మాట్లాడని మరో ప్రధాని

దేశానికి మాట్లాడని మరో ప్రధాని దొరికాడు. ఏ కుంభకోణం మీదా, ఏ అవినీతి వ్యవహారం పైనా నోరు విప్పని మరో దేశాధినేత ప్రజలకు లభిచాడు. ఆయనే నరేంద్ర మోదీ. ఒకప్పుడు పీవీ నరసింహారావుకు ‘మౌన…

దేశానికి మాట్లాడని మరో ప్రధాని దొరికాడు. ఏ కుంభకోణం మీదా, ఏ అవినీతి వ్యవహారం పైనా నోరు విప్పని మరో దేశాధినేత ప్రజలకు లభిచాడు. ఆయనే నరేంద్ర మోదీ. ఒకప్పుడు పీవీ నరసింహారావుకు ‘మౌన ముని’ అనే పేరుండేది.  మేధావిగా పేరు పొందిన పీవీ ఏ విషయం మీదా పెదవి విప్పకపోయేవారు. ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అని పాడుకునేవారు. ఈ మౌన వైఖరిపై పత్రికల్లో కుప్పలు తెప్పలుగా కార్టూన్‌లు ప్రచురితమయ్యాయి. మనసులో ఏమున్నా పెదవి దాటి మాట బయటకు రాకపోయేది. పీవీ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసి, దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెర లేపిన మరో మేధావి మన్మోహన్ సింగ్. ఆర్థిక వ్యవహారాల్లో తలపండిన మేధావి. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ దయతో ప్రధాని అయ్యారు. అది కూడా రెండుసార్లు ప్రధాని పీఠం అలంకరించి నెహ్రూ, ఇందిర తరువాత సుదీర్ఘకాలం (పదేళ్లు) ప్రధానిగా పని చేసిన రికార్డును సాధించారు. 

అందులోనూ ‘నెహ్రూగాంధీ’ వంశానికి చెందని వ్యక్తి ఆంత సుదీర్ఘ కాలం ప్రధానిగా పనిచేయడం చాలా గొప్ప విషయం. ఈ రికార్డులు, ఘనతలు బాగానే ఉన్నా నోరు విప్పి మాట్లాడని ప్రధానిగా పేరు తెచ్చుకున్నారు. పదేళ్లలో మన్మోహన్ మీడియాతో మాట్లాడిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఆయన మాట్లాడినా అర్థమయ్యేది కాదు. పెదవులు కదలడం మాత్రమే కనిపించేది. పదేళ్లు పీఠంపై ఉండి ‘సింగ్ ఈజ్ కింగ్’ అనిపించుకున్నా ‘అసమర్థ ప్రధాని’ అనే అపప్రథను కూడా మూటగట్టుకున్నారు. భాజపా అగ్రనాయకుడు ఎల్‌కే అదవాణీయే ఈ మాట అన్నారు.

ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బండ మెజారిటీ సాధించి ప్రధాని అయిన నరేంద్ర మోదీ కూడా ‘మాట్లాడని ప్రధాని’ అనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడో తేడా ఉంది. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ మేధావులు. ఇలాంటివారు సహజంగానే స్వభావరీత్యా ఎక్కువగా మాట్లాడరు. పీవీ రాజకీయ నాయకుడైనా ఇప్పటి నాయకుల మాదిరిగా విలువలులేని నాయకుడు కాదు. అరాచకవాది కాదు. రౌడీ రాజకీయాలు, గూండాగిరీ చేసిన వ్యక్తి కాదు. విజ్ఞాన ఖని. బహుభాషా కోవిదుడు. ఈయన కూడా స్వభావరీత్యా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కాదు. మన్మోహన్ సింగ్‌కు రాజకీయాలు మధ్యలో అంటుకున్నాయి. సహజంగా ఆయన ఆర్థికవేత్త. పదవులు కావాలని అరిచి గోల చేసినవాడు కాదు. వాటి కోసం పార్టీలు మారినవాడు కాదు. రాజకీయాలు నిర్వహించే శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తి కాదు. అసలు నాయకుడి లక్షణాలే లేవు. 

సోనియా చెప్పింది వినడమే తప్ప సొంతంగా ఏ పనీ చేయలేదు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. ఇక నరేంద్ర మోదీ అసలు సిసలు రాజకీయ నాయకుడు. ‘గుండెలు తీసిన బంటు’ టైపు. పని చేయడం కంటే చేసినట్లు కనిపించాలని నమ్మే వ్యక్తి. ప్రచారంతో ప్రజలను నమ్మించే కళ తెలిసినవాడు. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడగల నేర్పు ఉన్నవాడు. ‘మాటల మాయాజాలం’ తెలిసినవాడు. నరేంద్ర మోదీ  గుజరాతీ కాబట్టి ‘వ్యాపారం’ ఆయన రక్తంలోనే ఉంది. వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తుంటారు. వినియోగాదారులకు మాటలు చెప్పి ఆకట్టుకుంటారు. మోదీ పరిపాలనలో ఇదే చేస్తున్నారు. గోరంత పని చేసి కొండంతగా ప్రచారం చేసుకుంటున్నారు. విదేశాల్లో, అంతర్జాతీయ వేదికలపై ఉపన్యాసాలతో అదరగొడుతున్నారు. విదేశాల్లో బహిరంగ సభలు నిర్వహించిన భారత ప్రధాని ఎవరూ లేరు. మోదీ ఈ పని చేశారు. తరచుగా ‘మన్‌కీ బాత్’ పేరుతో ఆకాశవాణిలో ప్రసంగిస్తున్నారు. 

మరి ఇంతగనం మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడని ప్రతిపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? ప్రధాని మౌనం వీడాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి? తాజాగా కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఇదే డిమాండ్ చేశారు. అవును….మోదీ మౌనంగా ఉన్నారు. తమ పార్టీ వారే చేసిన కుంభకోణాల మీద, తమ నాయకులే పాల్పడిన అవినీతి పనుల మీద ఏమీ మాట్లాడటంలేదు. విదేశాలకు వెళ్లినప్పుడు కాంగ్రెసు దేశాన్ని చెత్తచెత్తగా చేసిందని, తాను ఆ చెత్తను ఊడ్చి దేశాన్ని పరిశుభ్రం చేసేలా కృషి చేస్తున్నానని చెప్పుకున్నారు. కుంభకోణాల యుగం కాంగ్రెసుతోనే ముగిసిందని, ఇక కుంభకోణాలు జరగవని అన్నారు. ‘నేను తినను…మరొకరిని తిననివ్వను’ అని ఊదరగొట్టారు. పాలనలో ఏడాది పూర్తికాగానే ఘనంగా ఉత్సవాలు చేసుకున్నారు. 

‘మోదీ సామాన్యుడు కాదు. స్వయంగా దిగి వచ్చిన దేవుడు’ అని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు భజన చేశారు. కాని ఏడాది గడిచాక కుంభకోణాలు బద్దలవుతున్నాయి. ప్రకంపనాలు పుట్టిస్తున్నాయి. తమది నీతి నిజాయితీగల ప్రభుత్వమని, పారదర్శకత తమకు ప్రాణమని చెప్పుకున్న మోదీ ఇప్పుడేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రస్తుత కుంభకోణాల్లో నిజానిజాల మాటెలా ఉన్నా ప్రధానిగా వాటి గురించి మాట్లాడటం ఆయన బాధ్యత. విచిత్రమేమిటంటే భాజపా సమావేశాల్లోనూ ఆత్మవిమర్శ చేసుకోవడంలేదు. మొన్నీమధ్య జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో అందరూ ఒకరికొకరు పొగుడుకున్నారు తప్ప లోపాలపై చర్చ జరగలేదు. ‘నా పరిపాలన చూసి మీరంతా గర్వపడాలి’ అని మోదీ పార్టీ ఎంపీలను ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రశంసించారు. కేంద్ర మంత్రులుగాని, రాష్ర్ట ముఖ్యమంత్రులుగాని ఒక్క తప్పూ చేయలేదన్నారు. అందరూ నీతి నిజాయితీలతో పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. ఇలా వారికి వారే ప్రశంసించుకోవడం వల్ల ఏం ప్రయోజనం? ఏ పదవులూ లేని సామాన్యులే అనేక తప్పులు చేస్తారు. 

ఇక అధికారంలో  ఉన్నవారు చేయరా? కాని భాజపా నాయకులు తాము దైవాంశసంభూతులమని మాట్లాడుతున్నారు. తాము అత్యంత నీతిపరులమని గొప్పగా చెప్పుకునేవారు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు తప్పు చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ప్రతిపక్షాలు చేసేవి ఆరోపణలు మాత్రమే. వాటికి దొరికిన సమాచారం మేరకు మాట్లాడుతున్నాయి. ఆ ఆరోపణల్లో ‘పస’ లేదని నిరూపించే ప్రయత్నం ప్రధాని చేయొచ్చు. ఏ తప్పూ చేయలేదని చెప్పుకునేవారు విచారణ సంఘం నియమించడం ద్వారా స్వచ్ఛతను చాటుకోవచ్చు. కాని భాజపా మంత్రులు ‘మా బండారం మీరు బయటపెడితే మీ బండారం మేం బయట పెడతాం’ అంటూ ఎదురు దాడికి దిగుతున్నారు. యూపీఏ హయాంలో  ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భాజపా అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేసి పార్లమెంటు సమావేశాలు జరగకుండా స్తంభింపచేసింది. ఇప్పుడు ఇదే పని కాంగ్రెసు, ఇతర ప్రతిపక్షాలు చేస్తుంటే సర్కారు సహించలేకపోతోంది. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే నరేంద్ర మోదీ ఈ దేశాన్ని ఉద్ధరించడానికి దిగొచ్చిన దేవుడు కాదు. సాధారణ రాజకీయ నాయకుడు. విలువలు లేకపోయినా ఉన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న వ్యాపారవేత్త. 

మేనా