కరోనా ఓ పెనుభూతం. ఈ ప్రధాన భూతం కారణంగా అనేక భూతాలూ పుట్టుకొస్తున్నాయి. ఒక సమస్యతోనే కొట్లాడుదామనుకుంటే ఇంకా అనేక సమస్యలతో కొట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల తరువాత కరోనా పారిపోయినా దాని తరువాత అనేక సమస్యలు జనాలను పీక్కు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. సరే వాటి సంగతి అలా ఉంచుదాం.
ప్రస్తుతం కరోనా బాధితులకు మించి మద్యం బాధితులు పెరుగుతున్నారు. మద్యం బాధితులంటే లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్కపోవడంతో మతి స్థిమితం కోల్పోయి పిచ్చివాళ్ళు అవుతున్నవారు. కరోనా బాధితుల కోసం చాలా ఆస్పత్రులు ఉన్నాయి. కరోనా రాకముందు రోగులకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు కరోనా వ్యాపించాక కరోనా ఆసుపత్రులుగా రూపాంతరం చెందాయి.
కొన్ని రాష్ట్రాల్లో కొత్తగా ఆస్పత్రులు కడుతున్నారు కూడా. కరోనా రోగులు పెరుగుతుండటంతో రైల్ కోచ్ లను కూడా ఆసుపత్రులుగా మారుస్తున్నారు. కరోనా సమస్య దేశమంతా ఎలా కలవరపెడుతున్నదో తాగుబోతు పిచ్చోళ్ళ సమస్య కూడా అలాగే కలవరపెడుతోంది. ఈ పిచ్చోళ్ళ సమస్య కూడా దేశమంతా వ్యాపిస్తోంది.
మరి మద్యం బానిసలు దేశమంతా ఉంటారు కదా. వారికి మతి స్థిమితం పోతుంటే కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. వారిని తీసుకొని మెంటల్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మానసిక వ్యాధులు నయం చేయడం అంత సులభం కాదు. ఇతర రాష్ట్రాల సంగతి అలా ఉంచుదాం. తెలంగాణలో మద్యం పిచ్చివాళ్ళు పెరుగుతున్నారు.
కరోనా బాధితుల అప్డేట్స్ ఎలా విడుదల చేస్తున్నారో ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రి వారు మద్యం దొరక్క మతిస్థిమితం కోల్పోయి ఆస్పత్రిలో చేరుతున్న వారి అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. ఎర్రగడ్డ ఆస్పత్రికి బాధితుల తాకిడి పెరుగుతోందిగాని తగ్గడంలేదు. బుధవారం కొత్తగా 37 మంది ఇంపేషంట్లుగా చేరారు.
నిన్న మొత్తం 200 మంది ఆస్పత్రికి వచ్చారు. అంతకు ముందు సోమవారం 94 మంది రాగా, మంగళవారం 180 మంది వచ్చారు. బుధవారంనాటికి ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ రోజు ఎంతమంది వచ్చారో, వారిలో ఎంతమంది ఆస్పత్రిలో చేరారో ఇంకా తెలియరాలేదు.
మద్యం బానిసలు ఇలా రోజురోజుకు పెరిగిపోతుంటే ఎంతమందిని చేర్చుకుంటారు ? బెడ్లు ఉండాలి కదా ? డాక్టర్లు ఉండాలి కదా ? ఎర్రగడ్డలో రోగులను చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడితే వారికోసం ఇంకో ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సి ఉంటుందేమో …!