మువ్వన్నెల జెండాని అవమానించారు.!

కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇంకొందరు ఇతర రాజకీయ ప్రముఖులు.. ఎంచక్కా నిద్రపోయారు. మువ్వన్నెల జెండా ఎర్రకోటపై రెపరెపలాడుతున్న సమయంలో, ఈ వేడుకలకు హాజరైన రాజకీయ ప్రముఖులు కునుకు తీయడం పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు…

కేంద్ర మంత్రులు, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఇంకొందరు ఇతర రాజకీయ ప్రముఖులు.. ఎంచక్కా నిద్రపోయారు. మువ్వన్నెల జెండా ఎర్రకోటపై రెపరెపలాడుతున్న సమయంలో, ఈ వేడుకలకు హాజరైన రాజకీయ ప్రముఖులు కునుకు తీయడం పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ భక్తి గురించి నిత్యం పొలిటికల్‌ స్పీచ్‌లు దంచేసే పొలిటికల్‌ లీడర్స్‌, దేశభక్తి ఉప్పొంగాల్సిన సమయంలో, ఎంచక్కా నిద్రపోవడం విమర్శలకు తావివ్వకుండా ఎలా వుంటుంది.? 

పార్లమెంటులో కునుకు తీయడం ఓ లెక్క. ఏం చేస్తాం, పార్లమెంటుని వాళ్ళకి రాసిచ్చేశాం. ఐదేళ్ళకోసారి చట్టసభలకు నేతల్ని పంపడమంటే, చట్ట సభల్లో కొట్టుకోమనీ, నిద్రపోమని పేటెంట్‌ హక్కులు రాసిచ్చినట్లే తయారయ్యింది వ్యవహారం. 'మేం కూడా మనుషులమే.. మాకూ కునుకు రావడం సహజమే..' అని కొందరు రాజకీయ నాయకులు తమ కునుకుపాట్లను సమర్థించుకోవచ్చుగాక. 

ఏడాదిలో ఎన్నిరోజులు తాము చట్ట సభలకు హాజరవుతున్నాం.? ఆ చట్ట సభల్లో తాము ఎంతవరకు ప్రజా సమస్యల్ని లేవనెత్తుతున్నాం.. అన్న ప్రశ్నల్ని ఎవరికి వారు సంధించుకుంటే, నిద్ర అన్న మాటే ఉత్పన్నం కాదు. సరే, చట్ట సఫభల సంగతి వదిలేద్దాం. చట్టసభల్లో నేతల కునుకు గురించి మాట్లాడుకోవడమే అనవసరం. వ్యవస్థ అలా తయారైంది. దేశమంతా 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాల్లో మునిగి తేలుతోంటే, నేతలు కునుకు తీయడమేంటి నిస్సిగ్గుతనం కాకపోతే.! 

సరిహద్దుల్లో నిద్రాహారాలు మాని, వీర జవాన్లు దేశాన్ని రక్షిస్తోంటే మన రాజకీయ నాయకులకు నిద్ర ముంచుకొస్తోంది. పైగా, ఈ నిద్రకి ఆమ్‌ ఆద్మీ పార్టీ కవరింగ్‌ ఏంటో తెలుసా.? 'ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగం బోరింగ్‌గా వుంది..' అని. ఈ విషయాన్ని స్వయంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ శిసోడియా, సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. ఔనుమరి, అలా నిద్రపోయినవారిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా వున్నారు. 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఆఖరికి కేంద్ర రక్షణ మంత్రి కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కునుకు తీశారు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళంతా మువ్వన్నెల జెండాని అవమానించారా.? లేదా.? స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్కూలు విద్యార్థులు ఏమాత్రం, కునుకుపాట్లు తీసినా, సరిగ్గా నిల్చోకపోయినా, చెంప ఛెళ్ళుమనిపోతుంది. ఉద్యోగులెవరైనా కునుకుపాట్లు తీస్తే, ఊస్టింగే. మరి, వీళ్ళని.. ఈ రాజకీయ నాయకుల్ని ఏం చేయాలట.!