లే.. పంగా.. కబడ్డీ.. విచారంగా

అంతా అనుకున్నట్లే జరిగింది. క్రికెట్‌ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది కబడ్డీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఓ దశలో క్రికెట్‌తో పాపులారిటీ పరంగా పోటీ పడింది. కానీ, ఆ సందడి మూణ్ణాళ్ళ ముచ్చటే…

అంతా అనుకున్నట్లే జరిగింది. క్రికెట్‌ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది కబడ్డీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఓ దశలో క్రికెట్‌తో పాపులారిటీ పరంగా పోటీ పడింది. కానీ, ఆ సందడి మూణ్ణాళ్ళ ముచ్చటే అయ్యింది. 'లే.. పంగా' అంటూ దేశాన్ని 'ప్రో కబడ్డీ లీగ్‌' ఊపేస్తే, దానికి కొనసాగింపుగా, అంతర్జాతీయ కబడ్డీ పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. భారత కబడ్డీ జట్టు మరోమారు విజయఢంకా మోగించింది. 

ఇదివరకట్లా కాదు.. ఈసారి కబడ్డీ పోటీలు నువ్వా నేనా అన్నట్లే సాగాయి. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో కబడ్డీకి చోటు దక్కుతుందని కబడ్డీ ఆటగాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా కబడ్డీకి ప్రోత్సాహం అందించే బాధ్యత ప్రభుత్వాలదేనని నిర్వాహకులూ నినదించారు. కానీ, చిత్రంగా ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో కబడ్డీపై నిర్లక్ష్యం ప్రదర్శించాయి. క్రికెట్‌ ప్లేయర్స్‌ తరహాలో కబడ్డీ ప్లేయర్స్‌ పేరు మార్మోగిపోతున్నా, కబడ్డీ జట్టుని పాలకులు పట్టించుకోకపోవడం శోచనీయం. 

కబడ్డీ మన క్రీడ.. మన గ్రామీణ క్రీడ.. దానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తోందంటే, అది భారతదేశానికి గర్వకారణం. మేకిన్‌ ఇండియా.. మేడిన్‌ ఇండియా.. కబడ్డీని కూడా అలాగే చూడొచ్చు కదా.? కానీ, చూడట్లేదు. క్రికెటర్లకు వచ్చే కోట్ల ఆదాయాన్ని కబడ్డీ ఆటగాళ్ళు కోరుకోవడంలేదు.. ఒలింపిక్స్‌లో పతకాలు తెచ్చిన ఆటగాళ్ళకు లభించినట్లుగా కోట్లాది రూపాయల ప్రోత్సాహాన్నీ, బెంజ్‌ కార్లనీ వారు ఆశించడంలేదు. 

'మేం ఆడుకోవడానికి సరైన మైదానాల్ని తయారుచేయించండి.. మాలా ఛాంపియన్లు తయారవడానికి శిక్షణ ఇప్పించండి.. జాతీయ స్థాయిలో క్రీడామైదానాల్ని కబడ్డీ కోసం ఏర్పాటు చేయండి..' ఇదీ కబడ్డీ చాంపియన్స్‌లో ఒకరైన అజయ్‌ ఠాకూర్‌ ఆవేదన. అనూప్‌ కుమార్‌, మంజీత్‌ చిల్లర్‌ లాంటి కబడ్డీ స్టార్స్‌ ఇదే కోరుకుంటున్నారు. 'దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం కన్నా కోట్లు ఎక్కువేమీ కాదు..' అంటున్న ఈ కబడ్డీ స్టార్స్‌, కబడ్డీని బతికించమంటున్నారు. ఇంతకన్నా కబడ్డీ దయనీయ స్థితి గురించి వారు ఇంకెలా చెప్పగలరు.?