రాజకీయ నాయకులకు వివాదాలుండాలి. విమర్శలు, ప్రతివిమర్శలుండాలి. ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తుంటారు. కాని ఈమధ్య మేధావులు, రచయితలు సైతం ఏదో ఒక వివాదం సృష్టించి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు మొదలుపెట్టడమే కాకుండా దాన్ని రోజుల తరబడి సా….గదీస్తున్నారు. ఓపట్టాన ముగింపు పలకడం వారికి ఇష్టం ఉండదు. ఈమధ్య కాలంలో మీడియాలో బాగా ప్రాచుర్యం పొందిన దళిత రచయిత కమ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు వివాదాలకు ముగింపు పలకడం ఇష్టం లేనట్లుగా కనబడుతోంది. 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పుస్తకం రాసి పెను వివాదానికి కారణమయ్యాడు. అది అర్థం లేని, లాజిక్ లేని రచన అని పలువురు ప్రొఫెసర్లు, మీడియా ప్రముఖులు చెప్పారు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన పలు సమస్యలు, అణచివేత ఇప్పుడు లేవు. కొన్ని అంశాల్లో ప్రొఫెసర్‌కు కనీస పరిజ్ఞానం లేనట్లుగా కనబడుతోంది.
పూర్వకాలం నాటి వృత్తులను (కుమ్మరి, కమ్మరి, రజకులు, క్షురకులు వగైరా) ఆధారం చేసుకొని, ఉత్పత్తి వర్గాలని, ఉత్పత్తి చేయకుండా తిని కూర్చునే వర్గాలని విభజించి, మారిన సమాజాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏదో రాసుకుంటూపోయారు ఐలయ్య. ఒకానొక కాలంలో బడుగులను అగ్రవర్ణాలు అణిచేసిన మాట, దౌర్జన్యాలు చేసిన మాట వాస్తవమే. కాని ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. రాజకీయంగా వారిలో చైతన్యం పెరిగింది. కాని ఐలయ్య ఆ కాలంలోనే ఆగిపోయారు. కాని ఐలయ్య ఆ పుస్తకాన్ని అడ్డం పెట్టుకొని మీడియాలో ప్రముఖుడిగా ఎదిగిపోయారు. చివరకు తనకు ప్రాణభయం ఉందని, ఫలానవారు తనను చంపే అవకాశం ఉందంటూ ప్రచారం చేసుకొని సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఐలయ్య వెనక కమ్యూనిస్టులు, దళిత బహుజన సంఘాలు నిలవడంతో రెండు సామాజిక వర్గాల మధ్య పోరాటంగా పరిణమించింది. పరస్పరం కేసులు పెట్టుకున్నారు.
అయితే తెలంగాణ, ఆంధ్రాలోని అధికార పార్టీలకు రెండు వర్గాల ఓట్లు అవసరం కాబట్టి ఎవ్వరి మీదా చర్య తీసుకోలేదు. వివాదాన్ని పట్టించుకోలేదు. వైశ్యుల మీద చర్య తీసుకోకపోవడం కూడా ఐలయ్యకు అసంతృప్తిగా ఉన్నట్లుంది. ఐలయ్య పుస్తకాన్ని నిషేధించడం సమంజసం కాదని, ఆయనకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని సుప్రీం కోర్టు చెప్పడంతో ఐలయ్యకు మరింత రెచ్చిపోయే అవకాశం దొరికింది. తనకేదైనా జరిగితే అది మానవహక్కులకు విఘాతం కలిగినట్లేనని అన్నారు. ఇంగ్లిషును, విదేశీ సంస్కృతీ సంప్రదాయాలను అభిమానించే ఐలయ్య తాజాగా ఓ మాట చెప్పారు. ఏమిటది?
ఇక్కడ (తెలుగు రాష్ట్రాల్లో) తనకు ప్రాణహాని ఉందని అమెరికాకు తెలియచేస్తే అక్కడి ప్రభుత్వం సొంత ఖర్చుతో తనకు పూర్తి రక్షణ కల్పించి, ఆశ్రయం ఇస్తుందని చెప్పారు. అమెరికా రక్షణ కల్పించి ఆశ్రయం ఇచ్చినట్లయితే ఐలయ్య హ్యాపీగా అక్కడ ఉండొచ్చు. ఈ అనవసర వివాదాలెందుకు? ప్రాణభయం ఉందంటూ వణికిపోవడం ఎందుకు? కాని తాను పుట్టిన మట్టిలోనే చనిపోయేవరకు జీవిస్తానని అన్నారు. తాను గొప్పవాడినని, పలుకుబడి కలిగినవాడినని చెప్పకోవడానికి అమెరికా ప్రభుత్వం ఉచితంగా రక్షణ కల్పించి ఆశ్రయం కల్పిస్తుందని అన్నారేమో.