4జీ హ్యాండ్ సెట్స్ విషయంలో మొదటి దశ ప్రీ-బుకింగ్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. ఇప్పుడు సెకెండ్ ఫేజ్ ప్రీ-బుకింగ్ కు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం దీపావళి తర్వాత లేక నవంబర్ మొదటివారంలో మరోసారి ప్రీ-బుకింగ్ తెరవాలని జియో భావిస్తోంది.
నిజానికి రెండో విడత ప్రీ-బుకింగ్ ఈపాటికే ప్రారంభంకావాలి. కానీ తొలివిడత 4జీ హ్యాండ్ సెట్స్ బుక్ చేసుకున్నవాళ్లలో చాలామందికి ఇంకా ఫోన్లు అందించలేకపోయింది జియో. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని పట్టణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లాంటి నగరాల్లో జియో 4జీ హ్యాండ్ సెట్స్ డెలవరీ పూర్తిస్థాయిలో జరగలేదు.
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా దాదాపు 60లక్షల హ్యాండ్ సెట్స్ ను అందించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన జియో.. ఆ డెలివరీ ప్రాసెస్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి రెండో విడత ప్రీ-బుకింగ్ తెరవాలనుకుంటోంది. ఇలా 3దశల్లో జియో 4జీ ఫోన్లను వినియోగదారులకు అందించి, వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి లాభాల్లోకి రావాలనేది జియో ప్లాన్.
ఇప్పటికే మార్కెట్లో ఉన్న 399 రీచార్జ్ ప్లాన్ వర్కవుట్ అవ్వడంతో పాటు తాజాగా దీపావళి కానుకగా క్యాష్ బ్యాక్ ప్రకటించింది జియో. దీంతో పాటు 295, 449 రూపాయలతో సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ కూడా ప్రకటించింది. వినియోగదారుల నుంచి కూడా రీచార్జ్ లు గణనీయంగా పెరుగుతున్న వేళ.. ఈసారి జియో లాభాల బాట పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.