని  నిర్ణయించారు. ఇందుకు ఆయన చెప్పిన కారణం…ఖజానా మీద భారం పడుతుందని.

అలాగే పార్టీ కూడా టెన్షన్‌ పడాల్సివస్తుంది. తన  రాజీనామా కోరికను గుత్తా సుఖేందర్‌ రెడ్డి చెప్పగానే కేసీఆర్‌ విముఖత వ్యక్తం చేశారు.    

ఇందుకు రెండు కారణాలుండొచ్చు. ఒకటి ఇప్పటికే ఎన్నికల్లో వరుసగా పోటీ చేస్తుండటంతో విసుగు కలిగి ఉండొచ్చు. రెండోది ఓడిపోతామనే భయం కావొచ్చు. నల్గొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికంటే ఆషామాషీగా జరగదు. జయాపజయాల సంగతి ఎలా ఉన్నా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌ మీద కసితో, కోపంతో రగిలిపోతున్న కాంగ్రెసు పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్‌ వ్యతిరేకులంతా ఏకమవుతారు. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ జేఏసీ కూడా మద్దతు పలకొచ్చు.  

గుత్తా ఎంపీ పదవికి రాజీనామా చేస్తే  ఉప ఎన్నిక కోసం బలమైన నాయకుడిని ఎంపిక చేయాలి. అదో తలనొప్పి. గుత్తాకు ఎమ్మెల్సీ పదవో, లేకపోతే వేరే పదవో కట్టబెట్టాలి. ఇప్పటికే పదవుల కోసం అనేకమంది జంప్‌ జిలానీలు ఎదురు చూస్తున్నారు. గుత్తా సుఖేందర్‌ రెడ్డి రాజీనామా చేస్తే ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెసు నిర్ణయించుకుంది. ఏం జరుగుతుందో చూడాలి.