జనసేన డిమాండ్‌ చేస్తోంది..

పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ పిట్ట యాక్టివ్‌ అయ్యిందండోయ్‌. మొన్న జల్లికట్టు మీద పెద్ద 'వ్యాసం' తరహాలో స్పందించిన పవన్‌కళ్యాణ్‌, పనిలో పనిగా మన కోడి పందాల గురించీ ప్రస్తావించారు. ఆ తర్వాత నిన్ననే ప్రత్యేక హోదా…

పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ పిట్ట యాక్టివ్‌ అయ్యిందండోయ్‌. మొన్న జల్లికట్టు మీద పెద్ద 'వ్యాసం' తరహాలో స్పందించిన పవన్‌కళ్యాణ్‌, పనిలో పనిగా మన కోడి పందాల గురించీ ప్రస్తావించారు. ఆ తర్వాత నిన్ననే ప్రత్యేక హోదా గురించీ ఓ కథ రాసేశారు. తాజాగా, పోలవరం ప్రాజెక్టు – డంపింగ్‌ సమస్యపైనా కామెంట్‌ చేశారు. అమరావతి – భూసేకరణ మీదనా మాట్లాడారు. చివరగా, 'జనసేన డిమాండ్‌ చేస్తోంది' అంటూ ముక్తాయింపునిచ్చారు. 

ఓ పార్టీ డిమాండ్‌ చేస్తేనే ప్రభుత్వాలు స్పందించేస్తాయా.? అసలు అలాంటి రోజులున్నాయా.? తమిళనాడులో ఏం జరిగింది.? విద్యార్థులు రోడ్డెక్కి, రాజధాని చెన్నయ్‌ని స్తంభింపజేసినంత పన్జేశారు. సమాజం మొత్తం వారి ఆందోళనలకు మద్దతిచ్చింది. తద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చాయి. ఈ ఐకమత్యం గురించి గొప్పగా చెప్పిన పవన్‌కళ్యాణ్‌, ట్విట్టర్‌ని వదిలి జనంలోకి వెళ్ళకపోతే ఎలా.? 

రాజధాని అమరావతి పరిధిలోని రైతుల సమస్యలపై స్పందించారు, జనంలోకి వెళ్ళారు, వెళ్ళి వచ్చారంతే. కిడ్నీ బాధితుల కోసం ఉద్దానం వెళ్ళారు, జనం దగ్గరకు వెళ్ళాల్సింది పోయి, జనాన్ని తన దగ్గరకు రప్పించుకున్నారు. ఇది కాస్త వెరైటీ. జనం తమ సమస్యలు చెప్పుకునేందుకు పవన్‌కళ్యాణ్‌ దగ్గరకు రావాలి.! ఏం చేస్తాం, ఇది జనసేన రాజకీయం, నయా రాజకీయం. 

రాజధాని అమరావతిలో సమస్యలెదుర్కొంటున్న రైతులూ పవన్‌కళ్యాణ్‌ని, తెలంగాణలోని హైద్రాబాద్‌లో (ఉమ్మడి రాజధాని అని సరిపెట్టుకోవాలేమో) కలవాల్సి వస్తోంది. పోలవరం ప్రాజెక్టు డంపింగ్‌ బాధితులూ అంతే. పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ బాధితులూ సేమ్ టు సేమ్. కీడ్నీ బాధితుల విషయంలోనే కాస్త, కనికరం చూపి.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా వెళ్ళి, తాను వెళ్ళిన చోటకి జనాన్ని రప్పించుకున్నారు. 

ఇదా రాజకీయం.? ట్విట్టర్‌లో కామెంట్లు పెడితే, ప్రభుత్వాలు స్పందిస్తాయా.? ప్రజల్ని రప్పించుకుని, వారి సమస్యలు వినేసి, స్పందించేశానంటే కుదురుతుందా.? ప్రజల ఆవేదనని పవన్‌కళ్యాణ్‌ అర్థం చేసుకునే తీరు ఇదేనా.? పవన్‌కళ్యాణ్‌ని జనం ఎలా చూస్తున్నారో, ఆయనకు అర్థం కావడంలేదు. ఆయన జనాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఎవరికీ తెలియడంలేదు.! పవన్‌, జనానికి అర్థం కాక.. జనానికి పవన్‌ అర్థం కాక.. ఎలా.? ఇదెలాంటి రాజకీయం.? ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేస్తోంది. జనసేనాధిపతీ, ఆన్సర్ ప్లీజ్.!