నిజం నిప్పులాంటిది.. తట్టుకోగలరా.?

నిజం నిప్పులాంటిది.. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, కరడుగట్టిన వేర్పాటువాది.. పైగా తీవ్రవాది అయిన బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ అనంతరం కాశ్మీర్‌ అల్లకల్లోలమయ్యింది. చనిపోయింది ఒక్కడే తీవ్రవాది.. కానీ,…

నిజం నిప్పులాంటిది.. దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే, కరడుగట్టిన వేర్పాటువాది.. పైగా తీవ్రవాది అయిన బుర్హాన్‌ వానీ ఎన్‌కౌంటర్‌ అనంతరం కాశ్మీర్‌ అల్లకల్లోలమయ్యింది. చనిపోయింది ఒక్కడే తీవ్రవాది.. కానీ, తీవ్రవాది బుర్హాన్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం, కాశ్మీర్‌లో చోటుచేసుకున్న అల్లర్లు 34 మందిని బలిగొన్నాయి.. ఇంకా ఈ మారణకాండ కొనసాగుతూనే వుంది. అల్లరి మూకలు రోడ్లెక్కి 'స్వైరవిహారం' చేస్తోంటే, భూలోక స్వర్గం ఎక్కడికక్కడ రక్తసిక్తమవుతోంది. 

కాశ్మీర్‌ వివాదం ఈనాటిది కాదు. కాశ్మీర్‌ భారతదేశంలో అంతర్భాగం. పాకిస్తాన్‌ ప్రేరేపిత వేర్పాటువాదులు, కాశ్మీర్‌లో నిత్యం అల్లకల్లోలం సృష్టిస్తూనే వున్నారు. ఓ అంచనా ప్రకారం ప్రతి 15 మంది పౌరులకీ అక్కడో సైనికుడు కన్పిస్తాడు. ఆ సైనికుడు తన కుటుంబాన్ని వదిలి, అక్కడ పహారా కాసేది, ప్రజలకు భద్రతనివ్వడానికే. కానీ, వేర్పాటువాదుల వెర్రి ప్రసంగాలకు ఆకర్షితులైన యువత, తమ రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డ భద్రతాదళాలపైకి విరుచుకుపడ్తుంటారు. అదీ అసలు సమస్య. 

అధికారంలో ఎవరున్నా కన్సిస్టెంట్‌గా పరిస్థితుల్ని తమకు అనుకూలంగా వాడేసుకుంటుంటారు. అలా కాశ్మీర్‌ని ఎప్పటికీ చల్లారని రావణకాష్టంలా మార్చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. కానీ, ఇంకెన్నాళ్ళు ఈ మారణహోమం.? ఇంకెన్నాళ్ళు భూలోకస్వర్గం నరకాన్ని తలపిస్తుంది.? ఇవీ సగటు భారతీయుడి మదిలో మెదిలే ప్రశ్నలు. 

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌, తాజాగా సోషల్‌ మీడియాలో ఓ ఫొటో వుంచాడు. అది ఇప్పటి ఫొటో కాదు, కాశ్మీరీ పండిట్లపై వేర్పాటువాదుల అకృత్యాలకు నిలువటద్దం ఈ ఫొటో. నిజం నిప్పులాంటిది. అందుకే, ఈ ఫొటో ఇప్పుడు దుమారం రేపుతోంది. ఎప్పటిదో పాత ఫొటోతో ఇప్పుడు రాద్ధాంతం చేయడం అవసరమా.? అన్నది 'మేధావుల' విమర్శ. నిజమే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫొటో అంత సబబు కాదేమో.! కానీ, బుర్హాన్‌ వానీ చనిపోయాడు. అతని చుట్టూ ఎందుకు రాద్ధాంతం జరుగుతోంది.? 

వేర్పాటువాదులపై భద్రతాదళాలు విరుచుకుపడ్డం తప్పన్నది మేధావుల వాదన. మరి, ఆ వేర్పాటువాదులు సామాన్యుల్ని అత్యంత క్రూరంగా చంపేస్తున్నప్పుడు ఈ మేధావులు ఎక్కడున్నారు.? పైగా, ఆ వేర్పాటువాదులకు పొరుగుదేశం పాకిస్తాన్‌ సహాయ సహకారాలు అందిస్తోంటే, ఈ మేధావులు పెదవి విప్పరేం.! 

కాశ్మీర్‌ సమస్య విషయంలో మొదటి నుంచీ భారత్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చిన అమెరికానే ఇప్పుడు పరిస్థితిని అర్థం చేసుకుంది. కాశ్మీర్‌ వివాదం భారత్‌ అంతర్గత సమస్య అనీ, ఈ విషయంలో తాముగానీ, ఇంకే ఇతర దేశాలుగానీ జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అమెరికా తేల్చేసింది. అమెరికా కళ్ళు ఇన్నాళ్ళకు తెరుచుకున్నాయిగానీ, సోకాల్డ్‌ మేధావుల మెదళ్ళలో వున్న తుప్పు మాత్రం వదలడంలేదు.

చివరగా: ఒకప్పుడు కాశ్మీర్ పండిట్లంటే మెజార్టీ.. ఇప్పుడు ఆ పండిట్లు ఏరీ, ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తోంది. నరమేధం, ఊచకోత అనే పదాలు సరిపోవు, కొత్త పదాలు కనిపెట్టాలి పండిట్లను వేర్పాటువాదులు అంతం చేసిన వైనం గురించి చెప్పడానికి. ఈ నెత్తుటి వేర్పాటు రాజకీయ క్రీడ ఆగాలంటే, ముందుగా మేధావుల ఆలోచనలు మారాలి, ఆ తర్వాత పాలకుల్లో మార్పు రావాలి. జరుగుతాయా ఇవన్నీ.?