60 స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 4, 8 తేదీల్లో జరగబోతున్నాయి. అక్కడ పదిహేనేళ్లగా కాంగ్రె సు రాజ్యమేలుతోంది. 2002లో 20 సీట్లు, 2007లో సీట్లు గెలుచుకున్న ఆ పార్టీ 2012 వచ్చేసరికి ఏకంగా 42 గెలుచుకుంది. ఇన్నాళ్లూ ఒకే ముఖ్యమంత్రి – ఓక్రా మ్ ఇబోబి సింగ్! ఈసారైనా ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసి కాంగ్రెసు ఓడిపోతుందన్న ధీమా బీజేపీలో లేదు. ఇబోబిని ఎదిరించగల స్థానిక బీజేపీ నాయకుడు ఎవరూ లేక కాబోలు, బీజేపీ ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపటం లేదు. ఉత్తరప్రదేశ్‌లో లాగే అక్కడా మోదీ పేరు చెప్పే ఓట్లు అడుగుతున్నారు. మోదీ మణిపూర్ వచ్చి ఫిబ్రవరి 25న పెద్ద బహిరంగసభ పెట్టి ముఖ్యమంత్రిని దుయ్య బట్టారు. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి ఉనికి వుండేది కాదు. ఇటీవలి కాలంలో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని బీజేపీ నాయకత్వం పట్టుదలతో వుంది. నాగా లాండ్‌లో అధికారంలో ఉన్న నాగా పీపుల్ ఫ్రంట్‌తో చేతులు కలిపి అధికారంలో భాగస్వామి అయింది. విపరీతంగా ఫిరాయింపులు ప్రోత్సహించి అరుణాచల్ ప్రదేశ్‌ను దక్కించుకుంది. కాందిశీకుల సమస్య లేవనెత్తి అసోంలో అధికారంలోకి వచ్చింది. అసోంలో లాగానే మణిపూర్‌లో కూడా ప్రభుత్వం ఏర్పరచాలనే పట్టుదలతో మోదీ తనకు ఆత్మీయుడైన పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్‌ను ఈశాన్య రాష్ట్రాల ఇన్‌చార్జిగా నియమించి, మణిపూర్ ఎన్నికల సంగతి చూడమన్నారు. మణిపూర్ రాజకీయాలు పొరుగున వున్న నాగాలాండ్ రాజకీయాలతో ముడిపడి వున్నాయి.
మణిపూర్ జనాభాలో హిందువులైన మెయితియులు గణనీయంగా వుండి 60 లో 40 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేయగల స్థితిలో వున్నారు. వారితో బాటు కుకీలు, నాగాలు వున్నారు. నాగాలాండ్‌లో ఉద్యమిస్తున్న నేషనల్ సోషలిస్టుకౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్ ఐ-ఎమ్) పొరుగున వున్న అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్‌లలో నాగాలు వుంటున్న ప్రాంతాలను నాగా లాండ్‌కు చేర్చి ''గ్రేటర్ నాగాలిమ్''గా ఏర్పరచాలని డిమాండ్ చేస్తూ వుంటుంది. అందువలన పొరుగు రాష్ట్రాలన్నీ నాగా డిమాండ్లను సందేహాస్పదంగా గమనిస్తూ వుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015 ఆగస్టులో ఎన్‌ఎస్‌సీఎన్‌తో శాంతి ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో తమకు హాని కలిగించే అంశాలేమి వున్నాయో అని యీ పక్క రాష్ట్రాల ప్రజలకు బెదురుగా వుంది. ఆల్ మణిపూర్ స్టూడెంట్స్ యూనియన్ వారు ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని ఉద్యమం చేస్తున్నారు. వారిలో బెదురు పోగొట్టాలంటే ఆ ఒప్పందాన్ని కేంద్రం బహిరంగ పర్చాలి. కానీ కేంద్రం ఆ పని చేయటం లేదు. ఈ పరిస్థితిని మణిపూర్ ప్రభుత్వం చక్కగా వుపయోగించుకుంటోంది. బీజేపీ నాగాల పక్షాన వుందని, మణిపూర్ ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవటం లేదని తన ప్రజలకు చెపుతోంది.
అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికలలో మణిపూర్‌లో వున్న నాగాల ప్రభావం తగ్గించడానికి 2016 డిసెంబరులో కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పరచింది. ఈ ఏర్పాటును ఎన్ ఎస్‌సీఎన్ మద్దతున్న యునైటెడ్ నాగా కౌన్సిల్ వ్యతిరేకించింది. తరతరాలుగా వస్తున్న నాగాల హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం దురాక్రమణ చేస్తోందంటోంది. తమకు సంఖ్యా బలం వున్న సేనాపతి జిల్లాలో ప్రకటన వెలువడిన నవంబరు నుంచి ఆందోళన ప్రారంభించి రహదారుల దిగ్బంధం చేస్తోంది. ఆ దిగ్బంధం కొనసాగుతున్నకొద్దీ మణిపూర్‌లోని నాగాయేతర ప్రజలకు నాగాలపై మరింత కోపం పెరిగి, ఇబోబిసింగ్ ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి జిల్లాలు విభజించడం, కొత్త జిల్లాలు ఏర్పరచడం రాష్ట్రప్రభుత్వం హక్కు అని అందరికీ తెలుసు. వాటికి ఏ రాజకీయ కారణాలైనా వుండవచ్చు. అయినా నాగా సంస్థలు ఈ జిల్లా విభజన అంశంపై మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసే పరిస్థితికి వెళ్లాయి. ఎన్‌ఎస్‌సీఎన్ నాయకుడు ఆంథోనీ నింగ్‌ఖాన్ షిమ్రే 'నాగాలాండ్‌లో శాంతి స్థాపనకు తూట్లు పొడవడానికే ఇబోబిసింగ్ ఈ చర్య చేపట్టాడ'ని ఆరోపించాడు. ఇతను నాగా పోరాటయోధులకు ఆయుధాలు సరఫరా చేస్తూండేవాడు. శాంతి ఒప్పందంపై సంతకాలు జరగడా నికి ఒక రోజు ముందు వరకు జైల్లో వున్నాడు. ఇప్పుడు 'కేంద్రం కలగచేసుకుని టెన్షన్లు పెరగకుండా చూడడానికి మణిపూర్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల'ని కోరుతున్నాడు.
ఆ టెన్షన్లు ఏమిటంటే – యునైటెడ్ నాగా కౌన్సిల్ (యూఎన్‌సీ) పిలుపుపై నవంబరులో మణిపూర్-నాగా లాండ్ రహదారులలో బ్లాకేడ్ నిర్వహిస్తున్నారు. మణిపూర్ నుంచి నాగాలాండ్‌లోకి వాణిజ్యపరమైన సరుకులు ఏవీ వెళ్లకూడదని ఆందోళనకారుల పట్టుదల. నాగాలాండ్‌కి వెళ్లే దారిలో వున్న సేనాపతి జిల్లాలో నాగా పీపుల్స్ ఆర్గ నైజేషన్ అని ఏర్పడి ఆ సంస్థ సభ్యులైన యువకులు రహదారిలో అడ్డంకులు ఏర్పరచి, అటు వెళ్లే వాహనాలను ఆపి లోపలేమైనా సరుకులు వున్నాయా అని చెక్ చేస్తున్నా రు. వాహనం ఆపకపోతే రాళ్లు రువ్వి, కర్రలతో మోది ధ్వంసం చేస్తున్నారు. 2012 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి బ్లాకేడే జరిగింది. దానివలన మణిపూర్ ప్రజల్లో స్థానికత సెంటిమెంటు పెరిగి, కాంగ్రెసుకు 70% సీట్లు దక్కాయి. ఈ సారి కూడా అలాంటిది జరుగుతుందనే ఆశతో కాంగ్రెసు ప్రభుత్వం ఆ దిగ్బంధం కొనసాగుతున్నా పట్టించుకోవటం లేదు. దాన్ని పెద్దగా నియంత్రించే ప్రయ త్నమూ చేయటంలేదు. ఇటీవలి కాలంలో బీజేపీ మణిపూర్‌లో కాంగ్రెసు నుంచి నాయకులను తన పార్టీలో చేర్చుకుంటూ బలపడడానికి చూస్తోంది. తృణమూల్ కాంగ్రెసు నుంచి ప్రజాదరణ కల నాయకుడు ఖుముకేహమ్ జయకిషన్‌ను కూడా చేర్చుకుంది. అయితే ఈ దిగ్బంధం మొదలయ్యాక బీజేపీ నాగాలనే సమర్థిస్తోందని కేంద్రంలో అధికారంలో వున్నా నాగాలను కట్టడి చేయటం లేదని, నాగాలాండ్‌లో తన సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని తంటాలు పడుతోందని ఆరోపిస్తూ బీజేపీ నుంచి రాజీ నామా చేసి కాంగ్రెసులో చేరాడు.
ఎన్నికలలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఎలాగూ రాదని, ఎన్నికల తర్వాత నాగా పీపుల్ ఫ్రంట్‌తో కలిసి మణిపూర్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపీ వుందని, అందుకే వారి పట్ల మెతకగా వ్యవహరి స్తోందని, కావాలనుకుంటే ఎన్‌పీఎఫ్‌తో సఖ్యంగా వుండే రామ్ మాధవ్ ద్వారా వారిని నియంత్రించి వుండేదని, మణిపూర్‌లో నాగాయేతర ప్రజలు భావిస్తున్నారు. ఈ కారణంగా నాగాలతో చేసుకున్న ఒప్పందం గురించి బీజేపీ ఆత్మరక్షణలో పడింది. అది తుది ఒప్పందం కాదని, కేవలం ఫ్రేమ్ వర్క్ అనీ చెపుతోంది. దాని ప్రకారం నాగాలపై సార్వభౌమత్వం నాగాలకే వుంటుందట. ఆ సార్వభౌమత్వం ఏమిటో తుది ఒప్పందంలో తేలుస్తారట. ఏ రాష్ట్రంలోనైనా సరే నాగాలు అత్యధికంగా వున్న జిల్లా లకు స్వయం ప్రతిపత్తి (ఆటోనమీ) ఇస్తారనే ప్రతిపాదన వుందని ఆ ఒప్పందంలో వుందని ఈ లోపున లీకులు వచ్చాయి. బహుశా ఆ కారణం చేతనే కాబోలు మణిపూర్ సీఎం నాగాలు మెజారిటీ ఉన్న జిల్లాలను చీల్చి, తక్కినవారితో కలిపి కొత్త జిల్లాలు ఏర్పరచి వుంటారు. తమ ఆధిక్యం తగ్గిపోతుందని నాగాలు అందుకే ఆందోళన చేస్తున్నారు.
సహజంగానే దీన్ని మణిపూర్‌లోని తక్కిన వర్గాలు హర్షించవు. నాగా ఆందోళనను నిరసిస్తే తప్ప బీజేపీ వారి ఆదరణ పొందలేదు. అది చేయకుండా పదిహేనేళ్లగా లేనిది ఎన్నికల ముందే ఎందుకీ జిల్లాల విభజన? అని కాంగ్రెసును ప్రశ్నించడంతో సరిపెడుతోంది. గతవారం మోదీ మణిపూర్ వచ్చినప్పుడు ''ఆ ఒప్పందం గురించి భయపడాల్సినది ఏమీ లేదు. మణిపూర్ ప్రజల ప్రయోజ నాలకు హాని కలిగించే అంశం ఏదీ దానిలో లేదు. దాని మీద సంతకాలు పెట్టి ఏడాదిన్నరైంది. ఇన్నాళ్లూ కాంగ్రెసు వాళ్లు నిద్రపోయారా? ఇప్పుడు ఎన్నికల వేళ ప్రజల్లో అనవసర భయాలు రేకెత్తిస్తున్నారు. దిగ్బంధకారులకు ముఖ్యమంత్రి డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. మరో పక్క వారికి వ్యతిరేకంగా జనాల్ని రెచ్చగొడుతున్నారు. మేము కేంద్రం నుంచి సాయం చేస్తామన్నా పట్టించుకోలేదు. ఈ బ్లాకేడ్ ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనుకుంటున్నా రు. కానీ మధ్యలో ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించటం లేదు.'' అని నిందలేశారు తప్ప ఒప్పందం వివరాలేమీ చెప్పలేదు. దీనికి జవాబుగా మర్నాడు ముఖ్యమంత్రి ''నేను హోం మంత్రి రాజనాథ్ సింగ్ వద్దకు వెళ్లి కలిశాను. కానీ ఆయన సరిగ్గా స్పందించలేదు'' అన్నారు.
వీటితో బాటు మోదీ ఇబోబి సింగ్‌ని 10% కమిషన్ తీసుకునే అవినీతిపరుడైన ముఖ్యమంత్రిగా వర్ణించారు. 'మమ్మల్ని అధికారంలోకి రానిస్తే, కాంగ్రెసు 15 ఏళ్లల్లో చేయలేని అభివృద్ధిని 15 నెలల్లో చూపిస్తాం. మా ముఖ్య మంత్రి, మంత్రులు తీసుకునే కమిషన్ 0%!' అని మోదీ చెప్పారు. ఇబోబి 10% కమిషన్ తీసుకుంటూ వుంటే ఆ అవినీతి మాపడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసు కుందన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అంతకు ముందు ప్రకాశ్ జావడేకర్ తాము అధికారంలోకి వస్తే ఇబోబిని అవినీతి ఆరోపణలపై జైలుకి పంపుతామన్నారు. అప్పటిదాకా ఆగడమెందుకు, అదేదో ఇప్పుడే చేయవచ్చుగా! నాగాలాండ్‌లో జెలియాంగ్ ముఖ్యమంత్రిగా వుండగా అతని అవినీతికి వ్యతిరేకంగా ముగ్గురు బీజేపీ నాయకులు గళమెత్తితే వారిని పార్టీలోంచి తీసేసిన బీజేపీ మణిపూరు విషయంలో ఇలా మాట్లాడడం వింతగానే వుంటుంది. కానీ రాజకీయ సభల్లో ఇలాంటి ప్రశ్నలు ఎవరూ వేయ రు. నాగా సంస్థలతో చేసుకున్న ఒప్పందాన్ని బయట పెడితే తప్ప మణిపూర్ ప్రజలను నమ్మించడం కష్టం. మోదీ సభ జరిగిన మర్నాడు ఇబోబి సింగ్ మాట్లాడుతూ ''అది మణిపూరు ప్రజలకు మేలు చేసేదైతే బయటపెట్ట వచ్చుగా'' అన్నాడు. ఆ విషయమే రామ్ మాధవ్‌ను అడి గితే ''అది ఒక పేజీ వుంటుంది. జస్ట్ ఫ్రేమ్‌వర్క్ అంతే. దాని ఆధారంగా తుది ఒప్పందం తయారుచేయాలి. ఈ లోపున ఎలా బయటపెడతాం? మేం దేశాన్ని ఎవరికీ అప్పగించటం లేదు.'' అన్నారు. ఆ ఫ్రేమ్‌వర్క్ తయారై ఏడాదిన్నర అయింది. ఇప్పటిదాకా ఓ కొలిక్కి వచ్చినట్లు లేదు. ఆలస్యమైన కొద్దీ అనుమానాలు పెరుగుతున్నాయి. అవి ఎన్నికలలో ఒక అంశంగా మారుతోంది. పదిహేనేళ్ల పాలన తర్వాత కాంగ్రెసు మళ్లీ అధికారంలోకి రాగలిగితే మాత్రం ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుందని అనుకోవాలి.
కొసమెరుపు – అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలోను ప్రచారభారం మోదీపై పడడంతో ఆయన ఉపన్యాసాలు రాసే వారిపై ఒత్తిడి పెరిగింది. ఏవేవో పోలికలు, పదవిన్యాసాలు చేయవలసి వస్తోంది. గత వారం యూపీ ఎన్నికల సభలో మాట్లాడుతూ మోదీ ''బాహుబలిలో కట్టప్పలా యూపీ ప్రయోజనాలు రక్షిస్తా'' అన్నారు. కట్టప్ప మాహిష్మతీ ప్రజల బాగోగులు పట్టించుకోలేదు. భల్లాల దేవుడి పాలనలో వాళ్లు అవస్థలు పడుతున్నా వూరుకున్నాడు తప్ప వాళ్ల సంక్షేమం కోసం పాటుపడలేదు. మాహిష్మతిని పాలించిన రాజులు ఎవరైతే వాళ్లకు కట్టు బానిసలా విధేయుడిగా వున్నాడు. రేపు యూపీకి ఎవరు ముఖ్యమంత్రి అయితే వారికి మోదీ విధేయుడిగా వుంటూ వారు ఎలా పాలించినా కళ్లప్పగించి చూస్తూ వుంటారని అర్థమా? ఇంకో విషయం కూడా వుంది. కారణం ఎంత బలీయమైనదైనా కానీ కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచి చంపేశాడు. అలాగే యూపీని కూడా మోదీ వెన్నుపోటు పొడుస్తారా? మోదీ ఆ ప్రసంగం చేసేముందు బాహుబలి కథను ఓసారి గుర్తుకు తెచ్చుకుని మాట్లాడి వుంటే బాగుండేది.
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]