ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పతనమో, లేక న్యాయవ్యవస్థ బలహీనతో కాని ఆయనకు ఎప్పుడూ ఇబ్బంది రాకపోవడం విశేషమే.
కోటాను కోట్ల మంది ప్రజలు చూసిన వాస్తవానికి కోర్టులకు ఆధారాలు కనిపించకపోవడం విచిత్రంగానే అనిపించవచ్చు. అదేమిటి? ఇది అందరికి తెలిసిన విషయమే కదా. అయినా కోర్టులు ఇలా తీర్పులు ఇస్తాయా అని ఆశ్చర్యపోవచ్చు.
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్‌కు ఏబైలక్షల నగదు ఇస్తూ తెలంగాణ ఏసీబీకి పట్టుబడ్డది వాస్తవమని జనం అంతా నమ్ముతున్నారు. అలాగే స్టీవెన్సన్‌కు ఫోన్‌లో చంద్రబాబు భరోసా ఇస్తున్న విషయాన్ని కోట్ల మంది జనం ఆడియో రూపంలో విన్నారు. అయినా న్యాయస్థానాలకు వాటిలో సందేహాలు వచ్చాయి. అంతే చంద్రబాబుకు దాదాపు క్లీన్ సర్టిఫికెట్ వచ్చేసినట్లయింది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించడం విశేషంగానే భావించాలి. హైకోర్టు వారు ఏ విధంగా తీర్పు ఇచ్చారో తెలియదు కాని, వారికి ఎలాంటి ఉద్ధేశాలు ఆపాదించలేము కాని, కేసు గురించి వచ్చిన వార్తలు చూస్తే ఒక విధంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
న్యాయవ్యవస్థ ద్వారా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న చంద్రబాబు ధీమా మరోసారి రుజువు అయిందని అనుకోవాలి. హైకోర్టులు కొన్ని కేసులలో సాంకేతిక విషయాలకు, మరికొన్ని కేసులలో అందులో ఉన్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఒక కేసులో సంబంధం లేని వ్యక్తులు రాసిన లేఖ ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించిన తీరు, కొందరు ప్రముఖులను నెలల తరబడి జైలులో ఉంచిన ఘట్టాలు చూశాం. అదే హైకోర్టు ఇప్పుడు ప్రజలంతా చూసిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుపై విచారణ జరపనవసరం లేదని తీర్పు ఇచ్చింది. దానికి కారణం మంగళగిరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డికి కాని, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్‌కు గాని ఈ కేసుతో సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడింది.
తెలంగాణ రాష్ర్ట సమితి నేతలు గతంలో ఈ కేసు గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఒకమాట చెబుతుండేవారు. కేసుపై ముందుకు వెళితే చంద్రబాబు ఏదో రకంగా తప్పించుకుంటారని, అందువల్లే తాము కేసును అలాగే ఉంచామని అంటుండేవారు. వారు చెప్పింది వాస్తవమేనని ఇప్పుడు రుజువు అయినట్లుగా కనిపిస్తుంది.
హైకోర్టు తీర్పును గనమిస్తే ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే, దానిపై ప్రభుత్వం చర్య తీసుకోకపోతే సంబందం లేని వారు జోక్యం చేసుకోకూడదా అన్న ప్రశ్న వస్తుంది. ఇదే రూల్ అందరికి వర్తిస్తుందా? లేక చంద్రబాబు కేసు వరేక వర్తిస్తుందా? హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడంతో కొన్ని సందేహాలు తీరకుండా పోతాయన్న అభిప్రాయం ఏర్పడుతుంది.
తెలంగాణ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీవెన్స్‌న్‌ను టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ద్వారా తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసే ప్రయత్నం అవాస్తవమా? స్టీవెన్సన్‌తో ఏపీి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడింది అవాస్తవమా? మరి ఆడియో టేపుల సంగతి ఏమిటి? కోట్లాది మంది జనం చూసిన ఈ ఆడియో ఘట్టాన్ని హైకోర్టు పట్టించుకోదా? కోర్టులకు కళ్లు ఉండవంటారు? అది వేరే విషయం.
రామకష్ణారెడ్డికి లోకస్ స్టాండి లేదని చెప్పి తీర్పు ఇచ్చి ఉంటే వేరే విషయం. కాని చంద్రబాబు డబ్బు ఇచ్చినట్లు ఉందా? టీడీపీకి ఓటు వేయమని అడిగారా అని న్యాయమూర్తి అనడం ద్వారా ఆయన తన పరిధి అతిక్రమించారన్న విశ్లేషణలు వస్తున్నాయి. తెలంగాణ ఏసీబీ కోర్టులో కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ఏసీబీ సైతం చాలా ఉదారంగా, ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. చార్జీషీట్‌లో ముప్పైమూడు సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించిన ఏసీబీ ఆయనను కేసులో నిందితుడుగా చేయడంలో విఫలం అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చంద్రబాబుకు కుదిరిన రాజీ వల్లే ఇలా జరిగిందని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.
హైదరాబాద్‌లో పదేళ్లు రాజధానిగా ఉండే హక్కును సైతం వదలుకుని హడావుడిగా అమరావతికి వెళ్లి వెయ్యి కోట్లతో తాత్కాలిక రాజధాని కట్టుకునే పరిస్థితి ఈ కేసు వల్ల ఏర్పడిందన్నది వాస్తవం. హైకోర్టు తీర్పు చూశాక మొత్తం కేసు నీరుకారిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే ఈ కేసులో తాము న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళతామని ఎమ్మెల్యే రామకష్ణారెడ్డి అంటున్నారు. అక్కడ ఏమి అవుతుందో కాని, ఇప్పటికైతే హైకోర్టు తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకం పెంచేదిగా లేదని చెప్పక తప్పదు.
కొమ్మినేని శ్రీనివాస్ రావు , సీనియర్ జర్నలిస్ట్