ఇది చాలా మంది డ్రీమ్.. సంతోషంగా, సరదాగా సాగిపోయే దాంపత్యం! ఇది పెళ్లైన ప్రతి ఒక్కరూ కోరుకునేదే! అయితే అందరూ కోరుకునేదే అయినా.. దాన్ని అనుభవంలో పొందడానికి మాత్రం ఎవరికీ తేలిక కాదు! ప్రత్యేకించి ఈ రోజుల్లో ఇదంత తేలిక కాదు. అయితే ఎంత తేలిక కాదనే భావన ఉన్నా.. కొన్ని అలవాట్లను అలవరుచుకుంటే దాంపత్యం సంతోషంగా, సరదాగా సాగడం ఖాయమంటున్నారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్! ఎంతోమంది దంపతులకు కౌన్సెలింగ్ ఇచ్చి అనుభవాలతో వారు చెప్పేదేమిటంటే!
కంప్యాషన్ తో కూడిన కమ్యూనికేషన్!
దంపతులు అన్నాకా అనేక అంశాల్లో అభిప్రాయ బేధాలుంటాయి. అలాంటివి తలెత్తినప్పుడు చాలా మంది మొదట చేసే పని గట్టిగా అరవడం, అరిచి అభిప్రాయాలను చెప్పడం, అవతలి వారిని నిందించడం, విసుగను వ్యక్త పరచడం, విరుచుకుపడటం.. స్పందనతో కాస్త తేడాలు ఉండవచ్చు కానీ.. దంపతుల మధ్యన ఇలాంటివి సహజం! ఎంత సహజం అనుకున్నా. ఈ తీరును మార్చుకుంటే కొన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయని రిలేషన్ షిప్ కౌన్సెలర్లు చెబుతున్నారు.
ఏదైన అంశంలో అభిప్రాయ బేధాలొచ్చినప్పుడు తమ అభిప్రాయాన్ని సామరస్యంగా చెబితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. అరిచి చెప్పడం, అవతలి వారిని హర్ట్ చేసేలా మాట్లాడటం కంటే.. చెప్పాలనుకున్న దాన్ని నెమ్మదిగా, అర్థమయ్యేలా చెప్పడం దంపత్యంలో మంచి పద్ధతి అనేది వారి సూచన!
లవ్ అండ్ రొమాన్స్ ఉండాల్సిందే!
మీరెంత బిజీ గా అయినా ఉండొచ్చు, ఎంతైనా సంపాదిస్తూ ఉండవచ్చు, ఎన్ని సదుపాయాలను అయినా సమకూర్చి పెడుతూ ఉండవచ్చు! అయితే పార్ట్ నర్ కోరుకునే వాటిలో మీ నుంచి ప్రేమ, రొమాన్స్ లు ముందు వరసలో ఉంటాయనేది రిలేషన్ షిప్ కౌన్సెలర్లు చెప్పే మాట! ఎవరైతే వీటిని తమ పార్ట్ నర్ కు క్రమం తప్పకుండా అందిస్తూ ఉంటారో.. వారి పట్ల పార్ట్ నర్ కు ప్రేమ భావన కొనసాగుతుందని వారు స్పష్టంగా చెబుతున్నారు. దాంపత్యంలో లవ్ అండ్ సెక్స్ తక్కువవుతున్నాయంటే.. మానసికంగా దూరం పెరగడానికి అదీ ఒక కారణం అవుతుందంటున్నారు!
ఓపెన్ మైండెడ్ గా ఉంటే మంచిది!
మీతో ఈ విషయాన్ని చెబితే ఏమంటారో అనే భయం పార్ట్ నర్ లో తలెత్తనే కూడదు! చిన్న చిన్న విషయాల్లోనే కొందరు తీవ్రమైన భయాందోళనలు కలిగి ఉంటారు. పార్ట్ నర్ తో షేర్ చేయడానికి కూడా వెనుకాడుతూ ఉంటారు. దీంతో అబద్ధాలు అలవాటు కూడా అవుతాయి. కప్పిపుచ్చటం, దాచడం వంటికవి కూడా జరుగుతాయి. దీనికి ప్రధాన కారణం.. ఇరువురి మధ్యన కొన్ని విషయాలను అస్సలు షేర్ చేసుకునే పరిస్థితులు లేకపోవడం. సరదా, సంతోషకరమైన దాంపత్యానికి ఇది అడ్డంకే!
క్షమించే తత్వం!
క్షమా గుణం ఉన్న వారికి మించిన గొప్ప వాళ్లు ఉండరు. అలాంటి వారితో కాపురం చేసే వాళ్లకు కూడా ఆ కంఫర్ట్ తెలుస్తుంది. పెద్ద పెద్ద విషయాల సంగతెలా ఉన్నా.. చిన్న చిన్న విషయాల్లో అయినా క్షమాగుణం కలిగి ఉండటం కాపురంలో ఉండాల్సిన అర్హత!
చిన్న చిన్న సెలబ్రేషన్స్!
జీవన పయనంలో చిన్న చిన్న వాటికి ఆనందాన్ని వ్యక్తం చేసుకునే తత్వం కూడా కాపురాన్ని సవ్యంగా సాగించడంలో కీలక పాత్ర పోషిస్తుందంటారు. చిన్నచిన్న వాటికి సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే.. అవే మధురానుభూతులుగా మిగిలి సంతోషకరమైన దాంపత్యాన్ని సాగించవచ్చు!