కీలుబొమ్మ ముఖ్యమంత్రి…!

'మనదీ ఒక బతుకేనా నక్కలవలె, కుక్కులవలె/మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె'…అన్నారు మహాకవి . ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నప్పటికీ ఇది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లోని నాయకులు 'నీ…

'మనదీ ఒక బతుకేనా నక్కలవలె, కుక్కులవలె/మనదీ ఒక బతుకేనా సందులలో పందులవలె'…అన్నారు మహాకవి . ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నప్పటికీ ఇది రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల్లోని నాయకులు 'నీ బాంచెన్‌ దొరా/దొరసాని' అనాల్సిందే తప్ప మరోవిధంగా మాట్లాడితే ఇంతే సంగతులు. ఇతర రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తమిళనాడులోని నాయకులకు ఇదంతా అతికినట్లు సరిపోతుందని చెప్పుకోవాలి. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించే అక్కడి నాయకులు తమను తాము బానిసలుగా భావిస్తారో లేదో చెప్పలేంగాని చూసేవారికి అర్థమైపోతుంది. తాను ముఖ్యమంత్రిని కాలేకపోయానని పన్నీరుశెల్వం యమ బాధపడుతున్నారు. కాని ముఖ్యమంత్రి అయిన పళనిసామికి ఏం ఒరిగింది? ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు గడవకముందే 'పళనిసామి కీలుబొమ్మ ముఖ్యమంత్రి' అంటూ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి.

అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన శశికళ మేనల్లుడు టిటివి దికనరన్‌ అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నట్లు సమాచారం. జైల్లో కూర్చునేందుకు బెంగళూరుకు బయలుదేరుతూ చిన్నమ్మ దినకరన్‌ను తన ప్రతినిధిగానే కాకుండా సర్వాధికారిగా నియమించారు. పళనిసామి పేరుకే ముఖ్యమంత్రి. అసలు సీఎం దినకరనే. అప్పుడే పరిపాలన యంత్రాంగాన్ని ఆయన తన చేతుల్లోకి తీసుకోవడం ప్రారంభించారట…! జయలలిత తరిమేసిన ఈ వ్యక్తికి ఆమె మరణంతో మళ్లీ మహారాజ యోగం పట్టింది. ఒక్క ఈయనకే కాదు, జయలలిత దూరం పెట్టిన మన్నార్‌గుడి మాఫియాలోని అనేకమందిని శశికళ మళ్లీ చేరదీసింది. అన్నాడీఎంకే పార్టీలోనే కాదు, ప్రభుత్వంలోనూ ఇక వారిదే రాజ్యం. వారికి నాయకుడు దినకరన్‌. ఆయనకు తెలియకుండా ఏ పనీ జరిగేందుకు వీలులేదు. 

పన్నీరు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన సామాజికవర్గం వారు (గౌండర్‌) సంతోషించవచ్చేమోగాని ఆయనకు సంతోషం మిగలదు. పార్టీలో, ప్రభుత్వంలో ఏం జరుగుతోందో ఏరోజుకారోజు బెంగళూరు జైల్లో ఉన్న చిన్నమ్మకు తెలిసిపోతూనే ఉంటుంది. ఆ పని చేయడానికే దినకరన్‌ నియామకం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగంలో తనకు కావల్సివారు ఎవరెవరు, ఎక్కడెక్కడ (ఉన్నత, కీలక స్థానాల్లో) ఉండాలో తెలియచేస్తూ దినకరన్‌ జాబితా తయారుచేశారు. పన్నీరుశెల్వానికి విధేయులైనవారిని, ఆయన నియిమించినవారిని తీసేయాలని లేదా లూప్‌లైన్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. పన్నీరుకు చెందినవారు  పార్టీలో, ప్రభుత్వంలో కనబడకూడదనేది దినకరన్‌ ప్లాన్‌. పళనిసామి పొద్దున లేస్తే ప్రతి విషయాన్ని దినకరన్‌కు, ఆయనతోపాటు మన్నార్‌గుడి కుటుంబ సభ్యుడైన ఆర్‌పి రావణన్‌కు రిపోర్టు చేయాల్సివుంటుంది. పళనిసామి భారత రాజ్యాంగం ప్రకారం కాదు మన్నార్‌గుడి రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సివుంటుంది.

తాను ముఖ్యమంత్రి కాబట్టి తనకో అజెండా, విజన్‌ ఉంటాయని, దానిప్రకారం పనిచేస్తానని పళనిసామి అనుకుంటే కుదరదు. అజెండా నిర్దేశించేది శశికళ, దినకరన్‌ మాత్రమే. వారు ఏ విషయంలోనూ పళనికి క్రెడిట్‌ దక్కనివ్వరు. చిన్నమ్మ ఆదేశాలతో చేశాననో, చిన్నమ్మ ఆలోచనలకు, ఆశయాలకు అనుగుణంగా చేశాననో చెప్పుకోవల్సిందే. అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ నిర్దోషిగా తేలినట్లయితే ఆమే ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండేది.

కాని మొదటిసారి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత్రి వేరువేరుగా ఉన్నారు. అయినప్పటికీ పాలనా పగ్గాలు శశికళ, దినకరన్‌ చేతుల్లోనే ఉన్నాయి. పన్నీరుశెల్వం ఓవర్‌యాక్షన్‌ చేసి ముఖ్యమంత్రి పదవి పోగొట్టుకున్నారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన చిన్నమ్మకు విధేయుడిగా ఉన్నట్లయితే ఆమె ముఖ్యమంత్రి అయినా జైలుకు వెళ్లాల్సివచ్చేదని, అప్పుడు జయలలిత మాదిరిగా పన్నీరుకే పగ్గాలు ఇచ్చేదని, ఆమె నాలుగేళ్లపాటు జైలు నుంచి రాదు కాబట్టి ఈయనే వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి ముఖ్యమంత్రిగా ఉండేవారని అన్నారు. నిజమే. పన్నీరు మరోవిధంగా వ్యవహరించిట్లయితే అలాగే జరిగేది. అయినా మన్నార్‌గుడి మాఫియా కబంధ హస్తాల్లోనే ఉండాల్సివచ్చేది. పన్నీరుకు ప్రజల్లో అంతో ఇంతో సానుభూతి ఉంది. మంచోడనే పేరుంది. ఈ అభిమానంతో పళనిసామిని ఎదుర్కోగలరా?