'అన్నయ్య అని భావించిన వాడూ ప్రపోజ్ చేశాడు, ఎంతో మంచి స్నేహితుడు అనుకున్నవాడూ అసభ్యంగా ప్రవర్తించాడు, ఆడవాళ్లని అందరు మగాళ్లూ అలాగే చూస్తారెందుకు? ' ఆంధ్రప్రదేశ్‌లో సంచలన సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య డైరీలో ప్రతి మనసునీ తట్టిన వాక్యాలివి.
కంటిపాపే కాటేస్తుంటే, కంచే చేనును భక్షిస్తుంటే, నా అనుకున్నోళ్లే నాశనం చేస్తుంటే ఏదీ రక్షణ? ఆడదాన్ని గౌరవించడం సంగతి అటుంచి ఆమెను ఆటబొమ్మగా చూడడం అలవాటైన వారిలో అధికులు అయినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో రోజు రోజుకూ మహిళలపై అత్యచారాలు పెరిగిపోతూన్న నేపధ్యంలో… వాటిని అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఎందుకు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదో తెలియజెప్పింది తాజాగా విడుదల చేసిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎస్‌సిఆర్‌బి) నివేదిక.
ఆడవాళ్లను అత్యాచార భాధితులుగా మారుస్తున్న వారిలో తెలిసిన వాళ్లు, అమాయకంగా నమ్మినవాళ్లే అధికం. ఈ విషయాన్ని తేల్చింది ఎస్‌సిఆర్‌బి. సంస్థ గణాంకాల ప్రకారం… 86శాతం రేప్ కేసులు పరిశీలిస్తే… వీరంతా తమ కుటుంబ సభ్యుల, దగ్గర బంధువుల కారణంగానే అత్యాచారాలకు గురవుతున్నారు. ఏ మాత్రం భయపడనవసరం లేని వారు, వ్యక్తులను నమ్మడం కారణంగానే వీరు అత్యాచార బాధితులవుతున్నారని ఎన్ సి ఆర్‌బి నివేదిక వెల్లడించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా నమోదైన 37,413 రేప్ కేసుల్లో 32,187 కేసులలో నిందితులు దగ్గర బంధువులే కావడం గమనార్హం అని తెలియజేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, పక్కింటివాళ్లు, స్నేహితులే తరచుగా ఈ రకమైన దారుణాలకు పాల్పడుతున్నారని తేల్చింది. ఈ తరహా దారుణాలకు తెగబడుతున్న వారిలో 966మంది అత్యంత దగ్గర కుటుంబ సభ్యులు, 2,217 మంది బంధువులు, 8,344 మంది పక్కింటివాళ్లు, 618 మంది తోటి ఉద్యోగులు, తనతో పాటు పని చేసే వాళ్లు, 19,368 మంది పరిచయస్థులే.
రేప్‌లకు పాల్పడుతున్న వారిలో అన్నయ్యలున్నారు, తమ్ముళ్లున్నారు, తాతలున్నారు, ఆఖరికి కొడుకులు కూడా ఉన్నారని ఈ నివేదిక వెల్లడించిన వివరాలు చెబుతుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. తన చుట్టూ ఉన్నవారిలోని తప్పుడు ఆలోచనలను పసిగట్టే నైపుణ్యమే తప్ప ప్రభుత్వాలు, చట్టాలు తనను కాపాడలేవని ఆడపిల్లలు తెలుసుకోవాలి. గడప దాటకుండానే ఆడపిల్ల బతుకు బుగ్గి అవుతున్న పరిస్థితుల్లో… ఆత్మవిశ్వాసంతో తనను తాను తీర్చిదిద్దుకోవడం, తెలివిగా, శక్తివంతంగా, ధైర్యంగా మారడం ఒకటే ఆమెకు ఏకైక రక్షణ కవచంగా చెప్పక తప్పదు. జాగ్రత్త తల్లీ.
-ఎస్బీ