ఏపీ యువ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాది కావస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నెన్నో సంచలన నిర్ణయాలకు జగన్ పాలన సాక్షిగా నిలిచింది. మరీ ముఖ్యంగా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటు, ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం సంచలన నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ పాలనలో అత్యంత వివాదాస్పదానికి దారి తీసింది ఈ రెండు నిర్ణయాలే.
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అడ్డుకున్న శాసనమండలిని ఏకంగా రద్దు చేసి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ తీర్మానం కేంద్రం కోర్టులో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా వివాదానికి తెర లేచింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వాయిదా వేయడంపై సీఎం జగన్ నేరుగా స్పందించారు. నిమ్మగడ్డపై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై నిమ్మగడ్డ తీవ్ర ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ ఐదు పేజీల లేఖను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాయడం దుమారం రేపింది. ఈ లేఖపై ప్రస్తుతం సీఐడీ విచారణ కూడా సాగుతోంది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి నిబంధనల్లో ఏపీ సర్కార్ మార్పులు చేసింది. ఈ మార్పుల నేపథ్యంలో నిమ్మగడ్డ రమేశ్ తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీనిపై కూడా హైకోర్టులో విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్‌లో ఉంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడంపై కూడా కొన్ని నెలలుగా న్యాయ స్థానంలో ఓ పెద్ద యుద్ధమే జరుగుతోంది.
చివరికి ఈ పంచాయితీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూడా రంగులు తొలగించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పే వెలువడింది. ఉన్న మూడు రంగులకు తోడు ఎర్రమట్టి రంగు కలిపి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. తమతో పాటు సుప్రీంకోర్టు చెప్పినా రంగులు తొలగించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి కోర్టు ధిక్కరణ కింద కేసుల నమోదు వరకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో తిరుమల వెంకన్నకు సంబంధించి నిరర్థక ఆస్తుల అమ్మకంపై టీటీడీ పాలక మండలి ముందడుగు వేయడం మరో రచ్చకు తెరలేపినట్టైంది. గతంలో టీడీపీ పాలనలో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసేందుకు వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం లోని పాలక మండలి సమాలోచన చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే కుట్ర జరుగుతోందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగాయి. ఈ వివాదం మరింత పెద్దది కాకుండా జగన్ సర్కార్ టీటీడీ భూముల విక్రయానికి తెరదించింది.
భూములు విక్రయించవద్దని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సోమవారం రాత్రి జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీవో (జీవోఆర్‌టీ నెం.888) జారీ చేశారు. టీటీడీకి చెందిన 50 ఆస్తులను వేలం వేయాలని గత ప్రభుత్వం నియమించిన బోర్డు 2016 జనవరి 30వ తేదీన తీర్మానం చేసిందని, దీనిని నిలిపివేస్తున్నామని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ… ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశిస్తున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు.
ఈ 50 ఆస్తులను ధర్మ ప్రచారానికి, గుడుల నిర్మాణానికి, ఇతర ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించే అవకాశం ఉందా అనే విషయంపై మత పెద్దలు, భక్తులు, ఇతరులతో సంప్రదించి మదింపు చేయాలని సూచించారు. అంత వరకు ఈ ఆస్తుల వేలాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
బహుశా ఈ ఏడాది పాలనలో జగన్ సర్కార్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గిందని చెప్పాలంటే టీటీడీ భూముల విక్రయంలోనే కావచ్చు. అది కూడా జగన్ సర్కార్‌కు నేరుగా సంబంధం లేని వ్యవహారం. టీటీడీ భూముల విక్రయ నిర్ణయం పూర్తిగా ఆ దేవస్థానం పాలక మండలికి సంబంధించింది. కానీ ప్రతిపక్షాలు ఓ పథకం ప్రకారం మతం రంగు పులిమి , హిందూ సెంటిమెంట్‌ను రగిల్చి పబ్బం గడుపుకోవాలనే కుట్రలను విచ్ఛిన్నం చేస్తూ జగన్ సర్కార్ మంచి నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి, మరింతగా పంతాలు పట్టింపులకు వెళ్లకుండా జగన్ సర్కార్ ప్రదర్శించిన విజ్ఞత పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ఇలాంటి మార్పే జగన్ సర్కార్‌లో అందరూ కోరుకుంటున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్‌లో ఇలాంటి మార్పే కావాలని, రావాలని అందరి అభిలాష. తన పాలనానుభవాల నుంచి జగన్ ఎప్పటికప్పుడు గుణపాఠాలు నేర్చుకుంటూ నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంది?
-సొదుం