కులం పునాదులను కూల్చగలమా?

మన దేశంలో కులం పునాదులను కూల్చడమంటే చిన్న విషయం కాదు. రాజకీయాలు పూర్తిగా కులం పునాదుల మీదనే ఆధారపడినప్పుడు వాటిని కూల్చి  మనుగడ సాగించడం నాయకులకు, పాలకులకు సాధ్యమయ్యే పని కాదు. కులాల మాట…

మన దేశంలో కులం పునాదులను కూల్చడమంటే చిన్న విషయం కాదు. రాజకీయాలు పూర్తిగా కులం పునాదుల మీదనే ఆధారపడినప్పుడు వాటిని కూల్చి  మనుగడ సాగించడం నాయకులకు, పాలకులకు సాధ్యమయ్యే పని కాదు. కులాల మాట ఎత్తనిదే, కుల ప్రాతిపాదికన పథకాలు అమలు చేయనిదే, కుల రాజకీయాలు చేయనిదే, కులపరమైన ఉద్యమాలు నిర్వహించనిదే, కులాల మధ్య చిచ్చు పెట్టనిదే మన నాయకులకు, పాలకులకు జీవించడం సాధ్యం కాదు. కొందరు కుల రహిత సమాజం ఏర్పడాలని అంటారు.  సమసమాజం నిర్మించాలని అంటారు. ఇవన్నీ నినాదాలుగానో, ఉపన్యాసాలు ఇవ్వడానికో పనికొస్తాయిగాని ఆచరణకు పనికిరావు. ‘కులం పునాదుల మీద మీరు దేనినీ సాధించలేరు. ఒక నీతిని, జాతిని నిర్మించలేరు’ …అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్. కులం పునాదుల మీద నీతిని, జాతిని నిర్మించలేకపోవచ్చు. కాని మన నాయకులు, పాలకులు తమ రాజకీయ జీవితాలు నిర్మించుకుంటున్నారు. అధికారంలోకి వస్తున్నారు. ‘కులాల చెట్లను’ బ్రహ్మాండమైన వట వృక్షాలుగా ఎదగడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ చెట్ల నీడలోనే వారు సేదతీరుతున్నారు. కులం పునాదులు కూల్చే సమయం వచ్చిందని కొందరు అంటుంటే, ఆ పునాదులు కూలిస్తే వెనకబడిన కులాల వారికి తీవ్రమైన అన్యాయం జరగుతుందని మరి కొందరు వాదిస్తున్నారు. ఈ పునాదుల పేరు ‘రిజర్వేషన్లు’. కులం పునాదులను కూల్చడమంటే రిజర్వేషన్లు కులం ప్రాతిపదికన కాకుండా ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికన ఉండాలని అర్థం. గుజరాత్‌లో ఉధృతంగా సాగుతున్న పటేళ్ల ఉద్యమం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. 

రెండుగా చీలిన దేశం

దేశం రెండుగా చీలడమంటే ఇండియా, పాకిస్తాన్‌ల మాదిరిగా విడిపోవడం కాదు. రెండు వాదనలు జోరుగా సాగుతున్నాయని అర్థం. పటేళ్ల ఉద్యమం నేపథ్యంలో రిజర్వేషన్ల విధానాన్ని పూర్తిగా సమీక్షించాలని మేధావులు, ప్రముఖులు సూచిస్తున్నారు. ఇక కులం ప్రాతిపదికగానే రిజర్వేషన్లు ఉండాలని కొందరు వాదిస్తుండగా, ఆర్థిక స్థితిగతుల ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేయాలని కొందరు వాదిస్తున్నారు. అసలు పూర్తిగా రిజర్వేషన్లనే ఎత్తేయాలని కోరుతున్నవారూ ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్ ఏళ్లు కావొస్తున్నది. ఆర్థికంగా, సాంకేతికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్నాం. అయినా రిజర్వేషన్ల చీడపీడలు ఇంకా వదిలించుకోలేదకపోతున్నాం. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు పదేళ్లపాటు మాత్రమే అమలు చేయాలనే అంబేద్కర్ సూచనను మన పాలకులు తుంగలో తొక్కారు. ఇందుకు కారణాలు రెండు. మొదటిది…రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేయలేదు. రెండు…రిజర్వేషన్ల విధానం ద్వారా రాజకీయ ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఓట్ల బ్యాంకులు నిర్మించుకోవచ్చు. చివరకు రిజర్వేషన్ల కారణంగా అణగారిన (కులం ప్రాతిపదికన) వర్గాల వారందరికీ న్యాయం జరుగుతోందా? వారందరూ బాగుపడిపోయారా? అంటే అదీ లేదు. పదేళ్ల తరువాత రిజర్వేషన్లు తీసేయండని అంబేద్కర్ చెబితే అందుకు విరుద్ధంగా మరిన్ని కులాలకు విస్తరించుకుంటూ పోతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న రిజర్వేషన్ల విస్తరణ కారణంగానే గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం పుట్టుకొచ్చింది. ఒకప్పుడు తమకు రిజర్వేషన్లే అక్కర్లేదన్న ఈ సామాజిక వర్గం ఇప్పుడు రిజర్వేషన్లు కావాలని హింసాత్మకంగా ఉద్యమించడానికి కారణం ఏమిటి?  అగ్ర వర్ణాలుగా చెలామణి అవుతున్న కొన్ని సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం. విద్యా, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుండటం. ‘మాకు రిజర్వేషన్లు ఇవ్వండి…లేదా రిజర్వేషన్ల వ్యవస్థను పూర్తిగా ఎత్తేయండి’ అనే పటేళ్ల నినాదం అనేక రాష్ట్రాల్లోని అగ్రవర్ణ పేదలను ఉద్యమాలకు పురిగొల్పేలా చేస్తోంది. 

కోర్టులు వద్దన్నా….రాజకీయ ప్రయోజనాలే మిన్న

పార్లమెంటు ఎన్నికల సమయంలో, రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు మళ్లీ విజయం సాదించడం కోసం ప్రజలకు రకరకాల తాయిలాలు ఇస్తుంటాయి. ఓట్లు దండుకోవడానికి తాయిలాలు ఇవ్వడం మాత్రమే తెలుసుగాని, భవిష్యత్తులో వాటి వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలు తెలియవు. ఒకవేళ తెలిసినా పట్టించుకోరు. నాయకులకు ఎప్పటి పని అప్పుడే జరిగిపోవాలి. 2014 ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు తొమ్మిది రాష్ట్రాల్లో జాట్లను కేంద్ర ప్రభుత్వ ఓబీసీ కేటగిరీలో చేర్చింది. ఈ చర్యను జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) తప్పుబట్టింది. అలాగే ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ చర్య రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఉందని పేర్కొంది. యూపీఏ తన రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏకూ ఉపయోగకరమే కదా. దీంతో సుప్రీం కోర్టు తీర్పుపై రివిజన్ పిటిషన్ వేసింది. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్ అభిప్రాయాన్ని మన్నించాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. దీన్నిబట్టి ఏం అర్థమైంది? ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రభుత్వానికే గౌరవం లేదని తేలిపోయింది. మహారాష్ర్టలో మరాఠాలను ఓబీసీ కోటాలో చేర్చారు. ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేసింది. దీంతో అక్కడి భాజపా సర్కారు తాము సుప్రీం కోర్టుకు వెళతామని ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాలు కలిగించే రిజర్వేషన్ల విషయంలో పాలకులు ఎంతకైనా తెగిస్తారు.

సుప్రీం కోర్టు ఉత్తర్వులూ బేఖాతర్

పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయస్థానాల తీర్పులను, నిర్ణయాలను కూడా లెక్క చేయరు. కులాన్ని ఉపయోగించుకుంటే ఓట్లు పడతాయి. అది చాలు. దేశం ఏమైపోయినా పట్టించుకోరు. కొన్ని సామాజిక వర్గాలు నాశనమైనా లక్ష్యపెట్టరు. రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పును బుద్ధిగా పాటిస్తే ఓట్లు పడవు. అందుకే తమిళనాడు పాలకులు ప్రత్యేక చట్టం చేసుకొని రిజర్వేషన్లు 69 శాతానికి పెంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు 25 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించినా ప్రస్తుతం ఇది కోర్టులో ఉండటంతో అమలు కాలేదు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తానని హామీ ఇచ్చారు. పాలకులు ఓట్ల కోసం రిజర్వేషన్లను పెంచడం, కొత్తగా కొన్ని కులాలను చేరుస్తుండటంతో వివిధ కుల సంఘాలు ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. తమ కులాన్ని ఫలానా కేటగిరిలో చేర్చాలని, ఇంత శాతం రిజర్వేషన్ కల్పించాలని, అలా అయితేనే ఓట్లు వేస్తామని బెదిరిస్తున్నాయి. ఏపీలో కాపులు తమకు రిజర్వేషన్లు కావాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ కులానికి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుందో, ఏ కులం జనాభాలో ఎక్కువ శాతం ఉంటుందో ఆ కులం వారు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇలా రిజర్వేషన్లు కోరే సామాజిక వర్గాలు ఆర్థికంగా కూడా బలంగానే ఉంటాయి. 

పటేళ్ల ఉద్యమంపై దళితుల వర్గాల మండిపాటు

గుజరాత్‌లో జరుగుతున్న పటేళ్ల ఉద్యమంపై దళిత నాయకులు, అణగారిన వర్గాల వారికి నాయకులుగా చెప్పుకుంటున్నవారు మండిపడుతున్నారు. ఈ ఉద్యమాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరింపచేస్తామని గుజరాత్ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న హార్దిక్ పటేల్ ప్రకటించడంతో అన్ని రాష్ట్రాల పాలకవర్గాలకు ఇది తలనొప్పిగా మారే ప్రమాదముంది. గుజరాత్ ఉద్యమం వెనక ఆర్‌ఎస్‌ఎస్ ఉందని, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏకంగా రిజర్వేషన్లనే ఎత్తేసే కుట్ర చేస్తోందని దళిత కుల సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికను రిజర్వేషన్లను ఆ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పటేళ్ల ఉద్యమం ఒక పథకం ప్రకారం ఎన్‌డిఏ సాగిస్తోందని కొందరు చెబుతున్నారు. రిజర్వేషన్ల విధానం మీద చర్చ జరగాలని, సమీక్షించాలని కొందరు చేస్తున్న సూచనను కుల సంఘాల నాయకులు అంగీకరించడంలేదు. క్రీమీలేయర్ వర్గాలకు (రిజర్వేషన్లకు అర్హులైన కులాల్లో సంపన్నులు) రిజర్వేషన్ ఉండకూడదన్న వాదనను, ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలన్న వాదనను, కులం ప్రాతిపదికగా కాకుండా ఆర్థికపరమైన వెనకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేయాలనే వాదనను ప్రస్తుత రిజర్వేషన్ వ్యవస్థను గట్టిగా సమర్థించేవారు కొట్టిపారేస్తున్నారు. వీరంతా దళిత మేధావులు, అణగారిన వర్గాలకు చెందిన నాయకులు. పదేళ్లు ఉండాల్సిన రిజర్వేషన్లు 70 ఏళ్లయినా కొనసాగుతున్నాయంటే, ఇంకా ఇంకా విస్తరిస్తున్నాయంటే దీనిపై సమీక్షించుకోనక్కర్లేదా? రాజ్యాంగాన్నే ఎన్నోసార్లు సవరించుకున్నాం. రిజర్వేషన్లు అందులో భాగమే తప్ప అది శిలాశాసనం కాదు. కాని రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించడం పాలకులకు ఇష్టం లేదు. దాన్నొక తేనె తుట్టెగా భావిస్తున్నారు. 

పటేళ్ల ఉద్యమం కేవలం గుజరాత్ సమస్యా?

రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న పటేళ్ల ఉద్యమం కేవలం గుజరాత్‌కు సంబంధించిన సమస్యేనా? దేశమంతటికీ వర్తించదా? నిజానికి ఇది జాతీయ సమస్య. అన్ని అర్హతలు, ప్రతిభ ఉండీ రిజర్వేషన్ల కారణంగా నిరుద్యోగులుగా మారి, నిరాశలో కొట్టుమిట్టాడుతున్న లక్షలాది మంది అగ్రవర్ణాల సమస్య. పటేళ్ల ఉద్యమం ఇతర రాష్ట్రాల్లోని అగ్రవర్ణాల వారిని కూడా ఉద్యమించేలా చేయొచ్చు. ఆ రోజు రాదని చెప్పలేం. మోదీ, భాజపా అంటే పడని పార్టీలు పటేళ్ల ఉద్యమాన్ని గుజరాత్ వైఫల్యంగా చూపిస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రచారం చేసుకున్న గుజరాత్ అభివృద్ధి ‘డొల్ల’ అని నిరూపణ అయిందని అంటున్నారు. ఇందులోనూ వాస్తవం ఉంది. కాని ఇది ఆ రాష్ట్రానికే పరిమితమైన సమస్య కాదు. ఇప్పటికైనా రిజర్వేషన్లపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు రిజర్వేషన్ల విధానాన్ని ప్రక్షాళన చేయాల్సిన అంతకన్నా ఎక్కువ ఉంది. 

ఎం.నాగేందర్