ఏపీ టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఎదురైన ఒక చేదు అనుభవం ఎంత కాదనుకున్నా ఆ పార్టీ బలహీనతను బట్టబయలు చేసింది. కుప్పంలో ఆయన రోడ్‌షో చేస్తున్నప్పుడు కొందరు కార్యకర్తలు కుప్పంకు జూనియర్ ఎన్.టీ.ఆర్.ను ఎన్నికల ప్రచారా నికి పంపించాలని కోరారు. అది టీవీ చానళ్లలో లైవ్ లో కూడా వచ్చింది. అసలే కుప్పం నియోజకవర్గంలోని 87 పంచాయతీలకు గాను 73 పంచాయతీలను అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న అవమానాన్ని భరించలేక ఇబ్బంది పడుతున్న చంద్రబాబును ఈ ఘటన మరింత కలవరపెట్టింది.
బహిరంగంగా ఆయన అవును అనలేక, కాదనలేక తలపంకిస్తూ కనబడ్డ తీరే ఆయన పరిస్థితిని తెలియచెప్పింది. ఆ తర్వాత రోజు మరికొందరు లోకేష్‌ను పంపించాలని కోరినా జరగవలసిన డామేజీ జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఏమిటన్న చర్చ వచ్చినప్పుడల్లా జూనియర్ ఎన్.టీ.ఆర్., లోకేష్‌ల ప్రస్తావన వస్తోంది.
లోకేష్ పార్టీని నడపగలుగుతారా? లేదా అన్న మీమాంస పార్టీలో జరుగుతోంది. లోకేష్ ఆశించిన రీతిలో ఉపన్యాసాలు ఇవ్వలేకపోవడం, ట్వీట్‌లు పెట్టడంలో కూడా నైపుణ్యత, వ్యంగ్యం కాకుండా, మోటుతనంగా, దుర్భాషలాడే విధంగా ఉండడం, పార్టీ కార్యకర్తలకు ఇంకా చేరువ కాలేకపోవడం వంటి కారణాల వల్ల ఆయన నాయకత్వంపై అంత నమ్మకం కలగడం లేదు.
అయితే ఒక తండ్రిగా సహజంగానే లోకేష్‌ను నాయకుడిగా నిలబెట్టడానికి చంద్రబాబు తంటాలు పడుతున్నారు. అందులో భాగంగానే లోకేష్‌ను తొలుత పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి అని ప్రకటించడం, తదుపరి ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిని చేయడం జరిగింది. అప్పట్లో కుటుంబం నుంచి వత్తిడి కూడా చంద్రబాబుపై ఉందని అంటారు.
ఒకదశలో చంద్రబాబు తప్పుకుని లోకేష్‌కు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలన్న భావన కుటుంబంలో కొందరికి కలిగిందని, కాని ఎన్నికలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, మొదలైన కారణాల వల్ల లోకేష్‌కు తన సీటును అప్పగించకుండా మంత్రిగా మాత్రం కొనసాగించారని కొందరు నమ్ముతారు. కాని ఆయన మంత్రిగా పెద్దగా రాణించలేకపోయారు. కాకపోతే అన్నిటిలోను జోక్యం చేసుకోవడం ద్వారా పార్టీలో కొంత చికాకు సష్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిని చంద్రబాబు నిస్సహాయంగా భరించారని అంటారు.
ఆ తర్వాత లోకేష్‌కు మంగళగిరి సీటు కేటాయించినా ఓడిపోవడం మరింత సమస్యగా మారింది. అయినా తెలుగుదేశంలో తన తర్వాత వారసుడుగా లోకేష్‌నే కొనసాగించడానికి చంద్రబాబు అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. కాని వాటివల్ల పార్టీలో విశ్వాసం పెరగడం లేదు. ఈ నేపధ్యంలోనే జూనియర్ ఎన్.టీ.ఆర్. ప్రస్తావన వచ్చిందని భావించవచ్చు.
జూనియర్ ఎన్.టీ.ఆర్ పార్టీని నిలబెట్టకలుగుతాడా లేదా అన్నది వేరే విషయం. కాకపోతే లోకేష్ కన్నా బాగా ఉపన్యాసాలు ఇవ్వగలరని గతంలోనే రుజువు అయింది. దానికి తోడు సినిమా నటుడు కావడంతో ప్రజలలో ఆయనపై కొంత అభిమానం కూడా ఉంటుంది. జూనియర్ ఎన్.టీ.ఆర్ వస్తున్నారంటే ఆయన అభిమానులు పోగుఅయ్యే అవకాశం ఉంటుంది.
2009 ఎన్నికల సమయంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు పలు ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ర్ట సమితితో, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. అయినా ఫలితం కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ఆ ఎన్నికలలో జూనియర్ ఎన్.టీ.ఆర్. ఉమ్మడి ఏపీలోని వివిధ ప్రాంతాలలో ప్రచారానికి చంద్రబాబు వాడుకున్నారు. ఎన్.టీ.ఆర్. కూడా ఎన్నికల సభలలో బాగానే మాట్లాడేవారు. ఆ పర్యటనలలోనే ఎన్.టి.రామారావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆ తదుపరి టీడీపీలో ఆయన ప్రాధాన్యత తగ్గించడం మొదలైంది. వ్యూహాత్మకంగా పార్టీ మహానాడుకు జూనియర్ ఎన్.టి.ఆర్.ను ఆహ్వానించకపోవడం, లోకేష్‌ను ప్రొజెక్టు చేయడం ఆరంభించడం మొదలు అయ్యాయి.
ఆ క్రమంలో 2014 ఎన్నికలలో లోకేష్‌తో ఎక్కడో చోట నుంచి పోటీ చేయించి ఉంటే ఎలా ఉండేదో తెలియదు కాని, పార్టీ అధికారంలోకి వస్తుందో, రాదో అన్న అనుమానంతో అప్పుడు చంద్రబాబు ఆ రిస్కు తీసుకోలేదనిపిస్తుంది. అనూహ్యమైన రీతిలో స్వల్ప శాతం తేడాతో వైసీపీపైన టీడీపీ మెజార్టీ సాధించి అధికారం పొందింది. ఆ తర్వాత జూనియర్ ఎన్.టీ.ఆర్.ను అసలు పట్టించుకోవడం మానేశారు. ఈలోగా లోకేష్‌ను ప్రముఖ నటుడు, చంద్రబాబు బావమరిది అయిన బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణికి ఇచ్చి వివాహం చేశారు. తద్వారా ఎన్.టీ.ఆర్. కుటుంబంలో ప్రత్యేకించి బాలకృష్ణను తనవైపు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు.
అదే సమయంలో మరో బావమరిది హరికృష్ణతో వివాదాలు వచ్చినా, అప్పట్లో ఎన్నికలలో ఓటమి తర్వాత రాజీ కుదుర్చుకుని ఆయనకు ఎమ్.పి పదవి ఇచ్చారు. అది వేరే చరిత్ర. కాగా 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో హరికృష్ణ కుమార్తె సుహాసినికి కుకట్‌పల్లి టిక్కెట్ ఇచ్చి పోటీలో దించారు. అప్పటికే రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించడంతో ఆ సానుభూతి టీడీపీకి ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆశించారు. కాని ఆమె భారీ తేడాతో ఓటమి చెందారు. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి జూనియర్ ఎన్.టీ.ఆర్. ఇష్టపడలేదు. ఒక ట్వీట్ ఇచ్చి సరిపెట్టుకున్నారు.
ఈ నేపధ్యంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్.టీ.ఆర్.ను పార్టీలోకి మళ్లీ ఆహ్వానించి క్రియాశీలంగా ఉండాలని కోరే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థతి అయితే ఏమైనా చేస్తారేమో కాని, వచ్చే ఎన్నికల వరకు టీడీపీలో తన తర్వాత లోకేష్ నాయకత్వాన్నే చంద్రబాబు ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. ఆ ఎన్నికలలో కూడా టీడీపీ ఓటమి చెందితే అప్పుడు పలు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.
ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ చుట్టూనే పార్టీ రాజకీయాలు సాగుతాయి. కాని జరుగుతున్న పరిణామాలు, స్థానిక ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గెలుస్తున్న తీరుచూస్తే వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలిచే అవకాశం ప్రస్తుతానికి కనబడడం లేదు. వీటన్నిటిని జూనియర్ ఎన్.టీ.ఆర్. ఆయన సన్నిహితులు గమనించకపోవడం లేదు.
జూనియర్ ఎన్.టీ.ఆర్. వర్గీయుల సమాచారం ప్రకారం 2029 వరకు జూనియర్ ఎన్.టీ.ఆర్. సినిమారంగానికి పరిమితం అవుతారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితి ప్రకారం రాజకీయాలలోకి వచ్చే నిర్ణయం తీసుకోవచ్చు. అంతేకాక లోకేష్‌కు ప్రాధాన్యత ఇచ్చినంతకాలం జూనియర్ ఎన్.టి.ఆర్ తెలుగుదేశం వైపు చూడరని ఆయన సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు.
ఒకప్పుడు సీనియర్ ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉంటూ చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా సడన్‌గా తన రాజకీయ వారసుడు బాలకష్ణ అని ప్రకటించారు. వెంటనే చంద్రబాబు అప్రమత్తమై, దానివల్ల విమర్శలు వస్తాయని ఎన్.టీ.ఆర్.కు చెప్పి ఆ ప్రకటన ఉపసంహరించు కునేలా చేశారు. కాని ఇప్పుడు మాత్రం చంద్రబాబు టీడీపీని తన కుటుంబ పార్టీగా మార్చేశారు. తన తర్వాత లోకేషే పార్టీలో పవర్‌పుల్ అన్న సంకేతం ఇచ్చారు.
లోకేష్ ఇమేజీ పెంచడానికి ఆయా సందర్భాలలో చంద్రబాబు ప్రయత్నించకపోలేదు. తనకు ప్రధాని అయ్యే అవకాశం వస్తే తీసుకోవద్దని లోకేష్ సలహా ఇచ్చారని ఒకసారి, 2009లో తాను ప్రచారం చేసిన నగదు బదిలీ పధకం లోకేష్ కనిపెట్టిందేనని ఆయన ప్రచారం చేశారు. ఒకప్పుడు లోకేష్ రాజకీయాలలోకి వస్తారో, రారో అన్న సందేహం ఉండేది.
2014లో అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీలో తన వారసుడుగా లోకేష్‌నే మరింతగా ప్రమోట్ చేయడానికి చంద్రబాబు కృషి చేస్తున్నారు. అవి సఫలం కాకపోవడం ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. దానికి తోడు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మెజార్టీ పంచాయతీలను గెలుచుకోవడంతో ఎలాగొలా అక్కడ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి హడావుడిగా కుప్పం పర్యటనకు వెళ్లారు. ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు కుప్పం వెళితే అక్కడ జూనియర్ ఎన్.టీ.ఆర్. ప్లెక్సీలు ఎదురు కావడం పార్టీ కాడర్‌లో విశ్వాసం తగ్గే పరిస్థితి ఏర్పడింది.
అయితే పార్టీని నిలబెట్టుకోవడానికి జూనియర్ ఎన్.టీ.ఆర్. కూడా టీడీపీలోనే ఉన్నాడని ప్రచారం కోసం కొందరు వ్యూహాత్మకంగా ఆయన పోటో వాడి ఉండవచ్చని చెబుతున్నవారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా చంద్రబాబుకు ప్రస్తుతం ఎదురైన ఈ అనుభవం పార్టీ భవిష్యత్తును ప్రశ్నిస్తున్నదని చెప్పక తప్పదు.
కొమ్మినేని శ్రీనివాసరావు